చెన్నంపల్లి కోటలో తవ్వకాలు
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు 15 రోజుల విరామం తర్వాత శనివారం పునఃప్రారంభమయ్యాయి. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. మొదట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల తర్వాత ‘వాల్యూబుల్ మినరల్స్’ కోసమంటూ అధికారులతో ప్రకటన చేయించింది. ఓ వైపు తాంత్రిక పూజలు చేయిస్తూ.. మరో వైపు పలు సర్వేలను నిర్వహించింది.
స్కానర్లు, రెసెస్టివిటీ మీటర్లతో పాటు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అధికారుల ద్వారా అత్యాధునిక పరికరాలైన మాగ్నటో మీటరు, జీపీఆర్‌తో సర్వే చేయించింది. గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎగువ భాగాన కుడి వైపు స్థలంలో శనివారం మధ్యాహ్నం పూజలు చేసి.. తవ్వకాలు పునః ప్రారంభించారు. కర్నూలుకు చెందిన 12 మంది కూలీలతో తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ముందు గదుల ఆనవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. తవ్వకాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment