Chennampalli Fort
-
మాంత్రికుల సలహాలతో కోటలో తవ్వకాలు.!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో నిధుల కోసం గత కొన్ని నెలలుగా అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఏమి లేదని తెలిసి అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. అయితే తాజాగా మళ్లీ కోటలో నిధి వేటగాళ్లు తవ్వకాలు ప్రారంభించారు. నిధి వేటగాళ్లు క్షుద్ర మాంత్రికుల సలహాలతో కోటలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కలేబరాల అవశేషాలు మాత్రమే బయటపడటం విశేషం. అదేవిధంగా సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. రాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీంతో పురావస్తు, మైనింగ్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. వజ్ర వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికియాని వార్తలు రావడం తెలిసిందే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. -
'చెన్నంపల్లి' తవ్వకాల్లో అధికారుల కొత్తపాట
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. ఇన్ని రోజులుగా ఖనిజ సంపద కోసం వేటగాళ్లు, పూజారులు, క్షుద్ర మాంత్రికులు, జియాలజీ అధికారుల సూచనల మేరకు తవ్వకాలు చేస్తున్నారు. అయితే కొత్తగా శాసనాలు, తాళపత్రాల ఆధారంగా తవ్వకాలు చేస్తున్నామని అధికారుల కొత్తపాట పాడుతుండటం గమనార్హం. కాగా, కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది. సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం. -
'చెన్నంపల్లి' తవ్వకాల్లో కీలక పరిణామం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. అనంతంర ఈ నెల 3 వతేదీన మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిపిన తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాలు జరుపుతున్న కూలీలు ఇచ్చిన సమారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దొరికిన విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడిగా ధ్రువీకరించారు. -
కోటనెందుకు నాశనం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల పేరుతో చెన్నంపల్లి కోటను ఎందుకు నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఈ గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, పురావస్తుశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా గనులు, పోలీసుశాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. -
రాతిగుండు రహస్యం చెప్పేనా?
చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న విషయం విదితమే. ఆదివారం.. ఎనిమిది రాతి గుండ్లు, గదుల ఆకారంలో రెండు గుంతలు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టువదలకుండా ఇక్కడ తవ్వకాలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా, చెన్నంపల్లి (తుగ్గలి): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 36 రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో ఆదివారం రాతి గుండ్లు బయటపడ్డాయి. గుప్త నిధులు, నిక్షేపాలంటూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 13న కోటలో తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇటుకలు, ఎముకలు, ఇనుప ముక్కలు బయటపడ్డాయి. తరువాత జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల సూచన మేరకు.. ఈనెల 3న తవ్వకాలు పునఃప్రారంభించారు. ఆదివారం ఎనిమిది గుండ్రటి రాతి గుండ్లు బయట పడ్డాయి. వీటిని ఫిరంగి గుండ్లుగా భావిస్తున్నారు. గదుల ఆకారంలో రెండు గుంతలు ఉండడం, రాతి గుండ్లు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికా రులు భావిస్తున్నారు. జీఎస్ఐ అధికారులు మూడు చోట్ల తవ్వకాలు జరపాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు అధికారులు తవ్వకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. -
కోటలో మళ్లీ తవ్వకాలు
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు 15 రోజుల విరామం తర్వాత శనివారం పునఃప్రారంభమయ్యాయి. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. మొదట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల తర్వాత ‘వాల్యూబుల్ మినరల్స్’ కోసమంటూ అధికారులతో ప్రకటన చేయించింది. ఓ వైపు తాంత్రిక పూజలు చేయిస్తూ.. మరో వైపు పలు సర్వేలను నిర్వహించింది. స్కానర్లు, రెసెస్టివిటీ మీటర్లతో పాటు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల ద్వారా అత్యాధునిక పరికరాలైన మాగ్నటో మీటరు, జీపీఆర్తో సర్వే చేయించింది. గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎగువ భాగాన కుడి వైపు స్థలంలో శనివారం మధ్యాహ్నం పూజలు చేసి.. తవ్వకాలు పునః ప్రారంభించారు. కర్నూలుకు చెందిన 12 మంది కూలీలతో తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ముందు గదుల ఆనవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. తవ్వకాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ పర్యవేక్షించారు. -
‘చెన్నంపల్లి’లో తవ్వకాలపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను కర్నూలు జిల్లా, దూపాడుకు చెందిన బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాల పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ఆయన హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే సూచన మేరకు ఈ లేఖను పిల్‌గా మలచారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
‘చెన్నంపల్లి’ తవ్వకాలపై హైకోర్టుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను దూపాడుకు చెందిన డాక్టర్ బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాలను అడ్డుకోవాలని కోరు తూ లేఖ రాశారు.ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం 30న విచారణ జరపనుంది. -
మరోసారి తాంత్రిక పూజల కలకలం
-
చెన్నపల్లి కోటలో తాంత్రికపూజలు
-
‘ప్రతిపక్ష నేతపై క్షుద్రపూజలు చేస్తారేమో’
సాక్షి, చెన్నంపల్లి కోట(కర్నూలు) : ఆంధ్రప్రదేశ్‌లో తాంత్రికపూజలు మరోసారి కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలోని చెన్నపల్లి కోట బురుజు వద్ద బుధవారం తాంత్రిక పూజలు జరిగాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగాయని తెలిసింది. కాగా, ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులకు ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కోట బురుజు వద్దకు ఇద్దరు పూజరులను తీసుకొచ్చిన అధికారులు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. కోట బురుజు వద్ద పెద్ద ఎత్తున నిమ్మకాయలు, ఇతర సామగ్రిని స్థానికులు గుర్తించారు. కోటలో తాంత్రికపూజలపై స్పందించిన అధికారులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లు చెప్పారు. కోట మధ్య భాగంలో తవ్వి ఉండటంపై ప్రశ్నించగా.. 13 రోజులుగా కోటలో నిధుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో భారీ రాయి గుండ్లు, గుర్రం ఎముకలు, పూత పోసిన ఇటుకలు మాత్రమే దొరికాయని చెప్పారు. తవ్వకాల్లో భాగంగా కోట వెనుక భాగంలో ఉన్న బావిలోని నీటిని పూర్తిగా బయటకు తీసినట్లు వివరించారు. కోటలో ఉన్న పాతాళగంగ నుంచి సొరంగమార్గం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. తవ్వకాల్లో పురోగతిని సాధించేందుకు హైదరాబాద్ నుంచి అత్యాధునిక పనిముట్లను తెప్పించినట్లు వెల్లడించారు. అయితే, వాటిని ఉపయోగించినా ఎలాంటి ఫలితం దక్కలేదని చెప్పారు. ప్రతిపక్షం ఫైర్.. కోటలో తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కూడా నీళ్లునములుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న విజయవాడ దుర్గాదేవి గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. రేపోమాపో ప్రతిపక్ష నేతపై ప్రభుత్వ పెద్దలు తాంత్రికపూజలు చేస్తారేమో అనిపిస్తుందంటూ భయాందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడినా పాల్పడొచ్చని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వినాశన కాలం దాపురించే ఇలాంటి పనులకు ఒడిగడుతోందని మండిపడ్డారు. తాంత్రికపూజలు చేస్తున్న ప్రభుత్వం పెద్దలు ఉనికి లేకుండా పోతారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. వాళ్లు తానా అంటే వీళ్లు తందానా అంటున్నారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తితో పని చేయడం మానేశారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో తాంత్రికపూజలపై విచారణ జరిపిస్తారని చెప్పారు. తాంత్రికపూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. క్షుద్రపూజలు మూర్ఖత్వ చర్య ‘దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటివరకూ వాస్తు, జోతిష్యాలను ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్షుద్రపూజల వరకూ వెళ్లడం హాస్యాస్పదం. ప్రజల్లోని మూఢ నమ్మకాలను తొలగించాల్సిన ప్రభుత్వాలు.. వాటిని ప్రోత్సహించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఏదో ఆశించి ఓ వ్యక్తిపై క్షుద్రపూజలు చేసి లాభపడినట్లు ఆధారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. క్షుద్రపూజలు నిజమే అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై నెగ్గడానికి రాజకీయ నాయకులు కేవలం క్షుద్రపూజల కోసమే ఖర్చు చేస్తారు. తాంత్రికపూజలు, క్షుద్రపూజలు వంటి వాటిని ప్రభుత్వాలు సమర్ధిస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుంది.’ - టీవీ రావు.. జనవిజ్ఞాన వేదిక