
టన్నెల్ బోరింగ్ మెషీన్ శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది
ఎస్‌ఎల్‌బీసీలో ప్రధాన టన్నెల్‌కు అనుసంధానించేలా ‘అడిట్’ టన్నెల్‌కు ప్రతిపాదన
గాలి ప్రసరణ, నీరు,మట్టి, రాళ్ల తొలగింపు,మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా నిర్మాణం
ప్రధాన సొరంగంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా ఏర్పాటు..
మధ్యలో ఏదో ఒకవైపు నుంచి సమాంతరంగా నిర్మించే అవకాశం
భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సహాయక చర్యలకు వీలు
ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బీఆర్‌ఓ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం నేతృత్వంలో ప్రణాళికలు
3 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభంగా సాగేలా, ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేగంగా చర్యలు చేపట్టడానికి వీలుగా ‘అడిట్’ టన్నెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ప్రధాన సొరంగంలో (ఇన్‌లెట్ నుంచి) 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా (హారిజాంటల్)గా ఈ ‘అడిట్’ టన్నెల్‌ను నిర్మించనుంది. ప్రధాన సొరంగంలోకి గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపునకు, మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఈ టన్నెల్ ఉండనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, ఇతర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
నిపుణుల సూచనలకు అనుగుణంగా...
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల పైకప్పు కుప్పకూలి, 8 మంది గల్లంతై ఇప్పటికి ఆరు రోజులు దాటింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు టన్నెల్ వద్దే ఉంటూ సహాయక చర్యలను, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన దేశ, విదేశీ నిపుణుల సూచనలు, ఇంజనీర్ల అభిప్రాయాలను పరిశీలించారు.
ప్రపంచంలో టన్నెల్ ప్రమాదాలు చాలా జరిగినప్పటికీ.. ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన ప్రమాదం చాలా క్లిష్టమైనదని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద అనుసంధానం అయ్యేలా భూఉపరితలం నుంచి ‘అడిట్’ సొరంగం నిర్మించాలని నిర్ణయించారు. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపు వంటివాటికి ఈ ‘అడిట్’ టన్నెల్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచించడంతో.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు.
మరో మార్గం లేకపోవడంతో..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని భూమి ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. 43 కిలోమీటర్ల ఈ టన్నెల్‌లో ‘ఇన్‌లెట్, ఔట్‌లెట్ ’ మినహా మధ్యలో ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. ప్రస్తుతం ప్రమాదం 13.9 కిలోమీటర్ల పాయింట్ వద్ద జరిగింది. ఇలాంటి సమయంలో మధ్యలో మరో మార్గం ఉంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. అయితే ఇక్కడ ఎక్కువ లోతు ఉండటంతో నిలువునా బావిలా సొరంగం తవ్వే అవకాశం లేదు, తవ్వినా ప్రయోజనం ఉండదని, కూలిపోయే అవకాశాలు ఎక్కువని తేల్చారు. ఈ క్రమంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. ఉపరితలంపై నుంచి ‘అడిట్’ టన్నెల్‌ను ఒక దారిలా నిర్మించాలని నిర్ణయించారు.
నిపుణుల పర్యవేక్షణలో...
ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనల కోసం టన్నెల్ నిర్మాణాల్లో నిపుణులైన ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తంలను మంత్రి ఉత్తమ్ ఎస్‌ఎల్‌బీసీ వద్దకు రప్పించారు. సివిల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఈ ‘అడిట్’ సొరంగంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ‘అడిట్’ టన్నెల్ తవ్వడానికి అటవీ, పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదని... ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో భాగంగానే దీనిని నిర్మిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు పొందడం కష్టం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్ క్యాంపు వద్ద విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి.సంతోష్, ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఎన్‌జీఆర్‌ఏ, కాంట్రాక్టు సంస్థలు రాబిన్‌సన్, జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులు, నిపుణులు చేసిన సూచనలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)తో తవ్వకాలు జరుపుతున్నప్పుడు పైకప్పు కూలడం, మట్టి, నీరు, ఇతర ఖనిజాలు పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘అడిట్’ సొరంగం నిర్మాణం జరపాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసం ఎంత ఖర్చయినా వెచ్చిస్తామని చెప్పారు. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్‌లో నిరంతరం వివిధ టీంలకు చెందిన 20 మంది నిపుణులు మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. టన్నెల్‌లో సిల్ట్ తొలగింపు, డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. పనిచేయకుండా ఉన్న కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ కీలకం కానుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేయాలని పేర్కొన్నారు.