
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ సిబ్బందితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మల్లు రవి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
చిక్కుకుపోయిన కార్మీకుల వెలికితీతకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.. మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
రోబోలను కూడా వినియోగించే ప్రయత్నాలు చేస్తాం
సహాయక చర్యల్లో 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.. జీపీఆర్‌తో తొలుత గుర్తించిన చోట కార్మీకుల ఆనవాళ్లు దొరకలేదు
ఈ ప్రమాదం అనుకోకుండా జరిగింది..ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు.. ఇది మనందరి సమస్య.. ఏకతాటిపై నిలబడదామన్న సీఎం
సహాయక చర్యల పర్యవేక్షణ.. నిపుణులతో సమీక్ష
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మీకులను బయటకు తీసేందుకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మరో రెండు, మూడురోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. రోబోలను సైతం వినియోగించి కార్మీకులను వెలికితీసే ప్రయత్నాలను చేస్తామని వెల్లడించారు.
మళ్లీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలను చేపడుతున్నామని వివరించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్దనున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్‌తో కలిసి నిపుణులతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
‘ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చిరకాల వాంఛగా ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పదేళ్లలో కనీసం 3 కి.మీ కూడా పూర్తిచేయలేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టు కంపెనీని ఇబ్బంది పెట్టారు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ను కట్ చేయడంతో మోటార్లు నడవని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని జాగ్రత్తలు తీసుకుని పనులు ప్రారంభించింది.
టన్నెల్ బోరింగ్ మిషిన్ మరమ్మతు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అమెరికా పంపి స్పేర్‌పార్ట్స్‌ను తెప్పించాం. ప్రాజెక్టు పూర్తయితే రూపాయి ఖర్చు లేకుండానే 30 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు అందుతుంది. మేము శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. ఇది మనందరి సమస్య..విపత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ అండగా ఉండాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.
దేశంలోని వ్యవస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి..
‘దేశ భద్రత కోసం కష్టపడే ఆర్మీ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తోంది. టన్నెల్ నిపుణులు, ప్రైవేటు ఏజెన్సీలతో పాటు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి, వారందరినీ అభినందిస్తున్నా. ప్రమాద స్థలంలో మట్టి, నీరు ఎక్కువగా ఉండటం, కన్వేయర్ బెల్టు రిపేరులో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సోమవారం సాయంత్రానికి బెల్టు అందుబాటులోకి వస్తుంది. జీపీఆర్ గుర్తించిన చోట కార్మీకుల ఆనవాళ్లు దొరకలేదు. ప్రభుత్వం ఇంకా పట్టుదల, చిత్తశుద్ధితో సహాయక చర్యలను చేపడుతోంది. ప్రమాదం జరిగిన గంటలోనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను సంఘటన స్థలానికి పంపా.
ప్రధాని మోదీతోనూ మాట్లాడా..
దేశంలోని వ్యవస్థలతో పాటు మంత్రులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడా. కేంద్రం సహకారంతోనూ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచి్చన వారిపై సానుభూతి, మానవత్వంతో వ్యవహరిస్తున్నాం. సహయక చర్యలను చూసేందుకు వస్తున్న ప్రతిపక్షాలతో పాటు ఎవరినీ నియంత్రించ లేదు, నిర్భంధించ లేదు. పూర్తి పారదర్శకంగా ఉన్న మమ్మల్ని తప్పుబడుతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు.
రెండు ఉదంతాలకు మధ్య తేడా ఉంది..
‘గతంలో బీఆర్‌ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనుల్లో 9 మంది చనిపోతే ఐదేళ్ల తర్వాత వాళ్ల మృతదేహాలు దొరికిన విషయం మర్చిపోయారా? శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనలో చనిపోయిన వారిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి ఘటనకు, ఇప్పటి ప్రమాదానికి తేడా ఉంది. అక్కడ నిర్లక్ష్యం ఉంది.
తాగి నడిపి మనిషిని గుద్దితే జరిగిన ప్రమాదం లాంటిది కాళేశ్వరం ఉదంతం.. తాగి వస్తున్న వాడిని బతికించేందుకు చెట్టును గుద్దిన ఘటన లాంటిది ఈ ప్రమాదం. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. కేసీఆర్ ఎక్కడా కని్పంచడం లేదు. ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత ఆయనకు లేదా? నేను ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. మా వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. టీం లీడర్‌గా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
హరీశ్ నీ పాస్‌పోర్టు బయటపెట్టు..
‘ప్రమాదం జరిగితే నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని హరీశ్ అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ దుబాయ్‌లో దావత్ చేసుకున్నది నిజం కాదా? అబుదాబిలో రెండురోజులు దావత్‌లో మునిగి తేలారు. మత్తు దిగినాక వచ్చి ఇష్టం వచి్చనట్టు మాట్లాడుతున్నారు. హరీశ్.. మీ పాస్‌పోర్టును బయట పెట్టండి. ఎయిర్‌పోర్టులో వివరాలు చూడండి. నేను వస్తే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే రాలేదు. ఇట్ల సోయి లేకుండా మాట్లాడవచ్చా?..’ అని రేవంత్ మండిపడ్డారు.
అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్‌జీఆర్‌ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment