సుందర సోమనాథుడు
పాఠక పర్యటన
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయం సందర్శించే భాగ్యం కలగడం మా అదృష్టం. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో ఆ దేవాలయాన్ని, ఆ దైవ సన్నిధిని స్మరించుకోవడం మరింత భాగ్యం. నేటికీ రెండు నెలల క్రితం అహ్మదాబాద్‌లో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి మా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాను.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాజ్‌కోటి ఎక్స్‌ప్రెస్‌లో అహ్మదాబాద్ చేరుకున్నాం. బంధువుల ఇంట సందడి పూర్తవగానే చుట్టుపక్కల ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు చూడాలని బయల్దేరాం. అందులో ముందుగా గాంధీనగర్‌ను, ఆ తర్వాత గుజరాతీల ఇష్టదేవత భద్రకాళీ, జగన్నాథ మందిరాల దర్శించుకున్నాం. ఆ తర్వాత .. అహ్మదాబాద్ నుండి సోమనాథ్ దేవాలయం ఎంత దూరంలో ఉందో వాకబు చేశాం.
అహ్మదాబాద్ నుండి 400 కి.మీ దూరం ఉన్న సోమనాథ్‌కు బస్‌ల ద్వారా చేరుకోవచ్చు. మేం లగ్జరీ బస్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకొని బయల్దేరాం. రాత్రంతా ప్రయాణించి, ఉదయం 8 గం.లకు సోమనాథ్ చేరుకున్నాం. అక్కడ గైడ్‌ను మాట్లాడుకొని, దేవాలయ సందర్శనకు బయల్దేరాం.
ప్రాచీన వైభవం...
సోమనాథ్ దేవాలయం అతి ప్రాచీన కట్టడం. ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆలయం నిర్మాణం, నాటి ప్రాచీన శిల్ప కళా వైభవం అడుగడుగునా అబ్బురపరిచింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో యాదవుల రాజు వల్లభ ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆ తర్వాత కాలంలో ఎన్నో దాడులకు ఈ కట్టడం లోనైందని తెలిసింది. చాళుక్యుల నిర్మాణ కౌశలం అడుగడుగునా కనిపిస్తుంది. 1947లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని గైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎర్రటి రాయితో చేసిన ఈ ఆలయ నిర్మాణం గుజరాత్ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆలయ సమీపంలోని కోనేరు విశాలమైనది. ఆ నీటిలో స్నానాలు ముగించుకొని శివలింగ దర్శనం చేసుకున్నాం. సోమనాథ్ దేవాలయంతో పాటు అక్షరథామ్, సబర్మతీ ఆశ్రమం, మౌంట్ అబూ ప్రదేశాలనూ చూసి వచ్చాం. ఈ పర్యటన ఎప్పటికీ మరచిపోలేనిదిగా మా మదిలో నిలిచిపోయింది.
-కె.సునీత కృష్ణమూర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్