ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
గ్రామీణ సంస్కృతి బలోపేతం చేసుకోవాలంటే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు.
శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు
‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే.
పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
గ్రామీణ పేదరికం 5 శాతమే
‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment