Rural Culture
-
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్‌గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
గ్రామీణ వారసత్వమే మన సంపద
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వారసత్వం దేశానికి వెలకట్టలేని సంపద అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ పేర్కొన్నారు. ఆధునికత, నాగరికత పేరుతో అంతరించిపోతున్న గ్రామీణ సంస్కృతి, జీవనం, విలువలు, సంప్రదాయాలను కాపాడుకుని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’(పరి) పేరుతో శనివారం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మంథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హస్తకళలు, చేతివృత్తులు, గ్రామీణ భాషలు, లిపులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, అంతరించిపోతున్న అరుదైన కళలు, భాషలు, వంటకాలు తదితరాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’పేరుతో డిజిటల్ జర్నలిజమ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాలగు మ్మి చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ఔత్సాహికులు, పాత్రికేయులు, 1000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాముల య్యారన్నారు. కనుమరుగవుతున్న గ్రామీ ణ భాషలు, లిపులు, కళలు రికార్డు చేసి వెలుగులోకి తెస్తున్నామని, లక్షకు పైగా మరాఠీ గ్రామీణ గీతాలు, జనపదాలు వెలుగులోకి తెచ్చామని, ఇంకా బ్రతికి ఉన్న కొద్దిమంది స్వాతంత్ర సమరయోదుల అనుభవాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ పేరుతో గ్రామీణ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. గ్రామీణ చేతివృత్తులు ,అరుదైన కళలను ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేతకారులు, కేరళ మలబార్‌లోని కళాసీలు జీవనాధారం కోల్పోయారని, 50 ఏళ్లలో 200 గ్రామీణ భాషలు వాడుకలో లేకుండా పోయాయని సాయి నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సువిశాల భారతంలో వివిధ ముఖకవళిలకలతో ఉండే ప్రజలను పరిచయం చేయడానికి ‘ఫేస్ డైవర్సిటి’పేరుతో దేశంలోని అన్ని జిల్లాల నుండి జిల్లాకు ముగ్గురు చొప్పన ఫోటోలు సేకరించి అందుబాటులో ఉంచే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మంథన్ ప్రతినిధి అజయ్‌గాంధీ సహ పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. -
మన ఊరే...! మన వాళ్లే...!!
-
ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..
-
ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..
చదివింది ఇంజినీరింగ్..తర్వాత క్రియేటివిటీకి దగ్గరగా ఉంటుందని ఇంటీరియర్ డెకరేటర్‌గా పని చేసినా ఏదో అసంతృప్తి. ఎందుకో యాంత్రిక జీవితానికి అలవాటుపడటం అమెకు నచ్చలేదు. తన చిన్నతనంలో పల్లెల్లో జీవనశైలిపై తల్లిదండ్రులు, పెద్దలు చెప్పే కథలు ఆమెకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని సంప్రదాయాలు, అక్కడి జీవన విధానం అంటే అమెకు అమితమైన ఆసక్తి. పేయింటింగ్స్ పై ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా, మంచి పేయింటింగ్ వేయాలన్న ఆసక్తి మాత్రం ఆమెకు ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతగానో ఇష్టపడే పెయింటింగ్నే తన ప్రొఫెషన్‌గా మలుచుకుంది. అందులోనూ పల్లెల్లో జీవన విధానంపై ఆమె గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరిని చిన్నతనంలోకి తీసుకువెళతాయి. ఆవిడే.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్‌లలో డిగ్రీలు చేసినా, ప్రొఫెషనల్ పేయింటర్గా మారి పల్లెల్లోని వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న నైషితారెడ్డి కాసర్ల. 'పల్లెకు పోదాం' పేరిట ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తను వేసిన చిత్రాలను ప్రదర్శించింది. తన పేయింటింగ్స్‌పై అమె మాటల్లోనే... మనం నగర జీవితానికి అలవాటుపడిపోయి బీజీ జీవతంతో కుస్తీ పడుతుంటాం. మన ముందు తరం వాళ్లు ఆస్వాదించిన ఆనందాన్ని మనం మిస్ అవుతున్నాం. పల్లెలు, అక్కడ వారి రోజువారి జీవన విధానం గురించి ఎవరైనా చెబుతుంటే ఎంతగానో ప్రేరణపొందేదాన్ని. నా పెయింట్లలో అక్కడి వాతావరణాన్ని చూపించాలనుకున్నాను. గొర్రెల కాపరి, బర్రెలు కాసేవారిజీవితాన్ని చూస్తే... వాటిని తీసుకొని వెళ్లి రావడం గమనిస్తే వారికున్న వనరులతో ఓ మంచి వాతారణంలో జీవితాన్ని గడుపుతారు. వాళ్లకు ఉన్నదాంట్లోనే ఎంతోగానో సంతృప్తిగా జీవిస్తారు. ఇబ్బందులు వాళ్లకు కూడా ఉంటాయి. రోజువారి జీవితంతో కుస్తీ పడుతూ ఉంటారు. అయినా వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. పాటలు పాడుతూ, సరదాగా కబుర్లు చెబుతూ, చిన్న చిన్న పనులతో కష్టాలను మరిచిపోతారు. బోనాలు అనేది మనకు చాలా పెద్ద పండగ. ఊళ్లోని అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో బోనాలు పండగ జరుపుకుంటారు. కొత్తగా వచ్చిన మెషిన్లను(గ్రాండర్లను) చూసినప్పుడు, పెద్దలు పల్లెల్లో వారు వాడిన ఇసురు రాయి గురించి చెప్పేవారు. పల్లెల్లో కష్టపడి తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తారు. అదెంతో కష్టతరమైంది. ఆ పని చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. భవిష్యత్తులో ఈ పని చేయడానికి కూడా ఏవైనా మిషిన్లు కనిపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కష్టపడి పని చేసి వచ్చిన రైతు తాటికల్లు తాగి సేదతీరే దృశ్యమే ఈ పెయింటింగ్. లేబర్ అనగానే మగవారు మాత్రమే అనే భావన సాధారణంగా అందరిలో ఉంటుంది. కానీ ఎలాంటి గుర్తింపులేకుండానే పల్లెల్లో మహిళలు కూడా ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటారు. చాట చెరగడం, బుర్రకథ చెప్పడం, వాగుదగ్గరికి వెళ్లి నీరు తీసుకురావడం, నెత్తిపై గడ్డి కట్ట మోయడం, నాటువేయడంలాంటి వాటిలో తెలియకుండానే నా పెయింటింగ్స్లలో మహిళవి ఎక్కువగా ఉన్నాయి. మనం చిన్నప్పుడు గ్రామాల్లో చూసిన ఎన్నో నేడు కనిపించడం లేదు. ఇక తర్వాత తరం వారికి వాటి ఆనవాలు కూడా లేకుండా పోతాయేమో అనిపిస్తుంది. ఇలా ఆర్ట్ రూపంలో వేసి ఉంచితే అయినా వాటిని తర్వాత తరాల వారికి చూపించవచ్చు అని ఆలోచన. ఇక చిన్నప్పటి నుంచి ఇష్టమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇలా చిత్రాల్లోకి మలచడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. ఇంజినీరింగ్ చేసి ఇలా ఆర్టిస్ట్‌గా మారుతాను అనుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ ఇంట్లో వాళ్లే సపోర్ట్ చెయ్యడం నా అదృష్టం. -
పొడవైన జడకు రూ. 15వేలు !
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడి ప్రజల జీవన శైలిని బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో నివశిస్తున్న వారికి పరిచయం చేయడానికి వీలుగా ఈ నెల 3 నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో ‘హళ్లి హబ్బ’ నిర్వహిస్తున్నట్లు విద్యారణ్య సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.సి.రమేష్ తెలిపారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హళ్లి హబ్బలో లగోరి, గోళీల ఆట వంటి గ్రామీణ క్రీడల్లో పోటీ ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇందులో పాల్గొన్న వారిలో పొడవైన మీసాలు ఉన్న మగవారికి మొదటి బహుమతిగా రూ.15వేలు, పొడవైన జడ ఉన్న మహిళలకు మొదటి బహుమతిగా రూ.15వేలుగా ఇవ్వనున్నామన్నారు. ఈ రెండు విభాగాల్లో కూడా రెండు, మూడో స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.10వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే హళ్లిహబ్బలో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని రమేష్ తెలిపారు. - సాక్షి, బెంగళూరు