rural india
-
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
2024 యూనియన్ బడ్జెట్: ఉద్యోగ కల్పనపై దృష్టి!
ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఆగష్టు 12 వరకు జరగనున్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవలే వెల్లడించారు.త్వరలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో నిర్ణయించిన GDPలో 5.1% ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక విధానానికి సంబంధించిన విస్తారమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందని భారతదేశ ప్రధాన ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా పేర్కొన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వేగంగా వృద్ధి వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఉద్యోగాల కల్పనలో మాత్రమే వెనుకబడింది. రాబోయే దశాబ్దంలో 7% GDP వృద్ధి కూడా ఉద్యోగ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త సమీరన్ చక్రవర్తి ఒక నోట్లో తెలిపారు. 7 శాతం వృద్ధి రేటు 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. నిజానికి కావాల్సిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.ఈ ఏడాది జరిగిన జాతీయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. మిత్రపక్షాల సహాయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. పోస్ట్ పోల్ సర్వేలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణంగానే బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయిందని వెల్లడించాయి. అంతే కాకుండా ప్రతి పక్షం కూడా దేశంలో నిరుద్యోగ సమస్య గురించి చెబుతూనే ఉంది. కాబట్టి రాబోయే బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అనుగుణంగా ఉండే ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నిరుద్యోగం పైపైకి.. ఉద్యోగాలు లేక యువత విలవిల
న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటేశామని మీసాలు మెలేస్తున్నాం. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశ్మీర్లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి. 40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్ కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది. ప్రభుత్వం ఏం చేస్తోంది ? నిరుద్యోగం కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2023 చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రైవేటు రంగంలో పని చేయడానికి నిపుణులైన కార్మికులు లభిస్తారన్నది కేంద్రం వాదనగా ఉంది. రవాణా రంగంలో ఊబర్, ఓలా, ఆతిథ్య రంగంలో ఇంటికి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి, జోమాటో సర్వీసులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ తయారీ రంగం, మౌలికసదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం -
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
ఇంటర్నెట్ లేకపోయినా.. డిజిటల్ పేమెంట్స్ చేయోచ్చు
ముంబై: గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా ఆర్బీఐ ఆఫ్‌లైన్ చెల్లింపుల సేవల అమలుకు కార్యాచరణను ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా లేదా కనెక్టివిటీ సరిగ్గా లేని చోట్ల.. ఆఫ్‌లైన్‌లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించినట్టయింది. ఆఫ్‌లైన్ విధానంలో చెల్లింపులను ప్రాక్సిమిటీ మోడ్ (ఫేస్ టు ఫేస్) విధానంలో నిర్వహిస్తారు. కార్డులు, వ్యాలెట్లు, మొబైల్ డివైజెస్లతో ఈ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. కనుక ఈ లావాదేవీలకు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ (మరో అంచె ధ్రువీకరణ) అవసరం ఉండదని ఆర్బీఐ తెలిపింది. రూ.200 ఒక్కో లావాదేవీ పరిమితి రూ.200 వరకు, మొత్తం మీద అన్ని లావాదేవీలకు గరిష్ట పరిమితి రూ.2,000 వరకే ఉంటుందని (తిరిగి ఆన్లైన్ ద్వారా బ్యాలన్స్‌ను నింపుకునే వరకు) పేర్కొంది. 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఆర్బీఐ పరీక్షించింది. ‘‘బలహీనమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచేందుకు ఆఫ్‌లైన్ లావాదేవీలు తోడ్పడతాయి. నూతన విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అని ఆర్బీఐ ప్రకటించింది. కస్టమర్ ఆమోదంతో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానాన్ని యాక్టివేట్ చేయొచ్చని తెలిపింది. ఈ విధానంలోనూ కస్టమర్‌కు లావాదేవీల పరంగా రక్షణ ఉంటుందని (కస్టమర్ ప్రమేయం లేని సందర్భాల్లో) స్పష్టం చేసింది. చదవండి: ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు -
విద్యార్ధులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్‌లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు. 6–12 తరగతి విద్యార్థులకు.. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (వాయిస్ టెక్నాలజీ) వంటి భవిష్యత్ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది. అమెజాన్ సైబర్ రోబోటిక్స్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్స్, కోడింగ్ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్నర్ కోడ్.ఓఆర్జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. ఏఎఫ్ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ‘ఉపాధి రంగంలో కంప్యూటర్ సైన్స్ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారింది. సీఎస్‌ను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘నాణ్యమైన కోర్సు కంటెంట్ లేకపోవడం, స్థానిక భాషలో పరిమితంగా అధునాతన కంటెంట్ వంటివి సీఎస్ కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అడ్డంకులు. ప్రతిభ, అభిరుచి యువకులందరిలో విస్తరించినప్పటికీ అవకాశాలు పరిమితమే. ఏఎఫ్ఈతో సీఎస్ విద్యను ముందస్తుగా అందించడం ద్వారా ఈ అంతరాన్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. చదవండి: వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్‌లోకి. -
రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ!
హైదరాబాద్ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ బాటలు వేసింది. వేస్ట్ టూ వెల్త్ వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్ సీజన్లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్ అధ్యాపకులు అంటున్నారు. ప్రాజెక్ట్ బిల్డ్ ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్ గదిని నిర్మించారు. బయె ఇటుక ప్రత్యేకతలు - సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు. - బయె ఇటుకలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. - సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. - ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం బయో బ్రిక్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం? -
అటు ఓలా స్కూటర్... ఇటు ఓల్ట్రో సైకిల్...
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్లో ఓల్ట్రో దూసుకొస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్ ఓల్ట్రో. ఓల్ట్రో ఓల్ట్రో స్టార్టప్ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ నుంచి ఓల్ట్రాన్ పేరుతో ఇ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్ని డిజైన్ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ ఓల్ట్రో సైకిల్లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సగటున ఒక యూనిట్ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ధర ఎంతంటే ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్‌పై వన్ ఇయర్ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్‌గడ్‌లో ఈ సంస్థకు సైకిల్ తయారీ యూనిట్ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది. వారంటీ సైకిల్‌కి సంబంధించిన కంట్రోలర్, మోటార్లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్‌నే రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్ రిపేర్ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. -
పెరిగిన డిజిటల్ లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలే కీలకం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో గడిచిన 18 నెలల్లో డిజిటల్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు ఇక ముందూ కీలక పాత్ర పోషిస్తాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ, భౌతిక పరమైన సేవల అవసరం కూడా ఉంటుంది. భౌతికంగా అక్కడ శాఖల నిర్వహణ ఉండాల్సిందే’’ అని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్ కత్పాలియా అభిప్రాయపడ్డారు. గ్రామీణ భారతానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కోటక్ మహీంద్రా బ్యాంకు జాయింట్ ఎండీ దీపక్‌గుప్తా.. రిటైల్ కస్టమర్లు భౌతిక, డిజిటల్ నమూనాలను అనుసరిస్తున్నా.. ఇతర కస్టమర్లు ఇప్పటికీ నగదు పరమైన లావాదేవీలే ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి భౌతిక, డిజిటల్‌తో కూడిన ఫిజిటల్ నమూనా అవసరమని ఎన్పీసీఐ ఎండీ, సీఈవో దీలీప్ ఆస్బే అన్నారు. చదవండి : నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
వలసలు నేర్పుతున్న పాఠాలు
కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీటన్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు. కోవిడ్–19 ప్రాణాంతక వ్యాధి తొలి దశలో జాతి మొత్తంగా చూసిన అత్యంత విషాదకరమైన ఘటన ఏదంటే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు భారీ స్థాయిలో వలసపోతున్న భయానకమైన దృశ్యాలే. వీరు నగర భారత అసంఘటిత ఆర్థికవ్యవస్థకు చెందిన అదృశ్య చోదకులు. ఈ వ్యాసం పనిస్థలాల నుంచి వలస కూలీల నిష్క్రమణకు సంబంధించినది. ముందుగా వలసలు అంటే ఎవరు అనేది అర్థం చేసుకుందాం. సాధారణంగా తమ జన్మస్థలం నుంచి లేక తమ నివాస స్థలం నుంచి బయటకు వెళ్లేవారు అనే ప్రాతిపదికన వలస ప్రజలను నిర్వచిస్తుంటాం. గత దశాబ్దం పొడవునా రాష్ట్రాలు దాటి కొత్త అభివృద్ధి కేంద్రాలకు ప్రత్యేకించి చిన్న, మధ్యస్థాయి పట్టణాలకు మనుషులు పయనమై పోవడం వల్ల వలస అనే చట్రం అర్థం మార్చుకుంది. ఇలా భారీస్థాయిలో జనాభా వలస పోవడం ఎక్కడ జరుగుతోంది, వలస ప్రజలు ఎక్కువగా ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతున్నారు. వారి నివాస స్థానం, వారి గమ్య స్థానం ఏది అనేది చర్చనీయాంశంగా ఉంటోంది. వలస కార్మికులు ప్రధానంగా మహానగరాల్లో భవన నిర్మాణ స్థలాల్లో పనిచేస్తుంటారు. పట్టణాల శివారు ప్రాంతాల్లో ఇటుకబట్టీల్లో పనిచేస్తుంటారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తుంటారు. పైగా చెరకు పండించే ప్రాంతాలు, ముక్కారు పంటలు పండించే ప్రాంతాల్లో కూడా వీరు కనిపిస్తారు. ఇవి కాకుండా చిన్న చిన్న రోడ్డు పక్క వ్యాపారం చేసేచోట, సేవలు అందించే చోట కూడా వీరు పనిచేస్తుంటారు. దేశం మొత్తంమీద ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి భారీగా వలసలు జరుగుతుంటాయని, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానాల్లో ఉంటాయని క్షేత్రస్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వలసప్రజలను భారీ ఎత్తున స్వాగతిస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజ రాత్, ఏపీ, కేరళ తొలి స్థానాల్లో ఉంటున్నాయి. భారత్‌లో వలస ప్రజల గురించి అందుబాటులో ఉన్న డేటా పూర్తి వైవిధ్యభరితమైన వాస్తవికతను ప్రదర్శిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోపల వివిధ ప్రాతాలకు 45 కోట్లమంది వలసపోతున్నారని, ఇది 2001 జనాభా లెక్కల కంటే 30 శాతం ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. దేశం లోపల భారీఎత్తున సాగుతున్న ఈ వలసకు కారణాలు ఏంటి? అమితమైన బాధ, కడగండ్ల బారినపడటం లేక అవకాశాలు వెదుక్కుంటూ పోవడం వల్ల వలస వెళుతున్నారా? లభ్యమవుతున్న సహజ కారణాలు, పంచుకున్న అనుభవాలను పరిశీలించినట్లయితే వలసలు ప్రారంభమవుతున్న రాష్ట్రాలు తక్కువ సామాజిక, ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తున్నాయని, చాలావరకు దేశంలో వలసలనేవి జీవనం గడపడంకోసం, మనుగడకోసం పోరాటంలో భాగంగా జరుగుతుంటాయని తెలుస్తుంది. జీవితంలో బాధలనుంచి బయటపడటానికే మన దేశంలో ఎక్కువగా వలసలు జరుగుతుంటాయి. వలసలు ప్రారంభమయ్యే, చేరుకునే ప్రాంతాల్లోని పని అవకాశాలు, మనుగడ పరిస్థితుల ప్రాతిపదికనే వలసల వ్యూహాలు ఆధారపడి ఉంటాయి. వలసపోయిన వారు తిరిగి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడం ఏ స్థాయిలో జరుగుతోందో పరిశీలిద్దాం. లేబర్ ఫోర్స్ సర్వే (2017–18) కాలానికి గాను 23 కోట్ల 80 లక్షలమంది కార్మికులు స్వయం ఉపాధి విభాగంలో పనిచేస్తున్నారని, మరో 11 కోట్ల 20 లక్షల మంది తాత్కాలిక కార్మికుల విభాగంలో పనిచేస్తున్నారని తెలిసింది. శాశ్వత వర్కర్లుగా ఉంటున్న లేదా మూడేళ్లకు మించి ఒప్పందంలో భాగంగా పనిచేస్తున్న వారు కోటీ 90 లక్షలమంది మాత్రమే. వీరిని మాత్రమే శాశ్వత ఉద్యోగులు అని పిలుస్తున్నారు. ఇకపోతే క్రమబద్ధమైన ఉపాధి రంగంలో ఉంటూనే తాత్కాలిక ఉపాధిరంగంలో పనిచేస్తున్న 4 కోట్ల 90 లక్షలమంది కార్మికులను ఈ విభాగం నుంచి తప్పించారు. ఆరో ఆర్థిక జనగణన 2015–16 ప్రకారం (కేంద్ర పాలితప్రాంతాలు మినహా), దేశంలో 2 కోట్ల 40 లక్షల పైబడిన వ్యాపార సంస్థలు 21 కోట్ల 16 లక్షలమంది కార్మికులను నియమించాయి. ఇక కార్మికుల సంఖ్య రీత్యా చూస్తే, 17.2 కోట్లమంది కార్మికులు (79.85 శాతం) తొమ్మిది మంది కంటే తక్కువ సంఖ్యలో కార్మికులను కలిగి ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇకపోతే 10 మందికి మించి 49 మందికి మించని కార్మికులు ఉన్న వ్యాపార సంస్థల్లో 2 కోట్ల మంది పనిచేస్తున్నారు. వందమందికంటే ఎక్కువ కార్మికులను కలిగి ఉన్న వ్యాపార సంస్థల్లో కోటీ 70 లక్షల మంది (8 శాతం) మాత్రమే పనిచేస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారీ సంస్థలను మినహాయిస్తే, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు స్థూల దేశీయ ఉత్పత్తిలో 6.11 శాతానికి దోహదం చేస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ 2010 మార్చి 20న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులతో సహా ఏ విభాగానికి సంబంధించిన ఉద్యోగులను, కార్మికులను తొలగించరాదని, వారి వేతనాల్లో కోత విధించరాదని ఆదేశించింది. ఈ సర్క్యులర్ ప్రకారం లే ఆఫ్‌లు ప్రకటించకుండా తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు వేతనాలు చెల్లించవలసి వస్తే అది పలు ఆర్థిక అవరోధాలకు సాక్షీభూతమై నిలుస్తుంది. అదనపు వేతన ఖర్చులను భరించాల్సి వస్తున్న కారణంగా ఈ విభాగంలోని అనేక యూనిట్లు దివాలా తీయక తప్పదు. ఈ భారీ ఖర్చును భరించే శక్తి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఉండదు. అందుచేతనే దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. కోట్లాది మంది వలస కార్మికుల జీవితాలను బాగు చేయలేనంతగా దెబ్బ తీయడమే కాకుండా, ఉత్పత్తి నుంచి పంపిణీ, వినియోగం వరకు అన్ని విభాగాల్లో, రంగాల్లో కార్యకలాపాలను స్తంభింపజేసింది. నగరాల నుంచి భారీస్థాయిలో వలసకార్మికులు తిరుగుముఖం పట్టడం అనేది స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదాల్లో ఒకటిగా నిలిచింది. గత వందేళ్లకాలంలో కోవిడ్–19 ప్రాణాంతక వైరస్ కలిగిస్తున్న ఉత్పాతాన్ని ఇటీవలి మానవచరిత్రలో ఎవరూ చూసి ఉండలేదు. 1918లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఫ్లూ వ్యాధిని మాత్రమే దీనికి సరిసమానంగా భావించవచ్చు కానీ ఆనాడు ఆ వ్యాధికి గురైన బాధితులు దాదాపుగా ఇప్పుడు బతికి ఉండలేదు. కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ క్రమం అనేది సుదీర్ఘ ప్రక్రియను అనుసరిస్తుంది. తమ నివాస ప్రాంతాల్లో పనులు దొరకని, పట్టణ ప్రాంతాల్లో అవకాశాల కోసం చూస్తున్న వలస కార్మికులకు ఇది బాధాకరమైన ప్రక్రియగానే ఉండబోతుంది. భారత నగరీకరణకు చెందిన చెల్లాచెదురు స్వభావం కానీ, లాక్ డౌన్‌ని పాక్షికంగా దశలవారీగా ఎత్తివేసిన పరిస్థితులు కానీ కాంట్రాక్టర్ కీలకంగా ఉండే కార్మికుల సప్లయ్ చైన్స్‌ని తిరిగి కొలిక్కి తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకునేలా ఉన్నాయి. కార్మికులు తిరిగి వస్తున్నందున అనియత రంగ కార్మిక మార్కెట్ కూడా మార్పు చెందనుంది. పైగా వలస కార్మికులను భారీగా ఇముడ్చుకునే నిర్మాణం రంగం వంటి కొన్ని రంగాలు త్వరలో పుంజుకోవడం సాధ్యపడదు. రాష్ట్రాలు దాటిపోయే వలస కార్మికులపై ఇప్పుడు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పట్టణాలు, నగరాలనుంచి ఒత్తిడి పెరుగుతోంది కానీ ఇవి వారికి పెద్దగా అవకాశాలు కల్పించలేవు. అధిక జనాభా ఖాళీగా ఉండటం, కారుచౌకగా శ్రామికులు అందుబాటులో ఉండటం అనేవి కార్మికుల సామూహిక బేరసారాలు, భద్రత, పని హక్కువంటి అంశాలపై విధ్వంసకర ఫర్యవసానాలకు దారి తీస్తాయి. ఇప్పటికే తమ నివాస ప్రాంతాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు పని దొరకబుచ్చుకునే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతినిపోయి ఉన్న పరిస్థితుల్లో, వీరి చుట్టూ అల్లుకున్న సామాజిక బాంధవ్యాలు మానవ మనుగడను సంక్షోభంలోకి నెట్టివేస్తాయి. ఇలా రివర్స్ మైగ్రేషన్ కలిగిస్తున్న ప్రభావం ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలపై వాటి అనుబంధ కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీట న్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ అవసరం మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు. -దిలీప్ దత్తా, డైరెక్టర్, సీఈఓ, సాయంతన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా -
కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్‌లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు పేర్కొంది. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 18-45 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది. ఆ తరువాత 46-60 సంవత్సరాల వారిలో 39.5 శాతం ఉండగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్ 4 వరకు ఈ సర్వే జరిగింది. కోవిడ్ కవచ్ ఎలీసా కిట్ ఉపయోగించి 28,000 మంది రక్తనమునాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్ కోసం పరీక్షించింది. చదవండి: దేశంలో రికార్డు స్థాయిలో 96,551 కేసులు -
రూరల్ రంగస్థలం!
ఇన్నాళ్లు ఒకెత్తు.. ఇప్పుడు ఎన్నికల పైఎత్తు!! గ్రామీణ రంగస్థలంపై ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మోదీ సర్కారు ఈ సారి బడ్జెట్‌పై పెద్ద కసరత్తే చేసింది. ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో ఓటర్ను ఆకర్షించేవిధంగా ‘ఫ్లాగ్షిప్’ ప్రణాళికను ప్రకటించారు. పేరుకు మధ్యంతర బడ్జెటైనా, పూర్తిస్థాయి బడ్జెట్‌ను తలపింపజేశారు. ఉపాధిహామీకి మరింత ధీమా, మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం, గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులను కుమ్మరించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. గ్రామపంచాయతీలకు డిజిటల్ సొబగులు, ప్రతిఒక్కరికి గృహవసతి కల్పన లాంటి తాయిలాలు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ లక్ష్యానికి ఆమడదూరంలో భారత్ నిలిచింది. ఉపాధి హామీకి మరింత ఊతం - మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ దఫా బడ్జెట్లో రూ. 60వేల కోట్లు కేటాయింపు. - గతేడాది కన్నా ఈ మొత్తం రూ. 5వేల కోట్లు లేదా 11 శాతం అధికం. - అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతారు. - దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా ఉండేందుకు, అర్బన్– రూరల్ విభజనను తగ్గించేందుకు కృషి. - 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. - ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన - 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద ఇప్పటిదాకా 2,48,19,168 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం లక్ష్యం 2.5 కోట్ల కుటుంబాలు. - ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. - దీనికోసం ఇప్పటివరకూ రూ. 16320 కోట్ల వెచ్చింపు. - పేద, మధ్యతరహా కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బుల అందజేత. - ఎల్ఈడీ బల్బులతో రూ.50వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా. మూడు రెట్లు పెరిగిన గ్రామీణ రోడ్ల నిర్మాణం - 2022కు బదులు 2019 మార్చికే అన్ని ఆవాసాలకు రహదారులు - ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు 3 రెట్లు పెరిగాయి. - మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. ఫేజ్–3 కింద ఆవాసాలను ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లతో కలిపేందుకు లింక్ రోడ్ల నిర్మాణాలు. - హైవేల నిర్మాణంలో ప్రపంచంలోనే ముందంజ. రోజుకు 27 కి.మీ. హైవేల నిర్మాణం స్వచ్ఛ భారత్ సాకారం... - 2014–15 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. బహిరంగ మలవిసర్జన అలవాటు దాదాపు కనుమరుగైంది. - ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాల సంఖ్య 5.45 లక్షలకు చేరింది. - గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. గ్రామీణ టెలిఫోనీ - భారత్ నెట్ ఫేజ్1 కింద 1, 21, 652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. - 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. - దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాంక్ యాక్సెస్ లభించింది. - 39, 359 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్స్ ఇన్స్టలేషన్ పూర్తి. - ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం - ఈ ‘భారత్ నిర్మాణ్’ పథకానికి నిధులు జోరుగానే అందుతున్నాయి. - దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. - దీన్ని ఇప్పుడు విజన్ 2030లో భాగంగా చేర్చారు. - నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - 2019–20 కేటాయింపులు 25,853కోట్లు - 2018–19 సవరించినది 26,405 కోట్లు - ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం(గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కలిపి) - నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో రూ. 10వేల కోట్ల కార్పస్‌తో కొత్తగా హౌసింగ్ ఫండ్(ఏహెచ్ఎఫ్) ఏర్పాటు. - ఇళ్ల నిర్మాణాలు ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఈ పథకం కింద ఐదు రెట్లు అధికం. 2022 నాటికి అందరికీ గృహవసతి లక్ష్యం. ఊరటనిచ్చేదే! ‘బడ్జెట్ ప్రజలకు కొంత ఊరట కలిగించేదే. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన తరహాలో కేంద్ర స్థాయిలో నగదు బదిలీని పెట్టడం హర్షించదగిన పరిణామం’ –డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్. ఊరికి మరిన్ని మెరుపులు... పదిహేనేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఉపాధి హామీకి నిధుల హామీ దొరికింది. మునుపటికన్నా మరీ ఎక్కువ కాకున్నా... ఒక మోస్తరుగా కేటాయింపులు పెరిగాయి. ఇక గ్రామ్జ్యోతి యోజనంటూ ఏటా విద్యుత్ కనెక్షన్లిచ్చిన కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందుకు ఆనందించాలో... అసలింకా కరెంటుకు నోచుకోని ఇళ్లున్న దౌర్భాగ్యానికి సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. గ్రామీణ రోడ్ల నిర్మాణం మాత్రం జోరుగానే సాగుతోంది. స్వచ్ఛ భారత్ ఆశయంలో ఉన్నంత ఉదాత్తత ఆచరణలో ఇంకా కనిపించాల్సి ఉందన్నది కాదనలేని నిజం. కాకపోతే దీనికి ప్రభుత్వం కన్నా ప్రజలే ఎక్కువ చేయాల్సిందన్నది వాస్తవం. ఏడాదిలో కనీస ఉపాధి రోజులు: 100 -
రూ.2000 నోటు లాజిక్ నాకు తెలియదు
సాక్షి, కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేధోవర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. అయితే, గ్రామీణ పౌర సమాజం మాత్రం పెద్ద మొత్తంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని చెప్పారు. అయితే, అప్పటికప్పుడు రూ.500 నోట్లను రద్దు చేసిన కేంద్రం వెంటనే అంతకంటే పెద్దదైన రూ.2000 నోటును ఎందుకు తీసుకొచ్చిందోనని, ఆ లాజిక్ తనకు ఇప్పటికీ అర్ధం కాలేదని చెప్పారు. బుధవారం ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యార్థులతో మమేకమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నేను ఆర్థికశాస్త్రంలో పెద్ద నిపుణుడిని కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేథావులను పెద్దగా ఆకర్షించలేదు.. కానీ, గ్రామాల్లోని భారతీయులు మాత్రం బాగా స్వాగతించారు. పెద్ద నోట్ల నిర్ణయం ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటకీ తెలియదు. నేను పెద్దగా నిపుణుడిని కానప్పటికీ ఒక సామాన్యుడిగా ఆలోచించినప్పుడు కొన్ని కారణాల రీత్యా రూ.500 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతే వేగంగా అంతకంటే పెద్దవైన రూ.2000 నోట్లను ఎందుకు తీసుకొచ్చిందో అన్న లాజిక్ నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఇలా ఎందుకు చేశారో నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరు.. ఈ విషయం నిపుణులనే మీరు కూడా అడగండి. 1950 నుంచి జపాన్, చైనా మాదిరిగా భారత ఐటీ కంపెనీలు స్వల్పశ్రేణి తయారీరంగంపై దృష్టిపెట్టలేదు. మన దురదృష్టం కొద్ది దేశంలో 75శాతం చిన్నారులు స్కూల్‌కు వెళుతున్న వారిలో 8వ తరగతి చేరకముందే స్కూల్ మానేస్తున్నారు. వీరు 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఓ ఉపాధి కావాలి. వారికి స్వల్పశ్రేణి తయారీరంగంలోనే అది లభిస్తుంది. భారత్‌లో ఆ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. భారత ఆర్థికవేత్తలు ఈ అంశంపై దృష్టి సారించాలి' అని నారాయణమూర్తి తెలిపారు. -
అర్ధాకలితో గ్రామీణ భారతం..
గ్రామీణ ప్రజలు తినే ఆహారం తగ్గిపోతోంది 40 ఏళ్ల క్రితం నాటి కంటే తక్కువ తింటున్న భారతీయులు నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిపోయింది. 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి రేటు సాధిస్తోంది. 2008లో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడినా.. మనదేశం తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే.. గ్రామీణ భారతంలో ప్రజలు తినే ఆహారం బాగా తగ్గిపోయిందట. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 83 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించడం లేదట. ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆహారం కంటే గ్రామీణ భారతీయులు తక్కువగా తింటున్నారట. ఈ విషయాలన్నీ 2012 నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో(ఎన్‌ఎన్‌ఎంబీ) సర్వే వెల్లడించింది. 1975-79 నాటి సరాసరితో పోల్చి చూస్తే ఇప్పుడు గ్రామీణ భారతీయులు 550 క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రొటీన్లు 13 గ్రాములు, ఐరన్ 5 మిల్లీగ్రాములు, కాల్షియం 250 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 500 మిల్లీగ్రామలు తక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. ఇక మూడేళ్లలోపు పిల్లలు ప్రతి రోజు 300 మిల్లీలీటర్ల పాలు తాగాల్సి ఉండగా.. ప్రస్తుతం సగటున ప్రతి చిన్నారికీ అందుతున్న పాలు 80 మిల్లీలీటర్లే. పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. సాధారణంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటే.. ప్రజల కంచాల్లో ఆహారం కూడా పెరగాలి. కానీ నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుతున్న పోషకాహారం బాగా తగ్గింది. గత నలభై ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వారి సంఖ్య 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో భూ యజమానులు, వ్యవసాయదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఇదే సమయంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. సాధారణ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటే.. ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి పెరిగింది. దీంతో పప్పులు, నూనెలు, తృణధాన్యాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొందరు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు. ఈ సర్వే ప్రకారం 35 శాతం మంది గ్రామీణ పురుషులు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. 42 శాతం మంది బాలలు నిర్దేశిత బరువుకంటే తక్కువ ఉంటున్నారట. పేదలు ఎక్కువగా నివసించే పల్లెలు, బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 70 ఏళ్లైనా విధానపరమైన చర్యల్లేవు.. స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి గురించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మదింపు జరుగుతూ ఉంటుంది. అయితే పోషకాల స్థాయిని మాత్రం పదేళ్లకు ఒకసారి లెక్కిస్తుండటం గమనార్హం. కాగా, భారతదేశంలో పోషకాహార స్థాయి బ్రెజిల్ కంటే 13 రెట్లు, చైనా కంటే తొమ్మిది రెట్లు, దక్షిణాఫ్రికా కంటే మూడు రెట్లు తక్కువే. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా పోషకాహార లోపానికి సంబంధించి మనదేశం సరైన విధాన పరమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. -
ఫేస్ బుక్ ద్వారా 'బూస్ట్ యువర్ బిజినెస్'
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతోంది. గ్రామాల్లోని చిన్న తరహా పరిశ్రమల వ్యాపారాభివృద్ధికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారత్ లోని పల్లెలకు 'బూస్ట్ యువర్ బిజినెస్ ' పేరిట్ ప్రత్యేక కార్యక్రమాన్ని పరిచయం చేసి, అక్కడి వ్యాపారాలను పెంచుకునే విధంగా సహాయ పడేందుకు కృషి చేస్తోంది. భారతదేశంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన చేతివృత్తులు, కళలపై ఫేస్ బుక్.. దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రామాల్లో తయారయ్యే అనేక కళాత్మక వస్తువులు, నేత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆయా వ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నట్లు ఫేస్ బుక్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ ఇనీషియేటివ్స్ అధికారి రితేష్ మెహతా తెలిపారు. ఒక సంస్థ అధికంగా వ్యాపారం చేయడం కష్టమని, అందుకే తాము అనేక సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలను అభివృద్ధి పరిచే ప్రయత్నం చేస్తున్నామని మెహతా తెలిపారు. ఇందులో భాగంగా పది వరకూ ఎన్జీవో లు లేదా ప్రభుత్వాలతో కలసి పనిచేసేందుకు ఫేస్ బుక్ సిద్ధమౌతున్నట్లు రితేష్ వెల్లడించారు. ముఖ్యంగా వృత్తులు, కళలకు ఫేస్ బుక్ మంచి వేదిక అని, అందుకే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల అభివృద్ధికి వినియోగించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని ఐదారు నగరాలతోపాటు ముఖ్యంగా గ్రామాల్లో పర్యటించిన ఫేస్ బుక్ తన కొత్త ప్రయత్నంలో భాగంగా బెనారస్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని నేత కార్మికులకు, అలాగే కనౌజ్, కాన్పూర్ ప్రాంతాల్లోని ప్రజలకు ఫేజ్ బుక్ వినియోగంపై అవగాహన కల్పించింది. ముందుగా గుజరాత్ గ్రామాల్లోని కళాకారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు పెనవేసుకున్న ఎన్జీవో సంస్థ 'సేవా' తో కలసి తమ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు చెప్తున్న ఫేస్ బుక్ ప్రతినిధులు... భాగస్వామ్యం విషయంలో మాత్రం స్పష్టతను ఇవ్వలేదు. అలాగే కర్నాటక ప్రభుత్వంతో కూడ వ్యాపారాభివృద్ధిపై చర్చించినా.. రాష్ట్రంలోని నగరాలకు ఎటువంటి ప్యాకేజ్ ను ప్రకటిస్తుందో తెలుపలేదు. ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరుతోపాటు దేశంలోని ఏడు నగరాల్లో పర్యటించిన ఫేస్ బుక్ ప్రతినిధులు.. 4000 మంది మహిళా వ్యాపారస్తులకు శిక్షణ ఇచ్చారు. ఈ సంవత్సరం చివరినాటికి మొత్తం 20 నుంచి 25 నగరాల్లో మహిళా వ్యాపారవేత్తలకు ఫేస్ బుక్ సాంకేతిక వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి పరచుకునే వీలుంటుందని మెహతా తెలిపారు. ఇప్పటికే తాము నిర్దేశించుకున్న నగరాల్లో జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్ ఉన్నాయని అక్కడకూడ పర్యటించి ఫేస్ బుక్ లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి అవగాహనను కల్పించనున్నట్లు సోషల్ నెట్వర్క్ సంస్థ అధికారులు చెప్తున్నారు. -
‘ఫ్లాగ్ షిప్’.. వేగం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేటాయింపుల జోరు... గ్రామీణ భారత్‌కు మరింత జవసత్వాలు కల్పించడం... మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలకమైన ‘ఫ్లాగ్షిప్’ పథకాలపై ప్రధాని మోదీ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఆర్థిక మంత్రి జైట్లీ ఇందులోని అన్ని పథకాలకూ భారీగా నిధుల కేటాయింపులను పెంచడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా.. ఇప్పటికే స్వచ్ఛ భారత్ సెస్సును విధించిన కేంద్రం.. ‘క్లీన్’ సెస్సును మరింతగా పెంచడం ద్వారా అదనంగా నిధులను సమకూర్చుకోనుంది. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దాదాపు ఒకటిన్నర రెట్లు కేటాయింపులు పెరగడం గమనార్హం. ఇక వరుసగా రెండేళ్ల కరువు పరిస్థితులతో దుర్భల పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేయూత కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా భారీగానే పెంచారు. రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకూ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం... చౌక గృహ నిర్మాణానికి పెద్దపీట వేయడం... పల్లెల్లో రోడ్లపై మరింతగా దృష్టిపెట్టడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి మోదీ సర్కారు ఈ బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేసింది. ఉపాధికి ‘హామీ’... 201617 కేటాయింపు: రూ. 38,500 కోట్లు (11% పెంపు) 201516 కేటాయింపు: రూ. 34,699 కోట్లు(12% పెంపు) గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేసేవిధంగా ఉపాధి పనులను వాడుకోనున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. స్వచ్ఛ భారత్‌కు దన్ను... భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా జైట్లీ గతేడాది సర్వీసు పన్నుకు (ప్రస్తుతం 14 శాతం) అదనంగా 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్సును అమల్లోకి తీసుకొచ్చారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని జైట్లీ బడ్టెట్ ప్రసంగంలో చెప్పారు. మరోపక్క, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి నిధుల కల్పన కోసం క్లీన్ ఎనర్జీ సెస్ (క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్‌గా ఇప్పుడు పేరు మార్చారు)ను ఈ బడ్జెట్లో కూడా పెంచారు. బొగ్గు తదితర ఖనిజాలపై ఒక్కో టన్నుపై ఇప్పుడు విధిస్తున్న రూ.200 సెస్‌ను రూ.400కు చేరుస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుద్ధ్యం), జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్ అభియాన్ రూ.9,000కోట్లు (గ్రామీణ)+ రూ.2,300 (పట్టణ) 201617 కేటాయింపు: రూ.9,000 కోట్లు (148 % పెంపు) 201516 కేటాయింపు: రూ.3,625 కోట్లు ♦ 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ♦ దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. ♦ కాగా, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ర్యాంకింగ్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల నగరాలు, పట్టణాల మధ్య నిర్మాణాత్మక పోటీకి తోడ్పడుతుందని జైట్లీ అన్నారు. ♦ అదేవిధంగా ఎస్‌బీఏలో భాగంగా నగరాల్లోని చెత్తను కంపోస్టుగా మార్చే ఒక ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెల్లడించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 201617 కేటాయింపు: రూ. 5,000 కోట్లు (92% పెంపు) 201516 కేటాయింపు: రూ.2,611 కోట్లు(76% తగ్గింపు) దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గ్రామీణ టెలిఫోనీ... 201617లో: రూ. 2,755 కోట్లు (15% పెంపు) 201516లో: 2,400 కోట్లు (32% తగ్గింపు) 2016 డిసెంబర్ కల్లా మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన... 201617 కేటాయింపు: రూ. 8,500 కోట్లు (25% పెంపు) 201516 కేటాయింపు: రూ. 6,800 కోట్లు (32% పెంపు) ♦ విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. ♦ 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని.. వచ్చే 1000 రోజుల్లో వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ హామీనిచ్చారు. ♦ దీనిలో భాగంగానే 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. ♦ తాజా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.3,000 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమం వంటి వాటికి (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్స్) రూ.5,000 కోట్లు చొప్పున కేటాయించారు. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16 ఫిబ్రవరి 23 నాటికి)లో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో మొత్తం విద్యుదీకరించిన గ్రామాలకంటే ఇది అధికమని కూడా జైట్లీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 201617 కేటాయింపు: రూ.20,075 (41% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,200 కోట్లు(11% కోత) ♦ అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్టెజ్‌లో చౌక గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎంఎస్‌వైతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు(60 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణానికి మించని గృహాలపై) సేవా పన్నును(ప్రస్తుతం ఇది 5.6 శాతంగా ఉంది) పూర్తిగా తొలగిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చౌక గృహాలకు(60 చదరపు మీటర్ల వరకూ) సంబంధించిన ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. ♦ మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు. ♦ మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. ♦ పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ కల్పనకు సర్దార్ పటేల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు పెట్టారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 201617 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (33% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,291 కోట్లు (0.7% తగ్గింపు) ♦ మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ఇది. ♦ గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మోదీ సర్కారు దీనికి ఈ బడ్జెట్లో దండిగానే నిధులను విదిల్చింది. ♦ ఈ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. ♦ 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ♦ 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73.5 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం 100 కిలోమీటర్లకు జోరందుకుందని.. దీన్ని మరింతగా పెంచనున్నట్లు కూడా జైట్లీ పేర్కొన్నారు. -
గ్రామాలు కూడా దాని వెనుకే పడుతున్నాయి
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పట్టణ వాసులే కాదు.. గ్రామీణవాసులు కూడా దూసుకెళుతున్నారని ఓ సర్వే తెలిపింది. గ్రామీణ భారతంలో గత ఏడాది కాలంలో సామాజిక అనుసంధాన వేదికలు(ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వీచాట్, ఈమెయిల్..మొదలైనవి) ఉపయోగించే వారు వందశాతం పెరిగారని వెల్లడించింది. ప్రస్తుతం 25 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని వివరించింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం సోషల్ మీడియా ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది వందశాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 35శాతం మాత్రమే పెరిగిందంట. అయితే, ఇక్కడ సోషల్ మీడియా ఉపయోగించేవారు సంఖ్యా పరంగా మాత్రం 118 మిలియన్లు ఉన్నారని సర్వే పేర్కొంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అనే సంస్థ, ఇండియన్ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో(ఐఎంఆర్బీ) అనే సంస్థలు కలిసి సోషల్ మీడియా ఇన్ ఇండియా-2014 అనే పేరిట ఒక నివేదిక వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ వరకు మొత్తం 143 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగించేవారు ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. ఇక, కేటగిరీలవారిగా కాలేజీ విద్యార్థులు 34శాతం, యువకులు 27 శాతం, పాఠశాల విద్యార్థులు 12శాతం పెరిగారని వివరించింది.