గ్రామాలు కూడా దాని వెనుకే పడుతున్నాయి
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పట్టణ వాసులే కాదు.. గ్రామీణవాసులు కూడా దూసుకెళుతున్నారని ఓ సర్వే తెలిపింది. గ్రామీణ భారతంలో గత ఏడాది కాలంలో సామాజిక అనుసంధాన వేదికలు(ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వీచాట్, ఈమెయిల్..మొదలైనవి) ఉపయోగించే వారు వందశాతం పెరిగారని వెల్లడించింది. ప్రస్తుతం 25 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని వివరించింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం సోషల్ మీడియా ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది వందశాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 35శాతం మాత్రమే పెరిగిందంట.
అయితే, ఇక్కడ సోషల్ మీడియా ఉపయోగించేవారు సంఖ్యా పరంగా మాత్రం 118 మిలియన్లు ఉన్నారని సర్వే పేర్కొంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అనే సంస్థ, ఇండియన్ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో(ఐఎంఆర్బీ) అనే సంస్థలు కలిసి సోషల్ మీడియా ఇన్ ఇండియా-2014 అనే పేరిట ఒక నివేదిక వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ వరకు మొత్తం 143 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగించేవారు ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. ఇక, కేటగిరీలవారిగా కాలేజీ విద్యార్థులు 34శాతం, యువకులు 27 శాతం, పాఠశాల విద్యార్థులు 12శాతం పెరిగారని వివరించింది.