mobile data
-
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మొబైల్ డేటా వినియోగంలో భారీగా పెరుగుదల
-
పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..!
సాక్షి, అమరావతి: దేశంలో డేటా ట్రాఫిక్ పెరుగుతోంది. మొబైల్ వినియోగంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ఏకంగా 3.2 రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా.. 2027 నాటికి 46 జీబీకి చేరుకుంటుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే... ఒక వ్యక్తి ద్వారా నెలలో 136 శాతం డేటా వాడకం పెరగనుంది. దేశంలో చౌకగా మొబైల్ డేటా లభిస్తుండటంతోపా టు హైస్పీడ్ 5జీ నెట్వర్క్ విస్తరణతో డేటా విస్తతిలో గణనీ య మైన మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సంస్థలు వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ డేటా నెట్‌వర్క్‌ల కోసం సుమారు 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. 240 గంటలకు పైగా బ్రౌజింగ్ ప్రపంచ జనాభాలో దాదాపు 65.60 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. 4.60 బిలియన్ల మంది ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో అయితే 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరం అవుతోంది. భారత్‌లో అయితే, ప్రస్తుతం సగటున నెలకు ఒక వ్యక్తి 240 గంటలకుపైగా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారు. ఈ లెక్కన దేశం మొత్తం ఒక నెలకు డేటా వినియోగం 14 ఎక్సాబైట్లకు చేరుకుంది. ఇక్కడ ఒక ఎక్సాబైట్ ఒక బిలియన్ గిగాబైట్లకు సమానం. చౌకైన డేటా! ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ ఒక జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూకే డేటా గణాంకాల వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు స్మార్ట్ఫోను వినియోగిస్తుండటంతో ఇది అమెరికా కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్ల వ్యాప్తిని కలిగి ఉంది. తక్కువ రేటుకు మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇటలీ (0.12 డాలర్లు) రెండవ, భారత్ (0.17 డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. మరోవైపు అత్యంత ఖరీదైన డేటా ప్లాన్లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్ దీవుల్లో ప్రజలు ఒక జీబీ డేటా కోసం 38.45 డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్ హెలెనాలో అయితే 41.06 డాలర్లుగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇజ్రాయెల్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వెచి్చంచి మొబైల్ డేటాను కొనుగోలు చేస్తున్నారు. -
డేటా స్పీడ్‌లో భారత్ జోరు..
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో (ఎస్జీఐ) అత్యంత స్వల్ప సమయంలోనే భారత్ 49 ర్యాంకులు ఎగబాకి 69వ స్థానానికి చేరింది. తద్వారా రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని జీ20 దేశాలను కూడా అధిగమించింది. 5జీ సేవల ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డేటా స్పీడ్‌కి సంబంధించి నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ విశ్లేషణ సంస్థ ఊక్లా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం భారత్‌లో సగటున డౌన్లోడ్ స్పీడ్ 13.87 ఎంబీపీఎస్ నుంచి (2022 సెప్టెంబర్) 115 శాతం వృద్ధి చెంది 29.85 ఎంబీపీఎస్‌కు (2023 జనవరి) పెరిగింది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌జీఐలో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది జనవరిలో 69వ స్థానానికి చేరింది. త్వరలోనే బ్రెజిల్ (35.85 ఎంబీపీఎస్, 57వ ర్యాంకు)ను కూడా అధిగమించనుంది. జియో టాప్.. జనవరిలో జియో 5జీ స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 246.49 ఎంబీపీఎస్ నుంచి కోల్‌కతాలో 506.25 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అలాగే ఎయిర్టెల్ 5జీ యూజర్లకు కోల్‌కతాలో సగటున 78.13 ఎంబీపీఎస్, ఢిల్లీలో 268.89 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభించింది. ఇక గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 5జీ లాంచ్ తర్వాత ఇది మరింత వేగవంతమయ్యింది. -
దేశంలో డేటా విప్లవం, 6ఏళ్లు పూర్తి చేసుకున్న జియో
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీసిన రిలయన్స్ జియో సోమవారంతో (5వ తేదీ) ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది. జియో రాక ముందు సగటున ఒక మొబైల్ కస్టమర్ ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అది నెలకు 15.8 జీబీ స్థాయికి చేరుకుంది. డేటా వినియోగం వంద రెట్లు పెరగడంలో జియో పాత్ర కీలకమని చెప్పుకోవాలి. అంతేకాదు, గతంలో ఒక జీబీ డేటాకు రూ.200కు పైన ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రూ.7–15కే జీబీ డేటా వస్తోంది. ఇక వచ్చే దీపావళి నుంచి 5జీ సేవల ప్రారంభానికి జియో సన్నద్ధమవుతోంది. 2023 చివరికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 4జీతో పోలిస్తే 5జీ సేవల వేగం ఎంతో ఎక్కువ. దీంతో 5జీ తర్వాత మూడేళ్ల కాలంలో డేటా వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. డేటా ఆధారిత కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రాకతో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. 41.30 కోట్ల కస్టమర్లతో టెలికం మార్కెట్లో జియో వాటా 36 శాతంగా ఉంది. -
'మొబైల్ డేటా చీప్‌గా దొరికే దేశాల జాబితాలో భారత్'!
అతి తక్కువ ధరకే మొబైల్ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్ నిలిచింది. 233 దేశాల్లో సేకరించిన డేటా ఆధారంగా భారత్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో వినియోగదారులకు మొబైల్ డేటాగా చీప్‌గా దొరుకుతున్నట్ల తాజాగా విడుదలైన ఓ నివేదిక తెలిపింది. యూకేకి చెందిన 'కేబుల్.కో.యూకే' అనే టెలికాం సంస్థ 233 దేశాల్లో 1జీబీ డేటా ధర ఎంత ఉందనే అంశంపై ఓ డేటాను విడుదల చేసింది. అందులో మొబైల్ డేటా తక్కువ ధరకే లభ్యమయ్యే 5 దేశాల్లో భారత్‌కు 5వ స్థానం దక్కింది. ఇక ఆ 5దేశాల్లో ఇజ్రాయిల్ దేశం 1జీబీ డేటాను 0.04 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.3.20), ఇటలీ 0.12 డాలర్లు(రూ.9.59), శాన్ మారినో 0.14 డాలర్లు (రూ.11.19), ఫిజి దేశంలో 1జీ డేటా 0.15 డాలర్ల (రూ.11.99), భారత్ 0.17 డాలర్ల (రూ.13.59)తో వరుస స్థానాల్లో నిలిచాయి. 1జీబీ మొబైల్ డేటా రూ.3,323 కేబుల్.కో.యూకే నివేదిక మొబైల్ డేటా ధర ఎక్కువగా ఉన్న 5 దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 1జీబీ డేటాను 41.06 డాలర్ల(రూ.3,323.92)కు అత్యధికంగా అమ్ముడవుతున్న దేశాల జాబితాలో సెయింట్ హెలెనా ప్రథమ స్థానలో నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఫల్క్ ల్యాండ్ దీవుల్లో 38.45 డాలర్లు (రూ.3,072.11) , సెంట్రల్ ఆఫ్రికా దేశమైన సెయింట్ థామస్ (São Tomé) ప్రిన్సిపి (principe)లో 29.49 డాలర్లు ( రూ.2,356) , టోకెలావ్ (Tokelau )లో 17.88 (రూ.1428) , యెమన్ దేశంలో 16.58 డాలర్ల (1324.72) ధరతో వరుస స్థానాల్లో నిలిచాయి. -
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! నెలకు సగటున ఎంత డేటా వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగి 76.5 కోట్లకు చేరారని, 4జీ డేటా ట్రాఫిక్ 6.5 రెట్లు పెరిగిందని నోకియా తెలిపింది. భారత్‌లో మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 99 శాతానికి చేరినట్టు పేర్కొంది. ఈ ఏడాది 5జీ సర్వీసులు మొదలవుతున్నా.. వచ్చే కొన్నేళ్లపాటు మొబైల్బ్రాడ్ బ్యాండ్ వృద్ధికి 4జీ టెక్నాలజీ సాయంగా నిలుస్తుందని నోకియా ఎంబిట్ పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ‘‘మొబైల్ డేటా వినియోగం 2017 నుంచి 2021 మధ్య ఏటా 53 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం మూడు రెట్లు పెరిగి 17జీబీకి చేరింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు అప్ గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు పెరిగారు. ఈ గణాంకాలన్నీ భారత్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగినట్టు తెలియజేస్తున్నాయి’’ అని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు. మిలీనియల్స్ (23–38) రోజుకు 8 గంటల సమయాన్ని ఆన్లైన్లో గడుపుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. షార్ట్ వీడియో ఫార్మాట్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం ఇవన్నీ భారత్‌లో డేటా వినియోగం వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. గతేడాది 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ల రవాణా జరిగిందని, ఇందులో 3 కోట్లు 5జీ ఫోన్లు ఉన్నట్టు తెలిపింది. -
ఒక జీబీ @ రూ.3,659
మొబైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా ఎన్నో యాప్స్.. ఎన్నో పనులు.. ప్రతిదానికీ డేటా అవసరమే. డబ్బులు చెల్లించి డేటాను రీచార్జి చేసుకోవాల్సిందే. మన దగ్గర కొన్నేళ్లుగా డేటా ధరలు బాగా తగ్గిపోయాయిగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేట్లు చుక్కలను తాకుతూనే ఉన్నాయి. మరి ఏ దేశంలో సగటున ఒక్కో గిగాబైట్ (జీబీ) డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దీనిపై బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్సైట్ విస్తృతమైన సర్వే చేసి లెక్కలు తేల్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా? 230 దేశాల్లో పరిశీలించి.. అమెరికాకు చెందిన గూగుల్, న్యూఅమెరికాస్ ఓపెన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ల ఉమ్మడి సంస్థ ఎం–ల్యాబ్, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెట్ ల్యాబ్ తదితర సంస్థల సహకారంతో కేబుల్ డాట్ యూకే వెబ్సైట్ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ప్లాన్లు, ధరలపై సర్వే చేశారు. 230 దేశాల్లో 6000 మొబైల్ డేటా ప్లాన్ల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయా దేశాల్లోని ప్రధాన టెలికాం సంస్థల డేటా ప్యాకేజీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో గుర్తించిన వివరాలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. ►ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా ఖండాల పరిధిలోని దీవుల్లో డేటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ►టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. ►ప్రపంచ సగటు డేటా ధరల కంటే అగ్రరాజ్యమైన అమెరికా, దాని పరిసర దేశాల్లో డేటా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా (154వ ర్యాంకు), జపాన్ (156వ ర్యాంకు) తదితర దేశాల్లో సగటున ఒక జీబీ రేటు రూ.250కిపైనే ఉంది. ►యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ మినహా మిగతా దేశాల్లో డేటా ధరలు చాలా ఎక్కువ. ►పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఇండియా కంటే తక్కువ ధరలకు మొబైల్ డేటా అందుబాటులో ఉందని సర్వే పేర్కొంది. ►ఇప్పటికీ 2జీ, 3జీ మొబైల్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్న దేశాల్లో.. తక్కువ మొత్తంలో డేటాకు ఎక్కువగా చార్జి చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఒక్కో జీబీ డేటాకు రేటు వేల రూపాయల్లోకి వెళుతోంది. -
డేటా వాడేశాడని తమ్ముడిని కడతేర్చాడు
జోధ్‌పూర్: మొబైల్ డేటాను మొత్తం వాడేశాడని సొంత తమ్ముడిని అన్నయ్య చంపిన ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిందితుడు రామన్(23) తన తమ్ముడు రాయ్‌ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ డేటాను పూర్తిగా వాడడంతో తమ్ముణ్ణి తిట్టాడు. కోపంతో నిందితుడు రాయ్ ఛాతీ మీద పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న రాయ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పారిపోయిన నిందితుడు రామన్‌ను శుక్రవారం రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. (చదవండి:ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) -
మొబైల్ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!
న్యూయార్క్: మొబైల్‌ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా ప్రజల కదలికలను గుర్తించి తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని రెండు వారాల ముందుగానే గుర్తించవచ్చునని అమెరికాలోని యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో చైనాలోని వుహాన్ నుంచి ప్రజలు ఏ రకంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారో పరిశీలించి, ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నికోలస్ క్రిస్టాకిస్ తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణమైతే స్థానికంగా ఉన్న ఆరోగ్య సమస్య కాస్తా ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిపోతుందని నికోలస్ తెలిపారు. జనవరి ఒకటవ తేదీ నుంచి వుహాన్‌లో లాక్డౌన్ నిబంధనలను విధించినప్పటి జనవరి 24వ తేదీ మధ్యలో కనీసం రెండు గంటల పాటు ఆ మహా నగరంలో గడిపిన వారి వివరాలను తాము సేకరించామని, చైనాలోని 31 ప్రావిన్సుల్లోని కోవిడ్ బాధితుల సమాచారంతో దీని పోల్చి చూశామని నికోలస్ తెలిపారు. ప్రజల కదలికలను సుమారు 94 శాతం వరకూ నిలిపివేసిన క్వారంటైన్ నిబంధనలు వ్యాధి నియంత్రణలో ఎంతో కీలకమయ్యాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రజలు ఎలా ఎక్కడెక్కడకు కదిలారన్నది మొబైల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించడం వల్ల రెండు వారాల ముందుగానే వ్యాధి ఎక్కడెక్కడకు ఎంత మేరకు విస్తరిస్తుందో గుర్తించడం వీలైందని వివరించారు. తాము ఉపయోగించిన మోడల్ ద్వారా కరోనా వంటి మహమ్మారులు ఏఏ నగరాలను తాకే అవకాశముందో కూడా ముందుగా తెలుసుకోవచ్చునని చెప్పారు. సమీప భవిష్యత్తులో కోవిడ్ –19 సామాజిక స్థాయిలో వ్యాపించడం మొదలుపెడితే దాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా కట్టడి చర్యలు సమర్థంగా పనిచేస్తాయని నికోలస్ వివరించారు. చదవండి: ఇటలీ తరహాలో భారత్‌లో లాక్డౌన్! -
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి,ముంబై: భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటాను అనుభవిస్తున్న కస్టమర్లు దాదాపు 10 రెట్ల మేర భారాన్ని భరించాల్సి వుంటుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. ఇది నిజంగా మొబైల్ వినియోగారుదారులకు షాకింగ్ న్యూసే. ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ చందాదారులు ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెలికాం కంపెనీలు కోరినట్లు ట్రాయ్ నిర్ణయం తీసుకుంటే మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. తాజాగా ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థన తరువాత కాల్, డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని , తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది. వినియోగదారుల జేబుకు చిల్లు రోజుకు 2 జీబీ 4జీ డేటా అందించే రూ .599 (84 రోజుల వాలిడిటీ) ప్లాన్‌లో (జీబీకి రూ .3.5 రేటు) జీబీకి రూ .20-35 పరిధిలో డేటా ధర నిర్ణయిస్తే ఇదే ప్లాన్‌కు రూ .3,360 రూ. 5,880 మధ్య బాదుడు తప్పదు. -
నెలకు 11 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్వర్క్ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 4జీ ఊతంతో 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. 3జీ డేటా ట్రాఫిక్ 30 శాతం క్షీణించింది. మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 96 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా జీబీకి రూ. 7 స్థాయిలో భారత్‌లో డేటా చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో అరగంట నిడివి వీడియో చూసేందుకు లేదా 200 పాటలను వినేందుకు సుమారు ఒక జీబీ డేటా సరిపోతుంది. కంటెంట్ నాణ్యతను బట్టి డేటా వినియోగం పెరుగుతుంది. సంపన్న దేశాల స్థాయిలో దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు విస్తరించే దాకా మొబైల్ డేటా వినియోగం పెరుగుతూనే ఉండవచ్చని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ విషయంలో చైనా, అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌ల కన్నా ముందు ఉంది. ► 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 59.8 కోట్లు కాగా, 3జీ యూజర్ల సంఖ్య 4.4 కోట్లు. ► నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫాంల ఊతంతో దేశీ యం గా వీడియోల వినియోగం భారీగా పెరిగింది. ► ఓటీటీ ప్లాట్‌ఫాంలపై యూజర్లు రోజుకు సగటున 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఒక్కో సెషను సగటున సుమారు 40 నిమిషాలు ఉంటోంది. ► 2019లో 4జీ హ్యాండ్సెట్స్ సంఖ్య 50.1 కోట్లకు చేరినట్లు అంచనా. అంతక్రితం ఏడాది ఇది 33 కోట్లు. వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఆధారిత స్మార్ట్ఫోన్ల సంఖ్య 43.2 కోట్లకు చేరింది. -
ముచ్చట్ల కంటే వీడియోలు చూసేందుకే..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. మొబైల్లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి మొబైల్ వినియోగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలు చూడటానికే సమయం కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2012లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియోలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకుపైగా వీడియోల లోకంలో విహరిస్తున్నట్లు ‘యాప్ అన్నే’ సంస్థ తెలిపింది. వీడియోలు తిలకించేందుకు అత్యధికంగా యూట్యూబ్‌ను అనుసరిస్తుండగా ఆ తర్వాత స్థానాల్లో హాట్‌స్టార్, జియో టీవీ, ప్రైమ్ వీడియో యాప్స్ ఉన్నాయి. జియో రాకతో జోరుగా... రిలయన్స్ జియో రాకతో దేశంలో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డేటా ధరలు దిగి రావడంతో 2016లో నెలకు సగటున 20 కోట్ల జీబీగా ఉన్న డేటా వినియోగం 2018 నాటికి ఏకంగా 370 కోట్ల జీబీకి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 5491 కోట్ల జీబీ డేటాను వినియోగించినట్లు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో తెలుగు హవా... హిందీయేతర వీడియోల విషయానికి వస్తే తెలుగు వీడియోలకు అత్యధిక డిమాండ్ ఉన్నట్లు ‘విడోలి’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. తెలుగు వీడియోలకు అత్యధిక వీక్షకాదరణ ఉంది. యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యే వీడియోల్లో తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయి. ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలను 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ, పంజాబీ, మలయాలీ, భోజ్‌పురి వీడియోలున్నాయి. తెలుగులో న్యూస్ చానళ్లు, సినీరంగ విషయాలకు ఆదరణ లభిస్తోంది. ఇక 5 జీ రంగప్రవేశం చేస్తే డేటా వినియోగం హోరెత్తనుంది. యూజర్లు ఇలా పెరిగారు సంవత్సరం ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య (కోట్లలో) 2015 25.99 2016 29.6 2017 48.1 2018 56.6 2019 62.7 (అంచనా) ప్రాంతీయ భాషా వీడియోల వీక్షణల సంఖ్య (కోట్లలో) భాష 2016 2018 తెలుగు 1,270 6,740 తమిళం 8,20 4,550 పంజాబీ 4,40 3,000 మలయాళం 380 1,990 భోజ్‌పురి 250 3,140 రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల... 2016లో తెలుగు వీడియోల వీక్షణల సంఖ్య 1,270 కోట్లు కాగా రెండేళ్లలో ఇది 6,740 కోట్లకు చేరింది. యూట్యూబ్‌లో అత్యధికంగా అప్లోడ్ అవుతున్న వీడియోల్లో తెలుగే మొదటి స్థానంలో ఉన్నట్లు ‘విడోలి’ తెలిపింది. 2016లో మొత్తం 1.6 కోట్ల తెలుగు వీడియోలు అప్లోడ్ కాగా 2018 నాటికి ఇది 16.6 కోట్లు దాటేసింది. -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
మాటల్లేవ్!.. జీవితం ఆన్‌లైన్‌కే అంకితం
సాక్షి,సిటీబ్యూరో: మహానగర ప్రజలు ఒంటరి అయిపోతున్నారు. తోటివారితో మాట్లాడేందుకు సమయం దొరకడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్య కూడా సంబంధాలు గగనమైపోతున్నాయి. ‘భోజనం చేద్దామా’ అన్న మాట కూడా ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు. ఇటీవల నగరంపై ‘ఆలిండియా డేటా యూసేజ్ మొబైల్ సొసైటీ’ సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘నెటిజన్లు’గా మారిపోతున్న సిటిజన్లు సెల్‌పోన్లలో మూగ సందేశాలకే పరిమితమవుతున్నారని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్లో చాటింగ్‌లు పెరిగిపోయాయని తేల్చి చెప్పింది. మొన్నటి వరకు మనిషికి ఆనందం వచ్చినా.. కష్టం కలిగినా తమ దగ్గరి వారితో పంచుకుని గుండె బరువు దించుకునేవారు. క్రమంగా మానవాళి మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు అందరూ వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్పోన్లో ఇంటర్నెట్కు అతుక్కుపోతున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించే వారు ఇప్పుడు తమ ఇంటికే నేరుగా నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారని సదరు సర్వే తేల్చింది. నగరంలోనే అత్యధిక వాడకం రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటర్నెట్ డేటా వాడుతున్న వారిలో నగర వాసులే ముందున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇక్కడ మొత్తం డేటాలో 59 శాతం వాడేస్తున్నారు. మొత్తం మీద 20 శాతం మంది 56.49 మిలియన్ డాటాను, 15 శాతం మంది నిరంతరం ఆన్లైన్లోనే ఉంటూ 43.04 మిలియన్ డాటాను వినియోగిస్తున్నట్లు మొబైల్ సంస్థల సర్వేలో వెల్లడైంది. వారంలో నాలుగైదు సార్లు నెట్‌ను ఆన్చేసేవారు 12 శాతం మంది 32.28 మిలియన్ డాటాను వాడుతున్నారు. వారానికి రెండుసార్లు వాడేవారు 14 శాతం మంది, వారానికి ఒకసారి ఎనిమిది శాతం మంది, నెలకు రెండు సార్లు నెట్ వాడే వారు 5 శాతం ఉన్నట్టు చెబుతున్నాయి. యువత, మహిళలే టాప్ నిత్యం డేటా వినియోగంలో యువత, మహిళలు ముందున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రతిరోజు 36 శాతం యువత, మహిళలు ఆన్లైన్లో తెగ బిజీగా ఉంటున్నట్టు తేల్చారు. వారి తర్వాత 24 శాతం కాలేజీ విద్యార్థులు, 19 శాతం స్కూల్ పిల్లలు, 15 శాతం వృద్ధులు, 8 శాతం వర్కింగ్ ఉమెన్స్ డేటా వాడుతున్నట్టు గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు డేటాను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ టాప్ ఇంటర్నెట్ వినియోగంలో 69 శాతం సోషల్ నెట్వర్కింగ్, 67 శాతం ఆన్లైన్ కమ్యూనికేషన్స్, 50 శాతం ఎంటర్టైన్మెంట్, 34 శాతం ఆన్లైన్ షాపింగ్, 27 శాతం ఆన్లైన్ సర్వీస్‌కు వినియోగమవుతోంది. అయితే, డేటా అత్యధిక వినియోగమంలో స్మార్ట్ ఫోన్లు టాప్‌గా ఉన్నట్లు గాణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా 73 శాతం, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ద్వారా 20 శాతం, టాబ్లెట్ ద్వారా 7 శాతం డేటాను వాడుతున్నట్టు సర్వేలో తేలిది. గృహ వినియోగమూ అధికమే.. సిటీలో గృహాల్లో ఉన్నవారు వాడే డేటా కూడా తక్కువేమీ కాదు.. గత ఐదేళ్లలో 50 శాతం నుంచి 88 శాతానికి వినిగోం పెరగగా, సైబర్ కేఫ్‌ల డేటా 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయింది. దీన్నిబట్టి మహిళలు అత్యధికంగా డేటా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ నగరంలో 15 శాతం మంది ఇంటర్నెట్కు దూరంగా ఉంటున్నట్టు సర్వే తేల్చింది. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో దూరంగా ఉంటున్నట్టు గుర్తించారు. మొబైల్స్ వాడకం 30 లక్షలకు పైనే మహానగరంలో జనాభా కోటికి పైగానే ఉంది. అందులో సుమారు 30 లక్షల మంది వరకు మొబైల్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. కొందరు రెండు, మూడు కనెక్షన్లు వాడుతున్నట్టు సమాచారం. బీఎస్సెన్ఎల్తో పాటు ఐడియా, ఎయిర్టెల్, జియో వంటి పేరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు సంస్థలు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సిటీలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఐదేళ్ల మార్కెటింగ్ సరళిని పరిశీలిస్తే మొబైల్ కొనుగోళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో రావడంతో 200 శాతం మేర మొబైల్స్ అమ్మకాలు వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. గతేడాదిలో వివిధ కంపెనీల మొబైల్స్ 51 లక్షల వరకు అమ్ముడుపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్ డేటా చార్జీలు
-
4 జీబీ డేటా 3 వేల రూపాయలు
మొబైల్ ఇంటర్నెట్.. ప్రస్తుతం ఓ నిత్యావసరంగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు కూడా ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తిని విస్తృతిస్తున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కనెక్ట్ అవడానికి కూడా మొబైల్ ఇంటర్నెటే ఓ సారథిలా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ లగ్జరీగా ఉంది. చాలా మంది దీని యాక్సస్‌ను పొందలేకపోతున్నారు. దీనిలో కరేబియన్ దీవి క్యూబా ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. క్యూబా ఎట్టకేలకు మొబైల్ ఇంటర్నెట్ను అందించడం ప్రారంభించింది. తొలిసారిగా ఎంపిక చేసిన యూజర్లకు అంటే ప్రభుత్వ రంగ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగులు, రాయబారులకు మొబైల్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు మొబైల్ ఫోన్ యూజర్లందరకూ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా క్యూబా పనిచేస్తోంది కూడా. క్యూబన్ టెలికాం దిగ్గజం ఈటీఈసీఎస్ఏ ఈ సర్వీసులను అందజేస్తోంది. అయితే ఆ దేశ టెలికాం మార్కెట్లో మోనోపలిగా సేవలందిస్తున్న ఈ సంస్థ, 4 జీబీ డేటాకు 45 డాలర్లు అంటే రూ.3 వేలను ఛార్జ్‌లుగా విధిస్తోంది. తన 50 లక్షల కస్టమర్లందరికీ ఇంటర్నెట్ యాక్సస్‌ను ఈటీఈసీఎస్ఏ కల్పిస్తుందని రిపోర్టు చెప్పాయి. అంటే దేశ జనాభాలో సగం శాతం. 2018 నాటికి దేశం మొత్తానికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా గట్టిగా చెబుతోంది. వ్యాప్తి చెందుతున్న ఇంటర్నెట్ యాక్సస్‌తో, దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఈ విప్లవానికి క్యూబా ప్రజలు కూడా సాయం చేస్తారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ చెప్పారు. 2013 వరకు క్యూబాలో ఇంటర్నెట్ కేవలం పర్యాటక హోటళ్లలోనే అందుబాటులో ఉంది. సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ వై-ఫైలతో ఈ ఇంటర్నెట్ వ్యాప్తిని క్యూబా విస్తృతపరుస్తోంది. అయితే 5జీ టెక్నాలజీ వైపు ప్రపంచ దేశాలన్నీ దూసుకుపోతుంటే, 3జీ కనెక్టివిటీని అందించడానికే క్యూబా తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
టెల్కోల ‘డేటా’గిరీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీల మధ్య కొనసాగుతున్న పోటీతో ఇంటర్నెట్ వ్యయాలు భారీగా దిగొచ్చాయి. మరోవైపు దేశీయ కంపెనీలతోపాటు విదేశీ దిగ్గజాల నుంచి ఆకట్టుకునే స్మార్ట్ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకేముంది మొబైల్లో డేటా వాడేవారి సంఖ్య భారత్‌లో అంచనాలను మించి పెరుగుతోంది. 2017 డిసెంబర్ నాటికే ఈ సంఖ్య 45.6 కోట్లు దాటింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17.22 శాతం అధికం. 2018 జూన్ నాటికి మొబైల్ డేటా కస్టమర్ల సంఖ్య సుమారు 47.8 కోట్లను తాకనుంది. డేటా ప్యాక్‌లతో బండిల్ కింద ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ను టెల్కోలు అందించడం కస్టమర్ల సంఖ్య ఇంతలా పెరిగేందుకు దోహదం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. డేటాపైనే ఎక్కువ ఖర్చు... దేశంలో 2013 నుంచి వాయిస్ ప్యాక్‌లపై కస్టమర్లు చేస్తున్న ఖర్చు తగ్గుతూ వచ్చింది. స్మార్ట్ఫోన్లు వెల్లువెత్తడంతో వినియోగదార్లు క్రమేపీ డేటా వైపు మొగ్గు చూపారు. సోషల్ మీడియా, యూట్యూబ్, వీడియో చాటింగ్‌లతో డేటా వినియోగం పెరిగింది. దేశంలో నెలకు 80 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం సగటు 2014 జూన్‌లో 70.10 ఎంబీ నమోదైంది. 2017 సెప్టెంబర్ నాటికి ఇది 1,600 ఎంబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. దీనినిబట్టి డేటా వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ జియో అరంగేట్రం తర్వాత డేటా వాడకం కట్టలుతెంచుకుంది. 2013లో కస్టమర్ సగటున రూ.100 వ్యయం చేస్తే, ఇందులో వాయిస్‌పైన 55 శాతం ఖర్చు ఉండేది. ఇప్పుడు వాయిస్‌పైన చేస్తున్న వ్యయం 16 శాతానికి వచ్చి చేరిందని కాంటార్–ఐఎంఆర్‌బీతో కలిసి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన నివేదిక చెబుతోంది. బండిల్ ప్యాక్‌లవైపు.. డేటాతోపాటు ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు ఉన్న బండిల్ 4జీ ప్యాక్‌లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. చిన్న ప్యాక్‌లతో పోలిస్తే డేటా, వాయిస్ ప్రయోజనాలు అధికంగా ఉండడం ఇందుకు కారణం. డేటా, వాయిస్ కాల్స్‌కు వేర్వేరు ప్యాక్‌లు తీసుకుంటే కస్టమర్‌కు తడిసిమోపెడవుతుంది. ప్రస్తుతం టెలికం రంగంలో ట్రెండ్ బండిల్ ప్యాక్‌లవైపు వెళ్తోందని ఐడియా ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు బండిల్ ప్యాక్ కింద లోకల్, ఎస్టీడీ ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, తక్కువ విలువ ఉన్న టాప్ అప్స్ విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయని స్థానిక ఆర్కే కమ్యూనికేషన్స్ ప్రతినిధి కేశవ్ తెలిపారు. బండిల్ ప్యాక్‌ల వాటా 60–70 శాతానికి చేరిందని చెప్పారు. టాప్ ప్యాక్‌లు ఇవే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో రిలయన్స్ జియో 84 రోజుల కాలపరిమితితో రూ.399 ప్యాక్‌ను అందుబాటులో తెచ్చింది. ప్రతిరోజు 1.5 జీబీ డేటా ఉచితం. ప్రతిరోజు 1.4 జీబీ డేటాతో 82 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌ను ఎయిర్టెల్, ఐడియా ప్రవేశపెట్టాయి. ఎయిర్టెల్ రూ.448, ఐడియా రూ.449 ధరకు ఈ ప్యాక్‌ను విక్రయిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు రూ.199లకు ప్రతిరోజు 1.4 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్యాక్‌లో 90 రోజులపాటు ప్రతిరోజు 1.5 జీబీ 3జీ డేటాను ఇస్తోంది. -
దొంగచాటుగా ఫోన్ చూస్తే జైలుకే...
రియాద్ : ఇటీవలి కాలంలో మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ ఫోన్లే సాక్ష్యధారాలుగా నిలుస్తుండటంతో కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, 5లక్షల సౌది రియోల్(దాదాపు రూ. 86.5 లక్షలు) జరిమానా విధించనున్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. -
భారీగా తగ్గిన డేటా టారిఫ్స్
న్యూఢిల్లీ : మొబైల్ ఇంటర్నెట్ రేట్లు భారీగా తగ్గాయి. గత మూడేళ్లలో మొబైల్ ఇంటర్నెట్ రేట్లు 93 శాతం మేర తగ్గినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డీవోటీ) రిపోర్టు చేసింది. ఇంటర్నెట్ రేట్లు భారీగా క్షీణించడంతో, ఈ మూడేళ్లలో డేటా వాడకం 25 సార్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. అత్యంత చౌకైన టారిఫ్ గ్లోబలీ- 2014లో ఒక్కో జీబీకి 33 రూపాయలుంటే, 2017 సెప్టెంబర్‌లో ఒక్కో జీబీకి 21 రూపాయలుందని వెల్లడించింది. అంటే మొత్తంగా 93 శాతం వరకు టారిఫ్ తగ్గింపు ఉన్నట్టు డీవోటీ తెలిపింది. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాక, టారిఫ్ రేట్ల తగ్గింపు మరింత ఉందని పేర్కొంది. ఈ కంపెనీ ఒక్కో జీబీని రోజుకు అత్యంత తక్కువగా 4 రూపాయలకే అందిస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ రేట్లు తగ్గడంతో, డేటా వాడకం పలు సార్లు పెరిగినట్టు తెలిసింది. ఒక్కో సబ్‌స్క్రైబర్ సగటు డేటా వాడకం 25 సార్లు పెరిగిందని డీవోటీ ట్వీట్ చేసింది. అంటే 2014లో ఒక్కో నెలలో 62జీబీ వాడకముంటే, 2017లో ఒక్కో నెలలో 1.6జీబీ వాడకముందని తెలిపింది. కాగ, భారత్‌లో మొబైల్ డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్కో నెలలో 1.3 మిలియన్ జీబీ నమోదవుతున్నట్టు డీవోటీ పేర్కొంది. ఇది అమెరికా, చైనాలలో వాడే డేటా వాడకం కంటే అత్యధికం. మరోవైపు దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం రెండింతలు పైగా పెరగడంతో(190 మిలియన్ నుంచి 390 మిలియన్లకు పెరగడంతో), ఇంటర్నెట్ యూజర్లు కూడా 66 శాతం పెరిగినట్టు డీవోటీ తెలిపింది. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. అటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సస్ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్ డేటా ప్రకారం 2017 డిసెంబర్ చివరి నాటికి ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది. -
మొబైల్ డేటా లేకున్నా చాటింగ్
న్యూఢిల్లీ: మొబైల్ డేటా లేకపోయినా చాటింగ్, వార్తలు, రైలు టికెట్ల బుకింగ్, చెల్లింపులు వంటి సదుపాయాలు పొందే విధంగా మెసేజింగ్ సేవల సంస్థ హైక్ తాజాగా ’టోటల్’ పేరిట కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూఎస్ఎస్డీ టెక్నాలజీపై ఇది పనిచేస్తుందని హైక్ మెసెంజర్ సీఈవో కవిన్ మిట్టల్ తెలిపారు. చౌక ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో దీన్ని పొందుపర్చేలా ఇంటెక్స్, కార్బన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెసేజింగ్, న్యూస్, స్పోర్ట్స్ స్కోర్లు మొదలైనవన్నీ ఈ సర్వీసుతో పొందవచ్చని.. అయితే, ఫొటోలు పంపేందుకు మాత్రం డేటా అవసరమవుతుందని మిట్టల్ తెలిపారు. ఇందుకోసం 4జీ స్పీడ్‌తో 20 ఎంబీ డేటా ప్యాకేజీలను రూ. 1 నుంచి అందించేలా అటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్, బీఎస్ఎన్ఎల్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్ జియో తదితర సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఎంపిక చేసిన ఇంటెక్స్, కార్బన్ ఫోన్లు కొనుగోలు చేసిన వారు టోటల్ సర్వీసుల కోసం సైన్ అప్ చేయగానే.. వారి హైక్ వాలెట్లో రూ.200 జమవుతాయని మిట్టల్ తెలిపారు. కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక డేటా ప్లాన్ల కొనుగోలుకు, ఇతరత్రా ఎవరికైనా పంపేందుకు కూడా ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. -
మొబైల్ ఇంటర్నెట్ ఓక్లా చెప్పిన శుభవార్త!
సాక్షి, న్యూడిల్లీ: ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే సంస్థ ఓక్లా తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నవంబరు మాసానికి సగటు మొబైల్ ఇంటర్నెట్వేగం దాదాపు రెట్టింపు అయిందని ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్త అని వ్యాఖ్యానించింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ 109వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో నిలిచింది. అలాగే సగటు బ్రాడ్ బ్యాండ్ వేగం 15శాతం పుంజుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం భారీగా పుంజుకుంటోందని పేర్కొంది. గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్ నెల గణాంకాలను ఓక్లా విడుదల చేసింది. దీని ప్రకారం సగటు మొబైల్ డోన్లోడ్ స్పీడ్ 7.65 ఎంబీపీఎస్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ వేగం 76 వ స్థానంలో ఉంది. ఈ సగటు జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబరులో 18.82 పాయింట్లుగా నిలిచిందని ఓక్లా తెలిపింది. మార్కెట్లో ఉన్న పోటీ, వివిధ ఆపరేటర్ల తారిఫ్ల దీనికి కారణమని ఇది సానుకూల దృక్పథమని ఓక్లా తెలిపింది. ఈ నూతన సంవత్సరానికి మార్కెట్ ఎలా వృద్ధి చెందుతుందో చూడడానికి తాము ఎదురుచూస్తున్నామని ఓక్లా సహ వ్యవస్థాపకుడు, జనరల్ మేనేజర్ డౌగ్ సూట్లేస్ వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడంలో నార్వే ఎప్పటిలాగానే మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో టాప్ ప్లేస్ కొట్టేసింది. -
మీరేంటో చెప్పే లేటు నిద్ర
లండన్: మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? అర్ధరాత్రి పన్నెండూ ఒకటి దాటితేగాని పడుకోరా? ఈ అలవాట్లే మీ ప్రవర్తన గురించి తెలియజేస్తాయట. మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో వెల్లడిస్తాయట. బుద్ధిగా రాత్రి తొమ్మిదీ పదింటికే బెడ్డెక్కి దుప్పటి కప్పేవారి కన్నా నిత్యం లేటుగా నిద్రకు ఉపక్రమించేవారి సోషల్ నెట్వర్కే పెద్దదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నెట్‌వర్క్‌లో ఎక్కువగా ఉండేది కూడా ఇలాంటి వారేనట. పైగా వీరి కేంద్రంగానే ఈ చాటింగులూ మీటింగులూ జరుగుతాయని పరిశోధనలో వెలుగుచూసింది. ‘మనం డైలీ ఎంత సేవు ఫోన్ వాడతాం? ఎక్కువగా ఎవరికి కాల్స్ చేస్తుంటాం? ఎన్ని గంటలు మాట్లాడతాం? అనే విషయాలను బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చని ఫిన్లాండ్లోని ఆల్టో వర్సిటీకి చెందిన తలాయే అలేదావుడ్ అనే పరిశోధకుడు అంటున్నారు. మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన తీరుతెన్నులపై ఈయన అధ్యయనం చేస్తున్నారు. ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌ల టైమింగ్స్, సోషల్ నెట్వర్క్ పరిధిని బట్టి వ్యక్తుల సామాజిక అలవాట్ల గురించి చెప్పొచ్చని, ఇలా కచ్చితమైన సమాచారాన్ని సర్వేల ద్వారా పొందడం కష్టమని వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యక్తుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ‘మధుమేహం, కణితులు వంటి వాటిని గుర్తించేందుకు బయోమార్కర్లు ఉన్నాయి. కానీ మానసిక రుగ్మతలను కచ్చితంగా కనుగొనేందుకు పరికరాలు గానీ వైద్య పద్ధతులు గానీ లేవు. అందువల్ల ఈ మేరకు కొత్త మార్గాలను అన్వేషించాలి. నిద్రకు ఉపక్రమించే వేళల్లో క్రమరాహిత్యం ఉందంటే వాళ్లు ఏవో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు తమ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే వైద్యులను సంప్రదించేలా చూడటమే మా లక్ష్యం’అని అలేదావుడ్ వివరించారు. -
బ్లూవేల్‌తో మరో డేంజర్ కూడా...
సాక్షి, న్యూఢిల్లీ : డేంజర్ డెత్ గేమ్‌గా అభివర్ణిస్తున్న బ్లూవేల్ ఛాలెంజర్ మన దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంది. నియంత్రణతోపాటు నిషేధం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూనే ఉన్నాయి. అందుకు కారణం ఆటకు సంబంధించిన లింకులు విస్తరించకుండా ఆపలేకపోవటమే. బ్లూవేల్ లింకులు ఇంటర్నెట్లో దొరకదు. అలాగని ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటానికి వీల్లేదు. కేవలం సోషల్ మీడియాల్లో లింకుల ద్వారానే ఆట విస్తరించేలా అడ్మిన్ రూపకల్పన చేశాడు. అయితే ఇంతకాలం యువత ప్రాణాలతో చెలాగటం ఆడుతున్న బ్లూవేల్ ఇప్పుడు మరో రూపంలో కూడా ముప్పును మోసుకోస్తుంది. ప్రమాదకరమైన వైరస్‌ను సైబర్ నేరగాళ్లు బ్లూవేల్ లింకుల పేరిట పంపుతూ వ్యాపింజేస్తున్నారు. బ్లూవేల్ పేరిట వచ్చే నోటిఫికేషన్లను గానీ, సమాచారాన్నీ గానీ క్లిక్ చేస్తే చాలూ మీఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం హ్యాక్‌కి గురయ్యే అవకాశం ఉందని ఇషాన్ సిన్హా అనే సైబర్ నిపుణుడు హెచ్చరిస్తున్నారు. సుమారు 70 లింకులపై అధ్యయనం చేసిన ఆయన అవన్నీ నకిలీవని తేల్చేశారు. ఇప్పటికే పలువురు తమ డేటా చోరీకి గురైనట్లు సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్లూవేల్ నేపథ్యం తెలిసి కూడా ఆత్రుతతో ఓపెన్ చేసి నష్టపోతున్న వారే చాలా మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూవేల్ పేరిట వచ్చే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా క్లిక్ చేయకపోవటమే మంచిదని వారు ప్రజలకు సూచిస్తున్నారు. గూగుల్, యాహూ, ఫేక్ బుక్సహా పలు సోషల్ మీడియా దిగ్గజాలకు ఇప్పటికే కేంద్రం బ్లూవేల్ లింకులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 42 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో ఇంటర్నెట్ వినియోగించే యూజర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 42 కోట్లకు చేరుతుందని ఐఏఎంఏఐ అంచనా వేసింది. పట్టణ ప్రాంత యూజర్ల నెలవారీ డేటా వ్యయం కనీసం రూ.275గా ఉంటుందని పేర్కొంది. 42 కోట్ల మంది యూజర్లలో పట్టణ ప్రాంతానికి చెందిన వారు 25 కోట్ల మంది, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు 17 కోట్ల మంది ఉంటారని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, డేటా చార్జీలు తక్కువగా ఉండటం వంటి పలు అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వివరించింది. -
కస్టమర్లకు ఐడియా తీపికబురు
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు శుభవార్త. టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను విక్రయించనుంది. మార్చి ఆఖరు నుంచి ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రారంభించనుంది. ‘1జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్స్‌ను 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు సమాన ధరల్లో విక్రయించాలని నిర్ణయించాం. డేటా ప్లాన్స్ ధరల్లో నెట్‌వర్క్‌ను బట్టి మార్పు ఉండదు. 2017, మార్చి 31నుంచి దీనిని అమలుచేస్తున్నాం’ అని ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్ ధరలు ఉంటాయి. అయితే, రిలయన్స్ జియో అందిస్తున్న 4జీ మొబైల్ డేటా సర్వీసు ఐడియా 2జీకి ఇచ్చే ధరకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తాజాగా తన నిర్ణయాన్ని ఐడియా మార్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. -
జియో గురి.. 50% మార్కెట్ వాటా
⇒ 2021కి డేటా మార్కెట్ ఆదాయంలో సగభాగంపై కన్ను ⇒ ప్రైమ్ యూజర్లకు అదనపు డేటా ప్రకటన న్యూఢిల్లీ: కేవలం ఆరు నెలల్లో యూజర్ల సంఖ్యను పది కోట్లకు పెంచుకున్న రిలయన్స్ జియో తాజాగా ఇప్పుడు టెలికం పరిశ్రమ ఆదాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొబైల్ డేటా వినియోగం వల్ల ఏర్పడే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఆదాయాన్ని బాగా పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. సగం వాటాపై ధీమాగా.. 2021 నాటికి డేటా మార్కెట్ ఆదాయంలో 50% వాటాను దక్కించుకుంటామని జియో ధీమా వ్యక్తం చేసింది. ‘వాయిస్ విభాగపు ఆదాయం క్రమంగా డేటాకు మారుతోంది. దేశంలోని డేటా మార్కెట్ 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని రిలయన్స్ జియో తాజాగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా వినియోగంలో 85% వాటా ను కలిగి ఉన్నామని తెలిపింది. నెట్వర్క్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యిందని, 2020–21 నాటికి డేటా డిమాండ్‌లో 60%కి పైగా వాటాను హస్తగతం చేసుకుంటామని పేర్కొంది. డిజిటల్ సర్వీసులపై కనీసం రూ.500 వెచ్చించే సబ్స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లుగా ఉందని తెలిపింది. భారత్‌లో 5జీ సపోర్ట్ నెట్వర్క్ కేవలం తమకు మాత్రమే సొంతమని పేర్కొంది. వాయిస్ నుంచి డేటాకు.. భారత్‌లో రానున్న కాలంలో డేటాకు బలమైన డిమాండ్ ఉంటుందని జియో అభిప్రాయపడింది. ‘వచ్చే రెండేళ్లలో వాయిస్ నుంచి డేటా విభాగానికి ఆదాయపు బదిలీ జరుగుతుంది. వాయిస్ విభాగపు ఆదాయం రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.0.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. డేటా ఆదాయం రూ.1.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని వివరించింది. పరిశ్రమలో గత ఐదేళ్లలో స్వల్ప వృద్ధి నమోదయ్యిందని, కానీ డేటా వినియోగం వల్ల వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘మొత్తంగా పరిశ్రమ ఆదాయం 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది. నెలకు 500–600 కోట్ల జీబీ డేటా డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక్కడ ఒక జీబీకి రూ.50లు వేసుకున్నా సంవత్సరానికి రూ.3 నుంచి రూ.3.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఇది అంచనా జీడీపీలో 1.35–1.6 శాతానికి సమానం’ అని వివరించింది. ప్రైమ్ యూజర్లకు అదనంగా మరో 5 జీబీ డేటా జియో మరో శుభవార్త ప్రకటించింది. రూ.303లతో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అదే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు 10 జీబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఈ అదనపు డేటా ప్రయోజనాలు కేవలం ఒక నెలకే వర్తిస్తాయని పేర్కొంది. అంటే ఏప్రిల్‌లో మాత్రమే అదనపు డేటా వస్తుంది. కాగా కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కాగా జియో ప్రైమ్ ఆఫర్ మాత్రం ఈ నెల 31 వరకు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. -
ఆరు నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ..
• త్వరలో మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ సేవలు • కోటి కస్టమర్లకు చేరువలో తెలంగాణ, ఏపీ • మొబిక్యాష్ ఎం–వాలెట్ ఆవిష్కరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆరు నెలల్లో 4జీ సేవలను ప్రారంభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతగా 1,150 టవర్లు ఏర్పాటు చేస్తోంది. మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ (ఎండీవో) సేవలను మార్చికల్లా అందుబాటులోకి తెస్తామని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం ఎల్.అనంతరామ్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ డేటాను వాడుతున్న కస్టమర్ వైఫై హాట్‌స్పాట్ ఉన్న ప్రాంతానికి వెళ్లగానే అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ను వాడేందుకు ఎండీవో టెక్నాలజీ తోడ్పడుతుందన్నారు. బ్రాడ్ బ్యాండ్‌లో 24 ఎంబీ డౌన్లోడ్ వేగం అందిస్తున్నామని, కొద్ది రోజుల్లో వెక్టర్ వీడీఎస్ఎల్ టెక్నాలజీతో 100 ఎంబీ వరకు వేగాన్ని ఆఫర్ చేస్తామన్నారు. కొత్త మొబైల్ వాలెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అగ్రస్థానం దిశగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్కు ప్రతి నెల కొత్తగా 2 లక్షల మంది మొబైల్ కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. కొత్త కస్టమర్ల సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉన్నాయి. మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య ప్రస్తుతం 97 లక్షలుంది. మార్చికల్లా ఈ సంఖ్య ఒక కోటి దాట నుంది. ఇదే జరిగితే మూడో స్థానంలో ఉన్న తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు టాప్–1కు చేరతాయి. 4.5జీ టెక్నాలజీతో కూడిన వైఫై హాట్‌స్పాట్స్ 518 నెలకొల్పారు. డిసెంబర్‌కల్లా మరో 3,000 హాట్‌స్పాట్స్ జతకూడతాయని అనంతరామ్ వెల్లడించారు. బ్యాంకు ఖాతా లేకున్నా.. బీఎస్ఎన్ఎల్–ఎస్బీఐ మొబిక్యాష్ మొబైల్ వాలెట్‌ను బ్యాంకు ఖాతా లేకున్నా వాడొచ్చు. ఫీచర్ ఫోన్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. వాలెట్లో నగదు నింపేందుకు డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అవసరం లేదని ఎస్బీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎం హరదయాల్ ప్రసాద్ తెలిపారు. వాలెట్లో నగదు నింపుకునేందుకు ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ రిటైల్ ఔట్‌లెట్‌కు వెళ్లాలి. వాలెట్ నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. బిల్లులు, వర్తకులకు చెల్లింపుల వంటి సేవలు రెండో దశలో జోడిస్తారు. -
మొబైల్ ఇంటర్నెట్, సోషల్ మీడియాపై బ్యాన్!
ఇంఫాల్‌లో చర్చిలపై దాడుల నేపథ్యంలో వదంతులు మత ఉద్రిక్తతలు నివారించేందుకు అధికారుల నిర్ణయం ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్ బాప్టిస్టు కన్వేన్షన్ సెంటర్ చర్చి, తాంగ్ఖుల్ చర్చిపై అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. చర్చిలపై దాడుల అంశంపై వదంతులు వస్తుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వదంతుల వ్యాప్తిని, మత ఉద్రిక్తతలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్పై, సోషల్ మీడియా వెబ్సైట్లపై నిషేధం విధించారు. మణిపూర్‌లోని పలు జిల్లాలు నాగాల పూర్వీకుల భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటూ నాగా గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. మణిపూర్‌కు నిత్యావసరాలు సరఫరా అయ్యే ప్రధాన రహదారిని గిరిజనులు దిగ్బంధించడంతో ఆ రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలతోపాటు కనీస ఔషధాలు లేక అల్లాడుతున్నారు. మరోవైపు నాగా ఉగ్రవాదుల దాడులతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌లో నాగా వర్గం ప్రజలు తరచూ సందర్శించే చర్చిలపై కొందరు అల్లరిమూకలు రాళ్లు విసరడం కలకలం రేపింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఫ్రీ టాక్ టైమ్ స్కీమ్ ప్రవేశపెట్టిన గోవా
పనాజీ(గోవా): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువతను ఆకర్షించడానికి గోవాలోని బీజేపీ సంకీర్ణ సర్కారు దేశంలోనే ప్రథమంగా ఫ్రీ టాక్ టైమ్, ఫ్రీ డేటా స్కీమ్‌ను ప్రకటించింది. 'గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్' పేరుతో 100 నిమిషాల టాక్ టైమ్, 1జీబీ డేటా(2ఎంబీపీఎస్ స్పీడు) ఉచితంగా అందిస్తారు. 1.25లక్షలు మంది యువత ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వానికి కోటి రూపాయల వరకు భారం పడనుందన్నారు. 16 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ స్కీమ్‌కు అర్హులని పరీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను అనుసంధానం చేయడంతో పాటూ, స్కిల్స్ డెవలప్ మెంట్ కోసం ఈ పథకం ఉపయోగపడనుందని తెలిపారు. దీనికి వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మొబైల్ సేవల పథకాన్ని అమలు చేయడానికి రిలయన్స్ జియో, ఐడియాతో పోటీ పడి వోడాఫోన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. గోవా వ్యాప్తంగా 500కు పైగా రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసి మరో 15 రోజుల్లో వోడాఫోన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుందని పరీకర్ తెలిపారు. -
రెండురోజులు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను, మెసేజ్ సర్వీసులను రద్దు చేశారు. వదంతులను నివారించి, శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం నాసిక్ జిల్లా తాలెగావ్ అనే గ్రామంలో 16 ఏళ్ల మైనర్ బాలుడు ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత నాసిక్ జిల్లాలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో సోమవారం నుంచి రెండు రోజులు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయాలని నాసిక్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ నెట్ వర్క్ ఆపరేటర్లను ఆదేశించారు. -
1,099లకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ ప్లాన్
పలు ప్లాన్స్‌కు రెట్టింపు డేటా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా అపరిమిత 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1,099గా ఉంది. వాలిడిటీ 30 రోజులు. అలాగే పలు 3జీ డేటా ప్లాన్స్‌కు అదనపు డేటాను ప్రకటించింది. స్పీడ్‌ను తగ్గించకుండా రూ.1,099లకే అపరిమిత 3జీ ప్లాన్‌ను తామే తొలిగా ప్రకటిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవత్సవా తెలిపారు. వినియోగదారులు రూ.549ల 3జీ ప్లాన్‌లో ఇదివరకటిలా 5 జీబీ కాకుండా 10 జీబీ డేటాను పొందొచ్చని అన్నారు. దీని వాలిడిటీ 30 రోజుల పాటు ఉంటుందన్నారు. అలాగే రూ.156 ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చని, దీని వాలిడిటీ 10 రోజులని చె ప్పారు. -
ఇక ఏడాది వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా ప్యాక్స్: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది వాలిడిటీతో కూడిన మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్‌కి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డేటా ప్యాక్స్ గరిష్ట వాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీర్ఘకాల వాలిడిటీతో కూడిన డేటా ప్యాక్స్‌కు అనుమతించండంటూ యూజర్ల నుంచి పలు విన్నపాలు అందాయని, ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ పేర్కొంది. డేటాను తక్కువగా ఉపయోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొత్త ఇంటర్నెట్ యూజర్‌ను ఆకర్షించేందుకు తమ తాజా చర్య దోహదపడుతుందని వివరించింది. -
నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
-
నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
శ్రీనగర్: కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఆంక్షలు విధించారు. శుక్రవారం భద్రత దళాలు అనంతనాగ్‌లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. పుల్వామా జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు. అనంతనాగ్, షోపియన్, పుల్గాం, సొపొరె పట్టణాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. శ్రీనగర్‌లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ రోజు జరగాల్సిన స్కూలు బోర్డ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశారు. కశ్మీర్ ప్రాంతంలోని బారాముల్లా నుంచి జమ్ములోని బనిహాల్‌కు వెళ్లే రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. -
ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికరలాభం మార్చి క్వార్టర్లో 2.8 శాతం పెరిగి రూ. 1,290 కోట్లకు చేరింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ. 1,255 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. తాజా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 23,016 కోట్ల నుంచి రూ. 24,960 కోట్లకు పెరిగింది. 2015-16 పూర్తి సంవత్సరానికి రూ. 96,532 కోట్ల ఆదాయంపై రూ. 5,484 కోట్ల నికరలాభం ఆర్జించింది. తాజా త్రైమాసికంలో ఇండియా నుంచి ఆదాయం 11.7 శాతం పెరుగుదలతో రూ. 18,328 కోట్లకు పెరిగిందని, మొబైల్ డేటా ఆదాయం జోరుగా 44 శాతం ఎగిసి రూ. 3,357 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. డేటా వినియోగదారులు, ట్రాఫిక్ పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడిందని కంపెనీ తెలిపింది. మొబైల్ డేటా జోరు...: ఇండియా నుంచి ఒనగూడుతున్న మొబైల్ ఆదాయంలో డేటా ఆదాయం వాటా ప్రస్తుతం 23.3 శాతానికి పెరిగిందని, ఏడాది క్రితం ఇది 17.6 శాతమేనని ఎయిర్టెల్ వివరించింది. ఒక్కో వినియోగదారు నుంచి లభిస్తున్న డేటా సగటు ఆదాయం తాజా త్రైమాసికంలో రూ. 21 పెరిగి రూ. 196కు చేరిం దని, ఈ విభాగంలో 31 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. మొబైల్ డేటాకు సంబంధించి ట్రాఫిక్ 69 శాతం, ఆదాయం 44% పెరగడంతో మంచి ఫలితాల్ని ప్రకటించగలిగామని, డేటా ట్రాఫిక్ 60% వృద్ధిచెందగా, ఆదాయం 44% ఎగిసిందని భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ వివరించారు. రూ. 1,434 కోట్లతో బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ బోర్డు సిఫార్సుచేసింది. షేరుకు రూ. 400 ధరతో మొత్తం చెల్లింపు మూలధనంలో 0.90% షేర్లను కొనుగోలు చేయాలన్నది ప్రతిపాదన. 2016 మార్చి 31నాటికి కంపెనీ మొత్తం రుణభారం రూ. 83,888 కోట్లకు చేరింది. రూ. 5 ముఖవిలువగల షేరుపై రూ. 1.36 చొప్పున డివిడెండును డెరైక్టర్ల బోర్డు సిఫార్సుచేసింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 3% పైగా పెరిగి రూ. 374 వద్ద ముగిసింది. -
మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం
శ్రీనగర్: భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు. హంద్వారా ఘటనతో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో గత బుధవారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఆర్మీ జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
24 గంటలు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
అహ్మదాబాద్: రిజర్వేషన్ల సాధనం కోసం గుజరాత్లో పటేల్ సామాజికవర్గం చేస్తున్న ఉద్యమం మరోసారి ఉద్రిక్తంగా మారింది. పటేళ్ల రిజర్వేషన్ల నాయకుడు హార్దిక్ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మెహ్సనా పట్టణంలో ఆ సామాజికవర్గం వారు చేపట్టిన ఆందోళన సందర్భంగా ఘర్షణ చెలరేగింది. ర్యాలీకి అనుమతి లేకున్నా 5 వేలమంది ఉద్యమకారులు తరలివచ్చారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడినట్టు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెహ్సనాలో కర్ఫ్యూ విధించారు. ఇక ఆ రాష్ట్రంలోనే సూరత్ నగరంలో పోలీసులు 500 మంది పటేల్ సామాజికవర్గం వారిని అదుపులోకి తీసుకున్నారు. పటేళ్లు చేపట్టిన నిరసన ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేయడం కోసం మెహ్సనా, సూరత్‌తో పాటు అహ్మదాబాద్ ప్రాంతాల్లో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేయించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) రేపు గుజరాత్ బంద్‌కు పిలుపునిచ్చింది. పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గతేడాది నుంచి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను గతేడాది అక్టోబర్‌లో రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. -
మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: భద్రత కారణాల రీత్యా కశ్మీర్లో బుధవారం మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. హంద్వారా ఘటనలో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో ఇవాళ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఆర్మీ జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉత్తర కశ్మీర్లో గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత!
చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ చేపట్టిన ఉద్యమం ఉధృత రూపం దాల్చటంతో హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉన్నటువంటి రోహ్తక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకు బీసీ లేదా ఓబీసీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆరు రోజులుగా జాట్లు చేస్తున్న నిరసణ కార్యక్రమాల్లో పలు హిసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రోహ్తక్లో జాట్లు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం హింసాత్మకంగా మారడంతో 15 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వదంతులు వేగంగా వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జాట్ల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు
♦ ఈ ఏడాది జూన్‌కల్లా ఈస్థాయికి ♦ 50శాతం వృద్ధి: ఐఏఎంఏఐ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా పెరుగుతోందని ఐఏఎంఏఐ(ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. ఈ ఏడాది జూన్ కల్లా మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 55 శాతం వృద్ధితో 37 కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం సంబంధిత అంశాల గురించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.... గత ఏడాది జూన్‌లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు వృద్ధి చెందింది. వీటిల్లో 22 కోట్లు పట్టణ ప్రాంతం వారే. వార్షికంగా చూస్తే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 71 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93 శాతం వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది. -
ఎయిర్టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీనికింద.. కస్టమర్లు రాత్రి వేళ ఉపయోగించే మొబైల్ డేటాలో సగభాగాన్ని మర్నాడు వారి ఖాతాకే తిరిగి క్రెడిట్ చేయనుంది. అలాగే, తమ మొబైల్ యాప్ వింక్‌పై నెలకు అయిదు సినిమాలు, అపరిమితంగా పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తోంది. దీనికి డేటా చార్జీలు వర్తిస్తాయి. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రకటించిన డేటా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వారం రోజుల్లో పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు కూడా వర్తింపచేయనున్నట్లు డెరైక్టర్ (కన్జూమర్ బిజినెస్ విభాగం) శ్రీని గోపాలన్ తెలిపారు. రాత్రి 12 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య వినియోగించే డేటాలో 50% పరిమాణాన్ని ప్రతిరోజూ కస్టమర్ల ఖాతాలో తిరిగి జమ చేయనున్నట్లు వివరించారు. -
జాగ్రత్త పడకుంటే... డేఠా
* వేగంగా పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం * సామాజిక మాధ్యమాల్లో వాడకమే అధికం * ఆటోమేటిగ్గా ఖర్చు చేయించేస్తున్న అదనపు ఫీచర్లు రాహుల్ హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఉండేది హాస్టల్లో. ఇంట్లో వాళ్లు అవసరమవుతుంది కదా అని మొబైల్ కొనిచ్చారు. ప్రీపెయిడ్ కార్డు ఇచ్చి... నెలకు కొంత లిమిట్ పెట్టారు. ఆ మేరకే వాళ్లు రీచార్జ్ చేస్తుంటారు. ఒకవేళ అదనంగా అవసరమై రాహుల్ ఫోన్ చేస్తే... అంతలా ఎవరితో మాట్లాడావని వాళ్ల నాన్న క్లాస్ తీసుకుంటాడు. అందుకే రాహుల్ వాళ్లనెప్పుడూ అదనపు రీచార్జ్ అడగడు. కాకపోతే ఈ మధ్య మొబైల్లో డేటా ఎక్కువగా ఖర్చవుతుండటంతో తరచూ రీచార్జ్ అవసరమవుతోంది. అందుకని తనకు బాగా చనువున్న బంధువుల్ని అడగటం మొదలెట్టాడు. వాళ్లేమో రాహుల్ అడిగినపుడల్లా ఎంతో కొంత రీచార్జ్ చేయటం జరుగుతోంది. కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి కదా! రాహుల్ విషయం కూడా వాళ్ల నాన్నకు తెలిసింది. ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు.‘‘నేను ఎప్పట్లానే వాడుతున్నాను నాన్నా! కానీ ఈ మధ్య ఎక్కువ ఖర్చయిపోతోంది’’ చెప్పాడు రాహుల్. నిజానికి రాహుల్ ఒక్కడిదే కాదు. ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటా వాడుతున్న చాలా మందికి ఇది అనుభవమే. డేటా కోసం తరచూ రీచార్జ్ చేయటం... మళ్లీ అంతలోనే అయిపోవటం... ఇవన్నీ కొత్త విషయాలేమీ కాదు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అందుకే... మొబైల్ ఆపరేటర్లు కూడా సంప్రదాయ వాయిస్ ఆధారిత సేవలకన్నా ఇపుడు డేటా ఆధారిత సేవలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రెవెన్యూ వృద్ధి కూడా వాయిస్‌తో పోలిస్తే డేటా నుంచే ఎక్కువగా ఉండటం మారుతున్న ధోరణికి నిదర్శనం. అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ టీఎన్ఎస్ ఇటీవల ‘కనెక్టెడ్ లైఫ్’ పేరిట అంతర్జాతీయంగా ఓ సర్వే చేసింది. 50 దేశాల్లో 60,500 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో... సామాజిక మాధ్యమాల సత్తా ఏంటో బయటపడింది. ఎందుకంటే సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ప్రతి రోజూ వాట్సాప్, వియ్‌చాట్ వంటి ఇన్స్టాంట్ మెసేజింగ్ సేవలు వాడుతున్నారట. ఇక 30 శాతం మంది ప్రతిరోజూ ఫేస్బుక్ చూస్తున్నారట. ఇక ఇండియాలోనైతే ఒక యూజర్ ద్వారా వస్తున్న డేటా ఆదాయం (పర్ యూజర్) రూ.176గా ఉంది. డేటా ద్వారా వచ్చే రెవెన్యూ ఏడాదికి 33 శాతం చొప్పున వృద్ధి అవుతుండగా... వాయిస్ ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం చొప్పున మాత్రమే పెరుగుతుండటం గమనార్హం. ఇవన్నీ చూస్తే... డేటా ఎందుకు ఖర్చవుతోందో అర్థమయిపోతుంది. రాహుల్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ఎందుకంటే తను రోజూ ఫేస్బుక్ చూస్తాడు. ఈ మధ్య ఫేస్బుక్లో వచ్చే వీడియోలు తన ప్రమేయం లేకుండానే ఆటోమేటిగ్గా ప్లే అయిపోతున్నాయి. పెపైచ్చు తన స్నేహితులు వాట్సాప్‌లో బోలెడన్ని గ్రూప్‌లు క్రియేట్ చేశారు. అన్నిట్లోనూ తనను చేరుస్తున్నారు. వచ్చే వీడియోలు బాగుంటున్నాయి కదా అని రాహుల్ కూడా వాటిని చూసి ఎంజాయ్ చేయటమే కాక... వివిధ గ్రూపులకు షేర్ చేస్తున్నాడు. అందుకే... డేటా మంచినీళ్లలా ఖర్చయిపోతోంది. నిజానికి రాహుల్‌కు తన కాలేజీలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే అందులో ఫేస్బుక్, యూ ట్యూబ్ వంటివి రావు. వాట్సాప్‌లో కూడా ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు వస్తాయి తప్ప వీడియోలు డౌన్లోడ్ కావు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం కొన్ని పరిమితులతో కూడిన ఇంటర్నెట్ ఇస్తోంది. కాకపోతే ఈ పరిమితులేవీ నచ్చని రాహుల్ లాంటి విద్యార్థులు ఎప్పుడూ డేటాను ఆన్ చేసే ఉంచుతున్నారు. ఫలితం... రీచార్జ్‌ల మీద రీచార్జ్‌లు చేయాల్సి వస్తోంది. అదీ కథ. సింప్లీ వైఫై ఉత్తమం... మొబైల్ డేటా వ్యయాలను తట్టుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవడమే మేలు. చక్కగా వైఫై రూటర్ పెట్టుకుని నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్లో, కార్యాలయంలో ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్‌ను నెట్‌కు అనుసంధానించవచ్చు. ఇక చార్జీలంటారా... ఇప్పుడు చాలా వరకు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల టారిఫ్‌లు దిగొచ్చాయి. రూ.400-500కు 30జీబీ ఆపైన డేటా పొందవచ్చు. తక్కువ స్పీడుతో ఈ ధరకు అన్లిమిటెడ్ ప్యాక్‌లు కూడా దొరుకుతున్నాయి. అధిక నిడివిగల వీడియోలు ఎక్కువ సంఖ్యలో డౌన్లోడ్ చేస్తే తప్ప సాధారణంగా ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత పరిమితికి మించి డేటా వినియోగం కాదు. వీడియోలు ఆటోమేటిగ్గా డౌన్లోడ్ కాకుండా.. ఫేస్బుక్ ఈ మధ్యే ఆటోమేటిగ్గా వీడియోలు ప్లే అయ్యే ఫీచర్‌ను జోడించింది. అంటే మీరు ఫేస్బుక్ తెరిచారంటే... సదరు వీడియో దగ్గరకు వెళ్లేసరికి అది దానంతట అదే ప్లే అవుతుందన్న మాట. ఈ ఫీచర్ వద్దనుకుంటే సెటింగ్స్‌లోకి వెళ్లి... ఆటోమేటిగ్గా ప్లే అయ్యే ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. లేదంటే డిఫాల్ట్‌గా అవి ప్లే అవుతూనే ఉంటాయి. దానివల్ల అయ్యే డేటా ఖర్చు కూడా ఎక్కువే. ఇక వాట్సాప్, హైక్ వంటి ఇన్‌స్ట్టంట్ మెసేజింగ్ సర్వీసుల విషయంలో ఎవరైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి... తమ కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని ఎవ్వరినైనా అందులో చేర్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు అంగీకరించాల్సిన పనేమీ లేదు. ఇష్టం లేకపోతే ఎగ్జిట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఇక ఈ గ్రూపుల్లో ఆసక్తిగా ఉంది కదాని మీరు పంపినట్టే మరో స్నేహితుడు సైతం మీకూ వీడియోలు, ఫొటోలు పంపిస్తే... మీ ప్రమేయం లేకుండానే డేటా ఖర్చవుతున్నట్లు లెక్క. గ్రూప్‌ల సంఖ్య పెరిగేకొద్దీ రోజూ వచ్చే వీడియోలు, ఫొటోల సంఖ్య పెరుగుతుంది. దీనర్థం... సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత డేటా ఖర్చవుతుంది. కంపెనీలు, కార్యాలయాల్లో ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు అధికారిక ఆదేశాలు ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల ద్వారానే అందుతున్నాయి. గ్రూప్‌లో సందేశం పంపితే అందరు సభ్యులకు వెంటనే చేరుతుంది కాబట్టి కార్యాలయాలూ ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లపై ఆధారపడక తప్పటం లేదు. కాకపోతే ఆ మేసేజ్‌ల కోసం ఎల్లప్పుడూ డేటా ఆన్‌చేసే ఉంచాల్సి ఉంటుంది. వీడియోల వంటివి ఆటోమేటిగ్గా డౌన్లోడ్ కాకుండా మీరు స్వయంగా ‘సెట్’ చేసుకుంటే తప్ప... జేబుకు చిల్లు పడటం ఖాయం. డేటా ఇలా ఖర్చవుతుంది... నెట్‌కు అనుసంధానమై వెబ్‌సైట్స్, యాప్స్‌ను తెరవగానే బ్రౌజింగ్ చార్జీలు మొదలైనట్టే. నెట్లో వినియోగించిన సమయం, వెబ్సైట్లు, యాప్స్నుబట్టి చార్జీలు పడతాయి. వీటికితోడు వీడియోల కోసం వాడితే అసలు కథ మొదలైనట్టే. ఎందుకంటే ఉదాహరణకు 5 ఎంబీ వీడియో మీ వాట్సాప్‌లోకి వచ్చిందంటే 5 ఎంబీ డేటా మీరు ఖర్చు చేసినట్టే. 10 మంది స్నేహితులకు వేర్వేరుగా ఈ వీడియోను పంపితే 50 ఎంబీ డేటా ఖర్చు అవుతుంది. ఒక గ్రూప్‌కు మాత్రమే పంపితే 5 ఎంబీ డేటా వాడినట్టు. పిక్చర్స్, సంక్షిప్త సందేశమైనా సరే సైజునుబట్టి డేటా ఖర్చు అయిపోతుంది. ఇక ఫేస్బుక్లో మీరు విహరించినంతసేపూ బ్రౌజింగ్ చార్జీలు ఉంటా యి. వీడియోలు చూస్తే సైజునుబట్టి డేటా వినియోగం అవుతుంది. నిజానికిపుడు 3జీ, 4జీ వాడకం పెరగటంతో డేటా ఖర్చులూ పెరుగుతున్నాయి. 3జీ వినియోగదార్లు 1జీబీ డేటాకు ఆపరేటర్‌ను బట్టి కనీసం రూ.200 వెచ్చించాల్సి వస్తోంది. అందుకని అవసరానికి మాత్రమే మొబైల్ డేటా వాడటం... వాట్సాప్, మెసెంజర్ తదితర యాప్స్ సెట్టింగ్స్‌ను మార్చుకోవటం... అనుమతి ఉంటేనే వీడియోలు డౌన్లోడ్ అయ్యేట్టు సరిచేసుకోవటం ఉత్తమం. ఇక వాట్సాప్, ఫేస్‌బుక్‌ను విరివిగా వాడేవారు కాస్త స్పీడు తక్కువైనా అన్లిమిటెడ్ ప్యాక్స్‌ను ఎంచుకోవడం బెటర్. - బిజినెస్ బ్యూరో -
జమ్ములో మళ్లీ 'నెట్' కట్!
శ్రీనగర్: గోమాంసం (బీఫ్) తినే విషయమై అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో జమ్ములో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బీఫ్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఫ్ పార్టీ ఇచ్చారన్న కారణంతో ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలోనే సహచర ఎమ్మెల్యేలు దాడిచేసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
‘మొబైల్10ఎక్స్’ను ఆవిష్కరించిన ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ డెవలపర్ల వృద్ధికి దోహదపడే విధంగా మొబైల్ ఇంటర్నెట్ సమాఖ్య ఐఏఎంఏఐ ‘మొబైల్10ఎక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 50 వేలుగా ఉన్న మొబైల్ యాప్ డెవలపర్ల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలకు చేర్చడం... అలాగే మొబైల్ యాప్ విభాగం ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి గూగుల్ ఇండియా, పేటీఎం సంస్థలు ప్రారంభ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఐఏఎంఏఐ ఈ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్లలో ఐదు మొబైల్ స్టార్టప్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పుణే/ముంబై పట్టణాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రాయ్ తెలిపారు. వీటిల్లో డెవలపర్లు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవసరమైన టెస్టింగ్ ల్యాబ్, డిజైన్ ల్యాబ్, కెపాసిటీ బిల్డింగ్ వంటి తదితర సౌలభ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద 5 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై శిక్షణను ఇస్తామని తెలిపారు. భారత్‌లో యాప్ డెవలప్మెంట్కు మంచి అవకాశాలు ఉన్నాయని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆనందన్ పేర్కొన్నారు. -
3 రోజుల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
శ్రీనగర్: మూడు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ లేకుండా గడిపిన జమ్మూకశ్మీర్ యువత ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పభుత్వం ఎత్తివేసింది. బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం నేపథ్యంలో మూడు రోజుల పాటు డేటా సేవలు నిలిపి వేసింది. ముందుగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. తర్వాత ఈ నిషేధాన్ని సోమవారం ఉదయం 10 గంటల వరకు పొడిగించారు. అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాలేదు. -
మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిషేధాల పరంపర తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నేటి (శనివారం మధ్యాహ్నం) నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ పీసీ ఠాకూర్ ప్రకటించారు. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించామని డీజీపీ వివరించారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాస్ (పటీదార్ ఆరక్షణ్ ఆందోళన్ సమితి) నాయకుడు హార్దిక్ పటేల్ సూరత్ నుంచి ప్రారంభించిన ఏక్తా యాత్రాను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం సూరత్‌లో హార్దిక్ సహా మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హార్దిక్ అరెస్టుతో మళ్లీ ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. అన్ని జిల్లాల్లో పటేల్ కులస్తులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాత్రిలోగా హార్దిక్ ను విడుదల చేయకుంటే జైల్ భరో కార్యక్రమానికి పూనుకుంటామని ఆనందిబెన్ సర్కారును హెచ్చరించారు. గత ఆగస్టు 25న అహ్మదాబాద్ లో పటేళ్లు నిర్వహించిన భారీ సభ అనంతరం చెలరేగిన హింసలో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది గుజరాత్ ప్రభుత్వం. సర్కారు చర్యను హైకోర్టు కూడా సమర్థించడం గమనార్హం. -
ఇంటర్నెట్ యూజర్లు@ 35 కోట్లు
న్యూఢిల్లీ : భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది జూన్ నెల చివరకు 35.2 కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 5.2 కోట్లు పెరిగినట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ హ్యాండ్సెట్స్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు 21.3 కోట్లుగా ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో 27.8 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరకు 26 శాతం వృద్ధితో 35.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 40 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కోటి నుంచి 10 కోట్లకు చేరడానికి దశాబ్ద కాలం.. 10 కోట్ల నుంచి 20 కోట్లకు రావడానికి మూడే ళ్ల సమయం.. 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరగడానికి ఏడాది కాలం పట్టింది. -
మీ మొబైల్లో డేటా స్టాప్ చేస్తారా?
♦ 1925కి కాల్/ఎస్ఎంఎస్ చేస్తే చాలు ♦ యాక్టివేషన్‌కు కూడా ఇదే నంబర్ ♦ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సర్వీసులను యాక్టివేట్/డీయాక్టివేట్ చేసుకోదల్చుకున్నవారి కోసం సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక నంబరు అందుబాటులోకి వస్తోంది. దీనికోసం ఇకపై 1925 నంబరుకి (టోల్ ఫ్రీ) కాల్ చేసినా లేదా ఎస్ఎంఎస్ చేసినా సరిపోతుంది. అదనపు ఆదాయం పొందే ఉద్దేశంతో టెలికం సంస్థలు మొబైల్ డేటా డీయాక్టివేషన్ ప్రక్రియను చాలా సంక్లిష్టంగా మార్చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. టెలికం ఆపరేటర్లు డేటా యాక్టివేషన్/డీయాక్టివేషన్కి సెప్టెంబర్ 1 నుం చి 1925 నంబరును అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. యాక్టివేషన్ కావాలనుకునేవారు ఇంగ్లీషులో స్టార్ట్ అని, డీయాక్టివేషన్ చేసుకోదల్చుకున్నవారు స్టాప్ అని ఈ నంబరుకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. టెలికం ఆపరేటర్లు తక్షణమే సదరు సర్వీసు పరిస్థితి గురించి కస్టమరుకు తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం 500 ఎంబీ, 1జీబీ, 2జీబీ తదితర డేటా పరిమితుల దాకా యూజరు ముందస్తుగా ఇచ్చిన సమ్మతి వర్తిస్తుంది. నిర్దేశిత పరిమితి దాటితే ప్రత్యేకంగా అనుమతి ఉండాల్సిందే. ఇక స్పెషల్ టారిఫ్ వోచర్లు (ఎస్టీవీ) లేదా కాంబో వోచర్ లేదా యాడ్ ఆన్ ప్యాక్ వంటి డేటా ప్యాక్‌లు తీసుకున్న వారు డేటా సర్వీసుల కోసం తమ అనుమతి ఇచ్చినట్లుగానే భావించడం జరుగుతుంది. డేటా ప్యాకేజీ కోసం సబ్స్క్రయిబ్ చేయకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి వినియోగించుకునే వారికి ప్రతి 10 ఎంబీ డేటా విని యోగం తర్వాత టెల్కోలు అలర్ట్‌లు పంపాల్సి ఉంటుంది. కస్టమర్లు అంతర్జాతీయంగా రోమిం గ్లో ఉన్న సమయంలో డేటాను గానీ వినియోగించుకోకుండా ఉన్న పక్షంలో హ్యాండ్‌సెట్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌ను స్విచ్ ఆఫ్ చేయాలంటూ అలర్ట్ చేయాల్సి ఉంటుంది. -
భారతీ ఎయిర్‌టెల్‌కు మొబైల్ ఇంటర్నెట్ జోరు
40 శాతం ఎగసిన నికర లాభం న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ జోరుతో భారతీ ఎయిర్టెల్ లాభాలు బాగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నికర లాభం 40 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో 1,108 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,554 కోట్లకు పెరిగింది. మొబైల్ డేటా బిజినెస్‌లో ట్రాఫిక్ 87 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మొత్తం అమ్మకాలు రూ.23,005 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.23,681 కోట్లకు పెరిగాయని వివరించింది. భారత వ్యాపారం 10 శాతం వృద్ధి సాధించిందని పేర్కొంది. మొబైల్ డేటా ఆదాయం 67 శాతం వృద్ధితో రూ.2,609 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు డేటా ఆదాయం రూ.42 నుంచి రూ.181కు వృద్ధి చెందిందని వివరించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎయిర్టెల్ షేర్ 1 శాతం తగ్గి రూ.414 వద్ద ముగిసింది. -
నగరంలో 4జీ సేవలు
హైదరాబాద్, వైజాగ్ తర్వాత వరంగల్ బీటా సర్వీసులు ప్రారంభించిన ఎయిర్టెల్ సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలు హన్మకొండ : నగరవాసులకు శుభవార్త! నాలుగోతరం మొబైల్ ఇంటర్నెట్‌సేవలు వరంగల్ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఎయిర్టెల్ సంస్థ సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నెలరోజుల పాటు 4జీ సేవల పనితీరును బేరీజు వేసి సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలందిస్తామని కంపెనీ ప్రతి నిధులు స్పష్టం చేశారు. నగరంలో 4జీ సేవలు అందించేందుకు మొత్తం 100 టవర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 50 టవర్లు పూర్తిస్థాయిలో సేవలందిస్తారుు. 4జీ (బీటా) సేవలను ట్రయల్న్‌గ్రా ఎయిర్టెల్ సంస్థ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తర్వాత.. నాలుగోతరం సెల్యులార్ సేవలు మొదట హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఇటీవల ప్రారంభమయ్యాయి. తర్వాత 4జీ సేవలు అందుతున్న మూడో నగరం వరంగల్. దేశవ్యాప్తంగా 4జీ సేవలు 30 నగరాల్లో అందుతున్నారుు. సోమవారం హన్మకొండలోని ఎయిర్టెల్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కరుణ, నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు, భారతీ ఎయిర్టెల్ జోనల్ మేనేజర్ నాగరాజు 4జీ సేవలను నగరంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా 3జీ ధరలకే 4జీ సేవలందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో 4జీ హ్యాండ్సెట్లు వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలంగాణ, ఏపీ, ఎయిర్టెల్ సీఈవో విజయ్‌రాఘవన్ చెప్పారు. 4జీ హ్యాండ్సెట్లు ఉన్న వినియోగదారులు 4జీ సిమ్‌కార్డుల కోసం తమ షోరూంలలో సంప్రదించాలని కోరారు. పదింతల వేగం ప్రస్తుతం ఎయిర్టెల్ సంస్థ ఈ సేవలకు శ్రీకారం చుట్టగా త్వరలో ఇతర ఆపరేటర్లు సైతం సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 3జీతో పోల్చితే 4జీ సేవల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువ. 3జీ సేవల్లో డాటా డౌన్లోడ్ వేగం సగటున 7 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకన్) ఉంది. ఇదే 4జీలో అయితే నిశ్చలంగా ఉన్నప్పుడు 1 జీబీపీఎస్ (గిగాబైట్స్ పర్ సెకన్ లేదా 1024 ఎంబీపీఎస్).. చలనంలో ఉంటే 100 ఎంబీపీఎస్‌గా ఉంటుం ది. సంబంధింత టవర్ నుంచి దూరం, డౌన్లోడ్ చేసే సమయంలో ట్రాఫిక్ రద్దీ, కంపెనీ అందిస్తున్న సేవల నాణ్యతను బట్టి డాటా డౌన్లోడ్ వేగంలో మార్పులు ఉంటాయి. సేవల్లో నాణ్యత 4జీ సేవలు అందుబాటులోకి వస్తే యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించడం తేలికే. పెద్ద సైజు ఉన్న ఫొటోలు, వీడియోలనైనా క్షణాల్లో ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా తమ స్నేహితులకు పంపించుకోవచ్చు. 1జీబీ డాటా ఉండే హెడీ సినిమానైనా నిమిషాల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పౌర సేవలైన గ్యాస్‌బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపుల్లో నాణ్యత పెరుగుతుంది. దేశవిదేశాలోని వర్సిటీల్లో చెప్పే ఆన్లైన్ క్లాసులకు ఇక్కడి నుంచి హాజరుకావచ్చు. ఎంజీఎం వంటి పెద్దాస్పత్రుల్లో అత్యవసర సమయాల్లో రోగులకు ఆన్లైన్ ద్వారా టెలీమెడిసిన్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైద్య నిపుణుల నుంచి సాయం తీసుకోవచ్చు. -
2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు
- ఐఏఎంఏఐ, కేపీఎంజీల నివేదిక న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడమే దీనికి ప్రధాన కారణమంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., - ఈ ఏడాది జూన్ చివరి నాటికి భారత్‌లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య (వెర్లైన్, వెర్లైస్ రెండూ కలిపి) 35 కోట్లుగా ఉంది. - 2017 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుంది. దీంట్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 31.4 కోట్లుగా ఉంటుంది. 2014 నాటికి ఈ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 15.9 కోట్లు మాత్రమే. - 2013-17 కాలానికి మొబైల్ నెట్ యూజర్ల సంఖ్య 28% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోంది. - భవిష్యత్తులో 2జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గి 3జీ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 2013-17 కాలానికి 3జీ వినియోగదారుల సంఖ్య 61% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. - 2014 చివరికి 8.2 కోట్లుగా ఉన్న 3జీ కస్టమర్ల సంఖ్య 2017 నాటికి 28.4 కోట్లకు పెరుగుతుంది. - మొబైల్ ఇంటర్నెట్ కారణంగా ఇంటర్నెట్ విస్తరణ అనూహ్యంగా ఉండనున్నది. - 90 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ భారతీయుల్లో 7 శాతం మంది(దాదాపు 6 కోట్లు) ఇంటర్నెట్ను చురుకుగా వినియోగిస్తున్నారు. - 2012లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే గ్రామీణుల సంఖ్య 0.4 శాతమే. రెండేళ్లలో ఈ సంఖ్య 4.4 శాతానికి పెరిగింది. -
గ్రామాలు కూడా దాని వెనుకే పడుతున్నాయి
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పట్టణ వాసులే కాదు.. గ్రామీణవాసులు కూడా దూసుకెళుతున్నారని ఓ సర్వే తెలిపింది. గ్రామీణ భారతంలో గత ఏడాది కాలంలో సామాజిక అనుసంధాన వేదికలు(ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వీచాట్, ఈమెయిల్..మొదలైనవి) ఉపయోగించే వారు వందశాతం పెరిగారని వెల్లడించింది. ప్రస్తుతం 25 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని వివరించింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం సోషల్ మీడియా ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది వందశాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 35శాతం మాత్రమే పెరిగిందంట. అయితే, ఇక్కడ సోషల్ మీడియా ఉపయోగించేవారు సంఖ్యా పరంగా మాత్రం 118 మిలియన్లు ఉన్నారని సర్వే పేర్కొంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అనే సంస్థ, ఇండియన్ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో(ఐఎంఆర్బీ) అనే సంస్థలు కలిసి సోషల్ మీడియా ఇన్ ఇండియా-2014 అనే పేరిట ఒక నివేదిక వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ వరకు మొత్తం 143 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగించేవారు ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. ఇక, కేటగిరీలవారిగా కాలేజీ విద్యార్థులు 34శాతం, యువకులు 27 శాతం, పాఠశాల విద్యార్థులు 12శాతం పెరిగారని వివరించింది. -
ఐడియా డేటా రేట్లు అప్
ఢిల్లీలో 2జీ రేట్లు రెట్టింపు, 3జీ ప్లాన్లు 33% అధికం త్వరలో మిగతా సర్కిల్స్‌లోనూ పెంపు న్యూఢిల్లీ : ఇటీవలి వేలంలో భారీ మొత్తం వెచ్చించి స్పెక్ట్రం దక్కించుకున్న టెలికం కంపెనీలు టారిఫ్‌లు పెంచడం మొదలుపెట్టాయి. అన్నింటికన్నా ముందుగా ఐడియా సెల్యులార్ ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (ఎన్సీఆర్) ప్రీపెయిడ్ కస్టమర్లకు మొబైల్ డేటా రేట్లను దాదాపు 100 శాతం దాకా పెంచేసింది. దీంతో కొన్ని 2జీ ప్లాన్ల రేట్లు రెట్టింపు కాగా, 3జీ ప్లాన్లు సుమారు 33% మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో మిగతా సర్కిల్స్‌లో కూడా డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చిలో జరిగిన వేలంలో ఐడియా అత్యధికంగా రూ. 30,300 కోట్లు బిడ్ చేయడం తెలిసిందే. ఇంత మొత్తం వెచ్చించినందున దీని వల్ల డేటా రేట్లు పెంచక తప్పకపోవచ్చని కంపెనీ ఎండీ హిమాంశు కపానియా గతంలో వ్యాఖ్యానించారు కూడా. కొత్త మార్పుల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై రూ.255 కడితే 3జీబీ డేటా (2జీ) కాకుండా 1.5 జీబీ మాత్రమే లభిస్తుంది. 28 రోజుల కాల పరిమితి ఉండే 1జీబీ 3జీ ప్యాక్ టారిఫ్ రూ.249 నుంచి రూ.295కి పెరిగింది. 2జీలో ఇప్పటిదాకా ఇస్తున్న 3జీబీ ప్లాన్‌ను తొలగించింది. -
బీఎస్ఎన్ఎల్లో డేటా క్యారీ ఫార్వర్డ్ సదుపాయం
న్యూఢిల్లీ: వాడుకోకుండా మిగిలిపోయిన మొబైల్ ఇంటర్నెట్ డేటాను తదుపరి రీచార్జ్‌లో వినియోగించుకునేలా (క్యారీ ఫార్వర్డ్) బీఎస్ఎన్ఎల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది 2జీ, 3జీ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. 3జీ సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొంగొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. 10 రోజుల కాలవ్యవధితో 1జీబీ మేర 3జీ మొబైల్ డేటాకి సంబంధించి బీఎస్ఎన్ఎల్ ఇటీవలే రూ. 68 విలువ చేసే డేటా స్పెషల్ టారిఫ్ వోచర్ (ఎస్టీవీ)ని ప్రవేశపెట్టింది. -
మొబైల్ ఇంటర్నెట్ వినియోగం 74% అప్
న్యూఢిల్లీ: దేశంలో 3జీ వినియోగం పెరగటం వల్ల మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో వృద్ధి కనిపించింది. 2013తో పోలిస్తే గతేడాది చివరకు 3జీ డాటా వినియోగంలో 114 శాతం వృద్ధి, మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 74 శాతం వృద్ధి నమోదైందని నోకియా నెట్వర్క్స్ తెలిపింది. 2జీ మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 41 శాతం వృద్ధి కనిపించింద ని నోకియా నెట్వర్క్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం డాటా వినియోగంలో 3జీ వాటా 52 శాతంగా ఉంది. 2జీ వినియోగదారునితో పోలిస్తే 3జీ వినియోగదారుడు 3 రెట్లు ఎక్కువ డాటాను వినియోగించుకుంటున్నాడు. ‘ఏ’ సర్వీస్ ప్రాంతాలలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో డాటా వినియోగం అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 3జీ డాటా వినియోగంలో 129 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ‘బి’ సర్వీస్ ప్రాంతాలలో కూడా 3జీ డాటా వినియోగంలో 107 శాతం వృద్ధి కనిపించింది. డాటా వినియోగం ప్రకారం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మెట్రో నగరాలు ‘బి’ సర్వీస్ ప్రాంతం కిందకు వస్తాయి. డాటా వినియోగంలో పెరుగుదల వివిధ మొబైల్ పరికరాలు, నెట్‌వర్క్‌ల పైన ఆధారపడి ఉంటుందని నోకియా నెట్వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గిరోత్రా అన్నారు. పరిశ్రమ అధ్యయనం ప్రకారం, 2014లో భారత్‌కు 258 మిలియన్ల ఫోన్లు దిగుమతి అయ్యాయి. వీటిలో 22 శాతం 3జీ స్మార్ట్ఫోన్లు, 7 శాతం 2జీ స్మార్ట్ఫోన్లు, 1 శాతం 4జీ స్మార్ట్ఫోన్లు, 70 శాతం ఫీచర్ ఫోన్లు ఉన్నాయని చెప్పారు. -
ఎయిర్టెల్ లాభం రెట్టింపు
క్యూ3లో రూ.1,437 కోట్లు * మొబైల్ డేటా ఆదాయాల జోరు * 6 శాతం పెరిగి... రూ. 23,228 కోట్లకు చేరిన ఆదాయం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రెట్టింపునకుపైగా ఎగబాకి రూ.1,437 కోట్లుగా నమోదైంది. ముందటేడాది ఇదే కాలంలో రూ.610 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొబైల్ డేటా(ఇంటర్నెట్ ప్యాకేజీలు) ఆదాయాల్లో వృద్ధి కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో రూ.23,228 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.21,960 కోట్లతో పోలిస్తే 5.8 శాతం పెరిగింది. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటాం: ఎండీ కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంద్వారా ఆదాయాన్ని మరింత పరుగులు పెట్టించడం తమ లక్ష్యమని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అదేవిధంగా స్థిరమైన టారిఫ్‌లు, మొబైల్ డేటా విభాగంలో వినూత్న ప్లాన్‌ను అందించడంపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లలో మూడో క్వార్టర్లో ఇంత భారీ ఆదాయం లభించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ ఎయిర్టెల్ భారత్ కార్యకలాపాల ఆదాయం క్యూ3లో 12.6 శాతం పెరిగి రూ.16,256 కోట్లుగా నమోదైంది. ⇒ మొబైల్ సేవల ఆదాయం 13 శాతం, టెలీ మీడియా ఆదాయం 13.2%, డిజిటల్ టీవీ(డీటీహె చ్) ఆదాయం 15.8% చొప్పున వృద్ధి చెందాయి. ⇒ మొబైల్ వాయిస్ కాల్స్ ద్వారా డిసెంబర్ క్వార్టర్లో ఒక్కో భారతీయ యూజర్ నుంచి నిమిషానికి సగటున(ఏఆర్పీయూ) 37.67 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఏఆర్‌పీయూతో పోలిస్తే 0.45 పైసలు పెరిగింది. ⇒ మొబైల్ డేటా ఆదాయం అత్యధికంగా 74.3 శాతం ఎగబాకి రూ.2,114 కోట్లకు చేరింది. భారత్‌లో ఒక్కో కస్టమర్ మొబైల్ ఇంటర్నెట్ వినియోగం క్యూ3లో 38.3 శాతం పెరిగింది. ఇక కన్సాలిడేటెడ్‌గా ఈ ఆదాయం క్యూ3లో 62 శాతం వృద్ధి చెంది రూ.2,872 కోట్లుగా నమోదైంది. ⇒ ఆఫ్రికాలోని అనుంబంధ సంస్థల నుంచి డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు రూ.836 కోట్లకు పెరిగాయి. ఆదాయం 5.5 శాతం తగ్గుదలతో రూ.7,230 కోట్ల నుంచి రూ.6,828 కోట్లకు చేరింది. అయితే, అక్కడి స్థానిక కరెన్సీల ప్రకారం చూస్తే... ఆదాయం 3.9 శాతం వృద్ధి చెందిందని కంపెనీ వెల్లడించింది. ⇒ ఆఫ్రికాలో మొబైల్ డేటా ఆదాయాలు 116 మిలియన్ డాలర్లకు చేరాయి. 34.9 శాతం వృద్ధి నమోదైంది. ⇒ మొత్తంమీద... 20 దేశాల్లో టెలికం సేవలు అందిస్తున్న ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య డిసెంబర్ చివరినాటికి 31.29 కోట్లకు చేరింది. వీరిలో భారతీయ కస్టమర్లు 22 కోట్లు. మొబైల్ ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య 4.2 కోట్లుగా ఉంది. ⇒ డిసెంబర్ ఆఖరికల్లా కంపెనీ నికర రుణ భారం రూ.66,839 కోట్లుగా నమోదైంది. భారతీ ఎయిర్టెల్ షేరు ధర బుధవారం 1 శాతం మేర క్షీణించి రూ.368 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
మూడురోజుల్లో ఫోన్ బిల్లు..జస్ట్ రూ.2లక్షలు
హైదరాబాద్ : ఫోన్ బిల్లు వేయి రూపాయలు వచ్చిందంటేనే బెంబేలు పడతాం.అలాంటిది ఏకంగా రెండు లక్షల బిల్లు వస్తే.....? కట్టేది మనం కాకపోతే ఎంత బిల్లు వస్తే ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ ఠక్కర్ ఫోన్ బిల్లు లక్షల్లో వచ్చింది. అది కూడా నెల రోజుల బిల్లు కాదు... జస్ట్ మూడు రోజుల బిల్లే....ఏంటీ అంతా బిల్లంటారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గత నెలలో సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన ...అక్కడ తన మొబైల్‌కు చిన్న సాంకేతిక సమస్య రావటంతో వై-ఫైని కాకుండా మొబైల్ డేటాను ఉపయోగించారు. గత నెల 12,13, 14 తేదీల్లో ఠక్కర్ ...మొబైల్ డేటాను భారీగా వాడుకున్నారు. పర్యటన అనంతరం వచ్చిన ఆయన ఫోన్ బిల్లు రూ.2,15,000 రావటం చూసి అవాక్కవటం ప్లానింగ్ విభాగం అధికారుల వంతైంది. ఫోన్ బిల్లును ఠక్కర్ సిబ్బంది.. విడతలు విడతలుగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారులు అప్రమత్తమై మొబైల్ డేటా జోలికి పోలేదట. -
ఇంటర్నెట్ యూజర్లు@ 24 కోట్లు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసే వినియోగదారులు బాగా పెరుగుతుండటంతో ఈ ఏడాది జూన్ కల్లా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 28 శాతం వృద్ధితో 24.3 కోట్లకు చేరుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., గతేడాది జూన్‌నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 19 కోట్లుగా ఉంది. 2012లో 15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య 2013లో 42 శాతం వృద్ధి చెంది 21.3 కోట్లకు పెరిగింది. 2012లో 6.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2013లో 92% వృద్ధితో 13 కోట్లకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్‌కల్లా వీరి సంఖ్య 18.5 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల వాటా 76%గా ఉంటుంది. ఇంటర్నెట్ వినియోగం వృద్ధి చెందుతున్న కారణంగా ఇ-కామర్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్ కూ డా చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. 2012 ఏడాది చివరినాటికి రూ.47,349 కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ గతేడాది చివరి కల్లా రూ.62,967 కోట్లకు వృద్ధి చెందింది. ఇక డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,938 కోట్లకు చేరుతుంది.