ఎయిర్‌టెల్ లాభం రెట్టింపు
క్యూ3లో రూ.1,437 కోట్లు
* మొబైల్ డేటా ఆదాయాల జోరు
* 6 శాతం పెరిగి... రూ. 23,228 కోట్లకు చేరిన ఆదాయం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రెట్టింపునకుపైగా ఎగబాకి రూ.1,437 కోట్లుగా నమోదైంది. ముందటేడాది ఇదే కాలంలో రూ.610 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
మొబైల్ డేటా(ఇంటర్నెట్ ప్యాకేజీలు) ఆదాయాల్లో వృద్ధి కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో రూ.23,228 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.21,960 కోట్లతో పోలిస్తే 5.8 శాతం పెరిగింది.
కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటాం: ఎండీ
కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంద్వారా ఆదాయాన్ని మరింత పరుగులు పెట్టించడం తమ లక్ష్యమని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అదేవిధంగా స్థిరమైన టారిఫ్‌లు, మొబైల్ డేటా విభాగంలో వినూత్న ప్లాన్‌ను అందించడంపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లలో మూడో క్వార్టర్‌లో ఇంత భారీ ఆదాయం లభించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు.
ఇతర ముఖ్యాంశాలివీ...
⇒ ఎయిర్‌టెల్ భారత్ కార్యకలాపాల ఆదాయం క్యూ3లో 12.6 శాతం పెరిగి రూ.16,256 కోట్లుగా నమోదైంది.
⇒ మొబైల్ సేవల ఆదాయం 13 శాతం, టెలీ మీడియా ఆదాయం 13.2%, డిజిటల్ టీవీ(డీటీహె చ్) ఆదాయం 15.8% చొప్పున వృద్ధి చెందాయి.
⇒ మొబైల్ వాయిస్ కాల్స్ ద్వారా డిసెంబర్ క్వార్టర్‌లో ఒక్కో భారతీయ యూజర్ నుంచి నిమిషానికి సగటున(ఏఆర్‌పీయూ) 37.67 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఏఆర్‌పీయూతో పోలిస్తే 0.45 పైసలు పెరిగింది.
⇒ మొబైల్ డేటా ఆదాయం అత్యధికంగా 74.3 శాతం ఎగబాకి రూ.2,114 కోట్లకు చేరింది. భారత్‌లో ఒక్కో కస్టమర్ మొబైల్ ఇంటర్నెట్ వినియోగం క్యూ3లో 38.3 శాతం పెరిగింది. ఇక కన్సాలిడేటెడ్‌గా ఈ ఆదాయం క్యూ3లో 62 శాతం వృద్ధి చెంది రూ.2,872 కోట్లుగా నమోదైంది.
⇒ ఆఫ్రికాలోని అనుంబంధ సంస్థల నుంచి డిసెంబర్ క్వార్టర్‌లో నష్టాలు రూ.836 కోట్లకు పెరిగాయి. ఆదాయం 5.5 శాతం తగ్గుదలతో రూ.7,230 కోట్ల నుంచి రూ.6,828 కోట్లకు చేరింది. అయితే, అక్కడి స్థానిక కరెన్సీల ప్రకారం చూస్తే... ఆదాయం 3.9 శాతం వృద్ధి చెందిందని కంపెనీ వెల్లడించింది.
⇒ ఆఫ్రికాలో మొబైల్ డేటా ఆదాయాలు 116 మిలియన్ డాలర్లకు చేరాయి. 34.9 శాతం వృద్ధి నమోదైంది.
⇒ మొత్తంమీద... 20 దేశాల్లో టెలికం సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య డిసెంబర్ చివరినాటికి 31.29 కోట్లకు చేరింది. వీరిలో భారతీయ కస్టమర్లు 22 కోట్లు. మొబైల్ ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య 4.2 కోట్లుగా ఉంది.
⇒ డిసెంబర్ ఆఖరికల్లా కంపెనీ నికర రుణ భారం రూ.66,839 కోట్లుగా నమోదైంది.
భారతీ ఎయిర్‌టెల్ షేరు ధర బుధవారం 1 శాతం మేర క్షీణించి రూ.368 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.