
ఐడియా డేటా రేట్లు అప్
ఢిల్లీలో 2జీ రేట్లు రెట్టింపు, 3జీ ప్లాన్లు 33% అధికం
త్వరలో మిగతా సర్కిల్స్‌లోనూ పెంపు
న్యూఢిల్లీ : ఇటీవలి వేలంలో భారీ మొత్తం వెచ్చించి స్పెక్ట్రం దక్కించుకున్న టెలికం కంపెనీలు టారిఫ్‌లు పెంచడం మొదలుపెట్టాయి. అన్నింటికన్నా ముందుగా ఐడియా సెల్యులార్ ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (ఎన్‌సీఆర్) ప్రీపెయిడ్ కస్టమర్లకు మొబైల్ డేటా రేట్లను దాదాపు 100 శాతం దాకా పెంచేసింది. దీంతో కొన్ని 2జీ ప్లాన్ల రేట్లు రెట్టింపు కాగా, 3జీ ప్లాన్లు సుమారు 33% మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో మిగతా సర్కిల్స్‌లో కూడా డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మార్చిలో జరిగిన వేలంలో ఐడియా అత్యధికంగా రూ. 30,300 కోట్లు బిడ్ చేయడం తెలిసిందే. ఇంత మొత్తం వెచ్చించినందున దీని వల్ల డేటా రేట్లు పెంచక తప్పకపోవచ్చని కంపెనీ ఎండీ హిమాంశు కపానియా గతంలో వ్యాఖ్యానించారు కూడా. కొత్త మార్పుల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై రూ.255 కడితే 3జీబీ డేటా (2జీ) కాకుండా 1.5 జీబీ మాత్రమే లభిస్తుంది. 28 రోజుల కాల పరిమితి ఉండే 1జీబీ 3జీ ప్యాక్ టారిఫ్ రూ.249 నుంచి రూ.295కి పెరిగింది. 2జీలో ఇప్పటిదాకా ఇస్తున్న 3జీబీ ప్లాన్‌ను తొలగించింది.