టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.
గతేడాది జూలైలో ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్‌స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.
టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్‌పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్‌పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది.
కంపెనీల వారీగా ఏజీఆర్
భారతీ ఎయిర్‌టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment