ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్‌ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది.
ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్‌లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్‌స్టాల్ చేసిన 50,000 సైట్‌లలో 41,000 సైట్‌లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.
దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్‌ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.
వీటిలో దాదాపు 36,747 సైట్‌లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్‌లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్‌లను విస్తరించాలనే బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment