Mobile towers
-
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్కి వెళ్తుంటే ఇది తెలుసుకోండి..
తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో మీరు బీఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్‌లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్‌లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉంటాయి.సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండిపేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.మీ ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.ఏదైనా టవర్‌పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది. -
బీఎస్ఎన్ఎల్కు వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. -
ఇండస్ నుంచి వొడాఫోన్ ఔట్!
ముంబై: దేశీ మొబైల్ టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వాటాను విక్రయించేందుకు టెలికం రంగ బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్లోగల పూర్తి వాటాను వొడాఫోన్ 2.3 బిలియన్ డాలర్లకు(రూ. 19,100 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం బ్లాక్‌డీల్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇండస్ వాటాను మొబై ల్ దిగ్గజం విక్రయించే వీలున్నట్లు తెలియజేశాయి. ఇండస్‌లో గ్రూప్‌లోని వివిధ సంస్థల ద్వారా వొడాఫోన్ 21.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో ఇండస్ టవర్స్ శుక్రవారం ముగింపు ధర రూ. 341తో చూస్తే వొడాఫోన్ వాటా విలువ రూ. 19,100 కోట్లుగా విశ్లేషకులు మదింపు చేశారు. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల నిధుల సమీకరణ బాటలో సాగుతున్న వొడాఫోన్ ఐడియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 16.7 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా వొడాఫోన్ ఐడియా షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. డిమాండు ఆధారంగా వొడాఫోన్ గ్రూప్.. ఇండస్‌లో వాటా విక్రయాన్ని చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, బీఎన్పీ పారిబాస్లను వొడాఫోన్ ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. అయితే వొడాఫోన్ ఇండియా, బ్రిటిష్ మాతృ సంస్థ ప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! 2022లోనూ.. నిజానికి 2022లో వొడాఫోన్.. ఇండస్ టవర్స్‌లోగల 28 శాతం వాటాను విక్రయించేందుకు నిర్ణయించినప్పటికీ స్వల్ప వాటాను మాత్రమే అమ్మగలిగింది. వాటా విక్రయానికి ప్రత్యర్ధి టెలికం దిగ్గజాలతో చర్చలు చేపట్టినప్పటికీ ఫలించలేదు. ఇండస్‌లో వాటా విక్రయం ద్వారా 42 బిలియన్ డాలర్లకుపైగా గల నికర రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించేందుకు వొడాఫోన్ ప్రణాళికలు వేసింది. ప్రపంచంలోనే టెలికం టవర్ల దిగ్గజాలలో ఒకటిగా నిలుస్తున్న ఇండస్ టవర్స్ దేశీయంగా రెండో పెద్ద మొబైల్ టవర్ల కంపెనీగా నిలుస్తోంది. సుమారు 2,20,000 టవర్లు కలిగిన కంపెనీలో మరో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సైతం వాటా ఉంది. -
టెలికం టవర్ల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన కొత్త రైట్ ఆఫ్ వే రూల్స్ ప్రకారం.. ప్రైవేట్ భవనాలు, స్థలాల్లో మొబైల్ టవర్లు, స్తంభాలను అమర్చడం, కేబుల్స్ ఏర్పాటుకు టెలికం కంపెనీలకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే సంబంధిత అధికారులకు ముందస్తుగా రాతపూర్వకంగా సమాచారం తప్పనిసరి. భవనం, నిర్మాణం వివరాలు, ఎంత మేరకు భద్రంగా ఉన్నదీ స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి ధ్రువీకరణతో సమాచారాన్ని టెలికం కంపెనీలు అందించాల్సి ఉంటుంది. 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. -
హద్దుల్లేకుండా.. హల్లో!
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ ఫోన్ నెట్వర్కు అందుబాటులోకి రానున్నదని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ సాంకేతిక సమాచారం, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 4వేల మొబైల్ టవర్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్రంగా 6వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ లేదన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో 3,933 గ్రామీణ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఏ ఒక్క గ్రామం మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇబ్బందులు పడకూడదని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించి, కేబినెట్ నోట్ ప్రవేశ పెట్టామన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా ఈ చర్య చేపడుతున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం దివాలా తీసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ల్)కు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు పునరుజ్జీవం కల్పించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యతో ఈ సంస్థ గతేడాది నిర్వహణ లాభాల (ఆపరేటింగ్ ప్రాఫిట్) స్థాయికి పునరుద్ధరణ సాధించిందన్నారు. బీఎస్ఎన్ల్కు రెండు విడతల్లో ఆర్థిక వనరులు కల్పించిందని తెలిపారు. తొలివిడత కింద 2019లో రూ.90వేల కోట్లు, మలివిడతగా రూ.45వేల కోట్లు ఈ ఏడాది మంజూరు చేశారని ప్రకటించారు. దీంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు పునరుజ్జీవం పొందాయన్నారు. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, 4జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 5జీ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో తుది మెరుగులు దిద్దుకుంటోందని, ఫోన్, రేడియోకు 5జీ టెక్నాలజీ అనుసంధానంతో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కనీవినీ ఎరుగని నిధులు.. రాష్ట్రంలో రైల్వేరంగం సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. యూపీఏ హయాం కంటే 2022–23 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామన్నారు. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఏటా సగటున సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. 2014–2019 మధ్య బీజేపీ ప్రభుత్వం ఏటా సగటున రూ.4,126 కోట్లు రాష్ట్ర రైల్వే రంగానికి కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైల్వే రంగానికి రూ.9,734 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకంగా వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. -
ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా?
కరోనా వైరస్‌పై ఎన్నో తప్పుడు కథనాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీన్ని నివారించడం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమయంలో మరో వార్త అందరినీ కలవరపరుస్తోంది. తాజాగా 5జి ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రచారం బ్రిటన్‌లో ఊపందుకుంది. దీంతో అక్కడి ప్రజలు పలు చోట్ల టవర్లను తగులబెడుతున్నారు. దీనిపై మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టవర్లను తగులబెడుతూ తమ సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం కరోనాకు, 5జి నెట్‌వర్క్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. (రండి.. దీపాలు వెలిగిద్దాం) ఈ మేరకు బ్రిటన్ మంత్రి మైకేల్ గోమ్ మాట్లాడుతూ.. ఇది ఓ దుర్మార్గమైన అవాస్తవమని కొట్టిపారేశారు. టవర్లను ధ్వసం చేయడంపై ఇంగ్లండ్‌లోని ఎన్హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) మెడికల్ డైరెక్టర్ స్టీఫెన్ పోయిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5జీ కథనాలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదో ప్రమాదకరమైన తప్పుడు కథనంగా అభివర్ణించారు. నిజానికి ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఫోన్ సిగ్నల్స్ అత్యంత అవసరమని పేర్కొన్నారు. కాగా టవర్ల నుంచి వచ్చే సిగ్నల్స్‌తో కరోనా వస్తుందన్న అపోహలతో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్, మెర్సిసైడ్ ప్రాంతాల్లో పలు టవర్లు ధ్వసం అయ్యాయి. ఈ విషయం గురించి బ్రిటన్‌లోని ఓ మొబైల్ నెట్వర్క్ అధికారి మాట్లాడుతూ.. 5జీపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నిరాధారమని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. (త్వరలో రిలయన్స్ జియో 5జీ టెక్నాలజీ) -
పదివేల టవర్లతో ఏపీలోదూసుకుపోతున్న జియో
సాక్షి, విజయవాడ : భారతదేశ వ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ సేవలను ఆంధ్రప్రదేశ్ వాసులకు మరింత అందుబాటులో తీసుకొచ్చామని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సమగ్రమైన మొబైల్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిబడిన నేపథ్యంలో ఈ డిజిటల్ విప్లవం రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువైందనీ, ఆంధ్రప్రదేశ్ లో 10వేల మొబైల్ టవర్ల కీలక మైలురాయిని చేరుకున్నామిన వెల్లడించింది. తద్వారా నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నామని పేర్కొంది.జియో నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించుకుని రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుకోవడంతాటు, వారందరికీ జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. జియో వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13.07 మిలియన్ల మంది చందాదారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జియో ప్రతి జిల్లా నుంచి అనేక మంది చందాదారులను తన ఖాతాలో జమచేసుకుంది. ప్రతిపౌరుడికి డేటా అనే లక్ష్యంతో 34 నెలల క్రితం జియో సేవలు ప్రారంభం అయ్యాయి. భారతదేశానికి చెందిన డిజిటల్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. కాగా ఉచిత కాలింగ్ సేవలు, డాటా సేవలతో టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో అతి స్వల్ప కాలంలోనే అతి ఎక్కువ వినియోగదారులనుసొంతం చేసుకుంది. అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారులతో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపింది. ఏప్రిల్ 2019 ట్రాయ్ గణాంకాల ప్రకారం, 314.8 మిలియన్ల చందాదారులను జియో కలిగి ఉంది. జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు జియో వినియోగదారులందరికీ సాటిలేని కనెక్టివిటీ సౌలభ్యం, 4జీ నెట్వర్క్ యొక్క శక్తివంతమైన మరియు విస్తృత శ్రేణి నెట్ వర్క్‌తో ఉత్తమ సేవలు. జియో అన్లిమిటెడ్ వాయిస్, డాటా ప్రయోజనాలు జియో ప్రీమియం యాప్స్ ప్రయోజనాలు పొందే అవకాశం, జియో టీవీ (అత్యంత జనాదరణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్), జియో మ్యూజిక్, జియో సినిమా సహా మరెన్నింటినో ఆనందించవచ్చు. జియో సిమ్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడం. జియో సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందేలా తీర్చిదిద్దడం. -
ఏపీలో మొబైల్ టవర్ల ఏర్పాటులో కమీషన్ల వేట
-
‘టవర్లు’ ఎక్కిన అవినీతి!
సెంట్రల్ విజిలెన్స్ నిబంధనలకూ విరుద్ధంగా.. సింగిల్ టెండర్‌పై పనులు అప్పగించడం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు కూడా విరుద్ధమని, ఈ నేపథ్యంలో సింగిల్ టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాల్సిందిగా న్యాయ శాఖ సైతం సూచించింది. తొలిసారి టెండర్లలో సింగిల్ టెండర్ వస్తే పనులు అప్పగించరాదని, అయినా ఈ భారీ ప్రాజెక్టుకు పోటీ లేకుండా అప్పగించడం సరైన పద్ధతి కాదని కూడా స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. ఈ భారీ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థకు లబ్ధిచేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ సర్కార్‌కు మాత్రం ఏటా రూ.18కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి : స్మార్ట్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రంలో పెదబాబు, చినబాబు చెలరేగిపోతున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి మరీ ప్రాజెక్టుల పేరుతో ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతూ అక్కడి నుంచి మళ్లీ సొంత జేబుల్లోకి కమీషన్ల రూపంలో మళ్లించుకుంటున్నారు. ఇందుకు రాష్ట్ర ఖజానాను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా మొబైల్ టవర్ల ఏర్పాటు ముసుగులో కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశారు. రూ.2వేల కోట్ల కాంట్రాక్టును అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఇంత భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం ఎంతా అంటే.. కేవలం రూ.18కోట్లే. అంటే 0.9శాతం అన్న మాట. కమీషన్ల కోసం టవర్లెత్తుతున్న ‘ముఖ్య’నేత బాగోతం వివరాల్లోకి వెళ్తే.. సింగిల్ విండో తరహాలో అన్ని రకాల సేవలను మొబైల్ టవర్ల ద్వారా పొందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 12వేల టవర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.2వేల కోట్లతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును అనుకున్నదే తడవుగా తమ అనుకూలురకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. కానీ, వీటి ఏర్పాటుకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఆర్థిక, న్యాయ శాఖ తప్పుబడుతున్నప్పటికీ ‘ముఖ్య’నేత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుండడపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను వదిలేసి, ‘ప్రైవేట్’ పనులను నెత్తినెత్తుకోవడంపై గతంలోనే ఉన్నతాధికార యంత్రాంగం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. టీవీలకు సెటాప్ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. ఇప్పుడు మొబైల్ సంస్థలు ఏర్పాటుచేసుకోవాల్సిన టవర్లను రాష్ట్ర ప్రభుత్వం భుజానకెత్తుకోవడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అంతేకాదు.. ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండరు నిబంధనలన్నీ ఆదిలోనే నీరుగార్చారంటూ ఆర్థిక శాఖ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసింది. కనీసం నిబంధనలను కూడా పాటించకపోవడంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని హెచ్చరించింది. అలాగే, టవర్ల ఏర్పాటుకు సింగిల్ టెండర్ వచ్చినందున మొత్తం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించి ప్యాకేజీలుగా విడదీసీ మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని, అప్పుడు ఎక్కువ బిడ్లు వస్తాయని సూచించింది. న్యాయ శాఖ కూడా సింగిల్ టెండర్ విధానాన్నీ తప్పుబట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల మేరకు కూడా సింగిల్ టెండర్‌పై పనులను ఇవ్వరాదని, తొలిసారి సింగిల్ టెండర్ వస్తే దాన్ని రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వానికి న్యాయ శాఖ సూచించింది. కానీ, ‘ముఖ్య’నేత.. ఆర్థిక, న్యాయ శాఖల సూచనలను, అభ్యంతరాలను బేఖాతరు చేశారు. సింగిల్ టెండర్‌గా వచ్చిన పేస్ పవర్ సిస్టమ్స్ అండ్ లైనేజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు రూ.2,000 కోట్ల విలువైన మొబైల్ టవర్ల ఏర్పాటు ప్రాజెక్టును అప్పగించేశారు. పేస్ అండ్ లైనేజ్ సంస్థలతో కలిసి ఏపీ టవర్స్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తుంది. ఇందులో ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు 30.33 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన స్థలాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటుచేయనున్నారు. అడుగడుగునా ఉల్లంఘనలు.. మొబైల్ టవర్ల ఏర్పాటుకు పిలిచిన టెండర్ల నిబంధనలన్నింటినీ పూర్తిగా నీరుగార్చారని ఆర్థిక శాఖ సోదాహరణంగా వివరించింది. ఉదా.. – ప్రాజెక్టు వ్యయమైన రూ.2,000కోట్లలో బిడ్ సెక్యురిటీగా 0.5 శాతం అంటే రూ.10కోట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం కోటి రూపాయలు మాత్రమే పెట్టారని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. – అలాగే, పెర్ఫార్మెన్స్గ్యారెంటీగా ప్రాజెక్టు వ్యయంలో ఐదు శాతం అంటే రూ.100కోట్లు ఉండాల్సి ఉండగా కేవలం రూ.20 కోట్లే పెట్టారని ఎత్తి చూపింది. – సాంకేతిక అనుభవం విషయంలోనూ.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 6000 మొబైల్ టవర్లు ఏర్పాటుచేసి ఉండాల్సి ఉండగా కేవలం 3000 టవర్లనే బిడ్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. – అలాగే, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వార్షిక టర్నోవర్.. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం అంటే 500 కోట్ల రూపాయలు నిబంధన విధించాల్సి ఉండగా కేవలం రూ.350 కోట్లు ఉంటే చాలని పేర్కొనడాన్ని కూడా తప్పుపట్టింది. ..ఇలా మొత్తం మీద బిడ్ నిబంధనలను నీరుగార్చినందున డీపీఆర్‌ను మళ్లీ రూపొందించి మరోసారి టెండర్లను ఆహ్వానించడం ద్వారా ఎక్కువమందికి బిడ్లు దాఖలు చేసే వెసులబాటును కల్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. -
సెల్ టవర్ల రేడియేషన్‌పై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : మొబైల్ టవర్ల రేడియేషన్ ప్రభావంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై ఒక నివేదిక సమర్పించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు సి. నాగప్పన్, ఎం ఖాన్ విల్కార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివరణలు కోరింది. నివాస ప్రాంతాల్లో మరియు పాఠశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ల నిర్మాణంపై నోయిడా నివాసి నరేస్ చంద్ర గుప్త దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీం విచారించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. సెల్ టవర్ల ద్వారా వెలుబడే రేడియేషన్ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మొబైల్ టవర్లనుంచి వెలువడే రేడియేషన్ విషతుల్య ప్రభావాలు, ఉద్గారాల ప్రమాణాల అమలుకు తీసుకుంటున్న చర్యలను సహా పలు అంశాలపై కేంద్రం నుండి ఒక నివేదిక కోరింది. మొబైల్ టవర్ల ప్రతికూల ప్రభావాలు ఏమిటి? వీటిని మానిటర్ చేయడానికి ఏదైనా ఏజెన్సీ ఉందా ? చట్టపరమైన నిబంధనలు, ఈ ప్రమాణాలను సుప్రీం ప్రశ్నించింది. సెల్ టవర్ల ఏర్పాటులో టెలికమ్యూనికేషన్ శాఖ ఏవైనా ఉల్లంఘనలను గుర్తించిందా, ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే, దానిపై తీసుకున్న చర్యలపై సుప్రీం ఆరా తీసింది. నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై ఉన్న కండీషన్స్ చెప్పాలని కోర్టు కోరింది. అలాగే ఇప్పటి వరకు దేశంలో ఉన్న సెల్ టవర్ల సంఖ్య, వాటిపై దాట్ తనిఖీలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికంను కోరింది. దేశంలోని సెల్ టవర్స్ రేడియేషన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాయా? అని ధర్నాసనం ప్రశ్నించింది. నిబంధనలు, నిబంధనలు ఉల్లంఘన రిపోర్టులు, అలాంటి వారిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి డాట్ నుండి సమాచారాన్ని కోరింది. దీంతోపాటు ఫోన్ సర్వీసు ప్రొవైడర్స్ లకు టవర్ల నిర్మాణంలో పాటించాల్సిన రేడియేషన్ ప్రమాణాలు, నిబంధనల అమలుపై ఒక టైమ్ ఫ్రేమ్ విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి కొంత సమయం కావాలని డాట్ న్యాయవాది పత్వాలియా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
‘టవర్ల’కు సొసైటీలు నో..
సాక్షి, ముంబై: నగరంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు త్వరలో గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ టవర్లు ఏర్పాటుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి. కొందరు కుదుర్చుకున్న ఒప్పందం (అగ్రిమెంట్) ను పొడగించేందుకు ముఖం చాటేస్తున్నారు. మొబైల్ టవర్ల నుంచి వెలువడే ప్రమాదకర రేడియేషన్‌కు భయపడే వారు తమ అగ్రిమెంట్లను పునరుద్ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ సేవలు అందించే వివిధ సంస్థలు కొత్త సొసైటీలు, ఖాళీ స్థాలాల వేటలో పడ్డాయి. నగరంలో దాదాపు మూడు కోట్ల నాలుగు లక్షల మొబైల్ వాడకం దారులున్నారు. ప్రతి నెలా సుమారు 70 వేల నుంచి లక్ష వరకు కొత్త వినియోగదారులు తోడవుతున్నారు. ప్రతి 20 వేల వినియోగదారులకు ఒక మొబైల్ టవర్ అవసరముంటుంది. ప్రస్తుతం ముంబైలో 9,500 మొబైల్ టవర్లున్నాయి. వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో టవర్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ప్రస్తుతం అదనంగా 670 టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ పేర్కొంది. సొసైటీలు, బహుళ అంతస్తుల భవనాలపై ఏర్పాటుచేసే సెల్‌ఫోన్ టవర్ల ఒప్పందం ఐదేళ్లు ఉంటుంది. కాని ఈ కాలవ్యవధి పూర్తయిన తరువాత గడువు పొడగించి ఇచ్చేందుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి. సెల్ టవర్లు ఏర్పాటుచేయడంవల్ల అందులోంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని వివిధ సేవా సంస్థలు గత రె ండు, మూడు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. దీంతో కాని వీటిని ఏర్పాటు చేయడంవల్ల సొసైటీలకు మంచి ఆదాయం వస్తుంది. కాని స్వయం సేవా సంస్థల ప్రచారం వల్ల టవర్లు ఏర్పాటుకు అనుమతివ్వడానికి సొసైటీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నగరంలో కొత్తగా 670 సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముండగా కేవలం 105 టవర్లకు స్థలం లభించింది. మిగతా టవర్ల ఏర్పాటుకు స్థలం వేటలో పడ్డాయి. ఇదిలా ఉండగా, సొసైటీ యాజమాన్యాలు సెల్ టవర్లను ఇలాగే నిరాకరిస్తూ పోతే కొద్ది రోజుల్లో సాధారణ ఫోన్లతోపాటు ఖరీదైన టూ జీ, త్రీ జీ లాంటి సేవలు నెట్వర్క్ లేక ఫొన్లు మొరాయించే పరిస్థితి ఎదురుకావడం ఖాయమని అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రకటనల ఆదాయంలో సగం.
సాక్షి, ముంబై: సొసైటీ భవనాలపై ఏర్పాటుచేసే మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని సభ్యులు కూడా పొందేలా నియమాల్లో మార్పులు చేయనున్నట్లు సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వెల్లడించారు. ఇదివరకు ఇలాంటి నిబంధన లేకపోవడంతో ప్రకటనలతో వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీలు భవనాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి లెక్కలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. నిధుల్లో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయనే చెబుతున్నారు. అంతేగాక ప్రకటనల ఆదాయంపై సొసైటీలు ఆడిటింగ్ కూడా జరిపిం చడం లేదు. అందుకే వీటికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని పాటిల్ అభిప్రాయపడ్డారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తం గా 88,433 రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి. ఈ భవనాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థ లు, దుకాణాలు ఉన్నాయి. వేలాది సొసైటీలు తమ భవనాలపై మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసేందుకు అనుమతించాయి. ఫలితంగా ఇవి నెలకు అద్దె రూపంలో లక్షలాది రూపాయలు పొందుతున్నాయి. ఇక నుంచి ఈ నిధులు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. ఇక నుంచి నిధు ల్లో 50 శాతం మొత్తాన్ని నివాసులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయాలి. మిగతా 50 శాతం నగదును సొసైటీ నిర్వహణకు వెచ్చించాలని చట్టాన్ని రూపొంధించనున్నట్లు పాటిల్ చెప్పారు. మొబైల్ టవర్లు, ప్రకటన బోర్డు లు ఏర్పాటుకు అనుమతినిచ్చే ముందు భవనానికి స్ట్రక్చరల్ ఆడిట్ కచ్చితంగా చేయించాలి. ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న లేదా జంక్షన్ల వద్ద ఉన్న భవనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ హోర్డింగులు ఏర్పాటుచేయడానికి వాణిజ్య సంస్థలు పోటీ పడతాయి. అందుకు ఎంతై నా చెల్లించడానికి ముం దుకువస్తాయి. కానీ వీటిని ఏర్పాటు చేయడంవల్ల భవనాలపై అదనపు భారం పడుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. అదనంగా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు సొసైటీ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. దీంతో విచ్చలవిడిగా టవర్లు, హోర్డింగులు వెలుస్తున్నాయి. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం సొసైటీలను ఆదేశించింది. -
మొబైల్ రేడియేషన్‌తో కేన్సర్ ముప్పు లేదు!
డబ్ల్యూహెచ్‌వో నిపుణుడి స్పష్టీకరణ న్యూఢిల్లీ: మొబైల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ నుంచి మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి హానిగానీ, కేన్సర్ ప్రమాదంగానీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణొడకరు స్పష్టంచేశారు. ‘మొబైల్ ఫోన్ల వల్ల మనిషి ఆరోగ్యానికి ముప్పు లేదని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనాల్లో ఇదివరకే తేలింది. మొబైల్ రేడియేషన్‌తో కేన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం లేదు’ అని ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో రేడియేషన్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ విభాగం కో ఆర్డినేటర్ మైఖేల్ రెపాచొలీ వెల్లడించారు. గురువారమిక్కడ ‘మొబైల్ ఫోన్స్ అండ్ పబ్లిక్ హెల్త్-మిత్ అండ్ రియాలిటీ’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ టవర్ కన్నా ఎఫ్ఎం రేడియో లేదా టీవీల రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు మించిన మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలనూ తోసిపుచ్చారు. పుస్తక సంపాదకుడు రవి వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు, టవర్ల వల్ల ఆరోగ్యంపై దుష్ర్పభావం కలుగుతుందని రుజువు కాలేదన్నారు.