టవర్స్ కంపెనీలో వాటా విక్రయానికి రెడీ
21.5% వాటాకు రూ. 19,100 కోట్లు!
ముంబై: దేశీ మొబైల్ టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వాటాను విక్రయించేందుకు టెలికం రంగ బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్‌లోగల పూర్తి వాటాను వొడాఫోన్ 2.3 బిలియన్ డాలర్లకు(రూ. 19,100 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం బ్లాక్‌డీల్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇండస్ వాటాను మొబై ల్ దిగ్గజం విక్రయించే వీలున్నట్లు తెలియజేశాయి.
ఇండస్‌లో గ్రూప్‌లోని వివిధ సంస్థల ద్వారా వొడాఫోన్ 21.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్‌ఈలో ఇండస్ టవర్స్ శుక్రవారం ముగింపు ధర రూ. 341తో చూస్తే వొడాఫోన్ వాటా విలువ రూ. 19,100 కోట్లుగా విశ్లేషకులు మదింపు చేశారు. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల నిధుల సమీకరణ బాటలో సాగుతున్న వొడాఫోన్ ఐడియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 16.7 వద్ద ముగిసింది.
గత కొద్ది రోజులుగా వొడాఫోన్ ఐడియా షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. డిమాండు ఆధారంగా వొడాఫోన్ గ్రూప్.. ఇండస్‌లో వాటా విక్రయాన్ని చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, బీఎన్‌పీ పారిబాస్‌లను వొడాఫోన్ ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. అయితే వొడాఫోన్ ఇండియా, బ్రిటిష్ మాతృ సంస్థ ప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం!
2022లోనూ..
నిజానికి 2022లో వొడాఫోన్.. ఇండస్ టవర్స్‌లోగల 28 శాతం వాటాను విక్రయించేందుకు నిర్ణయించినప్పటికీ స్వల్ప వాటాను మాత్రమే అమ్మగలిగింది. వాటా విక్రయానికి ప్రత్యర్ధి టెలికం దిగ్గజాలతో చర్చలు చేపట్టినప్పటికీ ఫలించలేదు. ఇండస్‌లో వాటా విక్రయం ద్వారా 42 బిలియన్ డాలర్లకుపైగా గల నికర రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించేందుకు వొడాఫోన్ ప్రణాళికలు వేసింది. ప్రపంచంలోనే టెలికం టవర్ల దిగ్గజాలలో ఒకటిగా నిలుస్తున్న ఇండస్ టవర్స్ దేశీయంగా రెండో పెద్ద మొబైల్ టవర్ల కంపెనీగా నిలుస్తోంది. సుమారు 2,20,000 టవర్లు కలిగిన కంపెనీలో మరో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సైతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment