సెంట్రల్ విజిలెన్స్ నిబంధనలకూ విరుద్ధంగా..
సింగిల్ టెండర్‌పై పనులు అప్పగించడం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు కూడా విరుద్ధమని, ఈ నేపథ్యంలో సింగిల్ టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాల్సిందిగా న్యాయ శాఖ సైతం సూచించింది. తొలిసారి టెండర్లలో సింగిల్ టెండర్ వస్తే పనులు అప్పగించరాదని, అయినా ఈ భారీ ప్రాజెక్టుకు పోటీ లేకుండా అప్పగించడం సరైన పద్ధతి కాదని కూడా స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. ఈ భారీ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థకు లబ్ధిచేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ సర్కార్‌కు మాత్రం ఏటా రూ.18కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు.
సాక్షి, అమరావతి : స్మార్ట్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రంలో పెదబాబు, చినబాబు చెలరేగిపోతున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి మరీ ప్రాజెక్టుల పేరుతో ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతూ అక్కడి నుంచి మళ్లీ సొంత జేబుల్లోకి కమీషన్ల రూపంలో మళ్లించుకుంటున్నారు. ఇందుకు రాష్ట్ర ఖజానాను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా మొబైల్ టవర్ల ఏర్పాటు ముసుగులో కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశారు. రూ.2వేల కోట్ల కాంట్రాక్టును అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఇంత భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం ఎంతా అంటే.. కేవలం రూ.18కోట్లే. అంటే 0.9శాతం అన్న మాట. కమీషన్ల కోసం టవర్లెత్తుతున్న ‘ముఖ్య’నేత బాగోతం వివరాల్లోకి వెళ్తే.. సింగిల్ విండో తరహాలో అన్ని రకాల సేవలను మొబైల్ టవర్ల ద్వారా పొందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 12వేల టవర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
రూ.2వేల కోట్లతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును అనుకున్నదే తడవుగా తమ అనుకూలురకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. కానీ, వీటి ఏర్పాటుకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఆర్థిక, న్యాయ శాఖ తప్పుబడుతున్నప్పటికీ ‘ముఖ్య’నేత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుండడపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను వదిలేసి, ‘ప్రైవేట్’ పనులను నెత్తినెత్తుకోవడంపై గతంలోనే ఉన్నతాధికార యంత్రాంగం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. టీవీలకు సెటాప్ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. ఇప్పుడు మొబైల్ సంస్థలు ఏర్పాటుచేసుకోవాల్సిన టవర్లను రాష్ట్ర ప్రభుత్వం భుజానకెత్తుకోవడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అంతేకాదు.. ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండరు నిబంధనలన్నీ ఆదిలోనే నీరుగార్చారంటూ ఆర్థిక శాఖ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసింది.
కనీసం నిబంధనలను కూడా పాటించకపోవడంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని హెచ్చరించింది. అలాగే, టవర్ల ఏర్పాటుకు సింగిల్ టెండర్ వచ్చినందున మొత్తం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించి ప్యాకేజీలుగా విడదీసీ మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని, అప్పుడు ఎక్కువ బిడ్లు వస్తాయని సూచించింది. న్యాయ శాఖ కూడా సింగిల్ టెండర్ విధానాన్నీ తప్పుబట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల మేరకు కూడా సింగిల్ టెండర్‌పై పనులను ఇవ్వరాదని, తొలిసారి సింగిల్ టెండర్ వస్తే దాన్ని రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వానికి న్యాయ శాఖ సూచించింది. కానీ, ‘ముఖ్య’నేత.. ఆర్థిక, న్యాయ శాఖల సూచనలను, అభ్యంతరాలను బేఖాతరు చేశారు. సింగిల్ టెండర్‌గా వచ్చిన పేస్ పవర్ సిస్టమ్స్ అండ్ లైనేజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు రూ.2,000 కోట్ల విలువైన మొబైల్ టవర్ల ఏర్పాటు ప్రాజెక్టును అప్పగించేశారు. పేస్ అండ్ లైనేజ్ సంస్థలతో కలిసి ఏపీ టవర్స్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తుంది. ఇందులో ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు 30.33 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన స్థలాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటుచేయనున్నారు.
అడుగడుగునా ఉల్లంఘనలు..
మొబైల్ టవర్ల ఏర్పాటుకు పిలిచిన టెండర్ల నిబంధనలన్నింటినీ పూర్తిగా నీరుగార్చారని ఆర్థిక శాఖ సోదాహరణంగా వివరించింది. ఉదా..
– ప్రాజెక్టు వ్యయమైన రూ.2,000కోట్లలో బిడ్ సెక్యురిటీగా 0.5 శాతం అంటే రూ.10కోట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం కోటి రూపాయలు మాత్రమే పెట్టారని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది.
– అలాగే, పెర్ఫార్మెన్స్‌గ్యారెంటీగా ప్రాజెక్టు వ్యయంలో ఐదు శాతం అంటే రూ.100కోట్లు ఉండాల్సి ఉండగా కేవలం రూ.20 కోట్లే పెట్టారని ఎత్తి చూపింది.
– సాంకేతిక అనుభవం విషయంలోనూ.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 6000 మొబైల్ టవర్లు ఏర్పాటుచేసి ఉండాల్సి ఉండగా కేవలం 3000 టవర్లనే బిడ్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
– అలాగే, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వార్షిక టర్నోవర్.. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం అంటే 500 కోట్ల రూపాయలు నిబంధన విధించాల్సి ఉండగా కేవలం రూ.350 కోట్లు ఉంటే చాలని పేర్కొనడాన్ని కూడా తప్పుపట్టింది.
..ఇలా మొత్తం మీద బిడ్ నిబంధనలను నీరుగార్చినందున డీపీఆర్‌ను మళ్లీ రూపొందించి మరోసారి టెండర్లను ఆహ్వానించడం ద్వారా ఎక్కువమందికి బిడ్లు దాఖలు చేసే వెసులబాటును కల్పించాలని ఆర్థిక శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment