తన అన్నయ్యకు ఆగమేఘాలపై ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ రెడీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
ఈ నెల 31న రిటైర్ కానున్న డీఎస్పీ కింజరాపు ప్రభాకర్
ఆ లోగానే అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించేందుకు హడావుడి
ఆర్థిక శాఖ ఆమోదం లేకున్నా పదోన్నతి కల్పించేందుకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది.
ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం.
ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment