
శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి: ‘నేనేమి ఆర్థిక శాస్త్రవేత్తను కాను. నా దగ్గర మంత్ర దండం ఏమీ లేదు. రాత్రికి రాత్రే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడం లేదు. మా కాళ్లకు సంకెళ్లు వేశారు. మా చేతులు కట్టేశారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్‌తో సహా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం.
అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతోనే మెరుగైన కేటాయింపులతో బడ్జెట్‌ను రూపొందించాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబును బ్లైండ్(గుడ్డిగా)గా నమ్మితే చాలు.. రాష్ట్రం రూపు రేఖలే మార్చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కరు చాలన్నారు.
తెలంగాణలో 2023–24లో రూ.1,73,389 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.1,01,985 కోట్ల ఆదాయం వచ్చిందని, జీతాల కోసం తెలంగాణ కేవలం రూ.51,682 కోట్లు (ఆదాయంలో 30 శాతం) ఖర్చు చేస్తుంటే, మనం రూ.89,008 కోట్లు (90శాతం) ఖర్చు చేస్తున్నామన్నారు. అప్పులకుతెలంగాణ ఏటా వడ్డీల రూపంలో రూ.52,080 కోట్లు చెల్లిస్తుంటే, ఏపీలో రూ.65,962 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు.
ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటాతో కలిపి రాష్ట్రానికి రూ.1.54,065 కోట్ల ఆదాయం వస్తే.. జీత భత్యాలు, వడ్డీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.1,54,971 కోట్లుందన్నారు. 2014–19లో వ్యవసాయంలో 16 శాతం, సేవల రంగంలో 11.9శాతం వృద్ధి రేటు నమోదైతే, 2019–24 మధ్య 10.3 శాతం, 9.9 శాతంగా నమోదైనట్లు తెలిపారు.
అంటే 2014–19తో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో వృద్ధి రేటు 3 శాతం పడిపోయిందన్నారు. ఫలితంగా రూ.76,195 కోట్లు అదనంగా అప్పు చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. జీఎస్‌డీపీ, జీడీపీ పెరిగితేనే అప్పులు పుడతాయని, అందుకోసమే నిత్యం తపన పడుతున్నామని తెలిపారు.
ఆర్థిక పరిస్థితి తెలిసే హామీలిచ్చాం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా తాము సూపర్ సిక్స్ హామీలిచ్చామని, సంపద సృష్టి ద్వారా వాటిని అమలు చేసి తీరతామని మంత్రి కేశవ్ తెలిపారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం ఏటా రూ.32,520 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
తల్లికి వందనం ద్వారా 72 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున జమ చేసేందుకు రూ.9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రూ.6,300 కోట్లు కేటాయించామన్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తే, తాము రూ.300 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment