మొబైల్ రేడియేషన్‌తో కేన్సర్ ముప్పు లేదు!
డబ్ల్యూహెచ్‌వో నిపుణుడి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మొబైల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ నుంచి మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి హానిగానీ, కేన్సర్ ప్రమాదంగానీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణొడకరు స్పష్టంచేశారు. ‘మొబైల్ ఫోన్ల వల్ల మనిషి ఆరోగ్యానికి ముప్పు లేదని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనాల్లో ఇదివరకే తేలింది. మొబైల్ రేడియేషన్‌తో కేన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం లేదు’ అని ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో రేడియేషన్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ విభాగం కో ఆర్డినేటర్ మైఖేల్ రెపాచొలీ వెల్లడించారు.
గురువారమిక్కడ ‘మొబైల్ ఫోన్స్ అండ్ పబ్లిక్ హెల్త్-మిత్ అండ్ రియాలిటీ’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ టవర్ కన్నా ఎఫ్‌ఎం రేడియో లేదా టీవీల రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్) ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు మించిన మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలనూ తోసిపుచ్చారు. పుస్తక సంపాదకుడు రవి వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు, టవర్ల వల్ల ఆరోగ్యంపై దుష్ర్పభావం కలుగుతుందని రుజువు కాలేదన్నారు.