
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలిపింది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.
ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్‌బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.
పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్‌బీయూ వ్యతిరేకిస్తోంది. ఇటువంటి జోక్యం బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్‌బీయూలో ఉన్నాయి.
ఉద్యోగుల డిమాండ్లు..
ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment