Idea Cellular
-
వొడాఫోన్ ఐడియాకు వెరిజాన్, అమెజాన్ దన్ను!
మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియాలో విదేశీ దిగ్గజాలు వెరిజాన్, అమెజాన్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. సంబంధిత కథనం ప్రకారం ఏజీఆర్ బకాయిల కేసుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చలు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, యూఎస్ వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ కమ్యూనికేషన్స్ 400 కోట్ల డాలర్లు(సుమారు రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పదేళ్లలోగా ఏజీఆర్ బకాయిలను చెల్లించమంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరిగి వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ. 50,000 కోట్లు బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్య సంస్థ వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. సుప్రీం ఆదేశాలమేరకు ఇప్పటికే కంపెనీ రూ. 7,850 కోట్లను చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. షేరు జోరు అమెజాన్, వెరిజాన్ ఇన్వెస్ట్మెంట్ యోచనలో ఉన్న అంచనాలతో ఇటీవల వొడాఫోన్ ఐడియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రోజులుగా ఈ షేరు దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 10.70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 11.30 వరకూ ఎగసింది. -
మళ్లీ జియోనే టాప్!!
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ ఛార్ట్‌లో మళ్లీ రిలయన్స్ జియోనే ముందంజలో నిలిచింది. ఆగస్టు నెలలో 22.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో, అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్‌గా జియో నిలిచినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో డౌన్లోడ్ పరంగా దూసుకెళ్లగా.. ఐడియా సెల్యులార్ కంపెనీ హయ్యస్ట్ అప్లోడ్ స్పీడు నెట్‌వర్క్‌గా నిలిచినట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది. జియో సగటు 4జీ డౌన్లోడ్ స్పీడులో, తన ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ముందంజలో ఉంది. సెకనుకు 10 మెగాబిట్స్ డౌన్లోడ్ స్పీడ్‌ను జియో నమోదు చేసినట్టు ట్రాయ్ తన మైస్పీడ్ పోర్టల్‌లో ప్రచురించింది. అదేవిధంగా ఐడియా 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ ఫ్లాట్‌గా 6.2 ఎంబీపీఎస్‌గానే ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ జూలై నెలలో 6.4 ఎంబీపీఎస్‌గా ఉండగా.. ఆగస్టు నెలలో 6.7 ఎంబీపీఎస్‌కు పెరిగింది. ఐడియా 4జీ అప్లోడ్ స్పీడ్‌లో 5.9 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. వీడియోలను చూడటానికి, నెట్ బ్రౌజ్ చేయడానికి, ఈమెయిల్స్‌ను యాక్సస్ చేసుకోవడంలో డౌన్లోడ్ స్పీడ్ కీలక పాత్ర పోషిస్తోంది. -
మెగా టెల్కో ఆవిర్భావం..
న్యూఢిల్లీ: దేశీయంగా నంబర్‌వన్ టెల్కో ఆవిర్భావం దిశగా.. టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. సుమారు 23.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్ ఐడియా నంబర్‌వన్ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా సెల్యులార్ ప్రమోటర్) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐడియా సెల్యులార్ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్ ఐడియాకు బాలేశ్ శర్మ సీఈవోగా ఉంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని నియమించే అధికారాలు వొడాఫోన్‌కు ఉంటాయి. తాజా డీల్‌తో మూడు ప్రైవేట్ టెల్కోలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్ఎన్ఎల్) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది. రూ. 14,000 కోట్లు ఆదా.. వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్లకు ఈ విలీన డీల్ తోడ్పడనుంది. ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగలవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. డీల్ ప్రకారం వొడాఫోన్ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి. విలీన సంస్థ వొడాఫోన్ ఐడియాకు దేశవ్యాప్తంగా 32.2 శాతం మార్కెట్ వాటా, 9 సర్కిళ్లలో నంబర్ వన్ స్థానం లభిస్తుంది. ఐడియా రూ. 6,750 కోట్లు, వొడాఫోన్ రూ. 8,600 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. అటు రెండు కంపెనీల స్టాండెలోన్ టవర్ల వ్యాపార విక్రయంతో మరో రూ. 7,850 కోట్లు లభించనున్నాయి. ఇందులో టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్లు పోగా నికరంగా రూ. 19,300 కోట్ల మేర నగదు నిల్వలతో కంపెనీ పటిష్ట స్థానంలో ఉంటుంది. సంయుక్త ప్రకటన ప్రకారం కావాలనుకుంటే ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కూడా విక్రయించవచ్చు. విలీన సంస్థకు రూ. 1,09,200 కోట్ల నికర రుణం ఉంటుంది. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఈ డీల్ భారీ ఊరటనివ్వనుంది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి వొడాఫోన్ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో హచిసన్ ఎస్సార్ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, దీనికి సంబంధించి 2.5 బిలియన్ డాలర్ల పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ అయిదేళ్ల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ జరుగుతోంది. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ ఏకంగా 6.6 బిలియన్ డాలర్ల మేర నష్టాలు రైటాఫ్ చేయాల్సి వచ్చింది. టెలికంలో కన్సాలిడేషన్.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఏకంగా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీగా ఆరంగేట్రం చేసినప్పట్నుంచీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. నార్వే సంస్థ టెలినార్‌కి చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారతి ఎయిర్టెల్ ఈ స్థిరీకరణకు తెరతీసింది. ఆ తర్వాత టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర మొబైల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. ‘భారత్‌లో అగ్ర స్థాయి టెలికం సంస్థ నేడు ఆవిర్భవించింది. ఇది నిజంగానే చారిత్రక ఘట్టం. ఇది కేవలం ఒక వ్యాపార దిగ్గజ ఆవిర్భావం మాత్రమే కాదు. నవభారత నిర్మాణానికి, యువత ఆకాంక్షల సాధనకు తోడ్పడాలన్నది మా లక్ష్యం’ – కుమార మంగళం బిర్లా మైలురాయి డీల్: టెలికం శాఖ ఐడియా, వొడాఫోన్ ఇండియాల విలీనం దేశీయంగా అతి పెద్ద కార్పొరేట్ మైలురాయిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ‘ఆరోగ్యకరమైన పోటీతత్వ’ ధోరణులకు ఇది దోహదపడగలదని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వ్యాఖ్యానించారు. ‘టెలికం మార్కెట్ స్థిరత్వ దిశగా సాగుతోంది. ఆ క్రమంలో ఈ అతి పెద్ద కార్పొరేట్ విలీన ఒప్పందం ఒక మైలురాయిలాంటిది’ అని అరుణ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలు లేవన్నారు. -
విలీనం దిశగా మరో అడుగు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్... తమ మొబైల్ వ్యాపార విభాగాల విలీన ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా టెలికం శాఖ (డాట్) నిర్దేశించినట్లుగా రూ.7,248 కోట్లు చెల్లించాయి. నిర్దిష్ట షరతులపై తమ నిరసనను తెలియజేస్తూ.. టెలికం శాఖకు చెల్లింపులు జరిపినట్లు ఐడియా వర్గాలు చెప్పాయి. విలీనానికి డాట్ డిమాండ్ ప్రకారం రూ.3,926.34 కోట్లు నగదు రూపంలో, మరో రూ.3,322.44 కోట్లు బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఇచ్చినట్లు తెలిపాయి. ఇరు సంస్థల విలీనానికి జూలై 9న డాట్ షరతులతో అనుమతులిచ్చింది. 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) విలువ, 35% మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో విలీన సంస్థ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఇది ఆవిర్భవించనుంది. విలీన సంస్థ రుణభారం రూ.1.15 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఈ కంపెనీలో వొడాఫోన్‌కి 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా షేర్హోల్డర్లకు 28.9% వాటాలుంటాయి. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్ ఆమోదం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్‌ల విలీనానికి టెలికం శాఖ (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వొడాఫోన్ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
భారీగా కుప్పకూలిన ఐడియా
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ మరోసారి భారీగా కుప్పకూలింది. కంపెనీ కన్సాలిడేట్ నికర నష్టాలు మూడింతలు మేర ఎగిశాయి. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.962.20 కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర నష్టాలు రూ.327.70 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ ఏడాది ఐడియాకు నష్టాలు మరింతగా పెరిగాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ఏడాదికి 22 శాతం తగ్గి రూ.6387.70 కోట్లగా రికార్డైంది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా 114 రూపాయల నుంచి 105 రూపాయలకు తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువ. జియో ఆర్పూ 137 రూపాయలుండగా.. భారతీ ఎయిర్టెల్ ఆర్పూ 116 రూపాయలుగా ఉంది. ఐడియా సెల్యులార్ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటీసీ సెటిల్మెంట్ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీకర వాతావరణ నేపథ్యంలో ఐడియా, వొడాఫోన్లు జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఒకటి కాబోతున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐడియా కంపెనీ స్టాక్ 0.66 శాతం పెరిగి రూ.68.80 వద్ద ముగిసింది. -
ఎయిర్‌టెల్‌కు పోటీ : ఐడియా కొత్త ప్లాన్
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రూ.249 ప్యాక్‌కు పోటీగా ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎయిర్టెల్ మాదిరి ప్రయోజనాలతో ఎయిర్టెల్ టారిఫ్ మాదిరిగానే 249 రూపాయలతో ఐడియా ఈ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్‌ను(రోమింగ్ కలిపి), ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ తాజాగా లాంచ్ చేసిన ఈ రూ.249 ప్యాక్‌లోనే ఐడియా మాదిరి ప్రయోజనాలనే లభిస్తున్నాయి. రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్‌పై రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులను విధించగా.. ఎయిర్టెల్, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వొడాఫోన్ కూడా వీటికి పోటీగా తన ప్యాక్‌ను తీసుకు రావాల్సి ఉంది. ఐడియా తన ప్రీపెయిడ్ యూజర్లు ఇటీవలే రోజుకు 5జీబీ డేటా అందించేలా రూ.998 ప్యాక్‌ను ప్రకటించింది. -
జియో దుమ్మురేపుతోంది...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ... మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో, అంతకంటే శరవేగంగా మార్కెట్ షేరును తన సొంతం చేసుకుంటోంది. కేవలం 16 నెలల్లోనే దేశీయ మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2017-18 డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియో మార్కెట్ షేరు 19.7 శాతానికి విస్తరించినట్టు వెల్లడైంది. ఇది ఐడియా సెల్యులార్ లిమిటెడ్ కంటే అత్యధికం. రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికే ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు జతకట్టబోతుండగా... వారికి మరింత షాకిస్తూ ఐడియా సెల్యులార్ కంటే అత్యధికంగా మార్కెట్ షేరు రిలయన్స్ జియో తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాలంటే కేవలం 90 బేసిస్ పాయింట్లే అవసరమని బ్లూమ్‌బర్గ్ క్వింట్ రిపోర్టు చేసింది. గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో రిలయన్స్ జియో రెవెన్యూ మార్కెట్ షేరు 584 బేసిస్ పాయింట్లు పెరిగిందని తెలిసింది. సబ్‌స్క్రైబర్ బేస్ కూడా 16 కోట్లను తాకింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో జియో 23 బిలియన్ డాలర్లను మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టనుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరింత వేగంగా మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది. -
రూ . 500కే 4జీ స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబయి : మొబైల్ ఫోన్ యూజర్లకు అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్, డేటా ప్లాన్స్‌తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం టాప్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు హ్యాండ్సెట్ కంపెనీలతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న వాయిస్, డేటా ప్లాన్స్‌తో లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గుముఖం పడుతున్నందున హ్యాండ్సెట్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్ ప్లాన్లను అందిస్తామని టెలికాం కంపెనీల ప్రతినిధి పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్ల తరహాలో స్మార్ట్ఫోన్ల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పారు. రిలయన్స జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని యూజర్లను నిలుపుకునేందుకే భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
ఎయిర్‌సెల్ యూజర్లకు ఐడియా షాక్
న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ యూజర్లకు ఐడియా సెల్యులార్ షాకిచ్చింది. బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్‌తో ఉన్న ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని ఐడియా పేర్కొంది. ఎయిర్‌సెల్ ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు తాము ఈ సర్వీసులను అందజేయమని వెల్లడించింది. అయితే ఎంతమొత్తంలో ఎయిర్‌సెల్ బాకీ పడి ఉందో ఐడియా తెలుపలేదు. '' బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్ లిమిటెడ్‌తో మా ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నాం'' అని ఐడియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 నవంబర్ నుంచి పలుమార్లు ఈ బకాయిలు చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను కోరామని, కానీ ఆ ఆపరేటర్ బకాయిలు చెల్లించడంలో విఫలమైనట్టు పేర్కొంది. ఇంటర్‌కనెక్ట్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌సెల్ ఈ పేమెంట్లను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్‌సెల్ వెంటనే స్పందించలేదు. -
టవర్ల విక్రయానికి ఓకే!
న్యూఢిల్లీ: త్వరలోనే విలీనం కానున్న టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్ ఇండియాకి రూ.3,850 కోట్లు (592 మిలియన్ డాలర్లు), ఐడియాకి రూ.4,000 కోట్లు (615 మిలియన్ డాలర్లు) లభిస్తాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. రెండు కంపెనీలకు కలిపి మొత్తం 20,000 టవర్లున్నాయి. డీల్‌పై ఐడియాకు డీఎస్పీ మెరిల్ లించ్, వొడాఫోన్‌కి మోర్గాన్ స్టాన్లీ సంస్థలు అడ్వైజర్లుగా ఉన్నాయి. ఈ డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పూర్తి కాగలదని అంచనా. రెండో అతిపెద్ద టవర్స్ అపరేటర్‌గా ఏటీసీ.. తాజా కొనుగోలుతో ఏటీసీ భారత్‌లో ఇండస్ టవర్స్ తర్వాత రెండో అతిపెద్ద టవర్ ఆపరేటింగ్ సంస్థగా నిలుస్తుంది. డీల్ అనంతరం ఏటీసీ వద్ద దాదాపు 70,000 టవర్లుంటాయి. వొడాఫోన్, ఐడియా (11.15 శాతం వాటా), టాటా టెలీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్‌కి ప్రస్తుతం 1.25 లక్షల టవర్లున్నాయి. రెండు సంస్థల విలీనంపై ఈ టవర్ డీల్ ప్రభావమేమీ ఉండదని కంపెనీలు పేర్కొన్నాయి. ‘ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో ఉండనుంది. మా 9,900 టవర్లకు గాను సుమారు రూ. 4,000 కోట్లు లభిస్తుంది. వొడాఫోన్తో విలీనమయ్యే దాకా ఈ మొత్తాన్ని వేరే ప్రత్యేక ఖాతాలో ఉంచుతాం‘ అని ఐడియా ఎండీ హిమాంశు కపానియా తెలిపారు. ‘20,000 టవర్లలో వొడాఫోన్, ఐడియాకి చెందిన 6,300 టవర్లు దాదాపు ఒకే దగ్గర ఉన్నాయి. దీంతో వీటిని విక్రయిస్తే ప్రతి నెలా ప్రతి టవర్‌పై రూ.50,000 నుంచి రూ. 55,000 దాకా మిగులుతుంది. ఆ ప్రకారం చూస్తే భారీగా ఆదా అయినట్లే లెక్క‘ అని ఆయన వివరించారు. దాదాపు రూ. 54,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులు వెచ్చిస్తారా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. విలీన ఒప్పంద ప్రక్రియలో ఈ డీల్ కూడా భాగమేనని.. ప్రధాన వ్యాపారేతర అసెట్స్/టవర్స్ విభాగాలను మెర్జర్ ముందుగా లేదా విలీన సమయంలోనైనా విక్రయించాలని ఇరు సంస్థలు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. కన్సాలిడేషన్ తప్పని పరిస్థితి.. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో... సంచలన ఆఫర్లతో టెల్కో దిగ్గజాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో టెలికంలో కన్సాలిడేషన్ తెరతీస్తూ.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సంస్థలు కొన్నాళ్ల క్రితమే విలీన నిర్ణయం తీసుకున్నాయి. ఇది పూర్తయితే సుమారు 35% మార్కెట్ వాటాతో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే దిగ్గజ టెల్కో ఏర్పాటవుతుంది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్టెల్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. -
ఐడియా నష్టాలు రూ.1,107 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,107 కోట్ల నికర నష్టాలొచ్చాయి. ధరల విషయమై పోటీ తీవ్రంగా ఉండటం, జీఎస్టీ అమలు గట్టి ప్రభావమే చూపించాయని ఐడియా తెలిపింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.92 కోట్ల నికర లాభం రాగా... ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మాత్రం రూ.815 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. గత క్యూ2లో రూ.9,300 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం క్షీణించి రూ.7,466 కోట్లకు పడిపోయింది. 4జీ నెట్వర్క్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో వడ్డీ వ్యయాలు రూ. 1,183 కోట్లకు, తరుగుదల వ్యయాలు రూ.2,114 కోట్లకు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి నికర రుణ భారం రూ.54,100 కోట్లుగా ఉంది. 7 శాతం తగ్గిన ఏఆర్పీయూ: పోటీ కారణంగా టారిఫ్‌ల విషయంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నదని ఐడియా తెలిపింది. గతంలో 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉందని, ఇప్పుడు 18 శాతం జీఎస్టీ అదనపు భారమని వివరించింది. ‘‘ఈ జూన్ క్వార్టర్లో రూ.141గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్పీయూ) ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 7 శాతం తగ్గి రూ.132కు పరిమితమయింది. వచ్చే ఏడాది మొదట్లోనే అత్యంత వేగవంతమైన వాయిస్ ఓవర్ లాంగ్–టర్మ్ ఇవొల్యూషన్‌ను (ఓల్ట్) అందుబాటులోకి తేనున్నామని ఐడియా వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడంతో బీఎస్ఈలో ఐడియా షేర్ 3 శాతం క్షీణించి రూ.94 వద్ద ముగిసింది. -
రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
సాక్షి, ముంబై : ట్రాయ్ మంగళవారం ఇచ్చిన షాక్‌తో టెల్కోలు భారీగా దెబ్బతిన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు బుధవారం మార్కెట్లో 7 శాతం పైగా నష్టపోయాయి. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటన టెల్కోలకు తీవ్ర షాకింగ్‌కు గురిచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ట్రాయ్ పేర్కొంది. 2020 జనవరి నుంచైతే ఏకంగా ఈ ఛార్జీలను జీరోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపింది. టర్మినేషన్ చార్జీ అన్నది ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్‌కు తన నెట్వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. దీంతో ప్రధాన టెల్కోలన్నీ తమ రెవెన్యూలను భారీగా కోల్పోనున్నాయి. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా ఉందని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని టెల్కోలు కోరుతున్నాయి. ట్రాయ్ నిర్ణయంతో ఐడియా 7 శాతం నష్టపోయి రూ.76.85 వద్ద, ఎయిర్టెల్ 6 శాతం పడిపోయి రూ.370 వద్ద ట్రేడైంది. ట్రాయ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండుగ చేసుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్ షేర్లు, ట్రాయ్ నిర్ణయంతో జియోకు వార్షికంగా రూ.3,800 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో ఎయిర్టెల్ రూ.1500-2000 కోట్లు, వొడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.1200 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. జియో రాకతో ఇప్పటికే పతనమైన టెలికాం ఇండస్ట్రి, మరింత కుదేలు కానున్నట్టు ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. -
జియోకు చెక్: రూ.32వేల కోట్లతో ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా.. అవి వర్క్‌వుట్ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్టెల్ పెద్ద ఎత్తునే ప్లాన్ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్‌ఫ్లోస్ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్‌వర్క్‌ల అప్‌గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. -
ఐడియా సెల్యులర్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారం అధిక ట్రేడింగ్ పరిమాణంతో పెరిగిన షేర్లలో ఐడియా సెల్యులర్ ఒకటి. ఈ షేరు 4.9 శాతం ఎగిసి రూ. 82.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 3.16 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో ఇంతటి భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడం గత 7 వారాల్లో ఇదే ప్రధమం. ఈ సందర్భంగా ఐడియా ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 23.73 లక్షల షేర్లు (3.69 శాతం) కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.19 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 40 పైసల మేర స్థిరంగా వుంది. ఫ్యూచర్లో జరిగిన షార్ట్ కవరింగ్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 80 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. కాల్ ఆప్షన్ నుంచి 12.8 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 13.65 లక్షలకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.30 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 19.95 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 85 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా 5.74 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 34.72 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు క్షీణిస్తే రూ. 80 సమీపంలో మద్దతు పొందవచ్చని, క్రమేపీ రూ. 85 స్థాయిని చేరవచ్చని ఆప్షన్ రైటర్ల యాక్టివిటీ వెల్లడిస్తున్నది. -
ఛార్జీల బాదుడు.. ఐడియాకు ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద టెలికాంగా పేరున్న ఐడియా సెల్యులార్కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ రూ.2.97 కోట్ల జరిమానా విధించింది. మహారాష్ట్ర, తమిళనాలడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వినియోగదారులపై ఎక్కువ ఛార్జీలు విధించిందనే కారణంతో ట్రాయ్, ఐడియా సెల్యులార్కు ఈ జరిమానా వేసింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో బీఎన్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్స్ కాల్స్‌ను టర్మినేట్ చేసేటప్పుడు ఐడియా ఈవిధంగా భారీమొత్తంలో ఛార్జీలు విధించింది. ప్రస్తుతం వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతున్న ఐడియా, 15 రోజుల్లో టెలికాం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ వద్ద ఈ మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. ట్రాయ్ యాక్ట్ 1997 లోని అధికారాలతో ఈ అథారిటీ ఐడియాకు రూ.2,97,90,173 మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో సబ్స్క్రైబర్లపై ఎక్కువ ఛార్జీలు వేసిన కారణంతో ఈ ఆదేశాలు జారీచేసినట్టు ట్రాయ్ పేర్కొంది. ఒకే రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి ఐడియా పలు టారిఫ్‌లను విధిస్తుంది. 2005 మేలో టెలికాం డిపార్ట్మెంట్ సవరించిన లైసెన్స్ షరతులకు ఈ టారిఫ్‌లు వివక్షతతో, అస్థిరంగా ఉన్నాయి. -
బుల్ రన్‌కు రెస్ట్.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై : గత నాలుగు సెషన్లుగా దూసుకెళ్తూ.. రికార్డు గరిష్టాలను తాకుతున్న బుల్ రన్‌కు స్టాక్ మార్కెట్లు రెస్ట్ ఇచ్చాయి. బ్యాంకు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ఫలితాల్లో నిరాశపరచడంతో, ఆ కంపెనీల షేర్లు నష్టాలు పాలయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంలో 32,309.88 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంలో 10,014.50 వద్ద క్లోజయ్యాయి. నష్టాలు పాలైనప్పటికీ, నిఫ్టీ తన కీలకమైన మార్కు 10వేల నుంచి కిందకి దిగలేదు. మొట్టమొదటిసారి ఈ మార్కును మంగళవారం సెషన్లో తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తనకు ఎంతో కీలకమైన మార్కును ఛేదించడంతో, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం సాధారణమని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కొంత ధర కరెక్షన్కు గురైందని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ నేటి మార్కెట్లో అత్యధికంగా 6.5 శాతం నష్టపోయింది. మే 30 తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి. ఈ కంపెనీ ఫలితాల్లో నిరాశపరచడంతో, షేర్లు నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ కూడా లాభాల్లో 8 శాతం డౌన్ కావడంతో, ఈ బ్యాంకు షేర్లు కూడా 3 శాతం పడిపోయాయి. వరుసగా మూడు క్వార్టర్లోనూ ఐడియా సెల్యులార్ తీవ్ర నష్టాలను నమోదుచేసింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ 5.6 శాతం డౌన్ అయింది. కానీ సిగరెట్ల నుంచి బిస్కెట్ల వరకు తయారీచేస్తున్న ఐటీసీ లిమిటెడ్ మంచి ఫలితాలను ప్రకటించడంతో, షేర్లు 2 శాతం పెరిగాయి. నేటి సెషన్లో రెండు సూచీల్లోనూ హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు మంచి లాభాలను ఆర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 64.16గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 53 రూపాయల నష్టంతో 28,423వద్ద ఉన్నాయి. -
ఐడియాకు జియో దెబ్బ
► వరుసగా మూడో క్వార్టర్లోనూ నష్టాలే ► క్యూ1లో రూ. 816 కోట్ల నష్టం న్యూఢిల్లీ: రిలయన్స్ జియో చౌక ఆఫర్ల దెబ్బ నుంచి ఐడియా సెల్యులార్ కోలుకోలేకపోతోంది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలే చవిచూసింది. మార్చి త్రైమాసికంలో రూ.326 కోట్లు నష్టపోయిన ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా రూ.816 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. గతేడాది క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 217 కోట్లు. ఇక తాజాగా ఐడియా ఆదాయం సైతం 14% క్షీణించి రూ. 9,552 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ జియో తమ ఉచిత 4జీ సర్వీసులను మార్చిలోనే నిలిపివేసినప్పటికీ.. ఐడియా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం కొనసాగింది.‘కొత్త సంస్థ ఉచిత సేవల నుంచి పెయిడ్ సర్వీసులకు మళ్లినా.. అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్, డేటా ప్లాన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో దేశీ వైర్లెస్ పరిశ్రమపై ఆ ప్రతికూల ప్రభావాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ కొనసాగాయి’ అని ఐడియా పేర్కొంది. డేటా వినియోగం పెరిగింది .. దీటుగా పోటీనిచ్చే క్రమంలో తామూ అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో పరిశ్రమ ఆదాయాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐడియా తెలిపింది. అయితే, రేట్లు తగ్గించినప్పటికీ.. వినియోగ పరిమాణం పెరగడం వల్ల మొబైల్ వాయిస్, డేటా సెగ్మెంట్లలో నష్టం కొంత భర్తీ అయినట్లు ఐడియా తెలిపింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన మొబైల్ డేటా పరిమాణం ఏకంగా 99.1% ఎగిసిందని, 252.8 బిలియన్ మెగా బైట్స్ మేర డేటా వినియోగం అయ్యిందని వివరించింది. ఇక, జూన్ చివిరికి కంపెనీ రుణభారం రూ. 53,920 కోట్లు. ఇందులో సింహభాగం స్పెక్ట్రం చెల్లింపుల కోసం తీసుకున్న రుణాలే ఉన్నాయి. గురువారం బీఎస్ఈలో ఐడియా షేరు 2 శాతం క్షీణించి రూ. 92.65 వద్ద ముగిసింది. -
జియో దెబ్బ: ఐడియాకి భారీగా తగిలింది
ముంబై : టెలికాం మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దెబ్బ నుంచి టెలికాం దిగ్గజాలు కోలుకోలేకపోతున్నాయి. దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఇటీవలే భారీగా తన లాభాలను కోల్పోగా.. మరో టెలికాం అగ్రగామి ఐడియా సెల్యులార్ కూడా జియో తాకిడిని తట్టుకోలేక కుదేలైంది. గురువారం ప్రకటించిన 2017-18 తొలి క్వార్టర్ ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నికర నష్టాలు రూ.815 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ కంపెనీ లాభాలు రూ.220 కోట్లగా ఉన్నాయి. గత మార్చి క్వార్టర్లో కూడా కంపెనీ రూ.325.60 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్లో ఐడియా నష్టాలు మరింత ఎగిశాయి. కంపెనీ ఆదాయం కూడా 14 శాతం మేర పడిపోయి రూ.8,182 కోట్లగా ఉన్నట్టు ఐడియా తెలిపింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐడియా రూ.671 కోట్ల నష్టాలను మాత్రమే ఎదుర్కొంటుందని భావించారు. కానీ వారి అంచనాలకు మించిపోయి మరింత నష్టాల్లోకి ఐడియా కూరుకుపోయింది. జియో ఆఫర్ చేస్తున్న అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్స్ వల్ల తాము కుదేలవుతున్నట్టు ఐడియా చెప్పింది. జియోకు తగ్గ ప్లాన్స్‌ను అమలుచేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటుందని తెలిపింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతో, దేశీయ టెలికాం మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. జియో ధరల యుద్ధంతో కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. కాగ, మొత్తం రెవెన్యూలు ఐడియా కంపెనీవి క్వార్టర్ క్వార్టర్‌కు 0.5 శాతం పెరిగాయి. కానీ ఏడాది ఏడాదికి 13.9 శాతం తగ్గాయి. జియోను దెబ్బతీయడానికి ఐడియా, వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. -
ఫ్రెషర్ల కంటే తక్కువగా బిర్లా వేతనం
టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో దెబ్బ అంతా ఇంతా కాదు. టెలికాం దిగ్గజాల రెవెన్యూలు భారీగా తుడిచిపెట్టుకుపోవడమే కాక, ఆ కంపెనీ చైర్మన్ ల వేతనాలకు భారీగా గండికొడుతోంది. ఐడియా సెల్యులార్ కు చైర్మన్ గా ఉన్న కుమార్ మంగళం బిర్లా 2017 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల కంటే తక్కువగా వేతనాన్ని ఆర్జించారని తెలిసింది. 2017 ఆర్థికసంవత్సరంలో ఆయన కేవలం రూ.3.30 లక్షల వేతనాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారని కంపెనీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. గతేడాది ఈయన వేతనం రూ.13.15 కోట్లు. 2017లో చైర్మన్ కు లేదా ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు కంపెనీ ఎలాంటి కమిషన్లను చెల్లించలేదు. దశాబ్దం క్రితం ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ఈ టెలికాం ఆపరేటర్ వార్షిక నికర నష్టాలను నమోదుచేసింది. రెవెన్యూలను పడిపోయినట్టు పేర్కొంది. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఐడియా రెవెన్యూలు 0.8 శాతం పడిపోవడంతో రూ.404 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జియో ఉచిత ఆఫర్ల తాకిడి తట్టుకోవడానికి ఈ కంపెనీలు సైతం భారీగా డేటా ధరలను తగ్గించాయి. ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఐడియా, వొడాఫోన్ లు కలిసి అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగం కోలుకుంటుందని బిర్లా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో సంజీవ్ ఆగా పారితోషికం కూడా రూ.16.7 లక్షల నుంచి రూ.5.90 లక్షలకు పడిపోయింది. అయితే మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వేతనం మాత్రం 13 శాతం పెరిగింది. ఆయనతో పాటు ఫైనాన్స్ చీఫ్ అక్షయ మూన్ద్రా వేతనం కూడా రూ.2.23 కోట్ల నుంచి రూ.2.33 కోట్లకు ఎగిసింది. దీనిలో స్టాక్ ఆప్షన్లను కలుపలేదు. కంపెనీలో సగటున ఉద్యోగుల వేతనం 8 శాతం పెరిగింది. -
ఐడియా, ఫ్లిప్‌కార్ట్: 4జీ స్మార్ట్ఫోన్లలో భారీ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యైకంగా కొనుగోలు చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను గురువారం ప్రకటించింది. 4 జీ స్మార్ట్ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకునే ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 356 తో రీఛార్జి చేసుకున్న ఐడియా వినియోగదారులకు 30 జిబి 4 జి డేటాను ఉచితంగా అందిస్తోంది. రోజువారీ డేటా పరిమితి లేకుండా ఈ డేటా ఉచితం. అలాగే అపరిమిత స్థానిక మరియు జాతీయ వాయిస్ కాలింగ్ సదుపాయం. రూ .191 రీఛార్జిపై 10 జిబి డేటా ఉచితంగా అందించనున్నామని సంస్థ ఒక ప్రకనటలో తెలిపింది. . రూ .4 వేల నుంచి రూ .25 వేల మధ్య కొన్న లెనోవో, మైక్రోమ్యాక్స్, మోటరోలా,పానాసోనిక్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ ఆఫర్ ప్రత్యేకం. అలాగే కొత్త ఐడియా వినియోగదారులకు కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐడియా పేర్కొంది. ఈ అసోసియేషన్ ద్వారా మరింతమంది భారతీయులకు భారీ డేటా వినియోగం, మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంటుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ అన్నారు. ఈ భాగస్వామ్యం కీలకమనీ, తమ వినియోగదారులకు మెరుగైన డేటా ప్రణాళికలను అందించడానికి, తమ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల బేస్‌ను పెంచుకోవడానికి ఇది సాయపడుతుందని ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్, చెప్పారు. కాగా ఆదిత్య బిర్లా గ్రూపు ఐడియా సెల్యులార్ దేశవ్యాప్తంగా 200 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. -
జియోకు భారీగా షాకిస్తున్నారు!
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్చి వరకు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియో ఇక టారిఫ్ బాదుడు ప్రారంభించింది. అప్పటిదాక జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లందరూ ఆ నెట్ వర్క్ కు భారీగా షాకిస్తూ ఇతర నెట్ వర్క్ లవైపుకు మరలడం ప్రారంభించారట. అంతేకాక తగ్గుతున్న రేట్ల ఛార్జీలు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియోకు మరలిన డేటా కస్టమర్లందరూ ఇప్పటికే భారీగా తమ నెట్ వర్క్ వైపుకు వచ్చేస్తున్నారంటూ టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో 2017లో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కుతామని ఐడియా అంచనావేస్తోంది. ఛార్జీలు బాదుడు ప్రారంభించిన తర్వాత నుంచే డేటా కస్టమర్లందరూ జియో నెట్ వర్క్ కు గుడ్ బై చెబుతున్నారంటూ ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా చెప్పారు. ద్వితీయార్థంలో రేట్లు స్థిరీకరణ జరుగుతుందని ఆయన అంచనావేశారు. '' ఇండస్ట్రీకి, తమకు ఈ రెవెన్యూ వృద్ధిని మేము ముందే అంచనావేశాం. ఏడాది బేసిస్ తో స్వల్ప వృద్ధితో ఇండస్ట్రీ ఫ్లాట్ గా ఉంటుందని అనుకున్నాం. 2017 క్యూ 4 నష్టాల నుంచి ఇండస్ట్రీ వచ్చే ఏడాది క్యూ 4 వరకు 15 శాతం రికవరీ అవుతుంది'' అని పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 14-15 శాతం నష్టపోయినట్టు తెలిపారు. మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం, మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టాలు చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్ స్క్రైబర్లు జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు. వాయిస్ వాడక వృద్ధి రెండంకెలు నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో రెండంకెలు, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో మూడింతలు వృద్ధిని నమోదుచేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు. -
రిజల్ట్స్ ఎఫెక్ట్ : ఐడియా షేర్లు ఢమాల్
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ షేర్లు నేటి మార్కెట్లో భారీగా నష్టపోతున్నాయి. ఇప్పటికే ఈ షేర్లు 8 శాతం మేర పడిపోయాయి. శనివారం ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాలతో కంపెనీ షేర్లు ఈ నష్టాలను చవిచూస్తున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కంపెనీ వరుసగా రెండో క్వార్టర్ లోనూ నష్టాలనే నమోదుచేసింది. 2017 మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టాలు 325.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ప్రకటించింది. గత ఆర్థికసంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ రూ.449.2 కోట్ల లాభాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్ కు ముందు క్వార్టర్ 2016 డిసెంబర్ లోనూ కంపెనీకి రూ.383.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాలే ఉన్నాయి.. ఇలావరుసగా ఐడియా నష్టాలను నమోదుచేస్తుండటం షేర్లపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీ స్టాక్ 8.28 శాతం పడిపోయి, రూ.84.65 వద్ద ట్రేడవుతోంది. -
ట్రాయ్ ఎఫెక్ట్: ఎయిర్టెల్, ఐడియా షేర్లు రయ్
ముంబై: ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ అనూహ్యంగా చెక్ పెట్టడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసి వచ్చింది. జియో తాజా సమ్మర్ సర్ప్రైజ్ ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్ ఆ దేశించడంతో ప్రత్యర్థి సంస్థలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర మేజర్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. శుక్రవారం నాటిమార్కెట్లో మదుపర్లు టెలి కాం ఇండెక్స్ లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఒకవైపు దలాల్ స్ట్రీట్ నష్టాల పాలవుతుండగా టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం. భారతి ఎయిర్ టెల్ దాదాపు 3 శాతంపైగా జంప్‌చేసిటాప్ గెయినర్‌గా నిలిచింది. ఇదే బాటలో ఐడియా సెల్యులర్ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్‌స్తాయి లాభాలను పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతానిపైగా నష్టపోయింది. కాగా ఇటీవల టారిఫ్లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్ మెంబర్షిప్ పథకంలో ఉచిత ఆఫర్‌ను మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలపై బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్షణమే నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఇక టారిఫ్ లు అమలు చేయబోతుందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు, ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి రూ.303 రీఛార్జ్ తో మరో మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతానికి పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో, ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్ లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5 శాతం పైకి ఎగిసి రూ.1,380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా.. ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 3.60 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐడియా సెల్యులార్ షేరు ధర 0.82 శాతం, ఎయిర్ టెల్ షేరు ధర 2.87 శాతం, వొడాఫోన్ 0.33 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47శాతం నష్టాల్లో రన్ అవుతున్నాయి.