మెగా టెల్కో ఆవిర్భావం.. | NCLT gives go-ahead to Idea-Vodafone merger | Sakshi
Sakshi News home page

మెగా టెల్కో ఆవిర్భావం..

Published Sat, Sep 1 2018 2:22 AM | Last Updated on Sat, Sep 1 2018 10:38 AM

NCLT gives go-ahead to Idea-Vodafone merger - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా నంబర్‌వన్‌ టెల్కో ఆవిర్భావం దిశగా.. టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్‌ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది. సుమారు 23.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్‌ ఐడియా నంబర్‌వన్‌ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ రెండో స్థానానికి పరిమితమవుతుంది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ (ఐడియా సెల్యులార్‌ ప్రమోటర్‌) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐడియా సెల్యులార్‌ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్‌ ఐడియాకు బాలేశ్‌ శర్మ సీఈవోగా ఉంటారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ని నియమించే అధికారాలు వొడాఫోన్‌కు ఉంటాయి. తాజా డీల్‌తో మూడు ప్రైవేట్‌ టెల్కోలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్‌ఎన్‌ఎల్‌) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది.

రూ. 14,000 కోట్లు ఆదా..
వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రిలయన్స్‌ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్‌లకు ఈ విలీన డీల్‌ తోడ్పడనుంది. ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగలవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. డీల్‌ ప్రకారం వొడాఫోన్‌ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి.

విలీన సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు దేశవ్యాప్తంగా 32.2 శాతం మార్కెట్‌ వాటా, 9 సర్కిళ్లలో నంబర్‌ వన్‌ స్థానం లభిస్తుంది. ఐడియా రూ. 6,750 కోట్లు, వొడాఫోన్‌ రూ. 8,600 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. అటు రెండు కంపెనీల స్టాండెలోన్‌ టవర్ల వ్యాపార విక్రయంతో మరో రూ. 7,850 కోట్లు లభించనున్నాయి. ఇందులో టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్లు పోగా నికరంగా రూ. 19,300 కోట్ల మేర నగదు నిల్వలతో కంపెనీ పటిష్ట స్థానంలో ఉంటుంది. సంయుక్త ప్రకటన ప్రకారం కావాలనుకుంటే ఇండస్‌ టవర్స్‌లో 11.15 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కూడా విక్రయించవచ్చు. విలీన సంస్థకు రూ. 1,09,200 కోట్ల నికర రుణం ఉంటుంది.

బ్రిటన్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఈ డీల్‌ భారీ ఊరటనివ్వనుంది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి వొడాఫోన్‌ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో హచిసన్‌ ఎస్సార్‌ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌ 7.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, దీనికి సంబంధించి 2.5 బిలియన్‌ డాలర్ల పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ అయిదేళ్ల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్‌ జరుగుతోంది. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ ఏకంగా 6.6 బిలియన్‌ డాలర్ల మేర నష్టాలు రైటాఫ్‌ చేయాల్సి వచ్చింది.

టెలికంలో కన్సాలిడేషన్‌..
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఏకంగా 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో భారీగా ఆరంగేట్రం చేసినప్పట్నుంచీ టెలికం రంగంలో కన్సాలిడేషన్‌ జరుగుతోంది. నార్వే సంస్థ టెలినార్‌కి చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారతి ఎయిర్‌టెల్‌ ఈ స్థిరీకరణకు తెరతీసింది. ఆ తర్వాత టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ మహారాష్ట్ర  మొబైల్‌ వ్యాపారాలను కొనుగోలు చేసింది.

‘భారత్‌లో అగ్ర స్థాయి టెలికం సంస్థ నేడు ఆవిర్భవించింది. ఇది నిజంగానే చారిత్రక ఘట్టం. ఇది కేవలం ఒక వ్యాపార దిగ్గజ ఆవిర్భావం మాత్రమే కాదు. నవభారత నిర్మాణానికి, యువత ఆకాంక్షల సాధనకు తోడ్పడాలన్నది మా లక్ష్యం’ – కుమార మంగళం బిర్లా

మైలురాయి డీల్‌: టెలికం శాఖ
ఐడియా, వొడాఫోన్‌ ఇండియాల విలీనం దేశీయంగా అతి పెద్ద కార్పొరేట్‌ మైలురాయిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ‘ఆరోగ్యకరమైన పోటీతత్వ’ ధోరణులకు ఇది దోహదపడగలదని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ వ్యాఖ్యానించారు. ‘టెలికం మార్కెట్‌ స్థిరత్వ దిశగా సాగుతోంది. ఆ క్రమంలో ఈ అతి పెద్ద కార్పొరేట్‌ విలీన ఒప్పందం ఒక మైలురాయిలాంటిది’ అని అరుణ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలు లేవన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement