3జీ రోమింగ్ ఒప్పందాలకు ఓకే | TDSAT allows 3G roaming pact | Sakshi
Sakshi News home page

3జీ రోమింగ్ ఒప్పందాలకు ఓకే

Published Wed, Apr 30 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

3జీ రోమింగ్  ఒప్పందాలకు ఓకే

3జీ రోమింగ్ ఒప్పందాలకు ఓకే

న్యూఢిల్లీ: దేశంలో అగ్రగామి టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు ఊరట లభించింది. 3జీ రోమింగ్ ఒప్పందాలపై టెలికం శాఖ(డాట్) విధించిన నిషేధం చెల్లదని టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్ తేల్చిచెల్పింది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా 3జీ రోమింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ డాట్ వడ్డించిన రూ.1,200 కోట్ల జరిమానాను కూడా రద్దుచేస్తూ మంగళవారం టీడీశాట్ తీర్పిచ్చింది.

2010లో టెల్కోలు 3జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం, ఆతర్వాత తమకు స్పెక్ట్రం లెసైన్స్‌లేని సర్కిళ్లలో ఇతర టెల్కోలతో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించడం తెలిసిందే. కంపెనీలు స్పెక్ట్రంను కొనుగోలు చేయకుండా సేవలందించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆరోపిస్తూ డాట్ ఈ నిషేధం, జరిమానాలను విధించింది. దీంతో తమకు స్పెక్ట్రం లేని సర్కిళ్లలో 3జీ సేవలను ఈ మూడు టెల్కోలూ నిలిపేయాల్సి వచ్చింది. డాట్ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయా కంపెనీలు టీడీశాట్‌ను ఆశ్రయించాయి.

 ఒప్పందాలు సహేతుకమే....
 స్పెక్ట్రం కొరత నేపథ్యంలో మెరుగ్గా ఈ సహజవనరులను ఉపయోగించుకోవడం కోసం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రోమింగ్ ఒప్పందాలకు అనుమతించవచ్చని టీడీశాట్ పేర్కొంది. స్పెక్ట్రంను తగినవిధంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని, తద్వారా వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనని టీడీశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ‘ఐసీఆర్ 3జీ రోమింగ్ ఒప్పందాల్లో టెల్కోలు లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని మేం భావించడం లేదు.

పరస్పర ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించకుండా డాట్ నిలువరించడం కుదరదు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఇచ్చిన నిషేధ, జరిమానా ఆదేశాల కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌సెల్, టాటా టెలీ కంపెనీలకు డాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇదిలాఉండగా.. టీడీశాట్ తీర్పుపై సుప్రీంకోర్టును డాట్ ఆశ్రయించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 ఒప్పందాలు ఇలా...
 2010లో నిర్వహించిన 3జీ వేలంలో ఎయిర్‌టెల్... 13 సర్కిళ్లలో రూ.12,295 కోట్లకు స్పెక్ట్రం కొనుగోలు చేసింది. ఇక వొడాఫోన్ 11 సర్కిళ్లు(రూ.11,617 కోట్లు), ఐడియా 11 సర్కిళ్లలో(రూ.5,769 కోట్లు) 3జీ స్పెక్ట్రం దక్కించుకున్నాయి. అయితే, ఎయిర్‌టెల్.. వొడాఫోన్‌తో ఒప్పందం ద్వారా ఆ కంపెనీ సర్కిళ్లలోని మహారాష్ట్ర, కోల్‌కతా, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈస్ట్‌లలో సేవలను ప్రారంభించింది. వొడాఫోన్.. ఎయిర్‌టెల్‌కు చెందిన అసోం, బీహార్, కర్ణాటక, ఈశాన్య భారత్, రాజస్థాన్, యూపీ వెస్ట్‌లతో సహా ఐడియా చేతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ఒప్పందం కుదుర్చుకొని 3జీ సేవలకు తెరతీసింది.

 ఐడియా కూడా వొడాఫోన్‌కున్న ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కోల్‌కతా సర్కిళ్లను ఉపయోగించుకోవడానికి ఒప్పందం చేసుకుంది. అయితే, వీటిపై డాట్ ఆదేశాలతో రోమింగ్ ఒప్పందాలద్వారా ఇస్తున్న సేవలను నిలిపేయాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టెల్కోలకు ఊరట లభించలేదు. దీంతో సుప్రీంను ఆశ్రయించిన టెల్కోలు... కేసును టీడీశాట్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు   సుప్రీం కోర్టు గతేడాది సెప్టెంబర్‌లో అంగీకారించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై మాత్రం నిషేధం విధించింది. అంతిమంగా ఇప్పుడు టీడీశాట్‌లో ఈ మూడు టెల్కోలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement