ఛార్జీల బాదుడు.. ఐడియాకు ఫైన్
ఛార్జీల బాదుడు.. ఐడియాకు ఫైన్
Published Sat, Aug 26 2017 12:40 PM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద టెలికాంగా పేరున్న ఐడియా సెల్యులార్‌కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ రూ.2.97 కోట్ల జరిమానా విధించింది. మహారాష్ట్ర, తమిళనాలడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వినియోగదారులపై ఎక్కువ ఛార్జీలు విధించిందనే కారణంతో ట్రాయ్, ఐడియా సెల్యులార్‌కు ఈ జరిమానా వేసింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో బీఎన్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్స్ కాల్స్‌ను టర్మినేట్ చేసేటప్పుడు ఐడియా ఈవిధంగా భారీమొత్తంలో ఛార్జీలు విధించింది. ప్రస్తుతం వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతున్న ఐడియా, 15 రోజుల్లో టెలికాం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ వద్ద ఈ మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది.
ట్రాయ్ యాక్ట్ 1997 లోని అధికారాలతో ఈ అథారిటీ ఐడియాకు రూ.2,97,90,173 మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో సబ్‌స్క్రైబర్లపై ఎక్కువ ఛార్జీలు వేసిన కారణంతో ఈ ఆదేశాలు జారీచేసినట్టు ట్రాయ్ పేర్కొంది. ఒకే రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి ఐడియా పలు టారిఫ్‌లను విధిస్తుంది. 2005 మేలో టెలికాం డిపార్ట్‌మెంట్ సవరించిన లైసెన్స్ షరతులకు ఈ టారిఫ్‌లు వివక్షతతో, అస్థిరంగా ఉన్నాయి.
Advertisement