రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
Published Wed, Sep 20 2017 1:09 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
సాక్షి, ముంబై : ట్రాయ్ మంగళవారం ఇచ్చిన షాక్‌తో టెల్కోలు భారీగా దెబ్బతిన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు బుధవారం మార్కెట్‌లో 7 శాతం పైగా నష్టపోయాయి. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటన టెల్కోలకు తీవ్ర షాకింగ్‌కు గురిచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ట్రాయ్ పేర్కొంది. 2020 జనవరి నుంచైతే ఏకంగా ఈ ఛార్జీలను జీరోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపింది. టర్మినేషన్ చార్జీ అన్నది ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్‌కు తన నెట్‌వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. దీంతో ప్రధాన టెల్కోలన్నీ తమ రెవెన్యూలను భారీగా కోల్పోనున్నాయి. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా ఉందని ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని టెల్కోలు కోరుతున్నాయి.
ట్రాయ్ నిర్ణయంతో ఐడియా 7 శాతం నష్టపోయి రూ.76.85 వద్ద, ఎయిర్‌టెల్ 6 శాతం పడిపోయి రూ.370 వద్ద ట్రేడైంది. ట్రాయ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండుగ చేసుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్ షేర్లు, ట్రాయ్ నిర్ణయంతో జియోకు వార్షికంగా రూ.3,800 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ రూ.1500-2000 కోట్లు, వొడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.1200 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. జియో రాకతో ఇప్పటికే పతనమైన టెలికాం ఇండస్ట్రి, మరింత కుదేలు కానున్నట్టు ఎయిర్‌టెల్ ఆరోపిస్తోంది.
Advertisement
Advertisement