
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.
సుప్రీంకోర్టు చర్యలు
ఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్‌డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.
ఏజీఆర్ లెక్కింపు ఇలా..
టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటు
వివాదం ఏమిటంటే..
ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment