Telecom
-
బీఎస్ఎన్ఎల్ లాభాల రింగ్‌టోన్
కాళ్లూ, చేతులు కట్టేసి పరుగుపందెంలో ఉసేన్ బోల్ట్‌తో పోటీపడమంటే అయ్యేపనేనా.. కానీ బీఎస్ఎన్ఎల్ పరిస్థితి అలాగే ఉండేది. బ్యూరోక్రసీ బంధనాలతోపాటు స్వయంకృతాపరాధాలు కూడా తోడు కావడంతో కంపెనీ నడక కుంటుపడింది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు 3జీ, 4జీ, కొత్త ఆవిష్కరణలు, సరళతరమైన టారిఫ్‌లతో దూసుకెళ్తుంటే బీఎస్ఎన్ఎల్ వెనుకబడిపోయింది. లాభాల మాట దేవుడెరుగు.. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయి మనుగడ కోసం నానాఅవస్థలు పడింది. అలాంటిది.. దశాబ్దంన్నర తర్వాత మళ్లీ బీఎస్ఎన్ఎల్ లాభాల రింగ్ టోన్ మోగింది. కంపెనీ మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సాక్షి, బిజినెస్ డెస్క్: ప్రభుత్వ టెలికం విభాగం సర్వీసులను కార్పొరేటీకరించడంతో 2000లో ఏర్పాటైన బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో మారుమూల ప్రాంతాలకూ టెలికం సర్వీసులను విస్తరించింది. 2000–2010 మధ్య నాటికి అత్యధిక యూజర్లతో మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత నుంచి యూనినార్, ఎయిర్టెల్, రిలయన్స్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు ఉత్తమ కస్టమర్ సర్వీసులను అందిస్తూ, దూకుడుగా వ్యూహాలను అమలు చేస్తుండటంతో పరిశ్రమపై కంపెనీ పట్టు సడలింది. కాలం చెల్లిన టెక్నాలజీ, ప్రైవేట్ కంపెనీలతో దీటుగా పోటీపడేందుకు అవసరమైన సాంకేతికత, పరికరాలను సమకూర్చుకోలేకపోవడం, సకాలంలో స్పందించలేని నిస్సహాయ స్థితి.. ఇలాంటి ఎన్నో కారణాలతో కంపెనీ కుదేలైంది. 2006–07లో 31 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2009 నాటికి 16 శాతానికి పడిపోయింది. 2016లో రిలయన్స్ జియో.. ఉచిత వాయిస్ కాల్స్, అత్యంత చౌకగా డేటా సేవలతో ఎంట్రీ ఇవ్వడమనేది మార్కెట్ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. ఇతర ప్రైవేట్ టెల్కోలతోపాటు బీఎస్ఎన్ఎల్ను కూడా గట్టిగా దెబ్బతీసింది. పెరిగిపోతున్న నష్టా లు, సరైన సమయంలో 4జీ సేవలను తేలేకపోవ డం, ఉద్యోగుల జీతాల భారం పెరిగిపోవడంలాంటి సవాళ్లతో కంపెనీ సతమతమైపోయింది. 2019 నాటికి దాదాపు కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు.. సవాళ్లెన్ని ఉన్నప్పటికీ గ్రామీణ, వ్యూహాత్మక ప్రాంతాల్లో టెలికం సేవలను విస్తరించడంలో కీలకంగా ఉన్న బీఎస్ఎన్ఎల్కి జవసత్వాలివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 2019 నుంచి 2022 వరకు మూడు విడతలుగా దాదాపు రూ.3.22 లక్షల కోట్ల విలువ చేసే ప్యాకేజీలిచ్చింది. కేవలం ప్యాకేజీ ఇచ్చి ఊరుకోకుండా సంస్కరణలు కూడా చేపట్టేలా చర్యలు తీసుకుంది. వ్యయ నియంత్రణ, భారీ స్థాయిలో ఉన్న సిబ్బందిని క్రమబద్దీకరించుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లాంటి సంస్కరణలు అమలయ్యేలా చూసింది. వ్యయాలను తగ్గించుకునేందుకు 2020లో స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును కంపెనీ అమలు చేసింది. అప్పట్లో ఏకంగా 80,000 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. దీనితో ప్రతి నెలా జీతాల బిల్లుల భారం రూ. 600 కోట్ల వరకు తగ్గుతుందని కంపెనీ అప్పట్లో తెలిపింది. పూర్వ వైభవం దిశగా.. బీఎస్ఎన్ఎల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 16,811 కోట్ల నుంచి రూ.19,130 కోట్లకు పెరిగింది. నష్టాలు రూ. 8,161 కోట్ల నుంచి రూ. 5,367 కోట్లకు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, 2007 తర్వాత.. అంటే 17 ఏళ్ల అనంతరం కంపెనీ తొలిసారిగా లాభాలు చూసింది. రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోటీ సంస్థల కన్నా చౌకగా, సరళతరమైన ప్యాకేజీలు ఇస్తుండటంతో వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్ బాట పడుతున్నారు. కార్యకలాపాల విస్తరణ, వ్యయ నియంత్రణ చర్యలతో నాలుగో త్రైమాసికంలోనూ ఇదే జోరు కొనసాగిస్తామని కంపెనీ ధీమాతో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 20 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది. 2025 ఆఖరు నాటికి 25 శాతం మార్కెట్ వాటాను నిర్దేశించుకుంది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో.. హై–స్పీడ్ ఇంటర్నెట్కి డిమాండ్ పెరగడంతో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతూ ఫైబర్–టు–ది–హోమ్ సేవలను వేగంగా విస్తరించింది. కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 500 లైవ్ టీవీ చానల్స్ లభించేలా ఫైబర్ ఆధారిత టీవీ సర్వీస్, స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌లాంటి వినూత్న సేవలు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు65,000 దేశవ్యాప్తంగా ఉన్న టవర్లు1,00,000 జూన్‌నాటికి లక్ష్యం(నాలుగు మెట్రో నగరాలు, దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో 4జీ సర్వీసులున్నాయి) 5జీ సర్వీసుల విస్తరణ ప్రస్తుతం వైర్లెస్ విభాగంలో 9 కోట్ల పైచిలుకు యూజర్లతో దాదాపు 8 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో సుమారు 43 లక్షల కనెక్షన్లతో 17% మేర మార్కెట్ వాటా ఉంది. -
టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.సుప్రీంకోర్టు చర్యలుఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.ఏజీఆర్ లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటువివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. -
5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమం
టెలికాం సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 22 సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూ.17,940 కోట్ల విలువైన కొత్త 5జీ స్పెక్ట్రమ్(spectrum) వేలానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు టెలికాం శాఖ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.వేలంలోని కీలక అంశాలుమిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం ఆపరేటర్లకు మరింత నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ కీలకం కానుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ఇది అనువైందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక్కో సర్కిల్‌కు మొత్తం 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లను అనుసరించి మారుతూ ఉంటుంది. ఢిల్లీ సర్కిల్లో అత్యధికంగా మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు, ముంబైలో మెగాహెర్ట్జ్‌కు రూ.67 లక్షలు, మహారాష్ట్రలో రూ.54 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.49 లక్షలుగా ఉంది.మారటోరియం తిరస్కరణభవిష్యత్తులో జరగబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై 5-6 సంవత్సరాల వడ్డీ లేని చెల్లింపు వ్యవధి లేదా మారటోరియం కోసం టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది. ముందస్తు చెల్లింపు, 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపు నిబంధనల్లో మార్పులుండవని తేల్చి చెప్పింది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల వ్యాలిడిటీ కాలానికి అందిస్తారు.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్ఈ వేలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, 5జీ సేవల ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి టెలికాం ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను అందించనున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ముఖ్యంగా హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమైన పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేలంలో యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లను వేలంలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాయ్ సూచించింది. -
కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
మోసపూరిత కాల్స్‌ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్‌ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్‌కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలుకాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అంతర్జాతీయ కాల్స్‌కు ఇలా..సీఎన్ఏపీ సర్వీస్‌తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.సవాళ్లున్నా అమలుకు సిద్ధంసీఎన్ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్లో ప్రారంభమమై మరొక సర్కిల్లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్
న్యూఢిల్లీ: డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెల్కోలకు నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. 365 రోజుల వేలిడిటీకి మించకుండా కనీసం ఒక స్పెషల్ టారిఫ్ వోచర్‌ను అందించాలంటూ ఈ మేరకు టారిఫ్ నిబంధనలను సవరించింది.ఇదీ చదవండి: మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?ట్రాయ్ సూచనల ప్రకారం కస్టమర్లు తాము వినియోగించుకునే సర్వీసులకు మాత్రమే చెల్లించే వీలు ఉంటుంది. ఇంటి వద్ద బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లున్న కుటుంబాలు, సీనియర్ సిటిజన్లకు పెద్దగా డేటా రీఛార్జ్ ప్లాన్ల అవసరం ఉండదనే వాదనలున్నాయి. అలాంటి యూజర్లు సాధారణ కస్టమర్ల మాదిరిగా అధికంగా డబ్బు వెచ్చించి రీఛార్జ్ చేసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ట్రాయ్ భావిస్తుంది. దాంతో డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ప్లాన్‌ను తీసుకురావాలనే సూచనలు చేసింది. దీనిపై తుది నిర్ణయం మాత్రం టెల్కోలే తీసుకోవాల్సి ఉంటుంది. -
సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన
దేశంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్స్ ద్వారా సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నడుం బిగించింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలు వెలువరించింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఈ కాలర్ ట్యూన్స్‌ను టెలికం కంపెనీలకు అందిస్తుంది. టెలికం కంపెనీలు మొబైల్ కస్టమర్లకు ప్రతిరోజు 8–10 కాల్స్‌కు ఈ సందేశాన్ని వినిపిస్తాయి. ప్రతి వారం కాలర్ ట్యూన్‌ను మారుస్తారు. ఇలా మూడు నెలలపాటు కాలర్ ట్యూన్స్ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని కాల్స్ భారత్‌లో నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి అందులో చాలా వరకు అంతర్జాతీయ స్పూఫ్డ్ ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసే వ్యవస్థను కేంద్రం, అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రూపొందించారు.ఇదీ చదవండి: ‘భారత్ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’ఇటీవల నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ స్కామ్‌లు, ప్రభుత్వం, పోలీసు అధికారులుగా నటించడం మొదలైన కేసులలో సైబర్ నేరస్థులు ఇటువంటి అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్స్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2024 నవంబర్ 15 వరకు 6.69 లక్షలకు పైగా సిమ్ కార్డ్‌లు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్ చేసింది. -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
టెలికం సంస్థలకు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు
న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.అలాగే, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం
దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. -
‘టీఎంటీ’ విభాగంలో ఏఐ ప్రభావం
దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్‌వర్క్‌ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్‌ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్‌ఫోర్స్‌లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్వర్క్ ఆటోమేషన్‌పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలి. అందుకు హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు. -
వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ టెలికాం విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను కొంత తీర్చినట్లు ప్రకటించింది. 2016లో సంస్థకు కేటాయించిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిను 9.3 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.8,465 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంస్థ పేర్కొంది.టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో కంపెనీలు చేసేదేమిలేక బకాయిలు చెల్లిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏజీఆర్ లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ గతంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలుటెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. కొన్ని సంస్థల నివేదిక ప్రకారం వొడాఫోన్ఐడియా 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
ఓటీటీ యాప్‌ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది. -
టెలికం సర్వీస్ లైసెన్సింగ్‌లో సమూల మార్పులు
న్యూఢిల్లీ: ప్రస్తుత టెలికం సర్వీస్ లైసెన్సింగ్ విధానంలో సమూలంగా మార్పులు తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రదానంగా మూడు రకాల అనుమతులను సిఫార్సు చేసింది. మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్, అనుబంధ సర్వీసుల ఆథరైజేషన్, క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ వీటిలో ఉన్నాయి.వివిధ సేవలు, సర్వీస్ ఏరియాలవ్యాప్తంగా ’వన్ నేషన్ – వన్ ఆథరైజేషన్’ లక్ష్యాన్ని సాధించే దిశగా ’ఏకీకృత సర్వీస్ ఆథరైజేషన్’ కింద ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్లను నెట్వర్క్ సర్వీస్ ఆపరేటర్ (ఎన్ఎస్వో), వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో)గా రెండు విభాగాల కింద ఇస్తారు.అనుబంధ సర్వీస్ ఆథరైజేషన్లను సాధారణంగా పెద్దగా పర్యవేక్షణ అవసరం ఉండని ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఇస్తారు. సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం తీసుకున్న సంస్థలకు క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ ఇస్తారు. -
టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లోని వివరాలు విచారించింది. టెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు లెక్కించడంలో లోపాలు జరిగాయి. వాటిని సవరించాలి. ఇప్పటికే పోగైన బకాయిలపై వడ్డీని ఉపసంహరించాలి. క్యూరేటివ్ పిటిషన్‌ను బహిరంగంగా విచారణ చేయాలని కంపెనీలు కోరాయి.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడిగతంలో సెప్టెంబర్ 1, 2020లో కోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం..మార్చి 31, 2021లోపు కంపెనీల బకాయిల్లో 10 శాతం చెల్లించాలి. తదుపరి ఏడాది మరో 10 శాతం చొప్పున 2031 మార్చి 31లోపు పూర్తి బకాయిలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెలికాం విభాగానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌పై రీవాల్యుయేషన్ అనుమతించబడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, అన్ని టెలికాం కంపెనీలు కలిపి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు రూ.55,054 కోట్లుగా ఉన్నాయి. వొడాఫోన్ఐడియా కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్
ఇబ్బందికర కాల్స్, నమోదుకాని టెలిమార్కెటర్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉక్కుపాదం మోపుతోంది. ట్రాయ్ ఆదేశాలతో 2.75 లక్షల ఫోన్ నంబర్లను టెలికాం సంస్థలు డిస్కనెక్ట్ చేశాయి. నమోదుకాని 50 టెలిమార్కెటింగ్ కంపెనీలకు చెందిన టెలికాం సేవలను బ్లాక్ చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.ఈ చర్యలు స్పామ్ కాల్స్‌ను తగ్గించడంలో, కస్టమర్లకు ఉపశమనం కలిగించడంలో గణనీయ ప్రభావాన్ని చూపుతాయని ట్రాయ్ భావిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ వల్ల 2024 ప్రథమార్థంలో నమోదుకాని టెలిమార్కెటర్లపై 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. ఇబ్బందికర కాల్స్‌ను కట్టడి చేసేందుకు ట్రాయ్ 2024 ఆగస్ట్ 13న అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేసింది. టెలికాలం వనరులను దుర్వినియోగం చేస్తున్న నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ వాయిస్ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని, రెండేళ్ల వరకు డిస్కనెక్షన్ లేదా బ్లాక్ లిస్టులో పెట్టాలని యాక్సెస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇబ్బంది కలిగించే కాల్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా..50కి మించిన కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపే నిర్దిష్ట నంబర్‌కు గ్రేడ్స్ ప్రకారం అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఇటీవలే తన చర్చా పత్రం ద్వారా టెలికాం కంపెనీలకు సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే! -
వేగంగా టెలికాం సేవల పునరుద్ధరణ
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వరదలతో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కాస్త నెమ్మదించడంతో టెలికాం కంపెనీలు తమ సేవల పునరుద్ధరణపై దృష్టి సారించాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో తెలుగు రాష్ట్రాల్లో వేగంగా సేవలను పునరుద్ధరించింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్‌వర్క్‌ను మెరుగ్గా నిర్వహించేలా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించింది. వరద ఉధృతి పూర్తిగా తగ్గకముందే తిరిగి జియో తన సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది.రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే రూ.6,500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ సర్వీసును విస్తరిస్తున్నారు. తెలంగాణలోనూ జియో 5జీ సేవలు అందిస్తోంది. దేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి జియో చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ -
టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు
భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది. -
బ్రిటీష్ టెలికంలో భారతి గ్లోబల్ పాగా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం భారతి గ్లోబల్ తాజాగా బ్రిటన్ సంస్థ బీటీ (బ్రిటీష్ టెలికం) గ్రూప్‌లో 24.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువను నిర్దిష్టంగా ప్రకటించనప్పటికీ బీటీ వేల్యుయేషన్ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని, దాన్ని బట్టి చూస్తే ఒప్పంద విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,600 కోట్లు) ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతి గ్లోబల్ ప్రకటన ప్రకారం కంపెనీ ముందుగా ఆల్టిస్ సంస్థ నుంచి బీటీ గ్రూప్‌లో 9.99 శాతం వాటాను తక్షణం కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థ అనుమతులు వచ్చాక మిగతా వాటాను తీసుకుంటుంది. బీటీని పూర్తిగా దక్కించుకోవడంపై గానీ బోర్డులో స్థానం తీసుకోవడంపై గానీ ఆసక్తి లేదని భారతి గ్లోబల్ పేర్కొంది. బీటీ గ్రూప్ బ్రిటన్‌లో అతి పెద్ద బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. దానికి గతంలో 1997 నుంచి 2001 వరకు భారతి ఎంటర్ప్రైజెస్ టెలికం విభాగమైన భారతి ఎయిర్‌టెల్‌లో 21 శాతం వాటాలు ఉండేవి. బీటీ గ్రూప్‌లో బిలియనీర్ ప్యాట్రిక్ డ్రాహీకి చెందిన పెట్టుబడి సంస్థ ఆల్టిస్ 2021లో ముందుగా 12 శాతం వాటాలు తీసుకుని తర్వాత దాన్ని 24.5 శాతానికి పెంచుకుంది. భారతి గ్లోబల్ పెట్టుబడులు తమ గ్రూప్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకానికి నిదర్శనమని బీటీ సీఈవో అలిన్ కిర్క్‌బీ పేర్కొన్నారు. టాటా, మహీంద్రాల సరసన భారతి.. → తాజా డీల్‌తో బ్రిటన్ కంపెనీలను కొనుగోలు చేసిన టాటా, మహీంద్రా, వెల్స్పన్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థల సరసన భారతి ఎంటర్ప్రైజెస్ కూడా చోటు దక్కించుకోనుంది. → టాటా గ్రూప్‌లో భాగమైన టాటా టీ 2000లో బ్రిటన్ సంస్థ టెట్లీ టీని కొనుగోలు 271 మిలియన్ పౌండ్లకు చేసింది. అప్పట్లో టెట్లీతో పోలిస్తే టాటా టీ పరిమాణం చాలా చిన్నది. అయినప్పటికీ 1995 నుంచి దాన్ని కొనుగోలు చేసేందుకు సుదీర్ఘంగా ప్రయత్నాలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా రంగంలోకి దిగారు. చివరికి 2000లో టాటా గ్రూప్ దాన్ని సొంతం చేసుకుని అప్పట్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలు డీల్‌ను నమోదు చేసింది. → ఆ తర్వాత ఆరేళ్లకు 2006 జూలైలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా, బ్రిటన్‌కి చెందిన టెర్రీ టవల్ బ్రాండ్ క్రిస్టీ మాతృ సంస్థ సీహెచ్టీ హోల్డింగ్స్‌లో 85 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 132 కోట్లు వెచి్చంచింది.→ టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తూ ఆ మరుసటి ఏడాది 2007లో ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ గ్రూప్‌ను దక్కించుకుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. దానికి కొనసాగింపుగా 2008లో టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ మోటర్ నుంచి దక్కించుకుంది. → ఇక 2016 అక్టోబర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల సంస్థ బీఎస్ఏ కంపెనీని రూ. 28 కోట్లకు తీసుకుంది. → 2020 ఏప్రిల్‌లో బైక్‌ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ 16 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. భారతి, బీటీలకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది. దిగ్గజ బ్రిటన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాకు ఒక గొప్ప మైలురాయిలాంటిది – సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ -
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్‌లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు. -
స్పెక్ట్రమ్ వేలం వాయిదా..కొత్త తేదీ ఖరారు
స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికా విభాగం(డాట్) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ వేలం జూన్ 6(గురువారం)న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకుగల కారణాలను మాత్రం డాట్ వెల్లడించలేదు.మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్-ఈఎండీ) డిపాజిట్ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధ చేసింది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్ చేశాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐస్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు. -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్‌కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్‌లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్‌మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్‌ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్‌గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్‌లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్‌కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!
భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తోన్న ప్రముఖ కంపెనీ రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన ఒక కంపెనీతో 5జీ షేర్డ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లను అందించేందుకు ఒప్పందం చేసుకోనుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉన్న రాడిసిస్ అనే కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఘనాలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. వాటి ప్రకారం..నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాకో(ఎన్జీఐసీ) అనే ఘనా కంపెనీకి అవసరమయ్యే కీలకమైన మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు, స్మార్ట్ఫోన్లను రాడిసిస్ అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో మెరుగైన డిజిటల్ సేవలను అందించేలా కంపెనీ పని చేస్తోందని ఎన్జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్కిరిత్ సింగ్ బ్లూమ్‌బెర్గ్ నివేదికలో పేర్కొన్నారు.భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే 14 ఆఫ్రికన్ దేశాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఆఫ్రికాలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా చలామణి అవుతోంది. ఇకపై రిలయన్స్ కూడా అక్కడ టెలికాం సేవలు ప్రారంభించడం పట్ల ఇరుకంపెనీల మధ్య పోటీ నెలకొంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఎన్జీఐసీ పదేళ్లపాటు ఘనాలో 5జీ సేవలను అందించేలా అనుమతులను పొందింది. అయితే ఆ లైసెన్స్‌ను పదిహేనేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ మూడేళ్ల మూలధన వ్యయం 145 మిలియన్ డాలర్లని అంచనా. ఎలాగైతే భారత్‌లో జియోను ఆవిష్కరించి టెలికాంరంగంలో రిలయన్స్ ప్రత్యేకత చాటుకుందో అక్కడ కూడా తనదైన ముద్రవేయాలని చూస్తుంది. -
మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్‌సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్లైన్లోనే బ్లాక్ చేసుకునే సౌకర్యం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.బ్రౌజర్లో https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’ క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్ అవ్వాలి. మన పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఇదీ చదవండి: రోజులో ఒకసారైనా ఓపెన్ చేసే ఈ యాప్ గురించి తెలుసా..?ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయాలి. -
దిగ్గజ టెలికం కంపెనీలో కలకలం, 73 మిలియన్ల మంది యూజర్ల డేటా లీక్
అమెరికాలో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీలో కలకలం రేపింది. ఆ సంస్థ యూజర్ల డేటా డార్కెట్ వెబ్‌లో ప్రత్యక్షమైంది. రెండు వారాల క్రితం ‘డార్క్‌వెబ్’ లో విడుదలైన డేటా కారణంగా సుమారు 7.6 మిలియన్ల మంది ప్రస్తుత ఖాతాదారులు, 65.4 మిలియన్ల మాజీ ఖాతాదారులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన ఏటీ అండ్ టీ కంపెనీ యూజర్ల డేటా 2019 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ డేటాను ఉపయోగించిన సైబర్ నేరస్తులు అనధికారికంగా తమ డేటాను యాక్సిస్ చేసిన ఆధారాలు లేవని, అయితే డేటా లీకేజీ సంస్థ నుంచి వచ్చిందా లేదంటే సిబ్బంది వల్లే ఇలా జరిగిందా? అన్న అంశంపై ఏటీ అండ్ టీ విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. పాస్వర్డ్లు రీసెట్ ఈ ఘటన తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డేటా లీకేజీ అందుకు గల కారణాల్ని అంచనా వేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత యూజర్లతో ఏటీ అండ్ టీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత 7.6 మిలియన్ యూజర్ల పాస్ వర్డ్‌లను రీసెట్ చేసింది. అవసరమైన చోట క్రెడిట్ మానిటరింగ్ అందిస్తామని తెలిపింది. కాగా, 5జీ నెట్వర్క్ యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 290 మిలియన్ల ప్రజలకు సేవల్ని అందిస్తోంది. ఫిబ్రవరిలో అంతరాయం ఫిబ్రవరిలో ఎటి అండ్ టిలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది యుఎస్ వినియోగదారులు కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడంలో అంతరాయం కలిగింది. -
మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే..
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. గత రెండేళ్లుగా ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థలు ఈసారి ఎలాగైనా వాటిని పెంచాలని యోచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను కనీసం 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం(ఆర్పూ) పెంచుకోవడంలో భాగంగా మరోసారి తమపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయని తెలిసింది. కొంతకాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్‌ల పెంపునకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయి. ఈమేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అవి పూర్తి అయిన తర్వాత కంపెనీలు ఛార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. టారిఫ్ ప్లాన్లలో మార్పులు ఎంట్రీ లెవల్ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు వివిధ ధరల్లో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికం సంస్థలు ఇబ్బడిముబ్బడి టారిఫ్ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారి టారిఫ్ చెల్లింపులు భరించలేకపోతున్నారని వాదనలు వస్తున్నాయి. టెలికం సంస్థలు వీరికోసం ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 2021లో టారిఫ్‌లను పెంచిన టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి. దాంతో కంపెనీల ఖర్చులు పెరిగాయి. ఆ వ్యయంలో కొంతమేర వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించబోతున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: విమాన సంస్థల వేసవి షెడ్యూల్ విడుదల -
5జీకి పెరుగుతున్న ఆదరణ.. డేటా వినియోగం ఎంతంటే..
భారత్‌లో 5జీ వినియోగదార్లు డేటాను విరివిగా వాడుతున్నారు. 4జీ వినియోగదార్లతో పోలిస్తే ఏకంగా 3.6 రెట్ల డేటాను వాడుతున్నట్లు టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో పేర్కొంది. టెలికం వినియోగదారులకు సేవలందించేందుకు కంపెనీలు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని ఆ నివేదికలో తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 5జీ అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీ కొన్నిసార్లు వాడకపోయినా 5జీ మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. 4జీ డివైజెస్ సంఖ్యతో పోలిస్తే 17 శాతం మేర 5జీ మొబైళ్లు వాడుతున్నారు. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా ఉంది. భారత్‌లో డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్‌గా నమోదవుతోంది. 1 ఎక్సాబైట్ 100 కోట్ల జీబీకి సమానం. సగటున ఒక్కో వినియోగదారు నెలకు 24 జీబీ వాడుతున్నారు. అంటే భారత్‌లో డేటా వినియోగం చాలా భారీగా ఉంది. మొత్తం మొబైల్ డేటా రద్దీలో 20 శాతం వాటాకు ఇది చేరింది. ఇదీ చదవండి..హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే..
కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలాన్ని మే 20న ప్రారంభించనుంది. వీటి ప్రాథమిక ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికాం విభాగం ఇటీవల నోటీసు జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టనున్నారు. అదే సమయంలో కొన్ని టెలికాం కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రానికి ఈ ఏడాది గడువు తీరనుండడంతో ఆ ఫ్రీక్వెన్సీలనూ ఈ వేలంలో జత చేయనున్నారు. దీంతో ప్రస్తుతం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించారు. తుది బిడ్డర్ల జాబితా మే 9న విడుదల చేస్తారు. నమూనా వేలం మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. వాస్తవ వేలాన్ని మే 20 నుంచి చేపడతారు. బిడ్డింగ్‌ను వేలంలో గెలుచుకున్నవారికి 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. 20 సమాన వార్షిక వాయిదాల్లో ఇందుకు చెల్లింపులు చేయాలి. దీనికి వడ్డీ రేటు 8.65 శాతంగా నిర్ణయించారు. కనీసం 10 ఏళ్ల అనంతరం స్పెక్ట్రమ్ సరెండర్ అవకాశం ఇస్తారు. ఈసారి వేలంలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ) లేవు. బ్యాంకు హామీలనూ సమర్పించాల్సిన అవసరం లేదు. స్పెక్ట్రమ్ అంటే? సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార బట్వాడాకు విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..
ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్‌తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్వర్క్ లేదా టెలికమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. తాజా డ్రాఫ్ట్ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. -
55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లు.. ప్రభుత్వం ఏం చేసింది?
దేశవ్యాప్తంగా 55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ దాని దుర్వినియోగం, సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది. టెలికాం వినియోగదారుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు తెలియజేసింది. నకిలీ, ఫోర్జరీ ధ్రువపత్రాలతో పొందిన మోసపూరిత మొబైల్ కనెక్షన్లను గుర్తించి తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ వినియోగదారులు తమ పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లను సరిచూసుకుని మోసపూరితమైన, అవసరం లేని కనెక్షన్లను నివేదించడానికి అనుమతించే సంచార్ సాథీ పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మొబైల్ కనెక్షన్లను విక్రయించేందుకు ఇప్పటికే ఉన్న కేవైసీ మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ టెలికాం కంపెనీలకు సూచనలిచ్చినట్లు చెప్పారు. 55.5 లక్షల మొబైల్ కనెక్షన్ల తొలగింపు అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎస్సెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలను 36 శాతం కట్టడి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా సుమారు 4 లక్షల మంది పౌరులు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా రూ. 1,000 కోట్లకు పైగా రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన అలాగే 55.5 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించినట్లు వివరించారు. వీటిలో బ్యాంక్‌లు, పేమెంట్ వాలెట్లకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్లు 9.8 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారులు నివేదించిన 13.4 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్‌లో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు చెప్పింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నివేదించిన ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించడంతోపాటు 1.3 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదనైతే లేదు’
నగదు కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్‌సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద అలాంటి ఏ ప్రతిపాదన లేదని తెలిపారు. అయితే కంపెనీని ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రమే ఆ వాటాను తీసుకున్నామనీ స్పష్టం చేశారు. మేజర్ వాటా కేంద్రానిదే.. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ టెలికం శాఖకు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. దీంతో ప్రభుత్వానికి ఆ వాటా సమకూరింది. ఇప్పుడు కంపెనీలో అతిపెద్ద వాటాదారు కేంద్ర ప్రభుత్వమే. భాగస్వామ్య సంస్థ బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 32.3 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 18.1 శాతం..రెండింటికీ కలిపి 50.4 శాతం వాటా ఉన్నది. మిగిలిన వాటా రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. వొడాఫోన్ చెల్లించాల్సిన మరో రూ.40,000 కోట్లకు నాలుగేళ్లపాటు మారటోరియం ఉంది. అయితే ఈ మొత్తాన్ని 2026 నుంచి కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బకాయిల్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుని వాటాను 70 శాతానికి పెంచుకుంటుందన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..? ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎన్ఎన్ఎల్)పై అడిగిన ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 4జీ సేవలను ప్రారంభించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన 1,00,000 సైట్ల కోసం కొనుగోలు ప్రణాళికలు చేసిందని తెలిపారు. -
అందుబాటు చార్జీల్లో టెలికం సేవలే ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకగా టెలికం సరీ్వసులు భారత్‌లో అందుబాటులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించాకా ఇప్పటివరకు టెల్కోలు వాటి నుంచి పూర్తి స్థాయిలో ఆదాయాన్ని అందుకోవడం ఇంకా మొదలుపెట్టని నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ నెట్‌వర్క్‌పై చేస్తున్న పెట్టుబడులను టెల్కోలు తిరిగి రాబట్టుకోవాలంటే వచ్చే మూడేళ్లలో ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 270–300గా ఉండాలనేది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయంగా సగటున ఏఆర్పీయూ రూ. 600–850గాను, చైనాలో రూ. 580గాను ఉండగా.. భారత్‌లో ఇది రూ. 140–200 స్థాయిలో ఉంది. మరోవైపు, 6జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి సారథ్యం వహించే స్థాయిలో ఉండాలని టెలికం రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం పరిశ్రమ, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో భారత్ 6జీ కూటమిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో యాంటెన్నా గ్రూప్, వేవ్‌ఫామ్ గ్రూప్, ఎక్విప్మెంట్ గ్రూప్ అంటూ వివిధ గ్రూప్‌లు ఉన్నాయని, అవన్నీ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. టెలికం రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని వివరించారు. టెలికం టారిఫ్‌లు మరింత పెరగాలి భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ వ్యాఖ్యలు భారత్‌లో టెలికం టారిఫ్‌లు అత్యంత చౌకగా ఉన్నాయని, ఇవి ఇంకా పెరగాల్సి ఉందని భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం పరిశ్రమ లాభదాయకంగా మారాల్సిన అవసరం ఉందని ఇన్వెస్టర్లతో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘పెట్టుబడులను కొనసాగించాలన్నా, భారత్ నిర్దేశించుకున్న డిజిటల్ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడాలన్నా టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి. సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయంపరంగానైనా (ఆర్పు), ప్రతి జీబీకి రేటుపరంగానైనా భారత్‌లో టారిఫ్‌లు చాలా చౌకగా ఉన్నాయి. ఇవి పెరగాల్సిన అవసరం ఉంది. టారిఫ్‌లు పెరుగుతాయా లేదా అనేది కాదు ప్రశ్న.. ఎప్పుడు పెరుగుతాయనేదే ప్రశ్న. అయితే, ఇదంతా మా చేతుల్లో లేదు. వేచి చూడటం తప్ప‘ అని ఆయన పేర్కొన్నారు. 5జీ విషయానికొస్తే నాణ్యమైన సర్వీసులను అందుబాటు ఉంచుతూనే ఓవరాల్‌గా టారిఫ్‌ల పెంపు కొనసాగించాలనేది తమ ఉద్దేశమని విఠల్ తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ను అత్యంత వేగంగా, అత్యధికంగా ఏర్పాటు చేసామంటూ దండోరా వేసుకునేందుకు తామేమీ పోటీపడటం లేదని విఠల్ చెప్పారు. 5జీ అనేది దీర్ఘకాలిక ప్రయాణమని, ఈ టెక్నాలజీ ఉపయోగపడే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ ఉచితంగా లభిస్తున్నందుకే వినియోగం అత్యధికంగా ఉంటోందని, టారిఫ్‌లు వేసినప్పటి నుంచే అసలైన వినియోగం తెలుస్తుందని విఠల్ అభిప్రాయపడ్డారు. -
శాట్‌కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్
Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్ నుంచి వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనుమతి కోరింది. వన్‌వెబ్, జియో శాటిలైట్, ఎలాన్‌మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌లింక్ వంటి ప్రాజెక్ట్లకోవలోకి అమెజాన్ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్‌లింక్ జీఎంపీసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్‌వెబ్ ఈ జీఎంపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్లకు వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు. అయితే కంపెనీలు ఇన్‌స్పేస్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. -
మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్‌గ్రిడ్
సాక్షి, అమరావతి: కేబుల్ టీవీ, టెలికాం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) మరిన్ని వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను ఏపీఎస్ఎఫ్ఎల్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టెలికాం సంస్థలు పిలిచే టెండర్లలో పాలొ్గని ఆ ప్రాజెక్టులను కూడా చేపడతామన్నారు. వ్యాపార విస్తరణకు అనుగుణంగా మూలధనం పెంచుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం రూ. 7 కోట్లుగా ఉన్న మూలధనాన్ని రూ. 2,000 కోట్లకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్ ఆస్తుల విలువ రూ. 3,586.22 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ఫేజ్–2 ప్రాజెక్టును చేపట్టామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూ. 627 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీఎస్ఎఫ్ఎల్ అకౌంట్లను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ ఆడిటింగ్ తర్వాత కాగ్‌కు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సెట్‌టాప్ బాక్స్‌ల కొరత ఉండటంతో ఎంఎస్‌వోలు సొంతంగా వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తే తొమ్మిది నెలల గడువులో ఆ మొత్తం చెల్లించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పా.. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానని గౌతమ్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కుంభకోణంలో లోకేశ్ పాత్ర ఉందా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని, తనను కూడా జైలుకు పంపించారన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు. -
ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్ హెచ్‌వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చైన్‌లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్‌లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
డిజిటల్ ఇన్ఫ్రా సంస్థలకు పర్మిట్లు కేంద్రానికి ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! ) అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) -
జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ త్వరలో..
న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్‌ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న ప్రత్యేక తీర్మానానికి షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. -
భారత్‌లో అవకాశాలు అపారం
సిడ్నీ: భారత్‌లో డిజిటల్ ఇన్ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, ఐటీ, ఫిన్‌టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్‌కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈవో పౌల్ ష్రోడర్ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్ ఫోన్లు గుర్తించాం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్‌లోని టాప్‌కాఫ్ (టీఏఎఫ్‌సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్‌లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్‌లను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. టాప్‌కాఫ్‌ను ఏపీఎల్‌ఎస్‌ఏ విజయవాడ బ్రాంచ్ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్, బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. -
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
జూమ్‌కు టెలికం లైసెన్సు - ఇక వారికి పండగే..!
న్యూఢిల్లీ: వెబ్ కాన్ఫరెన్స్ కంపెనీ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ (జెడ్వీసీ)కి తాజాగా భారత్‌లో దేశవ్యాప్త టెలికం లైసెన్స్ లభించింది. దీంతో ఇకపై బహళ జాతి కంపెనీలు, వ్యాపార సంస్థలకు తమ క్లౌడ్ ఆధారిత ప్రైవేట్ ఎక్స్చేంజ్ (పీబీఎక్స్) ’జూమ్ ఫోన్’ టెలిఫోన్ సర్వీసులను కూడా అందించడానికి వీలవుతుందని జెడ్వీసీ జీఎం సమీర్ రాజె తెలిపారు. భారత మార్కెట్‌కు కట్టుబడి ఉన్న తమకు ఇది కీలక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశీ యూజర్లకు వినూత్న సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
టెల్కోలకు రైల్వే గ్రీన్ సిగ్నల్! రైల్వే భూమిలో టెలికం టవర్లు
రైల్వే సంబంధ భూములలో రైల్‌టెల్ కార్పొరేషన్‌కు మినహా ఏ ఇతర టెలికం కంపెనీలూ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ అనుమతించడం లేదు. అయితే తాజాగా ఇందుకు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా భూములకు కొత్త లీజ్ విధానాలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశీయంగా 5జీ టెలికం నెట్వర్క్ ఊపందుకునే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. న్యూఢిల్లీ: ర్వైల్వే భూములకు సంబంధించి ల్యాండ్ లైసెన్సింగ్ ఫీజు(ఎల్ఎల్ఎఫ్) నిబంధనలను కొద్ది నెలల క్రితం కేంద్ర క్యాబినెట్ సరళీకరించింది. వెరసి ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో రైల్వే శాఖ కొత్త ఎల్ఎల్ఎఫ్ పాలసీకి తెరతీసింది. దీంతో మొబైల్ టవర్ల ఆదాయంలో 7 శాతాన్ని పంచుకునే నిబంధనలకు తెరదించింది. దీని స్థానే భూముల మార్కెట్ విలువలో వార్షికంగా 1.5 శాతం చార్జీల విధింపునకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా 5జీ నెట్వర్క్ విస్తరణకు దారి ఏర్పడనుంది. దీనిలో భాగంగా అనుమతులు మంజూరు చేసే అంశంలో భవిష్యత్ నెట్వర్క్ అవసరాలను పరిగణించేలా జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రైల్‌టెల్ మాత్రమే... ప్రస్తుతం రైల్వే రంగ టెలికం అవసరాలకు రైల్‌టెల్ కార్పొరేషన్‌పై మాత్రమే ఆ శాఖ ఆధారపడుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయివేట్ రంగ కంపెనీలకూ టెండర్లను ప్రారంభించినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని ఆయా సంస్థలు వాణిజ్యంగా వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఇదే సమయంలో ఈ మౌలిక సదుపాయాలను పోటీ ధరల ప్రాతిపదికన రైల్వేలు సైతం ఉపయోగించుకోనున్నాయి. 2016 పాలసీ ప్రకారం రైల్వే భూములలో రైల్‌టెల్‌కు మాత్రమే టవర్ల ఏర్పాటుకు వీలుండేది. తాజా విధానాలు వీటికి స్వస్తి పలికాయి. వీటి ప్రకారం 70 డివిజన్లు కార్యాలయాలు, స్టేషన్ పరిసరాలలో పోల్ మౌంట్లు, స్మాల్ సెల్స్ ఏర్పాటుకు అనుమతించనున్నాయి. రెండు నెలల గడువు సొంత నెట్‌వర్క్‌లో 5జీ సర్వీసుల వృద్ధికి కొద్ది రోజులుగా రైల్వే శాఖ ప్రయివేట్ నెట్వర్క్ ఆపరేటర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే భూములలో ప్రయివేట్ టెలికం కంపెనీలు టవర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతించడంతో వ్యయాలు తగ్గనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా సామర్థ్య మెరుగుకు ఊతం లభించడంతోపాటు, అత్యుత్తమ గ్రిడ్ ప్రణాళికలకు వీలున్నట్లు తెలియజేశాయి. రైల్వేలకు ఆయా భూములు అవసరమైనప్పుడు రెండు నెలల నోటీసు ద్వారా తిరిగి సొంతం చేసుకునే నిబంధనలు జత చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 5జీ టవర్ల ఏర్పాటుకు మొబైల్ సేవల దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భూముల కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజా నిర్ణయాలు పరిశ్రమకు బూస్ట్‌నివ్వనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో స్థానిక నెట్‌వర్క్‌లకు మరింత బలిమి చేకూరే వీలుంది. ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ దూర ప్రాంతాల రైల్వే స్థలాలలో టవర్ల ఏర్పాటు కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదని పరిశ్రమ నిపుణులు వివరించారు. తద్వారా టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటులో మరిన్ని ప్రణాళికలకు తెరలేస్తుందన్నారు. ఇది టెలికం పరిశ్రమ నుంచి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే టవర్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం, రైల్వేకు తిరిగివ్వడం వంటి కొన్ని అంశాలలో సమస్యలను పరిష్కరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. -
జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!
న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్‌లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్‌లో మొత్తం అన్ని టెల్కోల వైర్లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది. -
సత్తా చాటుకున్న రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పటిష్టమైన టెలికం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అగ్రస్థానం దక్కించుకుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. 2022కి సంబంధించి భారత్‌లో అత్యధికంగా ఇష్టపడే పటిష్టమైన బ్రాండ్స్ అంశంపై బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా ఇన్సైట్స్ కంపెనీ టీఆర్ఏ (ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) రూపొందించిన జాబితాలో ఈ ర్యాంకులు దక్కించుకున్నాయి. టెలికం విభాగంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వరుసగా నిల్చాయి. అపారెల్ కేటగిరీలో అడిడాస్ అగ్ర స్థానంలో ఉండగా నైకీ, రేమాండ్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇతర విభాగాలు చూస్తే.. ♦ ఆటోమొబైల్ కేటగిరీలో బీఎండబ్ల్యూకి నంబర్ 1 ర్యాంకు దక్కింది. తర్వాత స్థానాల్లో టొయోటా, హ్యుందాయ్, హోండా ఉన్నాయి. ♦ బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగంలో ఎల్ఐసీది అగ్రస్థానం. ఎస్బీఐ 2వ, ఐసీఐసీఐ బ్యాంక్ 3వ ర్యాంకు దక్కించుకున్నాయి. ♦ కన్జూమర్ అప్లయెన్సెస్‌లో కెంట్ నంబర్ 1గా ఉండగా .. లివ్‌ప్యూర్, ఒకాయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ♦ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్జీ, సోనీ, శాంసంగ్ టాప్ 3 కంపెనీలుగా ఉన్నాయి. ♦ వివిధ రంగాల్లోకి విస్తరించిన దిగ్గజాల జాబితాలో ఐటీసీ అగ్ర స్థానంలో ఉండగా, టాటా, రిలయన్స్ తర్వాత ర్యాంకులు దక్కించుకున్నాయి. ♦ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, ఐవోసీ, అదానీ టాప్ 3లో ఉన్నాయి. -
నెల రోజుల్లోనే 10 లక్షల 5జీ యూజర్లు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6–9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300..మరి ఇప్పుడు ఎంతుందో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలిసారి 5జీ నెట్ వర్క్ సర్వీసుల్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని..దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. అనంతరం 5జీ నెట్ వర్క్‌ల వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో ఒక కొత్త శకం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! ►5 జీ నెట్ వర్క్ ప్రారంభం అవ్వడం 130 కోట్ల మంది భారతీయులకు గొప్ప బహుమతి. దేశ అపరిమిత సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు సాక్షాత్కారంగా నిలుస్తాయి. ►ప్రపంచ సాంకేతిక విప్లవంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. 5జీతో టెలికాం టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ యువతకు అనేక ఉపాధి అవకాశాల్ని అందిస్తుంది. ►పొడక్ట్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా ఖర్చులు, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌లు అనే నాలుగు స్తంభాలపై డిజిటల్ ఇండియా విజయం ఆధారపడి ఉంది. మనం ఆత్మ నిర్భర్ అయినప్పుడే ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుతాయి. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నేడు వాటి సంఖ్య 200కు పెరిగింది. న్యూ ఇండియా ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉంది. ►కమ్యూనికేషన్ రంగంలో కనెక్టివిటీ చాలా ముఖ్యం. 2014 లో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆరు కోట్ల మంది ఉంటే ప్రస్తుతం 80 కోట్లకు మందికి పైగా ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ 100 గ్రామ పంచాయతీల నుండి ఇప్పుడు 170,000 పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించ బడి ఉన్నాయి. ►డిజిటల్ ఫస్ట్ విధానంతో మనం ఆన్లైన్ చెల్లింపుల వంటి పౌర కేంద్రీకృత సేవల (robust network) నెట్‌వర్క్‌ను నిర్మించడంలో విజయం సాధించాం. డిజిటల్ ఇండియా ప్రతి పౌరుడికి అనేక అవకాశాల్ని అందించింది. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ►ఇంతకుముందు 1జీబీ డేటా ధర సుమారు రూ. 300. ఇప్పుడు అది రూ.10. టెక్నాలజీ - టెలికాం అభివృద్ధితో, భారతదేశం పరిశ్రమ 4.0 విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, భారతదేశ శతాబ్దం’ అంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైర్లు’ -
Tele-Communications Bill 2022: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ సేవలకూ లైసెన్స్
-
టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్ చేస్తుంది. సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్ 20 ఆఖరు తేదీ. పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్ టెలికం పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
రిలయన్స్ రిటైల్ ఐపిఒ పై సర్వత్రా ఉత్కంఠ
-
ప్యాన్ ఇండియా 5జీ సేవలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులు వచ్చే రెండు, మూడేళ్లలో దాదాపు దేశమంతటా అందు బాటులోకి రాగలవని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మొబైల్ సేవలు అత్యంత చౌకగా లభిస్తున్నాయని, 5జీ వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పరిశ్రమలోకి రూ. 2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నాం. ఉద్యోగాల కల్పనకు కూడా ఇది తోడ్పడుతుంది. వచ్చే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం‘ అని వైష్ణవ్ వివరించారు. టెలికం కంపెనీలు 5జీకి అవసరమైన మౌలిక సదుపాయలను ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయని చెప్పారు. అక్టోబర్ కల్లా వీటిని ప్రవేశపెట్టొచ్చని, ఆ తర్వాత అత్యంత వేగంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేబుళ్లు, మొబైల్ టవర్ల ఏర్పాటుకు (ఆర్వోడబ్ల్యూ) అనుమతుల ప్రక్రియకు గతంలో 343 రోజులు పట్టేసేదని, సంస్కరమల ఊతంతో గతేడాది జూలై నాటికి ఇది సగటున 16 రోజులకు తగ్గిందని ఆయన చెప్పారు. -
నెల రోజుల్లో 5జీ సర్వీసులు.. టెలికం సహాయ మంత్రి చౌహాన్ వెల్లడి
న్యూఢిల్లీ: చిరకాలంగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు నెల రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దేశీయంగా అభివృద్ధి, తయారు చేసిన పరికరాలు వినియోగంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. అటు 6జీ నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆసియా, ఓషియానియా ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్న రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్ఎస్ఎఫ్) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆగస్టు 1న ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్ముడైన స్పెక్ట్రంలో రిలయన్స్ జియో దాదాపు సగభాగం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు వేసింది. -
బీఎస్ఎన్ఎల్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. ► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి. ► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అదనంగా.. ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి? -
71% అమ్ముడైన స్పెక్ట్రం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలంలో నాలుగో రోజు (శుక్రవారం) ముగిసే నాటికి రూ. 1,49,855 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. కొత్తగా రూ. 231.6 కోట్ల బిడ్లు వచ్చాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో ఇప్పటివరకూ 71 శాతం అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నాలుగో రోజైన శుక్రవారం మరో ఏడు రౌండ్లు జరిగాయని, దీంతో మొత్తం రౌండ్ల సంఖ్య 23కి చేరినట్లు వివరించారు. అయిదో రోజైన శనివారం కూడా వేలం కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెలికం పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులపై చర్చించేందుకు పీఈ ఫండ్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లు, బ్యాంకులతో మంత్రి శనివారం ముంబైలో భేటీ కానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
టెలికాం సంస్థలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో టెలికం సంస్థల స్థూల ఆదాయం 2.64 శాతం క్షీణించింది. రూ. 69,695 కోట్లకు పరిమితమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతక్రితం ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో టెల్కోల ఆదాయం రూ. 71,588 కోట్లు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సుమారు 16 శాతం పెరిగి రూ. 47,623 కోట్ల నుంచి రూ. 55,151 కోట్లకు పెరిగింది. ఏజీఆర్ ఆధారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు, చార్జీలు మొదలైనవి ఆధారపడి ఉంటాయి. సమీక్షా కాలంలో ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో రూ. 4,541 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) రూ. 1,770 కోట్లు దఖలు పడ్డాయి. లైసెన్సు ఫీజు కలెక్షన్ 19.21 శాతం, ఎస్‌యూసీ వసూళ్లు 14.47 శాతం పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ అత్యధికంగా రూ. 19,064 కోట్లుగా నమోదు కాగా, భారతి ఎయిర్‌టెల్‌ది రూ. 4,484 కోట్లు, వొడాఫోన్ ఐడియాది రూ. 6.542 కోట్లుగా నమోదైంది. 2021 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 0.9 శాతం క్షీణించి రూ. 117.84 కోట్లకు పరిమితమైంది. -
ఏజీఆర్ బకాయిలు: చట్టం ముందు అందరూ సమానులే!!
టెలికం ఆపరేటర్ల సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) చెల్లింపులకు సంబంధించి టెలికం వివాదాల పరిష్కార అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను వేర్వేరుగా చూడద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎస్‌యూ) తమ ఆదాయాల్లో టెలికం సంబంధిత సేవల నుంచి పొందుతున్న మొత్తం చాలా తక్కువనే ప్రాతిపదికన వాటిని ఏజీఆర్ వాటాను చెల్లించకుండా మినహాయించరాదని కేంద్రానికి ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఏ మినహాయింపు అయినా ప్రైవేటు రంగ సంస్థలకు ఇచ్చేటట్లయితేనే, వాటిని ప్రభుత్వ రంగ కంపెనీలకు వర్తింపజేయాలని సూచించింది. మరోమాటలో చెప్పాలంటే, ప్రభుత్వ రంగానికి ఇచ్చే మినహాయింపులను ప్రైవేటు రంగ సంస్థలకూ వర్తింపజేయాలని సూచించింది. ఏజీఆర్ ద్వారా కేంద్రానికి దాదాపు రూ.4 లక్షల కోట్ల ఆదాయం ఒనగూరుతున్న సంగతి తెలిసిందే. ఏజీఆర్‌ను సవాలుచేస్తూ, దాఖలైన పిటిషన్లను సైతం 2019 అక్టోబర్ 24న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 13 సంస్థలపై ప్రభావం ట్రిబ్యునల్ చైర్మన్ శివ కీర్తి సింగ్, సభ్యుడు సుబోధ్ కుమార్ గుప్తా ఇచ్చిన తాజా ఉత్తర్వులు టెలికం రంగం లేదా సంబంధిత సేవల లైసెన్సులు పొందిన పదమూడు ప్రభుత్వ రంగ కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కంపెనీలకు ఏజీఆర్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఆయిల్ ఇండియా, రైల్‌టెల్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, నోయిడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్, గెయిల్ ఇండియా, ఢిల్లీ మెట్రో, ఓఎన్జీసీ, తమిళనాడు అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్లు కూడా ఏజీఆర్ బకాయిల చెల్లింపుల నుంచి మినహాయింపు పొందాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కావడం, దీనికితోడు బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ మినహాయింపులు పొందాయి. సుప్రీంకోర్టు 2019 అక్టోబర్ 24న ఇచ్చిన రూలింగ్‌ను ఉదహరిస్తూ, నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్, డేటా ఇంజీనియస్ గ్లోబల్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ట్రిబ్యునల్ తాజా తీర్పు వెలువరించింది. ఈ విచారణ సందర్భంగా టెలికం శాఖ వాదనలను 27 పేజీల ఉత్తర్వుల్లో ట్రిబ్యునల్ తిరస్కరించింది. పీఎస్‌యూలు ప్రభుత్వ విధులను గణనీయంగా నిర్వర్తించడమే కాకుండా, పబ్లిక్ ఫండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయని, అందువ్లల ప్రజా ప్రయోజనాల రీత్యానే అవి మినహాయింపునకు అర్హమైనవని పేర్కొనడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. -
హద్దుల్లేకుండా.. హల్లో!
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ ఫోన్ నెట్వర్కు అందుబాటులోకి రానున్నదని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ సాంకేతిక సమాచారం, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 4వేల మొబైల్ టవర్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్రంగా 6వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ లేదన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో 3,933 గ్రామీణ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఏ ఒక్క గ్రామం మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇబ్బందులు పడకూడదని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించి, కేబినెట్ నోట్ ప్రవేశ పెట్టామన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా ఈ చర్య చేపడుతున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం దివాలా తీసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ల్)కు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు పునరుజ్జీవం కల్పించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యతో ఈ సంస్థ గతేడాది నిర్వహణ లాభాల (ఆపరేటింగ్ ప్రాఫిట్) స్థాయికి పునరుద్ధరణ సాధించిందన్నారు. బీఎస్ఎన్ల్కు రెండు విడతల్లో ఆర్థిక వనరులు కల్పించిందని తెలిపారు. తొలివిడత కింద 2019లో రూ.90వేల కోట్లు, మలివిడతగా రూ.45వేల కోట్లు ఈ ఏడాది మంజూరు చేశారని ప్రకటించారు. దీంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు పునరుజ్జీవం పొందాయన్నారు. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, 4జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 5జీ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో తుది మెరుగులు దిద్దుకుంటోందని, ఫోన్, రేడియోకు 5జీ టెక్నాలజీ అనుసంధానంతో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కనీవినీ ఎరుగని నిధులు.. రాష్ట్రంలో రైల్వేరంగం సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. యూపీఏ హయాం కంటే 2022–23 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామన్నారు. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఏటా సగటున సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. 2014–2019 మధ్య బీజేపీ ప్రభుత్వం ఏటా సగటున రూ.4,126 కోట్లు రాష్ట్ర రైల్వే రంగానికి కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైల్వే రంగానికి రూ.9,734 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకంగా వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. -
టెలికం దశ మోగుతోంది..
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగ ఔట్‌లుక్‌ను తాజాగా రేటింగ్ దిగ్గజం ఇక్రా స్థిరత్వాని(స్టేబుల్)కి అప్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన ప్రతికూల(నెగిటివ్) రేటింగ్‌ను సవరించింది. ఇందుకు టెలికం కంపెనీల టారిఫ్‌ల పెంపుతోపాటు.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలు(ప్యాకేజీలు) ప్రభావం చూపినట్లు ఇక్రా పేర్కొంది. వెరసి టెలికం పరిశ్రమ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌నకు అవసరమయ్యే పెట్టుబడులను సైతం సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. టెలికం వినియోగదారులు నిలకడగా 2జీ నుంచి 4జీకి మారుతుండటంతో టెలిఫోనీ సర్వీసుల వినియోగం పెరుగుతున్నట్లు ఇక్రా వివరించింది. ఫలితంగా టెలికం కంపెనీల సగటు వినియోగదారు ఆదాయం(ఏఆర్పీయూ) 2023 మార్చికల్లా రూ. 170కు చేరగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. దీంతో టెలికం రంగ ఔట్‌లుక్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వానికి అప్‌గ్రేడ్ చేసినట్లు ఇక్రా వెల్లడించింది. కారణాలున్నాయ్.. దీర్ఘకాలంగా వేచిచూస్తున్న టారిఫ్‌ల పెంపును టెలికం కంపెనీలు ఇటీవల అమల్లోకి తీసుకువస్తుండటంతో 2023 మార్చికల్లా ఏఆర్పీయూ రూ. 170ను తాకవచ్చని ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. దీనికితోడు ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలు ఈ రంగానికి దన్నుగా నిలవనున్నట్లు తెలియజేసింది. ఇటీవల టెలికం కంపెనీలు ప్రీపెయిడ్ టారిఫ్‌లను సుమారు 20 శాతం పెంచడంతో ఏఆర్పీయూలు మెరుగుపడనున్నట్లు ఇక్రా లిమిటెడ్ కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సవ్యసాచి మజుందార్ వివరించారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)కల్లా టెలికం పరిశ్రమ ఆదాయం 18–20 శాతం పుంజుకోవచ్చని అంచనా వేశారు. ఈ బాటలో 2024 మార్చికల్లా ఆదాయాలు మరో 10–12 శాతం బలపడగలవని అభిప్రాయపడ్డారు. దీంతో 2023కల్లా నిర్వహణ లాభాలు 30 శాతం వృద్ధి చూపే వీలున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్యాకేజీల కారణంగా 2025కల్లా పరిశ్రమలో వార్షికంగా రూ. 40,000 కోట్లమేర క్యాష్‌ఫ్లోకు వీలున్నట్లు మదింపు చేశారు. -
జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్’
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడే ‘టెస్ట్‌బెడ్’ను జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ (డాట్) కార్యదర్శి కె. రాజారామన్ ఈ విషయం వెల్లడించారు. నిర్దిష్ట ఉత్పత్తి లేదా సర్వీసును పరీక్షించేందుకు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ మొదలైనవి ఇందులో ఉంటాయి. సుమారు రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించే ప్రతిపాదనకు 2018 మార్చ్‌లో కేంద్ర టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ఐఐటీ విద్యా సంస్థలు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ దీని రూపకల్పనలో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ సంస్థలకు టెలికం శాఖ స్పెక్ట్రం కేటాయించింది. ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు గడువును మే 26 దాకా లేదా వేలం తర్వాత వ్యాపార అవసరాల కోసం స్పెక్ట్రంను కేటాయించే దాకా పొడిగించింది. చదవండి:5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు -
టెలికాం లెక్కల్లో గోల్మాల్..రూ.890కోట్లు అవినీతి..కాగ్ నివేదిక
సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఐసీఎస్ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, సీ–డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , ఐటీఐ లిమిటెడ్, సీడీఏసీ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఆర్థిక పరిణామాలకు దారితీసేవిగా ఉన్నాయని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) ద్వారా ప్రింట్ మీడియా ప్రకటన విడుదలకు సంబంధించిన ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) విఫలమైందని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితం రూ.1.21 కోట్ల అనవసర చెల్లింపులు జరిగాయని అంచనాలకు వచ్చింది. -
విమానయానం, టెలికం ప్రాజెక్టుల పూర్తి అవశ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికం శాఖ (డీఓటీ)ల్లో మూలధన వ్యయాల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వశాఖలను కోరారు. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ట్వీట్ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మూలధన వ్యయ పురోగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై ఆర్థికమంత్రి సమీక్ష జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మూలధన కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగదల 34.5 శాతంగా ఉంది. విలువలో రూ.5.54 లక్షల కోట్లకు చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ సేవల విస్తరణ వేగవంతం కావాలని కూడా టెలికంశాఖకు ఆర్థికమంత్రి సూచించారు. మానిటైజేషన్ ప్రణాళికపైనా సమీక్ష... సమావేశంలో ఆర్థికమంత్రి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ)కు సంబంధించిన ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలను సమీక్షించినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎంఎన్‌పీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని కేంద్రం పేర్కొంది. -
టెలికం పీఎల్ఐ.. రూ.3,345 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పెట్టుబడి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద టెలికం ఉత్పత్తుల తయారీకి సంబంధించి 31 ప్రతిపాదనలకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. దీనికింద రూ.3,345 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంతర్జాతీయ కంపెనీలైన నోకియా, జబిల్ సర్క్యూట్స్, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, సన్మీనా–ఎస్సీఐ, రైజింగ్ స్టార్తోపాటు.. దేశీయ కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్, టాటా గ్రూపులో భాగమైన అక్షస్త టెక్నాలజీస్, తేజాస్ నెట్వర్క్స్, హెచ్ఎఫ్సీఎల్, సిర్మా టెక్నాలజీ, ఐటీఐ లిమిటెడ్, నియోలింక్ టెలీ కమ్యూనికేషన్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్ పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలకు ఎంపికయ్యాయి. రానున్న నాలుగేళ్లలో ఈ సంస్థలు రూ.3,345 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రతిపాదనలు సమర్పించాయి. తద్వారా 40,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ పథకం అమలయ్యే కాలంలో ఈ సంస్థల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ఉత్పత్తులు తయారీ కానున్నాయి. అందుబాటు ధరల్లో ఉండాలి.. ‘‘మీరు తయారు చేసే ఉత్పత్తులు అందుబాటు ధరల్లో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రూ.3,345 కోట్ల ప్రోత్సాహకాలన్నవి పెద్దవేమీ కావు. మీకు మరింత మొత్తం ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాకపోతే మీరు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నదే షరతు. పరిశ్రమకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ తెలిపారు. ఈ పథకం దేశీయంగా పరిశోధన, నూతన టెలికం ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘పీఎల్ఐ ద్వారా భారత్‌ను టెలికం తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటోంది. దేశీయంగా విలువను జోడించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాం’’అంటూ టెలికం శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా ప్రవీణ్ పేర్కొన్నారు. చిన్న సంస్థలు సైతం.. టెలికం శాఖ ఆమోదించిన 31 దరఖాస్తుల్లో 16 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలవి (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. ఇందులో కోరల్ టెలికం, ఇహూమ్ ఐవోటీ, ఎల్‌కామ్ ఇన్నోవేషన్స్, ఫ్రాగ్ సెల్‌శాట్, జీడీఎన్ ఎంటర్ప్రైజెస్, జీఎక్స్ ఇండియా, లేఖ వైర్లెస్, సురభి శాట్‌కామ్, సిస్ట్రోమ్ టెక్నాలజీస్, టిన్నిఇన్ వరల్డ్‌టెక్ తదితర కంపెనీలున్నాయి. పీఎల్ఐ పథకం టెలికం రంగంలో స్వావలంబనకు (ఆత్మనిర్భర్ భారత్) దారితీస్తుందని టెలికం తయారీదారుల సంఘం టెమా పేర్కొంది. టెలికం ఆపరేటర్ల సంఘం సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పందిస్తూ.. పీఎల్ఐ పథకం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ‘‘భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికం మార్కెట్‌గా ఉంది. టెలికం ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను మార్చడానికి ఈ పథకం సాయపడుతుంది’’ అని కొచర్ ప్రకటించారు. -
మొబైల్ రీఛార్జ్... మోత తప్పదా ?
న్యూఢిల్లీ: టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. టారిఫ్‌లు పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎయిర్టెల్ వెనుకంజ వేయబోదని పేర్కొన్నారు. అయితే ఇది ఏకపక్షంగా చేయలేమని వెల్లడించారు. ఒకరినొకరు... టెలికం టారిఫ్‌లపై సునీల్ మిట్టల్ మాట్లాడుతూ... ‘ఒకరినొకరు చంపడం ఎంతకాలం కొనసాగించగలరు. చాలా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. టారిఫ్‌లను పెంచడం ఎల్లప్పుడూ చెడ్డదిగా అనిపిస్తుంది. గతంలో ఉన్న స్థాయికి తిరిగి తీసుకురండి. ప్రభుత్వం, అధికారులు, టెలికం శాఖ ప్రస్తుత సమస్యపై దృష్టిసారించాలి. భారత డిజిటల్ కల చెక్కుచెదరకుండా చూసుకోవాలి. భారతి ఎయిర్టెల్ ఈక్విటీ మరియు బాండ్ల ద్వారా సమయానుసారంగా తగినంతగా నిధులను సేకరించింది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్‌కు సేవ చేయడానికి కంపెనీ బలంగా ఉంది’ అని వివరించారు. చదవండి : గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ -
మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయి? తెలుసుకోండిలా
హైదరాబాద్: కారణాలు ఏవైనా కావొచ్చు.. మనకు తెలియకుండానే చాలా నంబర్లు తీసేసుకుంటాం. పాత నంబర్ని మరచిపోతుంటాం. అంతేకాదు.. మన పేరు మీద కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది పజిల్లా మారింది. ఈ గుట్టు విప్పేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇలా చేయండి మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మనం ప్రస్తుతం వాడే ఫోన్ నంబర్ని ఎంటర్ చేయాలి. మీ నంబరుకు ఓటిపీ వస్తుంది. దాంతో లాగిన్ అవ్వాలి. ఒక సారి సైట్లోకి లాగిన్ అవగానే మన పేరు మీద ఎన్న నంబర్లు ఉన్నాయనే విషయం డిస్ప్లే అవుతుంది. అక్కడ ఇది నా నంబరు కాదు, అవసరం లేదు, అవసరం ఇలా మూడు ఆప్షన్లు ఇంగ్లీష్‌లో వస్తాయి, ఇందులో అసరం లేదు, మనకు తెలియకుండానే మన పేరు మీద రిజిస్ట్రర్ అయిన నంబర్లను తొలగించుకునే ఆప్షన్ ఉంటుంది. మనకు తెలియని ఏదైనా నంబర్ మన పేరు మీద నమోదు అయి ఉందని తెలిస్తే. ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. చదవండి : యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ -
Narendra Modi: సత్వరం తరలించండి
న్యూఢిల్లీ: పెను తుపానుగా విధ్వంసం సృష్టించే అవకాశమున్న ‘యాస్’ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సహాయ చర్యలు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలను, సంబంధిత కేంద్ర సంస్థలను ఆదేశించారు. విద్యుత్, టెలికం సేవలు నిలిచిపోతే, సాధ్యమైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని సూచించారు. తుపాను కారణంగా కోవిడ్– 19 పేషెంట్ల చికిత్సకు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలగకుండా సమన్వయంతో, ప్రణాళకతో పనిచేయాలని కోరారు. మే 26 సాయంత్రానికి ఉత్తర ఒడిషా, పశ్చిమబెంగాల్ మధ్య యాస్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోందని, అవసరమైన ప్రాంతాలకు సహాయ బృందాలను తరలించడానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని వెల్లడించింది. మరికొన్ని బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపింది. గాలింపు, రక్షణ, సహాయ చర్యల కోసం నౌకాదళం, తీర రక్షకదళం నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉందని పీఎంఓ తెలిపింది. అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సహాయ చర్యల కోసం 11 రవాణా విమానాలను, 25 చాపర్లను సిద్ధంగా ఉంచామని వైమానిక దళం తెలిపింది. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు, విద్యుత్, టెలీకాం సేవల పునరుద్ధరణ, కోవిడ్ రోగుల చికిత్స, వ్యాక్సినేషన్.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరానని అనంతరం ప్రధాని ట్వీట్ చేశారు. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సిద్ధంగా ఉన్నాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ కోరారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. తుపాను ప్రభావం తక్కువ ఉండే అవకాశమున్న ప్రాంతాల్లోనూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన దానికన్నా రెండింతలు సిద్ధంగా ఉండడం వల్ల నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో బృందంలో 47 మంది సుశిక్షిత సిబ్బంది ఉంటారని తెలిపారు. రాష్ట్రాల్లో విపత్తు సహాయక బృందాల సామర్థ్యంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో వారికి సరైన శిక్షణ కూడా లేదన్నారు. ఈ విషయంలో ఒడిశా మాత్రం అద్భుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. -
RIL Q4 Results: ఆర్ఐఎల్ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 13,227 కోట్లకు చేరింది. దీనిలో యూఎస్ షేల్ ఆస్తుల విక్రయం ద్వారా లభించిన రూ. 737 కోట్ల అనుకోని లాభం కలసి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 6,348 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. 2019–20 క్యూ4లో రూ. 4,267 కోట్లమేర అసాధారణ నష్టం నమోదుకాగా.. తాజా(2020–21) త్రైమాసికంలో రూ. 787 కోట్లమేర ఆస్తుల విక్రయ లాభం జత కలసింది. వీటిని మినహాయిస్తే.. నికర లాభం 17 శాతం వృద్ధి సాధించినట్లని విశ్లేషకులు తెలియజేశారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 1,72,095 కోట్లను తాకింది. త్రైమాసికవారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) బిజినెస్ మెరుగుపడినట్లు కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఆర్జనలో టెలికం, రిటైల్ విభాగాల వాటా 33 శాతం నుంచి 45 శాతానికి ఎగసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వాటాదారులకు షేరుకి రూ. 7 డివిడెండ్ ప్రకటించింది. జియో జూమ్: క్యూ4లో టెలికం విభాగం జియో నికర లాభం 47 శాతంపైగా జంప్‌చేసి రూ. 3,508 కోట్లయ్యింది. ఆదాయం 19 శాతం పెరిగి రూ. 18,278 కోట్లకు చేరింది. 1.54 కోట్లమంది సబ్స్క్రయిబర్లను జత చేసుకుంది. అయితే ఇంటర్ కనెక్ట్ యూసేజీ చార్జీల విధానాలలో చేపట్టిన మార్పుల కారణంగా సగటు వినియోగదారు ఆదాయం రూ. 151 నుంచి రూ. 138కు తగ్గింది. 2021 మార్చికల్లా 42.62 కోట్లమంది సబ్స్క్రయిబర్లను కలిగి ఉంది. మార్చిలో జియో ఫోన్ ఆఫర్ కారణంగా వినియోగదారులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక రిటైల్ బిజినెస్‌లో గ్రోసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి రికార్డ్ ఆదాయం సమకూరడంతో నిర్వహణ లాభం 41 శాతం ఎగసింది. రూ. 3,623 కోట్లకు చేరింది. కాగా.. తొలిసారి జియో పూర్తి ఏడాది కార్యకలాపాల నేపథ్యంలో ఫలితాలు విడుదల చేసింది. వెరసి 2020–21లో రూ. 73,503 కోట్ల ఆదాయం, రూ. 12,537 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఓటూసీ, గ్యాస్ విభాగాలు పెట్రోకెమికల్ మార్జిన్లలో రికవరీ కొనసాగినప్పటికీ కోవిడ్–19 కారణంగా రిఫైనరీలు తక్కువ సామర్థ్యంతో పనిచేసినట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. దీంతో ఓటూసీ ఇబిటా 4.6 శాతం నీరసించి రూ. 11,407 కోట్లకు పరిమితమైంది. తూర్పుతీర ప్రాంతంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త డిస్కవరీలలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభంకావడంతో కొన్నేళ్ల తదుపరి వరుసగా రెండో క్వార్టర్లో పన్నుకుముందు లాభాలు నమోదయ్యాయి. కాగా.. పూర్తి ఏడాదికి(2020–21) నికర లాభం 35 శాతం పుంజుకుని రూ. 53,739 కోట్లకు చేరింది. టర్నోవర్ మాత్రం 18 శాతం క్షీణించి రూ. 5,39,238 కోట్లను తాకింది. ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం నీరసించి రూ. 1,996 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఓటూసీ విభాగంలో పటిష్ట రికవరీని సాధించాం. టెలికం, జియోలతో కూడిన డిజిటల్ సర్వీసుల బిజినెస్‌లోనూ ప్రస్తావించదగ్గ వృద్ధిని చూపాం. అధికస్థాయిలకు చేరిన సైట్ల వినియోగ రేటు, డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్టులు మెరుగుపడటం, ఇంధన రవాణా మార్జిన్లు వంటి అంశాలు ఓటూసీ బిజినెస్‌కు జోష్‌నిచ్చాయి. ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితులలో కన్జూమర్ విభాగం దేశానికి డిజిటల్, ఫిజికల్ లైఫ్‌లైన్‌గా వినియోగపడింది. కోవిడ్–19 ప్రజల జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలోనూ 75,000 మందికి ఉపాధి కల్పించాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ -
భారత్ తయారీకి ‘పీఎల్ఐ’ బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్సహా పదమూడు కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగం ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో 520 బిలియన్ డాలర్లకు (డాలర్ మారకంలో రూపాయి విలువ 73గా చూస్తే, దాదాపు 37,96,000 కోట్లు) చేరుతుందన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తయారీ రంగం ఉత్పత్తి దాదాపు 380 బిలియన్ డాలర్లు. దిగుమతులపై ఆధాపడ్డాన్ని తగ్గించడం, ఎగుమతుల పెంపు లక్ష్యంగా మొత్తం 13 రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ.1.97 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించడం పీఎల్ఐ పథకంలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్ఐ స్కీమ్‌పై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారీ వృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తయారీ రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తోంది. వచ్చే ఐదేళ్లకు పీఎల్ఐకి ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ► ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారుకూడా పీఎల్ఐ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ► మౌలిక వనరులకు సంబంధించి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార పరిస్థితులు మరింత మెరుగుపడ్డానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరిశ్రమల రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గడానికి కృషి జరుగుతోంది. ► వివిధ స్థాయిల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహానికి కేంద్రం గడచిన ఆరు, ఏడు సంవత్సరాల్లో పలు విజయవంతమైన చర్యలను తీసుకుంది. ► పలు విభాగాల్లో నియంత్రణా పరమైన క్లిష్టతలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోంది. ► అలాగే విభిన్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికను ప్రవేశపెట్టడానికి తగిన చొరవలను, నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. చిరుధాన్యాల సంవత్సరం... మనకు ఒక అవకాశం 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదముద్ర వేయడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది భారత్ రైతులకు ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణలో చిరుధాన్యాల విలువను తెలియజేడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభించాలని ఆయన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా ప్రచారం భారత్ రైతులకు ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. వృద్ధే బడ్జెట్ లక్ష్యం: వివేక్ దేవ్రాయ్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వృద్ధే లక్ష్యంగా రూపొందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అలాగే పన్ను రేట్లు స్థిరంగా కొనసాగుతాయని కూడా సంకేతాలు ఇచ్చిందని వివరించారు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెంపు లక్ష్యంగా సంస్కరణలపై 2021–22 బడ్జెట్ దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ బీఎఫ్ఎస్ఐ అండ్ ఫిన్‌టెక్ సదసు 2021ని ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత 8 శాతంగా ఉంటుందని అంచనా. ఎగుమతుల పెంపు ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వాస్తవిక వృద్ధిని అందించే రంగాల్లో ఎగుమతులు ఒకటి. అయితే ఎగుమతుల పెరుగుదల ఇంకా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ రంగం ‘నెమ్మది’: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం ఇదే సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఫైనాన్షియల్ రంగం తన పూర్తి స్థామర్థ్యం మేరకు పురోగమించడం లేదని అన్నారు. ఒక రకంగా చాలా నెమ్మదిగా నడుస్తోందన్నారు. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రపంచంలో 55వ ర్యాంకులో ఉందన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ గుప్తా మాట్లాడుతూ, భారత్‌ను వృద్ధి బాటలో సంఘటితంగా ముందుకు నడిపించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రత్యేకించి లాక్డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర మరువలేనిదన్నారు. డిజిటల్ లావాదేవీల పరిమాణం 2020 ఏప్రిల్– 2021 మార్చి 1 మధ్య రూ.4,525 కోట్లకు చేరిందని అన్నారు. -
స్పెక్ట్రం బిడ్డింగ్‌కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
దేశీయంగా తయారీకి భారీ ప్రోత్సాహం
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద టెలికం గేర్ల తయారీకి రూ.12,195 కోట్ల రాయితీలను ఐదేళ్ల కాలంలో ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ‘‘దీంతో వచ్చే ఐదేళ్లలో దేశంలో రూ.2.44 లక్షల కోట్ల మేర టెలికం పరికరాల తయారీ సాధ్యపడుతుంది. ఇందులో రూ.1,95,360 కోట్ల మేర ఎగుమతులు ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశానికి పన్నుల రూపేణా రూ.17,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది’’ అని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టెలికం గేర్ల తయారీకి పీఎల్ఐ పథకం అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.3,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ‘‘టెలికం రంగానికి పీఎల్ఐ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెలికం ఎక్విప్మెంట్ విభాగంలో భారత్‌లో తయారీ ఊపందుకుంటుంది. 5జీ ఎక్విప్మెంట్ కూడా రానుంది. కనుక ప్రోత్సాహకాలు ఇవ్వడం అన్నది కీలక నిర్ణయం అవుతుంది. భాగస్వాములతో ఇప్పటికే విస్తృతమైన సంప్రదింపులు చేశాము’’ అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రూ.50వేల కోట్లకు పైగా టెలికం ఉపకరణాల దిగుమతులకు పీఎల్ఐ పథకం చెక్ పెడుతుందని.. భారత తయారీ ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌కు, ఎగుమతి మార్కెట్లకు అందించడం సాధ్యపడుతుందని ప్రభుత్వం సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. 4 నుంచి 7 శాతం రాయితీలు టెలికం ఉపకరణాల తయారీపై 4 శాతం నుంచి 7 శాతం వరకు అమ్మకాల్లో రాయితీలను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద రాయితీలకు ఎంఎస్ఎంఈలు అయితే కనీసం 10 కోట్లు, ఇతరులకు రూ.100 కోట్ల పెట్టుబడుల నిబంధన అమలు చేయనున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి త్వరలోనే పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో 2014 నాటికి ఎల్రక్టానిక్స్ తయారీ విలువ రూ.1.9 లక్షల కోట్లుగా ఉంటే, 2019–20 నాటికి రూ.5.5 లక్షల కోట్లకు చేరుకున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
అదరగొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ. 13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 11,640 కోట్లు. తాజా మూడో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గినప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు రాణించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51%కి పెరిగింది. పన్నులకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిలయన్స్ రిటైల్‌దే ఉంది. సమీక్షాకాలంలో ఆర్ఐఎల్ ఆదాయం సుమారు 19% క్షీణించి రూ. 1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం (ఓ2సీ) త్రైమాసికాలవారీగా మెరుగుపడినప్పటికీ.. వార్షికంగా మాత్రం తగ్గింది. ఓ2సీ విభాగం పునర్వ్యవస్థీకరణ.. ‘ఓ2సీ (చమురు, రసాయనాలు తదితర విభాగాలు), రిటైల్ విభాగాలు కాస్త కోలుకోవడంతో పాటు డిజిటల్ సేవల విభాగం నిలకడగా వృద్ధి సాధిస్తుండటంతో మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పరిశుభ్రమైన, పర్యావరణహిత అభివృద్ధి సాధన దిశగా కొత్త ఇంధన, మెటీరియల్స్ వ్యాపారాలను విస్తరించేందుకు ఇది సరైన తరుణం. దీనికి అనుగుణంగానే ఓ2సీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి కస్టమర్లకు మరింత చేరువలోకి తెస్తున్నాం. దేశ ఎకానమీలోని ప్రతీ రంగానికి అవసరమైన ఇంధన, మెటీరియల్స్ సొల్యూషన్స్‌ను దీని ద్వారా అందుబాటు ధరల్లో అందించవచ్చు‘ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఓ2సీ ప్లాట్‌ఫామ్ పునర్వ్యవస్థీకరణతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఆదాయాలను ఒకే పద్దు కింద రిలయన్స్ చూపించింది. దీనితో రిఫైనింగ్ మార్జిన్లను ప్రత్యేకంగా ప్రకటించలేదు. జియో జోష్..: త్రైమాసికాలవారీగా చూస్తే.. డిజిటల్, టెలికం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 15 శాతం వృద్ధితో రూ. 3,489 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31 నాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లుగా ఉంది. ప్రతీ యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 145 నుంచి రూ. 151కి పెరిగింది. రిటైల్‌కు ఫ్యాషన్ ఊతం..: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు గణనీయంగా కోలుకోవడంతో రిలయన్స్ రిటైల్ మెరుగైన పనితీరు కనపర్చింది. పన్నుకు ముందస్తు లాభం సుమారు 12 శాతం పెరిగి రూ. 3,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 2,736 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం రూ. 45,348 కోట్ల నుంచి దాదాపు 23 శాతం క్షీణించి రూ. 36,887 కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.. ► కరోనా మహమ్మారి, రేట్లు పడిపోవడం వంటి అంశాలు ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఓ2సీ వ్యాపారం ఆదాయం రూ. 1,19,121 కోట్ల నుంచి రూ. 83,838 కోట్లకు తగ్గింది. ► త్రైమాసికాల వారీగా చూస్తే వడ్డీ వ్యయాలు 29 శాతం తగ్గి రూ. 4,326 కోట్లకు పరిమితమయ్యాయి. ► జియోలో వాటాల విక్రయం ద్వారా రూ. 1,52,056 కోట్లు, రిటైల్‌లో వాటాల విక్రయంతో రూ. 47,265 కోట్లు రిలయన్స్ సమీకరించింది. ► స్థూల రుణ భారం డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 2,57,413 కోట్లకు తగ్గింది. 2020 మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక చేతిలో ఉన్న నగదు రూ. 1,75,259 కోట్ల నుంచి రూ. 2,20,524 కోట్లకు పెరిగింది. కంపెనీ చేతిలో పుష్కలంగా నిధులు ఉండటంతో నికర రుణం మైనస్ రూ. 2,954 కోట్లుగా ఉంది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 2,050 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. -
ట్రాయ్ చైర్మన్‌గా వఘేలా
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు. మరోవైపు, టెలికం రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పదవీ విరమణ చేయనున్న శర్మ తెలిపారు. సర్వీసులకు గట్టి డిమాండ్‌తో పాటు కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగలిగే సామర్థ్యం టెల్కోలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్‌లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్‌లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్‌బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్‌లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్‌లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి. -
వోడాఫోన్ ఐడియాను వీడని ఏజీఆర్ కష్టాలు
స్టాక్ మార్కెట్లో మంగళవారం ఉదయం సెషన్లో టెలికాం రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. టెలికాం సంస్థలు కేంద్రానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేయడంతో ఈ రంగషేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. వోడోఫోన్ ఇండియా షేరు 9శాతం నష్టాన్ని చవిచూడగా, భారతీ ఎయిర్టెల్ షేరు 1.50శాతం పతనమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) ఏజీఆర్ లెక్కల ప్రకారం టెలికాం సంస్థలు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సింది. ఏజీఆర్ బకాయిలు చెల్లింపునకు టెలికాం సంస్థలు కోరిన 20 ఏళ్ల దాకా గడువు అంశంపై కోర్టు ఇరువాదనలు విన్నది. అనంతరం ఏజీఆర్ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇక బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ఈ విషయంలో మరోమాట కూడా వినేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వోడాఫోన్ షేరు రేటింగ్ డౌన్‌గ్రేడ్: ప్రముఖ రేటింగ్ సంస్థ సీఎల్ఎస్ఏ వోడాఫోన్ రేటింగ్‌ను తగ్గించింది. గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘ అండర్‌ఫెమ్‌ఫామ్’’కి డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే షేరు టార్గెట్ ధర రూ.14 నుంచి రూ.9కి తగ్గించింది. ఆర్థికసంవత్సరం 2021, 2022లో సాధించే ఈబిటా కంటే కంపెనీ ఏజీఆర్ చెల్లింపులు 5శాతం నుంచి 30శాతం పెరుగుతాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. ఏజీఆర్ చెల్లింపుల గడువు వాయిదా తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టడంతో వోడాఫోన్ ఐడియా 9శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.9.04)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.8.38 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడిచిన 3నెలల్లో 117శాతం లాభపడింది. -
జియో.. 5జీ గూగులీ!
ముంబై: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం సేవల సంస్థ జియో భారీ ప్రణాళికలకు తెరతీసింది. కొత్త తరం 5జీ సేవలకు సంబంధించిన సొల్యూషన్స్‌ను సొంతంగా దేశీయంగా అభివృద్ధి చేసింది. వీటిని వచ్చే ఏడాదే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అలాగే భారత అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్ ఆధారిత చౌక 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ సాంకేతికతతో రూపొందించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం టెక్ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టింది. అదే సమయంలో డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ దాదాపు రూ. 34 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మేడిన్ ఇండియా 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చని, మరుసటి ఏడాది క్షేత్రస్థాయిలో ఉపయోగంలోకి తేవచ్చని అంబానీ తెలిపారు. ‘5జీ సొల్యూషన్‌ను ప్రారంభ స్థాయి నుంచి పూర్తిగా జియోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిందని చెప్పేందుకు గర్వంగా ఉంది. పూర్తిగా 100 శాతం దేశీ సాంకేతికత, సొల్యూషన్స్‌ను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్ ద్వారా అందరికీ కంప్యూటింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఇది సరైన సమయం. జియోతో భాగస్వామ్యం ఆ దిశగా తొలి అడుగు‘ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. రిలయన్స్ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన ఏజీఎంలో జియోమీట్ ప్లాట్‌ఫాం ద్వారా 48 దేశాల్లోని 550 నగరాల నుంచి ఏకంగా 3.2 లక్షల మంది షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 2జీ విముక్త భారత్.. 5జీ సేవల ముంగిట్లో ఉన్న భారత్‌ను పూర్తిగా 2జీ నుంచి విముక్తం చేయాలన్న లక్ష్యం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం 2జీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న దాదాపు 35 కోట్ల మంది భారతీయులను చౌక స్మార్ట్ఫోన్ల వైపు మళ్లేలా చేయాల్సి ఉందని అంబానీ తెలిపారు. ‘చాలా మంది ఫీచర్ ఫోన్ యూజర్లు కాస్త చౌకగా ఉండే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఈ సవాలును ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నాం. మనం ఎంట్రీ లెవెల్ 4జీ .. అంతకు మించి ఆఖరుకు 5జీ స్మార్ట్ఫోన్లయినా సరే ప్రస్తుతమున్న ధరకన్నా అత్యంత చౌకగా డిజైన్ చేయగలమన్న నమ్మకం ఉంది‘ అని అంబానీ తెలిపారు. అయితే, ఇందుకోసం భారత్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అవసరమన్నారు. టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇది సుసాధ్యం కాగలదని చెప్పారు. భారత్ స్థాయిలో 5జీ సొల్యూషన్స్ ఉపయోగం నిరూపితమైన తర్వాత వీటిని అంతర్జాతీయంగా ఇతర టెల్కోలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్చ్.. సౌదీ ఆరామ్కో కుదరలేదు.. చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో సంస్థకు వాటాలు విక్రయించాలన్న ప్రతిపాదన అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదని అంబానీ చెప్పారు. కరోనా వైరస్ సంబంధ పరిణామాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. సౌదీ ఆరామ్కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న అంబానీ.. డీల్ ప్రస్తుత స్థితి గురించి వెల్లడించలేదు. సౌదీ ఆరామ్కో సంస్థకు ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సుమారు 15 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రిలయన్స్ గతేడాది ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీస్తున్నట్లు, 2021 తొలినాళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంబానీ చెప్పారు. ఆన్లైన్ ఏజీఎం రికార్డు వర్చువల్ విధానంలో నిర్వహించిన రిలయన్స్ ఏజీఎంలో రికార్డు స్థాయిలో షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి దాదాపు 3.2 లక్షల మంది ఇందులో పాల్గొన్నట్లు కంపెనీ వెబ్సైట్ వెల్లడించింది. ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద వర్చువల్ ఏజీఎంగా అంచనా. రిలయన్స్‌కి 26 లక్షల పైచిలుకు షేర్హోల్డర్లు ఉన్నారు. 2035 నాటికి జీరో కార్బన్ ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్, హైడ్రోజన్ మొదలైన వాటిని అందుబాటులోకి తెస్తామని అంబానీ చెప్పారు. టెక్నాలజీ సాయంతో కర్బన ఉద్గారాలను ఉపయోగకర ఉత్పత్తులు, రసాయనాల కింద మార్చడంపై దృష్టి పెడతామన్నారు. తద్వారా 2035 నాటికి కార్బన్–జీరో సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. జియో గ్లాస్.. ఆన్లైన్ విప్లవం మిక్సిడ్ రియాలిటీ సర్వీసులు అందించే జియో గ్లాస్‌ను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. 25 ఇన్‌బిల్ట్ యాప్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్‌తో కాల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో జరిగే సమావేశాల్లో ఇంటి వద్ద నుంచే పాల్గొనడం, ఉపాధ్యాయులు 3డీ వర్చువల్ రూమ్స్ ద్వారా హోలోగ్రామ్ తరగతులను నిర్వహించడం తదితర అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ ఎం థామస్ తెలిపారు. దీని ధర ఎంత ఉంటుందన్నదీ వెల్లడించకపోయినప్పటికీ, మార్కెట్లో ఈ తరహా గ్లాస్‌ల రేటు సుమారు రూ. 37,000–40,000 స్థాయిలో ఉంటోంది. జియో మీట్ 50 లక్షల డౌన్లోడ్స్.. దేశీయంగా తొలి క్లౌడ్ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే 50 లక్షల డౌన్లోడ్స్ నమోదయ్యాయని అంబానీ తెలిపారు. మరో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌కు పోటీగా జియో దీన్ని ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పనిచేస్తుంది. జూమ్లాగా 40 నిమిషాల కాలపరిమితి లాంటివి ఇందులో ఉండవని, 24 గంటలూ కాల్స్ కొనసాగించవచ్చని జియో పేర్కొంది. గూగుల్ 33,373 కోట్లు ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా జియోలో టెక్ దిగ్గజం గూగుల్ 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. దీని ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ. 4.36 లక్షల కోట్లుగా ఉంటుంది. గత వారమే సుమారు రూ. 4.91 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో జియోలో చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ఇన్వెస్ట్ చేసింది. తాజాగా జియోలో ఇన్వెస్ట్ చేసిన దిగ్గజాల్లో గూగుల్ 13వది. కేవలం 12 వారాల వ్యవధిలో వాటాల విక్రయం ద్వారా జియో సుమారు రూ. 1,52,055 కోట్లు సమీకరిం చినట్లయింది. 32.94 శాతం వాటాలు విక్రయించింది. గూగుల్‌కి వాటాల అమ్మకంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి తొలి దశ పెట్టుబడుల సమీకరణ పూర్తయినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. రుణరహిత కంపెనీ.. గడిచిన మూడు నెలల్లో రిలయన్స్ మొత్తం మీద రూ. 2,12,809 కోట్లు సమీకరించినట్లు అంబానీ తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులతో పాటు రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు, ఇంధన రిటైల్ వెంచర్లో బ్రిటన్ దిగ్గజం బీపీ చేసిన రూ. 7,629 కోట్ల పెట్టుబడులు కూడా వీటిలో ఉన్నాయి. ‘2021 మార్చి కన్నా ముందుగానే రిలయన్స్ ప్రస్తుతం నికరంగా రుణ రహిత కంపెనీగా మారింది. జియో, రిటైల్, చమురు–రసాయనాల (ఓ2సీ) వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా పటిష్టంగా మారింది‘ అని అంబానీ తెలిపారు. ఆయా ఒప్పందాలకు సంబంధించిన నిధులు దఖలు పడిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరంగా రుణ రహిత సంస్థగా మారనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో 75 శాతం నిధులు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. ఏప్రిల్ 22న ఫేస్బుక్ రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ (9.99 శాతం వాటా) చేయడం ద్వారా మొదలైన పెట్టుబడుల పరంపర ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఆరు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, చిప్ తయారీ సంస్థలు ఇంటెల్ కార్పొరేషన్ .. క్వాల్కామ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. షేరు... రేసు గుర్రమే! గత ఏజీఎమ్ (12–8–2019) నాటి ధర రూ.1,151 ఏడాది కనిష్ట ధర (23–3–2020) రూ.867 బుధవారం ఆల్‌టైమ్ గరిష్ట ధర (15–7–2020–ఇంట్రాడే) రూ.1,978 జియోలో 7.7 శాతం వాటా కొనుగోలు... జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టరుగా గూగుల్‌ను సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య, పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనితో తొలి దశ పెట్టుబడుల సమీకరణ లక్ష్యం పూర్తయ్యింది. కోట్లాది మంది భారతీయులకు ఉపయోగకరమైన సమాచారాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. జియో తరహాలోనే కొంగొత్త మార్పులు, నవకల్పనలను ఆవిష్కరిస్తోంది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్ డిజిటలీకరణలో జియో ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించగలిగితే మిగతా అందరు యూజర్లకు కూడా అనువైన ఉత్పత్తులను రూపొందించవచ్చన్న మా అభి ప్రాయానికి ఊతమిస్తోంది. జియోతో భాగస్వామ్యం ద్వారా కోట్ల మంది భారతీయులకు స్మార్ట్‌ఫోన్‌ను మరింత అందుబాటులోకి తేగలదని ఆశిస్తున్నాం. – సుందర్ పిచాయ్, సీఈవో, గూగుల్ -
చైనీస్ పరికరాలకు చెక్- ఐటీఐ స్పీడ్
టెలికం రంగంలో చైనీస్ పరికరాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించనున్నట్లు వెలువడిన వార్తలు పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 14.5 శాతం దూసుకెళ్లింది. రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 108 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ 32 శాతం జంప్‌చేసింది. ట్రేడింగ్ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 9.3 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! డాట్ దన్ను చైనా కంపెనీల నుంచి 4జీ పరికరాల కొనుగోలును నిలువరించవలసిందిగా ప్రభుత్వ రంగ కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను టెలికం శాఖ(డాట్) ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. చైనా కంపెనీల నుంచి దూరంగా ఉండాల్సిందిగా ప్రయివేట్ రంగ టెలికం దిగ్గజాలను సైతం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐటీఐ షేరుకి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ విభాగంలో పీఎస్‌యూ అయిన ఐటీఐ లిమిటెడ్ సేవలందిస్తున్న విషయం విదితమే. కంపెనీ డిఫెన్స్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్, ఆప్టికల్, డేటా నెట్వర్క్, పాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర పలు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా టెలికం టర్న్‌కీ ప్రాజెక్టులుసహా టెలికం సొల్యూషన్స్‌నూ అందిస్తోంది. -
దలాల్ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారు జాగ్రత్త..!
దలాల్ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారని, ఈ నేపథ్యంలో అప్రమత్తత వహించాలంటూ ప్రముఖ మార్కెట్ నిపుణుడు విజయ్ ఖేడియా హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో కొత్త సంపన్నుల రాకతో భారత స్టాక్ మార్కెట్ రద్దీగా మారినట్లు ఖేడియా తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రజలందరూ తమ ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను నిలిపివేసి ఇళ్లకు పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో ఇండియా డిపాజిటరీ గణాంకాలను పరిశీలిస్తే ఈ లాక్డౌన్ కాలం(3నెలలు)లో కొత్త డీమాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 18లక్షల కొత్త డిమాండ్ అకౌంట్లు మార్చి-మే నెలలో పుట్టుకొచ్చినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెర్ నివేదికలు చెబుతున్నాయి. మార్కెట్లోకి ఈ కొత్తగా ప్రవేశించినవారిని ఇన్వెస్టర్లు లేదా ట్రేడర్లుగా అని పిలుస్తారని, కాని తాను మాత్రం వారిని జూదగాళ్లుగా పిలవడానికి ఇష్టపడతానని ప్రజలను పేర్కోన్నారు. వీరికి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పందెం కాయడానికి చట్టపరమైన హక్కులు ఉన్నాయన్నారు. జూదగాడికి, ఫ్యూచర్స్ ట్రేడర్‌కు మధ్య ఒక చిన్న తేడా ఉంటుందని, జూదగాడు ఊహాగానాలను విశ్వసిస్తారని ఆయన తెలిపారు. అందుకే ఈక్విటీ మార్కెట్ భారీగా ఒడిదుడుకులకు లోనవుతుందని తెలిపారు. అయితే లాక్డౌన్ టైంలో మార్కెట్లోకి వచ్చిన నిజమైన ఇన్వెస్టర్లకు ఆయన రెండు సలహాలిచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్‌కు దూరంగా ఉండమని, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ద్వారా వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఖేడియా తెలిపారు. మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే: నిఫ్టీ ఇండెక్స్ మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే కదలాడేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు విజయ్ ఖేడియా అభిప్రాయపడ్డారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్-19 అంశాల నుంచి మరో 6-9 నెలల పాటు ప్రతికూల వార్తలనే ఊహించవచ్చు. ఈ వార్తలు మార్కెట్ సెంటిమెంట్ బలహీనపరిస్తాయి. మారిటోరియం విధింపు నిషేధం ముగింపు తర్వాత ఎన్పీఏలపై స్పష్టత వస్తుంది. ఇది మార్కెట్ తదుపరి గమనానికి కీలకం అవుతుంది.’’ అని ఆయన పేరొన్నారు. ఫార్మా, ఐటీ, టెలికాం షేర్లు మార్కెట్ నడిపిస్తాయి: ఫార్మా, ఐటీ, టెలికాం రంగాలకు చెందిన షేర్లపై ఖేడియా బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నారు. ఈ 3 రంగాల షేర్లు ఈ ఏడాది మార్కెట్‌ను నడిపిస్తాయని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఫార్మా షేర్లు బాగా అప్‌ట్రెండ్ మూమెంటమ్‌ను కలిగి ఉన్నాయన్నారు. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 33 శాతం వెయిటేజీని కలిగి ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీగా క్షీణించవచ్చని ఖేడియా తెలిపారు.