
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు భారతదేశం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సిమ్ కార్డుల అమ్మకాలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల భద్రతను పెంచుతూ, వాటి దుర్వినియోగాన్ని కట్టడి చేసి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా కొత్త నిబంధనలు అమల్లోకి తేనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను టెలికాం ఆపరేటర్లకు అందించింది.
సిమ్ కార్డు అమ్మకందారులకు కఠిన నిబంధనలు
భారత ప్రభుత్వం అన్ని టెలికాం ఆపరేటర్లకు సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించింది. టెలికాం ఆపరేటర్ల సిమ్ కార్డు అమ్మకందారులు మార్చి 31, 2025 లోగా రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది.
కీలక మార్పులు
సిమ్ కార్డు అమ్మకందారుల రిజిస్ట్రేషన్: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రధాన సంస్థలతో సహా అన్ని టెలికాం ఆపరేటర్లు తమ ఏజెంట్లు, ఫ్రాంచైజీలు, సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది సిమ్ జారీ ప్రక్రియలో పారదర్శకతను, భద్రతను పెంచుతుందని ప్రభుతం భావిస్తుంది.
గడువు: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం ఆపరేటర్లకు తగినంత సమయం ఇస్తూ ప్రభుత్వం గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే ఈ ప్రక్రియలో విఫలమైతే ఏ ఆపరేటర్ అయినా ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డులను విక్రయించకుండా నిషేధానికి గురవుతారు.
సిమ్ కార్డుల పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ పేరుతో అనుమతించిన తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ రిజిస్టర్ చేసిన సిమ్‌లు ఉంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఇదీ చదవండి: పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
మార్పులకు కారణం..
సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో సిమ్ కార్డుల అమ్మకాలపై నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నమోదు కాని సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు మోసపూరిత కార్యకలాపాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి సంఘటనలను గుర్తించడం, వాటిని దర్యాప్తు చేయడం సవాలుగా మారుతుంది. సిమ్ కార్డ్ అమ్మకందారులందరూ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం సాధ్యం అవుతుంది.