
ఫోన్లో మాటను డేటా ఆక్రమించింది. 2జీ స్కామ్ విచారణ జరుగుతుండగానే... 4జీ హల్‌చల్ చేస్తోంది. లైసెన్సుల కోసం వేల కోట్లు ఖర్చుబెట్టి వచ్చిన కంపెనీలు... మోయలేనంత రుణాల్లో కూరుకుపోయాయి. బహుశా! టెలికం మార్కెట్లోకి రిలయన్స్ గనక జియో పేరిట రంగప్రవేశం చేయకపోతే ఈ అప్పులు... ఈ నష్టాలతో కూడా పలు కంపెనీలు కొనసాగేవేమో!! జియో రాక వీటి నిష్క్రమణను వేగిరపరిచింది. మార్కెట్ లీడర్లకే టెలికామ్‌లో స్థానముందని స్పష్టంగా చెప్పింది. ఫలితం... ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను, ఒక్కో సర్కిల్‌లో కార్యకలాపాలకు గుడ్‌బై చెబుతున్న ఎయిర్‌సెల్‌ను... ప్రత్యేక కార్యకలాపాలకే పరిమితమవుతున్న ఆర్‌కామ్‌ను మినహాయిస్తే... ఈ రంగంలో మిగులుతున్నవి మూడే!! ఒకటి... ఐడియా–వొడాఫోన్‌ల విలీన సంస్థ... రెండోది ఎయిర్‌టెల్... మూడోది జియో!! కాకపోతే ఈ మూడూ నిలదొక్కుకోవటానికి ఎన్నో వ్యూహాలు అమలు చేశాయి. మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఆ వివరాలే ఈ కథనం... – సాక్షి బిజినెస్ విభాగం
జియో.. ముకేశ్ రెండో ‘విన్నింగ్స్’
రిలయన్స్ కమ్యూనికేషన్‌ను తమ్ముడికి అప్పగించేసినా టెలికామ్‌పై ముకేశ్ అంబానీ మమకారం మాత్రం పోలేదు. కాకపోతే రిలయన్స్ జియో పేరిట ఆయనిచ్చిన ఎంట్రీ చాలా వ్యూహాత్మకమైనది. 2జీ, 3జీ స్పెక్ట్రమ్ కోసం ఇతర కంపెనీలు వేల కోట్లు ఖర్చు చేయగా... భవిష్యత్ అంతా డేటాదేనని ఊహించిన ముకేశ్... రూ.12,800 కోట్లు వెచ్చించి 2011లోనే 4జీ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తరవాత ప్రభుత్వానికి దాదాపు రూ.1,700 కోట్లు చెల్లించి దేశవ్యాప్తంగా 4జీ ద్వారా వాయిస్, డేటా సేవలందించేందుకు లైసెన్సు పొందారు. ఇతరత్రా ఒప్పందాలు, సొంత టవర్లతో బీభత్సమైన నెట్‌వర్క్‌ను సృష్టించారు. పూర్తిగా ఉచితం... అనే నినాదంతో మార్కెట్‌లో పాగా వేశారు. ఆ తరవాత ప్రతి 3 నెలలకూ రూ.399తో అన్‌లిమిటెడ్ డేటా అంటూ ప్రచార తీవ్రతను పెంచుతూ పోతున్నారు. ఇదిగో... ఈ వ్యూహమే ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. ఐడియా–వొడాఫోన్ విలీనానికి సిద్ధమయినా, టాటాలు, టెలినార్ తమ నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్‌కు అప్పగించేసినా, ఆర్‌కామ్‌తో విలీనానికి ఎయిర్‌సెల్, ఎంటీఎస్ సిద్ధపడినా... ఇవన్నీ జియో వల్లేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదేమో!!
అనతికాలంలోనే...: సర్వీసులు ప్రారంభించిన 83 రోజుల్లోనే 5 కోట్ల మంది వినియోగదారులు జియో గూటికి చేరారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 14.5 కోట్లు. ఈ ఏడాది మార్చినాటికి జియో నష్టాలు రూ.22.50 కోట్లే కానీ... గతేడాది మార్చి 31కి రూ.32,963 కోట్లుగా ఉన్న కంపెనీ రుణ భారం ఈ ఏడాది మార్చినాటికి రూ.47,463 కోట్లకు చేరుకుంది. ఐఐఎఫ్‌ఎల్ అంచనాల ప్రకారం.. కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,600 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11,500 కోట్ల చొప్పున నష్టపోవచ్చు. 2021–22లో మాత్రమే లాభ, నష్ట రహిత స్థితిని చేరుకోవచ్చు. అయితే రిలయన్స్ ఇప్పటికే జియోపై రూ.2 లక్షల కోట్లు వెచ్చించింది. మరో 50 వేల కోట్లు పెట్టుబడులకు సిద్ధంగానే ఉంది. మున్ముందు డేటా వినియోగం పెరుగుతుంది కనక... పరిశ్రమలో తక్కువ కంపెనీలే ఉంటాయి కనక జియో కాస్త ముందే బ్రేక్ ఈవెన్ సాధించవచ్చన్నది మరికొందరి మాట.
ఎయిర్‌టెల్ తప్పులు చేసినా... కొనుగోళ్లు కలిసొచ్చాయి
బహుశా! సునీల్ భారతీ మిట్టల్‌కు తాను మారుతీ డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసినపుడు అది దక్కినట్టయితే ఈ ఎయిర్‌టెల్ అనే కంపెనీ ఆవిర్భవించేది కాదేమో!! తాము అప్పట్లో సునీల్ మిట్టల్ దరఖాస్తును తిరస్కరించటం గుర్తుకొచ్చినపుడు మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ ఈ వ్యాఖ్య చేస్తుంటారు. నిజం! 1995లో ప్రారంభమైన ఎయిర్‌టెల్... ఇపుడు భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా సహా 17 దేశాల్లో సేవలందిస్తోంది. ఆఫ్రికాలో జెయిన్ టెలికామ్‌ను మినహాయిస్తే... విదేశీ కొనుగోళ్లు, వాటాల కైవసం చాలావరకూ దీనికి కలిసొచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం దేశీ టెలిఫోనీ మార్కెట్లో 26 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో 24.7 శాతం వాటా సొంతం చేసుకుంది ఎయిర్‌టెల్. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రూ.2.09 లక్షల కోట్లు కాగా... రూ.లక్ష కోట్లకుపైగా రుణాలు కూడా ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రుణాల్లో అత్యధికం స్పెక్ట్రమ్ కోసం చేసినవేనని చెప్పొచ్చు. ఎందుకంటే 2010 మేలో 3జీ స్పెక్ట్రమ్ వేలం జరిగినపుడు ఎయిర్‌టెల్ ఏకంగా దాదాపు 1.2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి (19 బిలియన్ డాలర్లు) దేశంలోని 13 సర్కిళ్లకు లైసెన్సు పొందింది. ఇక వొడాఫోన్, ఐడియాలతో స్పెక్ట్రమ్ షేరింగ్ ఒప్పందం చేసుకుని మరో 9 సర్కిళ్లలో 3జీ సేవలందిస్తోంది. ఇక 2010 మేలో బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ) 4జీ స్పెక్ట్రమ్ వేలం జరిగింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, పంజాబ్, కోల్‌కతా సర్కిళ్లలో సేవలకు గాను ఎయిర్‌టెల్ 520 మిలియన్ డాలర్లు చెల్లించింది.
ఎయిర్‌టెల్ కొనుగోళ్లు, విలీనాలు ఇవీ..
2008లో 45 బిలియన్ డాలర్లతో సౌతాఫ్రికాకు చెందిన ఎంటీఎన్ టెలికంను కొనే ప్రయత్నాలతో భారతీ విదేశీ కొనుగోళ్ల ప్రస్థానం మొదలైంది. అయితే, ఆ డీల్ కుదరకపోయినప్పటికీ... ఆ తరవాత 10.7 బిలియన్ డాలర్లు వెచ్చించి 15 ఆఫ్రికా దేశాల్లో సేవలందిస్తున్న కువైట్‌కు చెందిన జైన్ మొబైల్ ఆఫ్రికా కార్యకలాపాలను సొంతం చేసుకుంది. ఇది తాము చేసిన తప్పిదంగా ఇప్పటికీ సునీల్ మిట్టల్ చెబుతుంటారు. ఇక ఉగాండాలో వారిద్ టెలికామ్‌తో పాటు దేశీయంగానూ పలు బ్రాడ్‌బ్యాండ్ సంస్థల్ని కొనుగోలు చేసింది. ఇక ఈ ఫిబ్రవరిలో నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ అనుబంధ సంస్థ టెలినార్ ఇండియాను... మార్చిలో టికోనా డిజిటల్ నెట్‌వర్క్స్‌ను సొంతం చేసుకుంది. వీటితో అటు మొబైల్, ఇటు బ్రాడ్‌బ్యాండ్‌లో మరింత ముందుకెళ్లిందని చెప్పొచ్చు. తాజాగా రువాండాకు చెందిన మిల్లీకామ్ ఇంటర్నేషనల్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇవన్నీ కలిసి... ఇపుడు భారతీ ఎయిర్‌టెల్‌ను పెద్ద బహుళజాతి కంపెనీగా మార్చాయనటంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.
వినియోగదారులకు లాభమేంటి?
వాయిస్, డేటా టారిఫ్‌లు ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. కంపెనీలు పోటీలు పడి మరీ ఆఫర్లనిస్తున్నాయి. విలీనం తరవాత 3–4 కంపెనీలే మిగిలే అవకాశాలుండడంతో దీర్ఘకాలంలో టారిఫ్‌లు పెరిగే అవకాశాలే ఎక్కువనే అంచనాలున్నాయి. లాభాలు నిలుపుకోవటానికి ఈ పెద్ద కంపెనీలు ఒక అంగీకారానికి వచ్చి, టారిఫ్‌లను తగ్గించక పోవచ్చని, కుమ్మక్కై ధరలు పెం చినా ఆశ్చర్యం లేదనేది నిపుణుల మాట.
ఐడియా–వొడాఫోన్ కలుస్తున్నారు గెలవటానికి...
హచిసన్–ఎస్సార్ కొనుగోలుకే రూ.లక్ష కోట్లవరకూ వెచ్చించిన వొడాఫోన్... ఏటీ అండ్ టీ, టాటా నిష్క్రమించినా నష్టాలతో కొనసాగుతున్న ఐడియా... విడిగా ఉంటే రెండింటికీ ఇబ్బందే. రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే. అందుకే విలీనమై నెంబర్–1 అవుతున్నాయి. విలీనానంతరం 40 కోట్లకుపైగా వినియోగదారులతో 35 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానం దీని చేతికొస్తుంది. రెవెన్యూ పరంగా చూసినా 43 శాతం వాటా దీని చేతిలోనే ఉంటుంది. విలీనం పూర్తయిన మూడేళ్ల తరవాత... ఈ రెండింటి ఖర్చులూ దాదాపు ఏటా రూ.15వేల కోట్ల దాకా మిగులుతాయనేది విశ్లేషకుల అంచనా. వొడాఫోన్ మెట్రోలు, పట్టణ ప్రాంతాల్లోనూ ఐడియా గ్రామీణ ప్రాంతాల్లోనూ బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ విలీన సం స్థ ఆదాయాలు ఇతర కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. విడివిడిగా చూస్తే, ఐడియా, వొడాఫోన్ కంపెనీలకు ఎయిర్‌టెల్, జియోలతో పోల్చితే 3జీ, 4జీ స్పెక్ట్రమ్ తక్కువ. డేటా వినియోగం బాగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విలీనమైతేనే పోటీ ఇవ్వగలమని ఈ రెండూ భావించాయని, అందుకే విలీనం సాధ్యమవుతోందనేది సంబంధిత వర్గాల మాట. ఈ రెండు సంస్థల రుణ భారం గతేడాది డిసెంబర్ నాటికి రూ.1.07 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment