
మొదటిరోజు మంచి స్పందన
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.
అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment