
టెలికంలో పరిస్థితులు సర్దుకుంటాయి
♦ ఉద్యోగాలకేమీ ఢోకా లేదు
♦ కేంద్ర మంత్రి సిన్హా
న్యూఢిల్లీ: కొత్త సంస్థలు ప్రవేశించినప్పుడు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం సహజమేనని, కన్సాలిడేషన్ తర్వాత టెలికం రంగంలో పరిస్థితులు చక్కబడగలవని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. టెలికం రంగంలో ఉద్యోగాలకేమీ ఢోకా లేదన్నారు. ‘టెలికం రంగం ఓపెన్ మారెŠక్ట్‌లాంటిది. కొత్త సంస్థలేమీ రాకూడదంటూ నిరోధించలేము. 2003లోనూ కొత్త కంపెనీలు వచ్చినప్పుడు మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత 1–2 ఏళ్లలో అంతా సర్దుకుంది.
ఇప్పుడుకూడా ఉద్యోగాలకేమీ సమస్య రాదు‘ అని సిన్హా తెలిపారు. చాలా దేశాల్లో రెండో మూడో టెలికం కంపెనీలు మాత్రమే ఉన్నాయని, అలాగే మన దగ్గర కూడా 4–5 సంస్థలు ఉండే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా 10 టెల్కోలు ఉన్నాయి. మూడేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్తగా రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించాక చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.