
దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.
ఎస్‌యూసీ అంటే ఏమిటి?
స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్‌యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.
రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం
2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్‌యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.
టెలికాం రంగంపై ప్రభావం ఇలా..
ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.
లబ్ధిదారులు ఎవరంటే..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!
సవాళ్లు ఇవే..
ఎస్‌యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది.