దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్‌వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment