సాక్షి, హైదరాబాద్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)తో ఏర్పరచుకున్న సుదీర్ఘ్ఘ అనుబంధాన్ని ఆ సంస్థ మెజార్టీ ఉద్యోగులు శుక్రవారం స్వచ్ఛందంగా తెంచుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) ప్రవేశపెట్టడంతో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ శ్రేణికి చెందిన ఐదు పదుల వయసు దాటిన ఉద్యోగులందరూ పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్‌ఎస్ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్‌ఎస్ తీసుకున్నారు.ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు సంస్థ ఆస్తుల్లో కొన్నింటిని లీజులు, అద్దెలకు ఇచ్చింది. తాజాగా ఉద్యోగుల వీఆర్‌ఎస్‌తో మిగిలిన భవన సముదాయాలు సైతం ఖాళీ ఆయ్యాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ
నగరంలోని ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ అయింది.ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లోని కొన్ని అంతస్తులను జీఎస్‌టీ శాఖకు అద్దెకివ్వగా ఖాళీ అయిన మిగిలిన అంతస్తులు సైతం అద్దెకు ఇచ్చేందుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.
అదేవిధంగా నగరంలోని లింగంపల్లి, చార్మి నార్, చాంద్రాయణగుట్ట, నాచారం, గౌలిగూడ, తిరు మలగిరి, చర్లపల్లి, అమీర్‌పేట, ఎర్రగడ్డలోని టెలికం భవనాల్లో వివిధ అంతస్తులు, సరూర్‌నగర్‌లోని ఏరియా మేనేజర్ ఆఫీసు, ఎస్‌డీఓటీ ఆఫీసు, తిరుమలగిరిలోని సిబ్బంది నివాస సమదాయంలోని వివిధ అంతస్తులు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, నాచారం, కాచిగూడ, ఖైరతాబాద్, సరూర్‌నగర్, పద్మారావు నగర్, గౌలిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కుషాయిగూడలలోని టెలికం భవనాల్లో, కోటిలోని నివాస సముదాయాల్లో, సైఫాబాద్‌లోని టెలికం భవన్‌ల్లో ఏటీఎంలకోసం 100 ఎస్‌ఎఫ్‌టీ వంతున అద్దెకు ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.
నగరంలో ఇలా...
హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు. మిగతా వారిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్ సర్కిల్ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment