IT Companies Employees List Of Layoffs - Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన.. లిస్టులో భారతీయులే ఎక్కువ.. ఎందుకీ పరిస్థితి?

Published Sat, Feb 18 2023 12:33 AM | Last Updated on Sat, Feb 18 2023 11:09 AM

IT Companies Employees List Of Layoffs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో చిన్న, పెద్ద కంపెనీలన్నీ పొదుపు మంత్రం పఠిస్తూ ఉద్యోగాల్లో భారీ కోతలు పెడుతున్నాయి. గతంలో అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్న సంస్థలు.. కోవిడ్‌ వ్యాప్తి అనంతరం చోటుచేసుకున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వేలాది మందిని తొలగించేస్తున్నా యి.

ఉద్యోగాల్లో చేరి పట్టుమని 10 రోజులు పూర్తికాని వారు మొదలు ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్లను సైతం పక్కన పెట్టేస్తున్నాయి. ఈ ప్రభావం ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాల ఉద్యోగులపైనే ఎక్కువగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటివరకు 17,400 మంది ఐటీ ఉద్యోగులు ఉద్వాసనకు గురవగా వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.. మొత్తంమీద ఇప్పటివరకు 340కిపైగా సంస్థలు, కార్పొరేషన్లు, బడా కంపెనీలు లక్ష మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఈ ట్రెండ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ పడే పరిస్థితులు కనిపించడం లేదని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఎందుకీ పరిస్థితి? 
ప్రముఖ ఆర్థిక, రాజకీయరంగ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం ఐటీ వ్యాపారాలు అత్యధికంగా ఎగుమతుల ప్రధానమైనవి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ కంపెనీలు ప్రపంచ మార్కెట్‌కు ఎక్కువగా దోహదపడేవిగా ఉన్నాయి. అందువల్ల ప్రపంచ ఆర్థిక రంగంలో వచ్చే మార్పులకు అవి కూడా లోనవుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి, ఆ తర్వాత రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా–చైనాల వాణిజ్య చిక్కులు పశ్చిమ దేశాల ఆర్థిక రంగంపై సవాళ్లు విసురుతున్నాయి.

అందువల్ల ఈ పరిణామాల ప్రభావం భారత ఐటీ రంగంపైనా పడుతోంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కంపెనీల యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. కరోనా కాలంలో ఐటీ రంగం అసహజమైన వృద్ధిని సాధించింది. గతంలో కంపెనీలు సాధారణ రిక్రూట్‌మెంట్‌ కంటే ఎక్కువ చేశాయి. ఇప్పుడు సిబ్బందిని తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి సాంకేతికత మరింతగా అందుబాటులోకి రావడంతో అధిక నైపుణ్యం ఉన్న వారు కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ రంగంలోనే ఉద్యోగులు, కార్మికుల వేతనాలు తగ్గుతున్నాయి. 

ముందు వరుసలో బడా కంపెనీలు... 
ఉద్యోగుల తొలగింపు సంఖ్యను లెక్కిస్తున్న layoffs.fyi వెబ్‌సైట్‌ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 345 టెక్‌ కంపెనీలు 1,03,767 మందికి లేఆఫ్‌ ప్రకటించాయి. ఇది 2022 వ్యాప్తంగా జరిగిన అన్ని టెక్‌ బిజినెస్‌ లేఆఫ్‌లలో 64 శాతం కావడం గమనార్హం. గతేడాది 1,045 ఐటీ, టెక్‌ కంపెనీలు 1,60,097 ఉద్యోగులను తొలగించాయి.

ఉద్యోగుల తొలగింపులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్‌ మరికొన్ని దిగ్గజ సంస్థలు ముందు వరసలో ఉన్నాయి. జనవరిలోనే ప్రపంచవ్యాప్తంగా 288 సంస్థలు, పరిశ్రమలు 3,300 ఐటీ నిపుణులకు ఉద్వాసన పలికాయి. ఈ నెలలో ఉద్వాసనలపర్వం మొదలుపెట్టిన టెక్‌ దిగ్గజాల్లో యాహూ, బైజూస్, గోడ్యాడీ, గిట్‌హబ్, ఈబే, ఆటోడెస్క్, ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ ఉన్నాయి. మొత్తంమీద చూస్తే యాపిల్‌ సంస్థ మినహా పెద్ద టెక్‌ సంస్థలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement