2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? | Why Tech Companies Are Going For Mass Layoffs Here Is Ful Analysis On It | Sakshi
Sakshi News home page

2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం?

Published Thu, Nov 24 2022 9:58 AM | Last Updated on Thu, Nov 24 2022 1:11 PM

Why Tech Companies Are Going For Mass Layoffs Here Is Ful Analysis On It - Sakshi

► (కంచర్ల యాదగిరిరెడ్డి) 
క్రికెట్‌ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. కోవిడ్‌ కష్టాలు ముగిసి మార్కెట్‌ పట్టాలెక్కుతోందని అందరూ అనుకుంటున్న సమయంలో మాంద్యం వార్తలు, ఐటీ కంపెనీల భారీ లేఆఫ్‌లు, కేవలం రెండు మాసాల్లో 1.25 లక్షలకు పైగా ఉద్యోగాలు పోవడం.. టెకీలకు, వారి కుటుంబసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

మాంద్యంపై సర్వత్రా చర్చ 
పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఉద్యోగులు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కార్లు కొనుగోలు చేయవద్దని అమెజాన్‌ సీఈఓ చెప్పారంటే భవిష్యత్‌ ఎలా ఉండబోతుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ మాంద్యం ఎప్పటిదాకా ఉంటుందన్న దానిపై ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. మాంద్యం వస్తుందని ప్రచారం ఊపందుకునే లోపే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మాంద్యం ఛాయలు అప్పుడే మొదలయ్యాయంటూ వెల్లడించింది.

మెటాతో పాటు ఇతర టెక్‌ కంపెనీలు ఉద్యోగులను ఫైర్‌ చేయడం (తొలగించడం) మొదలుపెట్టాయి. మెటా, అమెజాన్, తాజాగా ట్విట్టర్‌ పింక్‌ స్లిప్‌ల (ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ ఇచ్చే నోటీసులు) జారీ ప్రారంభించాయి. లేఆఫ్స్‌ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 టెక్‌ కంపెనీలు 1.4 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో దాదాపు 90 శాతం (1.25 లక్షలకు పైగా) తొలగింపులు జరిగింది అక్టోబర్, నవంబర్‌ నెలల్లోనే.

ఎక్కువగా భారతీయులే బాధితులు 
సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పింది. వీరిలో దాదాపు 80 శాతం అంటే 8,800 పై చిలుకు ఉద్యోగులు భారతీయులే. ‘ఖర్చులు తగ్గించుకునేందుకు నాకు ఇంకో దారి కనపడలేదు’అని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలోనే చెప్పుకున్నాడంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. మెటాలో తొలగింపులు మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం వరకూ ఉంటే, ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఇది మూడు శాతం మాత్రమే.

అంటే ఈ మూడు శాతంలో పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలోనూ దాదాపు 70 శాతం అంటే అంటే 7 వేల మంది భారతీయులే కావడం గమనార్హం. ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, బుకింగ్‌.కామ్, సిస్కో, బైజూస్, ఎయిర్‌ బీఎన్‌బీ, ఇన్‌స్టాకార్ట్‌ వంటి కంపెనీల్లోనూ రెండు వేల నుంచి దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఉబర్‌ వేర్వేరు విభాగాలకు చెందిన సుమారు ఆరు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

మాంద్యం భయమే కారణమా?
టెక్నాలజీ కంపెనీల్లో హైర్‌ అండ్‌ ఫైర్‌ పాలసీ కొత్తదేమీ కాదు. డాట్‌ కామ్‌ కంపెనీలు దివాలా తీసినప్పుడు, 2008 నాటి సబ్‌ ప్రైమ్‌ క్రైసిస్‌ సమయంలోనూ పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. అయితే కోవిడ్‌ కష్టకాలంలో బోలెడన్ని లాభాలు ఆర్జించిన తరువాత కంపెనీలు ఎందుకీ లే–ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో మాంద్యం ముంచొకొస్తోందన్న ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు నేల చూపు చూస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌లో మెటా ఒక్కో షేరు ధర 340 డాలర్లు కాగా గడచిన సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఆ షేర్‌ ధర 109.86 డాలర్లు కావడం గమనార్హం. 

ఆదాయం తగ్గుతుందన్న అంచనాలతో.. 
అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో అనేకం ప్రకటనలపై ఆధారçపడేవి. అయితే, ద్రవ్యోల్బణం నేపథ్యంలో కంపెనీలు ప్రకటనల ఖర్చులను తగ్గించుకున్నాయి. ఉద్యోగులకు రాసిన లేఖలో జూకర్‌బర్గ్‌ అదే చెప్పారు. భవిష్యత్తులో ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు బలపడటంతోనే ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. మెటా లాంటి సంస్థలకు స్నాప్‌చాట్, టిక్‌టాక్‌ వంటి కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

ఈ కారణంగానే 18 ఏళ్ల కంపెనీ చరిత్రలోనే మొదటి సారిగా ఫేస్‌బుక్‌ రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. పైగా మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లోనూ ఆదాయం తగ్గినట్లు ప్రకటించింది. అంతేకాదు మెటావర్స్‌ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం సుమారు వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండటం కూడా ఖర్చులు తగ్గించుకోవాలని మెటా సంస్థ అనుకునేందుకు మరో కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.  

ఇతర రంగాలపైనా ప్రభావం! 
అమెరికాలో గత నెలలో 2.61 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి చేరాయి. అయినప్పటికీ టెక్‌ కంపెనీల లేఆఫ్‌లపై ఆర్థిక వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. సాధారణంగా ఆర్థిక రంగంలో ఏం జరుగుతోందన్న దానికి టెక్‌ కంపెనీల పనితీరు ఓ కొలమానంగా ఉంటుందని, ఈసారి అక్కడి పరిస్థితుల ప్రభావం ఇతర రంగాలపై కూడా పడనుందని వారు హెచ్చరిస్తున్నారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు ఇంకా పెంచే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరిన్ని దెబ్బలు తప్పవని అంచనా. అయితే లేఆఫ్‌లు లేకున్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లోనూ ఆదాయాలు తగ్గిపోతుండటం గమనార్హం. క్రిస్మస్‌ సెలవులను దృష్టిలో పెట్టుకుంటే అమెరికాలో ఆర్థిక లావాదేవీలు చాలా చురుకుగా జరగాల్సిన సమయమిది. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. 

మన టెకీల్లో ధీమా 
అమెరికన్‌ టెక్‌ కంపెలల్లో అత్యధికులు భారతీయులేనన్నది, అందులోనూ తెలుగు రాష్ట్రాల వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే పెద్ద పెద్ద కంపెనీల లేఆఫ్‌ల ప్రభావం మనవాళ్లపై ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హెచ్‌–1బీ వీసాదారులు తమ ఉద్యోగాలు కోల్పోయారు కూడా. కొత్త ఉద్యోగం దొరక్కపోతే ఆరు నెలల కాలంలో వారు భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ, మన టెకీలు తక్కువ వేతనాలు తీసుకునేందుకు అలవాటు పడిన నేపథ్యంలో వారు తేలిగ్గానే ఉద్యోగాలు సంపాదించుకోగలరనే ధీమాతో ఉన్నారు.  

అవసరానికి మించి ఉద్యోగులు!
గత కొన్నేళ్లుగా ఐటీ కంపెనీల్లో నియామకాలకు చిత్ర విచిత్రమైన ప్రాతిపదికలు కనిపించాయి. భవిష్యత్తులో వచ్చే అవకాశమున్నప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోవడం, ప్రాజెక్టు రాకపోతే వారిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టాయి. ఫలితంగా చాలా కంపెనీల్లో అవసరానికి మించి ఉద్యోగులు చేరిపోయారు. ఫలితంగా ఖర్చులు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయంపై నిలకడ లేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు గత నాలుగు త్రైమాసికాలు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ పోవడం కూడా టెక్‌ కంపెనీలకు శాపంగా మారింది. రియల్‌ ఎస్టేట్, కార్లు అమ్ముకునే
కంపెనీలపై ఇది తీవ్రమైన దు్రష్పభావం చూపింది. 

నిరుద్యోగంపై లేఆఫ్‌ల ప్రభావం తక్కువే.. 
టెక్‌ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఆర్థిక మాంద్య పరిస్థితులకు సూచికలా? కావచ్చు, కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే టెక్‌ కంపెనీలు, వాటిల్లో ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువని, ఫలితంగా లేఆఫ్‌ల ప్రభావం నిరుద్యోగంపై పెద్దగా పడదని అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శ్యాక్స్‌ అంచనా వేస్తోంది. టెక్‌ కంపెనీలు తొలగించిన ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇతర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతుందని చెబుతోంది. గతంలోనూ టెక్‌ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఇతర రంగాల్లో ఉద్యోగాల కోతకు దారితీయలేదని ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మాంద్యం అవకాశాలు తక్కువేనని విశ్లేషించింది. 

లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే.. 
ఐటీ కంపెనీల లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే. ఆర్థిక వ్యవస్థ తాలూ కూ సహజసిద్ధ హెచ్చుతగ్గుల్లో భాగం. భారత ఐటీ రంగం ఏడాదికి 10% చొప్పున పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇది ఇలాగే కొనసాగే చాన్స్‌ ఉంది. సమీప భవిష్యత్తులో ఐటీ రంగంలో సుమారు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఏఐ/ఎంఎల్, వెబ్‌ 3.0 వంటి టెక్నాలజీల ఆధారంగా ఐటీ రంగం వృద్ధి చెందనుంది. 
-క్రిస్‌ గోపాలకృష్ణన్‌ ఇన్ఫోసిస్‌వ్యవస్థాపకులు

అనివార్యంగానే లేఆఫ్‌లు 
ఒక రకంగా చూస్తే టెక్‌ కంపెనీల లేఆఫ్‌లు అనివార్యమైనవనే చెప్పాలి. ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి కోవిడ్‌ సమయంలో ప్రతి టెక్నాలజీని రిమోట్‌ ఫ్రెండ్రీగా, మొబైల్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఫలితంగా ఐటీ నిపుణులతోపాటు సహాయక సిబ్బందికీ డిమాండ్‌ పెరిగింది. అందుకు తగ్గట్టుగా నియామకాలూ జరిగాయి. ఇప్పుడా పరిస్థితులు లేవు. రెండో కారణం.. ఉత్పాదకత విషయంలో కంపెనీల ఆలోచనలు మారడం. ఇక మూడో కారణం.. స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటుకు వెంచర్‌ క్యాపిటలిస్టులు, ఎంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి అంత సులువుగా నిధులు రాకపోవడం!
-మురళి బుక్కపట్నం వైస్‌ చైర్మన్, ద ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (గ్లోబల్‌)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement