![Infosys Layoff in Mysore Campus](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/infosys-layoffs.jpg.webp?itok=c6LfWSLB)
ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయని సంబరపడుతున్న వేళ 'ఇన్ఫోసిస్' (Infosys) మరోమారు లేఆఫ్స్ బాంబ్ పేల్చింది. ఒక్కసారిగా 700 మంది ఫ్రెషర్లను ఇంటికి పంపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా అన్యాయమని లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో చేర్చుకున్న ఫ్రెషర్లలో 700 మంది.. మూడు సార్లు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఈ కారణంగానే వారిని బయటకు పంపుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌కు చెందిన వారని తెలుస్తోంది.
కంపెనీలో ట్రైనింగ్ తీసుకునే ఫ్రెషర్స్ కచ్చితంగా.. సంస్థ నిర్వహించే అసెస్‌మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే కంపనీలో కొనసాగలేరు. ఈ విషయాన్ని ఆఫర్ లేటర్లలో కూడా స్పష్టం చేశామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభించింది కాదు. గత రెండు దశాబ్దాలుగా కంపెనీ ఈ పద్దతిలోనే ఉద్యోగులను ఎంపిక చేస్తోందని పేర్కొంది.
లేఆఫ్‌లకు ప్రభావితమైన ఉద్యోగులలో చాలామంది 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. వీరందరూ కంపెనీ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందారు. వీరి ఇంటర్వ్యూలో పూర్తయిన తరువాత ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి కూడా కంపెనీ చాలా సమయం తీసుకుందని గతంలోనే వెల్లడైంది. ఆ తరువాత ఆఫర్ లెటర్స్ అందిస్తూ.. సిస్టమ్ ఇంజనీర్ ఉద్యోగులకు రూ. 3.2 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..
ఇన్ఫోసిస్ కంపెనీ ఒక్కసారిగా ఫ్రెషర్లను తొలగించడంతో.. బాధితులు కంటతడి పెట్టుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తొలగించిన ఫ్రెషర్స్ 700 మందా? 400 మందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటనేదే ప్రశ్న. అయితే కంపెనీ లేఆఫ్‌లను నాసెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ట్రైనింగ్ సమయంలోనే బయటకు పంపించడం అనేది సమంజసం కాదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment