
ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ప్రారంభం
త్వరలో ఫీల్డు హాజరు కోసం ప్రత్యేక యాప్
సాక్షి,సిటీబ్యూరో: ఇక జలమండలి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందే. శనివారం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) పద్ధతి హాజరు అమలు ప్రారంభమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు నిలిచిపోగా ..ఇప్పుడు ఆ«ధునిక సాంకేతిక ముఖగుర్తింపు హాజరు అమలులోకి వచ్చింది. దశల వారీగా క్షేత్ర స్థాయి వరకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఫీల్డ్ సిబ్బందికి సైతం ప్రత్యేక యాప్ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు అమలు చేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది.
ఉదయం 11 గంటల తర్వాతే..
గత ఐదేళ్లుగా మాన్యువల్ హాజరు అమలవుతుండటంతో ఉద్యోగులు ఎవరు ఎప్పుడు వస్తున్నారో.. వెళ్తున్నారో సమయ పాలన లేకుండా పోయింది. సాక్షాత్తు జలమండలి ప్రధాన కార్యాలయంలో కొందరైతే ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రావడం ఆనవాయితీగా మారింది. ప్రధాన కార్యాలయంలో సుమారు 500 మంది, డివిజన్, సెక్షన్ ఆఫీసుల్లో మూడు వేల మంది వరకు సిబ్బంది సేవలందిస్తున్నారు. బయో మెట్రిక్ హాజరు లేకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్లు ఇటీవల ఉన్నతాధికారుల పరిశీలనలోనే బహిర్గతమైంది.
ప్రధాన కార్యాలయంలో పరిశీలించగా..60 శాతం మంది ఉదయం 11.30 గంటల తర్వాత విధులకు వస్తున్నట్లు తేలింది. డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సిబ్బంది, ఉద్యోగుల గైర్హాజరుతో ఆ ప్రభావం సేవలపై పడుతోంది. కొందరైతే అసలు విధుల్లోకే రాకుండా..వస్తున్నట్లు మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. మరికొందరు ఆలస్యంగా వచ్చి మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయి..సొంత పనులు చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విధుల అలసత్వానికి చెక్‌పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు జలమండలి సిద్ధమైంది.