సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి తమ రోజూవారీ విధులు, వృత్తిగత జీవితంలో గుణాత్మక మార్పులు కోరుకుంటున్నారు. ఆఫీస్ వేళలు–పనివిధానంలో మార్పులు జరగాలని భారత్‌లోని మెజారిటీ ఎంప్లాయిస్ గట్టిగా అభిలషిస్తున్నారు. కార్యాలయ పనివేళల నియమాలు అనేవి తాము కోరుకున్నట్టుగా రూపొందించేందుకు యాజమాన్యాలు ఒప్పుకుంటే జీతాలు తగ్గించుకోవడమే కాదు ఇతర అంశాల్లోనూ రాజీపడేందుకు సిద్ధమంటున్నారు.
►మొత్తంగా 17 దేశాల్లోని 33 వేలమంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే అధారంగా...ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్స్ ఎట్ వర్క్ 2022 @ ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ ఓ నివేదికను రూపొందించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పనిగంటల్లో, విధులు నిర్వహించే విధానంలో వెసులుబాటు ఉండాలని ప్రతి పది మందిలో ఏడుగురు కోరుకున్నట్టు తేలింది.
రోజూవారీ చేసే పనిగంటలపై తమకు పూర్తి పట్టు ఉండాలని భారత్‌లోని 76.07 శాతం ఉద్యోగులు స్పష్టం చేశారు. వర్క్ ఫ్రం హోం లేదా ఇల్లు, ఆఫీసుల మధ్య ఎంచుకునే అవకాశం, వారంలో సగం రోజులు ఆఫీసు, సగం రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తే తమకిచ్చే జీతంలో కొంత తగ్గించుకునేందుకు, ఇతర అలవెన్సుల్లో రాజీపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే పనిచేయాలని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్న పక్షంలో కొత్త కొలువులు వెతుక్కుంటామంటూ 76.38 శాతం భారత ఉద్యోగులు పేర్కొన్నట్టు ఈ రిపోర్ట్ తెలిపింది.
వర్క్ ఫ్రంహోం సందర్భంగా తమ సేవలను మంచి గుర్తింపు లభించిందని 73 శాతం, నైపుణ్యాల మెరుగు, శిక్షణా అవసరాలు వంటి వాటిపై యాజమాన్యాలతో చర్చించగలిగామని 74 శాతం చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, మెంటల్ హెల్త్‌ను కాపాడుకునేందుకు ఇంటినుంచి పనిచేయడం ఉపయోగపడిందని 56 శాతం అభిప్రాయపడ్డారు. çసాÜంప్రదాయ ‘నైన్ టు ఫైవ్’ఉద్యోగుల టైమింగ్స్ స్థానంలో సృజనాత్మకతతో కూడిన మరింత వినూత్న ప్రత్యామ్నాయాలను వారు కోరుకుంటున్నారు.
►కోవిడ్ మహమ్మారి కాలంలో తీవ్రమైన మానసిక సంఘర్షణ, ఒత్తిళ్లను ఎదుర్కున్నందున చేసే ఆఫీసుపని– గడిపే రోజూవారీ జీవితం మధ్య మంచి సమతూకంతో పాటు ఒత్తిళ్లు లేని పనివిధానం కోరుకుంటున్నారు’అని ఏడీపీ సౌతీస్ట్ ఏషియా, ఇండియా ఎండీ రాహుల్ గోయల్ చెప్పారు. గతంలో ఆచరణ సాధ్యం కాదని భావించిన వారానికి 4 రోజుల పని విధానం అమలు, ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం కల్పించడం ద్వారా ఆయారంగాల్లోని ఉత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులను ఆకర్షించే అవకాశముందని గోయల్ అభిప్రాయపడ్డారు.
ఐటీ అనే కాదు ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి
ఐటీ అనే కాకుండా అన్ని రంగాల ఉద్యోగులు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కోరుకుంటున్నారు. జాబ్ ఇంటర్వ్యూలప్పుడే జీతం ప్యాకేజీ కంటే కూడా వర్క్ ప్రం హోం, హైబ్రిడ్ వర్కింగ్ ఇస్తేనే చేరతామంటున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా తమకు తోచిన పద్ధతుల్లో పనివేళలు అడుగుతున్నారు. కనీసం వారానికి రెండురోజులైనా ఇంటినుంచి పని విధానం ఉందా లేదా అని ఆరాతీస్తున్నారు. ట్రైనీలు, ఎంట్రీలెవల్ ఎంప్లాయిస్ కూడా దీనినే కోరుతున్నారు.
– డా. బి. అపర్ణరెడ్డి, హెచ్‌ఆర్ నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment