ఉద్యోగులకు కరోనా భయం..! విధులకు వెళ్లొదంటూ కుటుంబసభ్యుల ఒత్తిడి లాంగ్ లీవ్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నాలు ప్రైవేటులో ఉద్యోగాలు వదులుకుంటున్న వైనంఇప్పటికే నగరం నుంచి 30 శాతం పల్లెబాట
సాక్షి, సిటీబ్యూరో: కరోనా విజృంభణ ఉద్యోగుల కుటుంబాలను వణికిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులు కరోనా బారినా పడుతుండటంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న వారి విధులపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆఫీస్‌కు వెళ్లే వారి కుటుంబాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాలకంటే డ్యూటీ ఎక్కువ కాదని.. విధులకు వెళ్లొదంటూ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ప్రతి కుటుంబంలోనూ వృద్ధులు, వ్యాధిగ్రస్తులతోపాటు చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఆఫీసులకు వెళితే విధి నిర్వహాణలో ఎంతో మంది కలిసే అవకాశాలు ఉన్నందున కరోనా ఉపద్రవం ఏ రూపంలో ముంచుకువస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జ్వరం, జలుబు, దగ్గు ఉంటే విధులకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆయా లక్షణాలు బయటపడే వరకు విధులకు హాజరవుతుండటంతో వారితో సన్నిహితంగా మెగిలిన వారు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులపై కుటుంబసభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నట్లు సమాచారం. (24 గంటల్లో 2.6 లక్షల మందికి)
సెలవులకు సై..
కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలతో సంబంధాలు గల ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సెలవులకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరువుతన్నా కరోనా మాత్రం వెంటాడుతూనే ఉంది. ఒక వేళ కరోనా బారిన పడితే వైద్యం ఖర్చుతో కూడుకున్నది కావడం ప్రాణాలకుసైతం భరోసా లేకపోవడం బెంబేలెత్తిస్తోంది. స్వయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఉద్యోగాలకు సెలవులు పెట్టడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే సెలవులు తీసుకోవచ్చునని ఉన్నతాధికారులు సూచిస్తుండటంతో పలువురు ముందు జాగ్రత్తగా సెలవుపై వెళుతున్నట్లు సమాచారం. కొందరు తమ ఈఎల్‌లను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 10 శాతం వరకు ఉద్యోగులు సెలవుపై ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొందరు సెలవుల కోసం దరఖాస్తు పెట్టుకొని మంజూరు కోసం వేచి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (దోమలతో కరోనా రాదు)
దేనికైనా రెడీ
కరోనా భయంతో ఉద్యోగాలు వదులుకునేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వయస్సుపై బడటంతో పాటు వివిధ రోగాల బారినపడి ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్తే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి కరోనా బారిన పడితే ప్రాణాల దక్కవన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు స్వచ్ఛంద పదవీ విరమణకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణలపై అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్నవారు సైతం ఉద్యోగాలు వదులుకునే పనిలో పడ్డారు. వర్క్ ఫ్రం హోం కాకుండా ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉండటంతో ఉద్యోగాలు వదులుకుంటేనే ప్రాణాలు దక్కుతాయని భావిస్తున్నారు. పలు సంస్ధలో ఉద్యోగుల రాజీనామాల పరంపర ప్రారంభమైంది. (మానవత్వాన్ని మింగేసిన కరోనా)
ఖాళీ అవుతున్న నగరం
విశ్వనగరంగా దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. నగరం జనాభా కోటిపైనే. లాక్‌డౌన్ సమయంలోనే విద్యా సంస్థ«లు, వసతి గృహాలు మూత పడి విద్యార్థులు, పనులు లేక వలస కార్మికులు, ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగులు కలిపి సుమారు 20 లక్షల మంది వరకు స్వస్థలాలకు తరలి వెళ్లారు. లాక్‌డౌన్ సడలింపు అనంతరం కరోనా విశ్వ రూపం ప్రదర్శిస్తుండటంతో పలువురు మృత్య వాత పడుతున్నారు. కరోనా వైద్యం కూడా పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆయా వర్గాల కుటుంబాలు కరోనా భయంతో సొంతూళ్ల బాట పడుతున్నారు. సుమారు 10లక్షల వరకు వెళ్లి ఉంటారని అంచనా. ఫలితంగా ప్రతి విధుల్లో ఇళ్లు , పోర్షన్స్ ఖాళీ అవుతున్నాయి. ఎక్కడ చూసిన ‘టు లెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే సగం నగరం ఖాళీ కావడం ఖాయమని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment