ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లోని ప్రభావం కారణంగా రోజువారీ పని విధానం, పద్ధతుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్, దాని కారణంగా అమల్లోకి వచ్చిన ‘వర్క్ ఫ్రం హోం’పని విధానం వల్ల భారత్ వంటి దేశంలోనూ అనేక కీలక మార్పులు సంభవిస్తున్నాయి. మొత్తంగా దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఇతర సిబ్బంది సంఖ్యతో పోలిస్తే కొంత శాతం మాత్రమే ఇంటి నుంచి పనిచేసే పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇది పరోక్షంగా పలు అంశాలను ప్రభావితం చేయడంతో పాటు తక్కువ వేతనం వచ్చే ‘లో-వేజ్ సపోర్ట్’ జాబ్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఇదీ మెకెన్సీ అధ్యయనం..
వర్క్ ఫ్రం హోం ప్రభావం వల్ల పట్టణాలు, నగరాల్లోని ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా వ్యాప్తి భయం కారణంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు, రిటైల్ స్టోర్లు, దుకాణాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులకు ఇళ్ల నుంచి పనిచేసే వెసులుబాటు ఉన్న చోట వారు ఆఫీసులకు రాకపోవడంతో మెయింటెన్స్, అనుబంధరంగాల ఉద్యోగుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయే పరిస్థితులు ఏర్పడినట్లు కన్సల్టెన్సీ దిగ్గజం మెకెన్సీ సంస్థ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లి పని చేయాల్సిన అవసరం లేకపోవడంతో పెద్ద నగరాలు, పట్టణాల నుంచి వివిధ రంగాల ఉద్యోగులు చిన్న పట్టణాలకో లేదా సొంతూళ్లకు వెళ్లడంతో ఆ ప్రభావం కూడా పరోక్షంగా పడుతోంది.
2019 మధ్యకాలంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్‌లలో 32 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్దెకు కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించగా, అది 2020 ప్రథమార్థంలో 13.7 మిలియన్ చదరపు అడుగులకు తగ్గిపోయినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఉన్నత, మధ్యరకంగా ఆదాయం వచ్చే వృత్తులు కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మరింత వృద్ధి చెంది జాబ్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
భవిష్యత్‌లో అనేక మార్పులు..
భారత్‌లోని మొత్తం 46.4 కోట్ల మంది ఉద్యోగుల్లో (వ్యవసాయం రంగం సహా) మెజారిటీ ఉద్యోగులు లేదా వ్యవసాయం, అనుబంధ రంగాలు, రిటైల్, తదితర వ్యాపార రంగాలకు చెందిన ఉద్యోగాలు, విధులు, బాధ్యతలు దూరంగా ఉంటూ ఇళ్ల నుంచి చేసేందుకు అనువుగా ఉందన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో లేబర్ ఫోర్సు, జనాభా పెరుగుదల నేపథ్యంలో దాదాపు అన్ని స్థాయిల్లోని ఉద్యోగాలు గణనీయంగా వృద్ధి చెందుతాయని, 2030 సంవత్సరానికల్లా రెండుకోట్ల మంది వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మరలుతారని ఈ నివేదిక అంచనావేస్తోంది. మరో రెండు కోట్ల మంది దాకా వర్కర్లు కొత్త జాబ్‌లకు మారాల్సి ఉంటుందని, భారత్ సహా అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో 25 శాతం దాకా వర్కర్లు మరో పదేళ్లలో తమ వృత్తులను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది.
మారిన విధులు, బాధ్యతలు..
రోజువారీ పనుల నిర్వహణకు సంబంధించి గతంలో మన పని విధానం, ఆలోచనలకు భిన్నంగా కొత్త పద్ధతులు, గతంలో ఆచరణ యోగ్యం కావని భావించే పద్ధతులను కూడా ఇప్పుడు వినూత్నంగా అమలుచేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన పరిస్థితుల్లో ఆయా అనుకూల విధానాలు, పద్ధతులు వ్యాపారసంస్థలు, కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. పని ప్రదేశాల్లో చేయాల్సిన పనులు, విధులను మరోచోట నుంచి కూడా సులభంగా పూర్తిచేసుకునేందుకు వీలు ఏర్పడటంతో వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ పద్ధతులను సంస్థలు అనుసరిస్తున్నాయి. దీంతో పాటు వినియోగదారులు కూడా వివిధ అవసరాల కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై, డిజిటల్ చానల్స్‌పై ఆధారపడటం పెరగడంతో ఆన్‌లైన్‌లో నిర్వహించే వ్యాపారాలు కూడా పెరిగిపోయాయి.
2015–19 మధ్య కాలంతో పోలిస్తే ఈ-కామర్స్ అమ్మకాలు రెండింతలకు మించి పెరిగాయి. 2020 మార్చితో పోలిస్తే 2020 నవంబర్ కల్లా టెలీమెడిసిన్, ఆన్‌లైన్‌లో డాక్టర్ల సంప్రదింపులు, వంటివి వెయ్యి శాతం, ఆన్‌లైన్‌లో చదువు, నేర్చుకోవడం వంటి వాటికి సంబంధించి 63 శాతం యూజర్స్ పెరిగినట్టు తేలింది. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య 40 శాతం పెరిగినట్లు, ప్రతిరోజు మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు ఆర్డర్ చేసి తెప్పించుకునే వారు 10 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment