ఆనంద శివకామేశ్వరి ఆశ్రమంలో సరస్వతి పూజలో పాల్గొన్న మహిళలు
- స్కూళ్లలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
హైదరాబాద్ ఉప్పల్, మల్కాజిగిరి జోన్ పరిధిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం పలు పాఠశాలల్లో పండితులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఆలయాలు, కళాశాలల్లో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి విశిష్టత గురించి పండితులు వివరించారు. సరస్వతి దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగి జ్ఞానమనే వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
– ఉప్పల్, మల్కాజిగిరి జోన్ బృందం.
సరస్వతీ శిశు మందిర్‌లో..
ఘనంగా వసంత పంచమి వేడుకలు
వసంత పంచమి వేడుకలను సోమవారం అబిడ్స్, చార్మినార్, మెహిదీపట్నం జోన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. సరస్వతీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాల్లో, విద్యాసంస్థల్లో సరస్వతీ దేవికి పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
బెంగాలీల సరస్వతి పూజలు ప్రారంభం
చార్మినార్: వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని సోమవారం మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో బెంగాళీల సరస్వతీ పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఈ పూజలను ప్రారంభించారు. బెంగాలీ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సరస్వతి పూజల సందర్భంగా బెంగాలీలు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.
ఈ నెల 5న బెంగాళీలు సరస్వతీ దేవి విగ్రహంతో పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు. మీరాలంమండి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు అలీజా కోట్ల, కాలికమాన్, గుల్జార్‌హౌజ్, మదీనా సర్కిల్, నయాపూల్ ద్వారా హుస్సేనీసాగర్ వరకు కొనసాగనుందని అంజయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment