
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ ఇన్నోవేషన్‌లో సేవలందిస్తోన్న సినెరిక్ గ్లోబల్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఏఐ ఉత్పత్తులు, సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో కంపెనీ 150 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. జీసీసీ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.
‘ఏఐ ఆధారిత ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్‌కు ప్రాముఖ్యత పెరుగుతోంది. కోడింగ్ హబ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతి చేసే కేంద్రంగా నగరం పరివర్తన చెందింది. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏర్పాటు చేసి, స్థానికంగా ఏఐ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ కంపెనీలరాక ప్రోత్సాహకరంగా మారింది’ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
సినెరిక్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుధాకర్ పెన్నం మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా సినెరిక్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిబద్ధతను తెలియజేస్తూ, హైదరాబాద్ ప్రగతిశీల ఏఐ విధానాలను నొక్కి చెప్పారు. ‘కంపెనీ 150 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి హైదరాబాద్‌లోని కొత్త జీసీసీ కీలకం కానుంది. స్థానికంగా బలమైన టాలెంట్ పూల్‌ను నిర్మిస్తూనే, తదుపరి తరం ఏఐ టెక్నాలజీలను ఆవిష్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌ప్రైజెస్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. జీసీసీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మెర్జెన్ గ్లోబల్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ.. సినెరిక్ గ్లోబల్ జీసీసీ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ అవసరాలను తీర్చే అత్యాధునిక ఆవిష్కరణలను అందించడంలో కీలకంగా మరనుందని చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మార్కెట్ 2028 నాటికి 10% సీఏజీర్‌తో పెరిగి 65.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, సేల్స్‌ఫోర్స్ ఆటోమేషన్ 2027 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత వర్క్ ఫ్లో ఆటోమేషన్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో సర్వీస్ నౌ మార్కెట్ 22.5 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా. 2025 చివరి నాటికి 23.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి చెందుతున్న విభాగాలకు అనుగుణంగా వ్యాపారాలకు సృజనాత్మక, ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడానికి సినెరిక్ గ్లోబల్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment