సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో టెలికాం సేవల రంగంలో మరింత దూసుకుపోతోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను కొనుగోలు చేయనుంది. అమెరికాకు చెందిన రాడీసిస్‌తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది. ఓపెన్ టెలికాం సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాడిసిస్ కార్పొరేషన్ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ డీల్ విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది. 2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది.
రాడిసిస్‌కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్‌కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని, తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్ టీమ్ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఒరెగాన్‌లోని హిల్స్ బోరోలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు ఉన్నారు. ఈ డీల్ ముగిసిన తరువాత రాడిసిస్ డీలిస్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment