
న్యూఢిల్లీ: టెలికం రంగ స్థూల ఆదాయం 2017లో 8.56 శాతం క్షీణతతో రూ.2.55 లక్షల కోట్లకు పరిమితమయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ నుంచి లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల రూపంలో అర్జించే ఆదాయానికి గండిపడింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
టెలికం రంగ స్థూల ఆదాయం 2016లో రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం పొందే ఆదాయం వరుసగా 18.78%, 32.81% తగ్గింది. యూజర్ల సంఖ్య పెరిగినా, టెల్కోల ఆదాయం తగ్గడం గమనార్హం. 2016 డిసెంబర్ చివరి నాటికి 115.17 కోట్లుగా ఉన్న టెలీఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2017 డిసెంబర్ చివరి నాటికి 3.38% వృద్ధితో 119.06 కోట్లకు పెరిగింది.
జియో మినహా ఇతర సంస్థల ఆదాయం డౌన్..
రిలయన్స్ జియో మినహా ఇతర సంస్థల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)లో క్షీణత నమోదయ్యింది. భారతీ ఎయిర్‌టెల్ ఏజీఆర్ 24.46 శాతం క్షీణతతో రూ.48,880 కోట్ల నుంచి రూ.36,922 కోట్లకు తగ్గింది. వోడాఫోన్ ఏజీఆర్ 24.14 శాతం క్షీణతతో రూ.26,308 కోట్లకు, ఐడియా ఏజీఆర్ 23.17 శాతం క్షీణతతో రూ.22,616 కోట్లకు, బీఎస్‌ఎన్‌ఎల్ ఏజీఆర్ 19.42 శాతం క్షీణతతో రూ.10,564 కోట్లకు తగ్గింది.
అయితే జియో ఏజీఆర్ మాత్రం 2,564 శాతం వృద్ధితో రూ.7,466 కోట్లకు ఎగసింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు అనేవి సంస్థల ఏజీఆర్‌పై విధిస్తారు. దీంతో సంస్థల ఏజీఆర్ తగ్గడం వల్ల కేంద్ర ప్రభుత్వపు ఆదాయం కూడా తగ్గిపోయింది. లైసెన్స్ ఫీజు దాదాపు రూ.3,000 కోట్ల తగ్గుదలతో రూ.12,976 కోట్లకు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు రూ.2,485 కోట్ల తగ్గుదలతో రూ.5,089 కోట్లకు పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment