
సరిగ్గా 15 ఏళ్ల కిందట... 2002 డిసెంబర్లో రిలయన్స్ ఇన్ఫోకామ్ ద్వారా దేశంలో టెలికం విప్లవానికి పునాది వేశారు ముకేశ్ అంబానీ. తదుపరి సంవత్సరం డిసెంబరు 23న తన తండ్రి జయంతి సందర్భంగా సేవలనూ ఆరంభించారు. కానీ 2005 జూన్‌లో రిలయన్స్ సామ్రాజ్యం రెండు ముక్కలయింది. ముచ్చటపడి ముకేశ్ ఆరంభించిన రిలయన్స్ ఇన్ఫోకామ్... అనిల్ అంబానీ చేతికొచ్చింది.
అన్నయ్య అప్పగించిన టెలికం సామ్రాజ్యాన్ని ఊహించనంత వేగంగా ముందుకు తీసుకెళ్లారు అనిల్ అంబానీ. సీడీఎంఏ టెక్నాలజీతో పని కాదని తలచి 2008లో జీఎస్‌ఎం టెక్నాలజీకి అనుమతి తీసుకున్నారు. సర్వీసులు ఆరంభించారు. స్టాక్ మార్కెట్ కూడా అనిల్ చర్యలను స్వాగతించింది. ఫలితం... షేరు రూ.845కు దూసుకెళ్లింది. నాటి విలువ ప్రకారం అప్పటి రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లు!!. మరిప్పుడు..? షేరు ధర కేవలం రూ.11.80. మార్కెట్ విలువ దాదాపు రూ.3,270 కోట్లు. ఈ ఉత్థాన పతనాల మధ్యలో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.
కంపెనీ తన చేతికి వచ్చిన కొద్దిరోజుల్లోనే అనిల్ అంబానీ ఏకంగా రూ.450 కోట్ల బకాయిలను రైటాఫ్ చేసేశారు. ఎందుకంటే హ్యాండ్‌సెట్లను వినియోగదారులకు ఆఫర్లలో అందజేయగా... వాటి డబ్బులు మాత్రం చేతికి రాలేదు. ఇక 2008లో జీఎస్‌ఎం లైసెన్స్ చేతికొచ్చాక... వాటాను డైల్యూట్ చేయటం ద్వారా తన కంపెనీని ఆఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌లో విలీనం చేయటానికి ప్రయత్నించారు. కాకపోతే ఈ ప్రయత్నానికి అన్న ముకేశ్ అంబానీ ససేమిరా అన్నారు.
సోదరుల మధ్య ఒప్పందం ప్రకారం ఒకరు కంపెనీని విక్రయించాలంటే మొదట మిగిలిన సోదరుడికి ఇవ్వజూపాలని, తను వద్దంటేనే బయటివారికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆర్బిట్రేషన్ మొదలుపెట్టడంతో... అనిల్–ఎంటీఎన్ మధ్య చర్చలు నిలిచిపోయాయి. దీంతో కాల్ రేట్లను తగ్గించి మరో వ్యూహానికి తెరతీశారు అనిల్. అదిగో... కంపెనీ రుణభారం పెరగటం అప్పటి నుంచే మొదలైంది. స్పెక్ట్రం ఫీజుల చెల్లింపులతో రుణాలు తారస్థాయికి పోయాయి. చివరకు మోయలేనివిగా తయారయ్యాయి. చివరకు కీలకం కాని ఆస్తుల్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో టవర్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టినా... వివిధ నియంత్రణలతో అది కూడా కొలిక్కి రాలేదు.
చివరకు ఎయిర్‌సెల్‌ను ఆర్‌కామ్‌ను విలీనం చేద్దామని ప్రయత్నించినా... అది కూడా నియంత్రణల గుప్పిట్లోనే రద్దయిపోయింది. ఇక రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వీటన్నిటికీ తోడు ఇపుడు రుణ దాతలు దివాలా పిటిషన్లు వేయటానికి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ ఆర్‌కామ్‌కు దెబ్బమీద దెబ్బలే. చివరకు ఈ మధ్య మిగిలిన టెలికామ్ కంపెనీలన్నీ ఆర్‌కామ్ వినియోగదారులకు స్వాగతం... అంటూ బహిరంగంగా ప్రకటనలు గుప్పించాయంటే పరిస్థితి తేలిగ్గానే అర్థమవుతుంది.
అప్పుల కుప్ప... తగ్గేనా!!
దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించడానికి అనిల్ అంబానీ భారీగా పెట్టుబడులు పెట్టారు. పైపెచ్చు పోటీ తీవ్రతను తట్టుకోవడానికి టారిఫ్‌లు తగ్గించారు. మార్కెట్ వాటా నిలుపుకోవడానికి ఎన్నెన్నో ఆఫర్లకు దిగారు. ఇవన్నీ ఆర్‌కామ్ రుణ భారాన్ని భారీగా పెంచేశాయి. తాజాగా జియో ప్రవేశంతో టారిఫ్‌లను మరింతగా తగ్గించారు. ఫలితం... రుణాలు, వాటిపై వడ్డీలు మరింత పెరిగిపోయాయి. ఎంతగా అంటే, కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.3,270 కోట్లయితే... అప్పులు ఏకంగా రూ.46వేల కోట్లు.
దీన్ని తగ్గించుకోవటానికి లాభదాయకం కాని 2జీ సర్వీసులను నిలిపేయడం దగ్గర నుంచి టెలికం టవర్లను, స్పెక్ట్రమ్, రియల్ ఎస్టేట్ ఆస్తులను, తాజాగా డీటీహెచ్ విభాగాన్ని కూడా విక్రయించింది. స్పెక్ట్రమ్, టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ విక్రయాల ద్వారా రూ.17,000 కోట్లు, ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించడం ద్వారా మరో రూ.10,000 కోట్లు మొత్తం రూ.27,000 కోట్లు సమీకరించనుంది. ఈ చెల్లింపులతో పాటు బ్యాంక్‌లకు రుణాలకు బదులుగా వాటాలివ్వటం ద్వారా రూ.46,000 కోట్లుగా ఉన్న రుణ భారాన్ని రూ.6,000 కోట్లకు తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
నానాటికీ అధికమవుతున్న నష్టాలు...
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ కంపెనీ రూ.152 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,919 కోట్ల నికర నష్టాలొచ్చాయి. ఈ క్యూ2లో కంపెనీ ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. గత క్యూ2లో రూ.62 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో రూ.2,709 కోట్ల నికర నష్టాలు మూటగట్టుకుంది. నికర అమ్మకాలు 49 శాతం క్షీణించి రూ.2,615 కోట్లకు తగ్గాయి.
పెరుగుతున్న దివాలా పిటిషన్లు...
ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో(ఎన్‌సీఎల్‌టీ) చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడీబీ) దివాలా పిటిషన్ వేసింది. ఆర్‌కామ్ రూ.9000 కోట్ల రుణ బకాయిలను సీడీబీకి చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. మన బ్యాంక్‌లూ రూ.15 వేల కోట్ల మేర రుణాలిచ్చినా... వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్‌కామ్ ప్రయత్నిస్తుండటంతో ఎన్‌సీఎల్‌టీ జోలికి వెళ్లటం లేదు.
ఆర్‌కామ్‌కు రుణాలిచ్చిన మరో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ), ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఈ విషయంలో సీడీబీకి బాసటగా నిలవనున్నట్లు సమాచారం. ఇవి ఆర్‌కామ్‌కు 200 కోట్ల డాలర్ల మేర రుణాలిచ్చాయి. ఇక రూ.1,150 కోట్ల బకాయిల కోసం ఎరిక్సన్ ఇండియా కూడా దివాలా పిటిషన్ వేసింది. ఇంకా ఓ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ కూడా బకాయిల కోసం ఈ పిటిషన్ వేసింది.
ఎదిగి... పతనమైందిలా
2002: సీడీఎంఏ టెక్నాలజీతో సర్వీసులు ఆరంభించింది.
2006: ముకేశ్ నుంచి అనిల్ అంబానీ చేతికి వచ్చింది.
టమాన్‌సూన్ హంగామా అంటూ హ్యాండ్‌సెట్లు పంపిణీ చేయటం వల్ల వచ్చిన రూ.4,500 కోట్ల నష్టాన్ని రైటాఫ్ చేసింది.
2008: జీఎస్‌ఎం టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసి అనుమతి పొందింది.
టవాటాలను డైల్యూట్ చేయటం ద్వారా ఆఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌తో విలీనం కావటానికి చర్చలు మొదలెట్టింది
టతమ ఒప్పందం ప్రకారం మొదటి అవకాశాన్ని తనకివ్వాలని, తను వద్దంటేనే వేరొకరితో చర్చలు జరపాలని ముకేశ్ అంబానీ పేర్కొనటంతో ఈ చర్చలు నిలిచిపోయాయి.
2009:– కాల్ రేట్లను నిమిషానికి 50పైసలకు తగ్గించింది. టెలికం కంపెనీలన్నీ తీవ్రంగా స్పందించాయి.
2010: ముకేశ్‌తో ఉన్న పోటీ పడకూడదన్న ఒప్పందానికి కాలం చెల్లింది. రుణ భారం పెరగటం మొదలైంది.
2013: ఆప్టిక్ ఫైబర్ టెలికం టవర్లను షేర్ చేసుకోవటానికి సోదరుడు ముకేశ్ అంబానీతో అనిల్ ఒప్పందం చేసుకున్నారు.
2014: ప్రీమియం కస్టమర్లకు తగిన సేవలందించడానికి సీడీఎంఏ, జీఎస్‌ఎం వ్యాపారాలను విడదీశారు. విస్తరణ ఖర్చులు, రుణాలు తగ్గించుకోవటానికి వివిధ సర్కిళ్ల మధ్య రోమింగ్ ఛార్జీలను వర్తింపజేశారు.
2015: కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా రుణాల తగ్గింపు ప్రణాళిక.
2016: స్పెక్ట్రమ్‌ను పంచుకోవటానికి వీలుగా జియోతో ఒప్పందం చేసుకున్నారు. టవర్లను బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించటం, వైర్‌లెస్ వ్యాపారాన్ని ఎయిర్‌సెల్‌తో విలీనం చేయటం వంటి ప్రణాళికలను ప్రకటించారు.
2017: రుణ దాతలు అంగీకరించకపోవటంతో ఎయిర్‌సెల్‌తో విలీనం డీల్ రద్దయింది. మెజారిటీ వైర్‌లెస్ కార్యకలాపాలను మూసేస్తామని ప్రకటించారు.
– (సాక్షి, బిజినెస్ విభాగం)
Comments
Please login to add a commentAdd a comment