రిలయన్స్‌ లాభం 39 శాతండౌన్‌ | Reliance Industries Profit Falls 39percent To Rs 6348 Crore In Q4 | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ లాభం 39 శాతండౌన్‌

Published Fri, May 1 2020 5:35 AM | Last Updated on Fri, May 1 2020 5:43 AM

Reliance Industries Profit Falls 39percent To Rs 6348 Crore In Q4 - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.10,362 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ3లో నికర లాభం రూ.11,640 కోట్లు) 45 శాతం తగ్గిందని పేర్కొంది.

ఇంధన, పెట్రో కెమికల్స్‌ వ్యాపారాలు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం, డిమాండ్‌ పడిపోవడంతో రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు నికర లాభంపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. అయితే టెలికం విభాగం, రిలయన్స్‌ జియో ఫలితాలు బాగా ఉండటంతో లాభ క్షీణత తగ్గిందని తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 2 శాతం క్షీణించి రూ.1,36,240 కోట్లకు చేరిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 11 శాతం తగ్గిందని తెలిపింది.  ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు....
     
► స్థూల రిఫైనరీ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) 8.9 డాలర్లుగా ఉంది.  
► కరోనా వైరస్‌ కల్లోలం ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది.  
► చమురు–గ్యాస్‌ వ్యాపారంలో రూ.485 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 
► రిలయన్స్‌ రిటైల్‌ స్థూల లాభం 20% వృద్ధితో రూ.2,062 కోట్లకు పెరిగింది.


అనుకున్న దానికంటే ముందుగానే రుణ రహిత కంపెనీ...
వచ్చే ఏడాది మార్చి కల్లా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా నిలపాలన్న ముకేశ్‌  లక్ష్యం ముందే  సాధించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. మొత్తం రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని కంపెనీ బావిస్తోంది. రూ.53.125 కోట్ల రైట్స్‌ ఇష్యూతో పాటు  జియోలో ఫేస్‌బుక్‌ ఇన్వెస్ట్‌ చేయనున్న రూ.43,574 కోట్లు, ఇంధన రిటైల్‌ విభాగంలో 49% వాటాను బ్రిటిష్‌ పెట్రోలియమ్‌ రూ.7,000 కోట్లకు విక్రయించడం.... ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లాగానే ఎన్నో కంపెనీలు, ఆర్థిక సంస్థలు  రిలయన్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు వస్తున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.  మార్చి క్వార్టర్‌ చివరినాటికి రిలయన్స్‌ కంపెనీ మొత్తం రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,75,259 కోట్లుగా ఉన్నాయి. నికర రుణ భారం రూ.1,61,035 కోట్లు.

రిలయన్స్‌ జియో లాభం 177 శాతం అప్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 177 శాతం ఎగసి రూ.2,331కు పెరిగింది. వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.14,835 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్‌ కంపెనీ ఇదే. వినియోగదారుల సంఖ్యలో 26 శాతం వృద్ధి సాధించింది.  ఒక్క నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.130.6గా ఉంది. ఇటీవలే కుదిరిన ఫేస్‌బుక్‌ డీల్‌ పరంగా రిలయన్స్‌ జియో విలువ రూ.4.62 లక్షల కోట్లని అంచనా. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 88% వృద్ధితో రూ.5,562 కోట్లకు, కార్యకలాపాల ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.54,316 కోట్లకు చేరాయి.
 ∙7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్‌ టు కెమికల్స్‌ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టగానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20% వాటాను సౌదీ ఆరామ్‌కో కంపెనీకి రిలయన్స్‌ విక్రయించనున్నది.

వేతనాల్లో  కోత
కంపెనీ ఉద్యోగులకు, డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు వేతనాల్లో 10–50 శాతం కోత విధించనున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తన పారితోషికం మొత్తాన్ని(రూ.15 కోట్లు) వదులుకోవడానికి చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సిద్ధపడ్డారని పేర్కొంది. వార్షిక వేతనం రూ.15 లక్షలలోపు ఉన్న వారికి వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని, అంతకు మించిన వేతనాలు పొందే వారికి 10 % కోత ఉంటుందని పేర్కొంది.  

రైట్స్‌ ఇష్యూ @ 53,125 కోట్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రైట్స్‌ ఇష్యూను ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను (1:15) రైట్స్‌ షేర్‌గా పొందవచ్చు.  రైట్స్‌ ఇష్యూలో షేర్లు జారీ చేసే ధర రూ.1,257. గురువారం నాటి ముగింపు ధర (రూ.1,467)తో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. రైట్స్‌ ఇష్యూ విలువ రూ.53,125 కోట్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద రైట్స్‌ ఇష్యూ.మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రైట్స్‌ ఇష్యూ ఇతర అంశాలపై అంచనాల కారణంగా బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది.

వినియోగ వ్యాపారాలు... రిలయన్స్‌ రిటైల్, రిలయన్స్‌ జియోలు  నిర్వహణ, ఆర్థిక పరమైన అంశాల్లో జోరుగా వృద్ధిని సాధించాయి. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మన దేశం, మా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ కూడా మరింత బలం పుంజుకుంటాయన్న ధీమా నాకు ఉంది.
–ముకేశ్‌ అంబానీ, చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement