Reliance Geo
-
జియో స్పెక్ట్రమ్ బకాయిలు క్లియర్
న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలన్నిటీని చెల్లించింది. టెలికం శాఖ(డాట్)కు రూ. 30,791 కోట్లు జమ చేసింది. తద్వారా 2021 మార్చివరకూ వడ్డీసహా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలను పూర్తిగా తీర్చివేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. వీటిలో 2014, 2015, 2016లలో వేలం ద్వారా చేజిక్కించుకున్న స్పెక్ట్రమ్‌తోపాటు.. 2021లో ఎయిర్టెల్ ద్వారా సొంతం చేసుకున్న రేడియో తరంగాల బకాయిలు సైతం ఉన్నట్లు వివరించింది. వెరసి వేలం, ట్రేడింగ్‌ల ద్వారా మొత్తం 585.3 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను పొందినట్లు వెల్లడించింది. ప్యాకేజీకి నో... స్పెక్ట్రమ్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ద్వారా ఏడాదికి రూ. 1,200 కోట్లమేర వడ్డీ వ్యయాలను ఆదా చేసుకోనున్నట్లు రిలయన్స్ జియో తెలియజేసింది. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం అంచనాలను మదింపు చేసింది. దీంతో ప్రభుత్వం టెలికం రంగానికి గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని వినియోగించుకోబోమని చెప్పినట్లయ్యింది. ఇటీవల వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి వాటాలను కేటాయించిన విషయం విదితమే. తద్వారా వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుండగా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) 9.5 శాతం చొప్పున వాటాలు కేటాయించనున్నాయి. ఈ నేపథ్యంలో జియో చెల్లింపులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు రూ.1,005 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్టెల్ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ స్పెక్ట్రమ్‌కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ వల్ల జియో నెట్వర్క్ యూజర్లకు ఇండోర్ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది. -
రిలయన్స్ లాభం 39 శాతండౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.10,362 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ3లో నికర లాభం రూ.11,640 కోట్లు) 45 శాతం తగ్గిందని పేర్కొంది. ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం, డిమాండ్ పడిపోవడంతో రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు నికర లాభంపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. అయితే టెలికం విభాగం, రిలయన్స్ జియో ఫలితాలు బాగా ఉండటంతో లాభ క్షీణత తగ్గిందని తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 2 శాతం క్షీణించి రూ.1,36,240 కోట్లకు చేరిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 11 శాతం తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు.... ► స్థూల రిఫైనరీ మార్జిన్(జీఆర్ఎమ్) 8.9 డాలర్లుగా ఉంది. ► కరోనా వైరస్ కల్లోలం ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► చమురు–గ్యాస్ వ్యాపారంలో రూ.485 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 20% వృద్ధితో రూ.2,062 కోట్లకు పెరిగింది. అనుకున్న దానికంటే ముందుగానే రుణ రహిత కంపెనీ... వచ్చే ఏడాది మార్చి కల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా నిలపాలన్న ముకేశ్ లక్ష్యం ముందే సాధించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. మొత్తం రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని కంపెనీ బావిస్తోంది. రూ.53.125 కోట్ల రైట్స్ ఇష్యూతో పాటు జియోలో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేయనున్న రూ.43,574 కోట్లు, ఇంధన రిటైల్ విభాగంలో 49% వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ రూ.7,000 కోట్లకు విక్రయించడం.... ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లాగానే ఎన్నో కంపెనీలు, ఆర్థిక సంస్థలు రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మార్చి క్వార్టర్ చివరినాటికి రిలయన్స్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,75,259 కోట్లుగా ఉన్నాయి. నికర రుణ భారం రూ.1,61,035 కోట్లు. రిలయన్స్ జియో లాభం 177 శాతం అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 177 శాతం ఎగసి రూ.2,331కు పెరిగింది. వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.14,835 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ కంపెనీ ఇదే. వినియోగదారుల సంఖ్యలో 26 శాతం వృద్ధి సాధించింది. ఒక్క నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.130.6గా ఉంది. ఇటీవలే కుదిరిన ఫేస్బుక్ డీల్ పరంగా రిలయన్స్ జియో విలువ రూ.4.62 లక్షల కోట్లని అంచనా. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 88% వృద్ధితో రూ.5,562 కోట్లకు, కార్యకలాపాల ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.54,316 కోట్లకు చేరాయి. ∙7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టగానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20% వాటాను సౌదీ ఆరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించనున్నది. వేతనాల్లో కోత కంపెనీ ఉద్యోగులకు, డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు వేతనాల్లో 10–50 శాతం కోత విధించనున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తన పారితోషికం మొత్తాన్ని(రూ.15 కోట్లు) వదులుకోవడానికి చైర్మన్ ముకేశ్ అంబానీ సిద్ధపడ్డారని పేర్కొంది. వార్షిక వేతనం రూ.15 లక్షలలోపు ఉన్న వారికి వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని, అంతకు మించిన వేతనాలు పొందే వారికి 10 % కోత ఉంటుందని పేర్కొంది. రైట్స్ ఇష్యూ @ 53,125 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను (1:15) రైట్స్ షేర్‌గా పొందవచ్చు. రైట్స్ ఇష్యూలో షేర్లు జారీ చేసే ధర రూ.1,257. గురువారం నాటి ముగింపు ధర (రూ.1,467)తో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. రైట్స్ ఇష్యూ విలువ రూ.53,125 కోట్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద రైట్స్ ఇష్యూ.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇతర అంశాలపై అంచనాల కారణంగా బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది. వినియోగ వ్యాపారాలు... రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిర్వహణ, ఆర్థిక పరమైన అంశాల్లో జోరుగా వృద్ధిని సాధించాయి. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మన దేశం, మా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా మరింత బలం పుంజుకుంటాయన్న ధీమా నాకు ఉంది. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
అగ్రస్థానానికి జియో
న్యూఢిల్లీ: సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ Výæణాంకాల ప్రకారం.. గతేడాది నవంబర్ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందాదారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది. -
జియో కొత్త ప్యాకేజీలు
న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధింపుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టెలికం సంస్థ రిలయన్స్ జియో సవరించిన కొత్త టారిఫ్ ప్యాకేజీలను ప్రకటించింది. చార్జీలను సర్దుబాటు చేసే విధంగా వీటిని ప్రవేశపెట్టింది. ‘రోజుకు 2 జీబీ డేటా ప్యాక్ పరిమితి ఉండే మూడు నెలల ప్యాకేజీ ధరను రూ. 448 నుంచి రూ. 444కి తగ్గిస్తున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు 1,000 నిమిషాల కాల్స్‌కు సరిపడా టాక్‌టైమ్ (ఐయూసీ మినిట్స్) ఇందులో ఉంటుంది. సాధారణంగా ఈ ఐయూసీ మినిట్స్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే అదనంగా రూ.80 చెల్లించాల్సి వస్తుంది‘ అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, రెండు నెలల ప్లాన్ గడువుండే ప్లాన్ రేటును రూ. 333కి తగ్గించడంతో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్గోయింగ్ కాల్స్‌కు సంబంధించి 1,000 నిమిషాలు పొందవచ్చు. మరోవైపు, ఒక నెల గడువుండే ప్లాన్ రేటును రూ. 198 నుంచి రూ. 222కి పెంచిన జియో, రూ. 80 విలువ చేసే ఐయూసీ మినిట్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను టెల్కోలు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఇది ప్రస్తుతం నిమిషానికి 6 పైసలుగా ఉంది. -
ఫిబ్రవరిలో జియో, బీఎస్ఎన్ఎల్దే హవా
న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్లెస్ కస్టమర్లను కోల్పోయాయి. అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపె నీల జాబితాలో.. వొడాఫోన్ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను జోడించి.. అనతికాలంలోనే ఏకంగా 30 కోట్ల సబ్స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది. ఈ అంశంపై బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగింది. సంస్థ 3జీ నెట్వర్క్ మరింత మెరుగుపడింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా 57.87 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. -
ప్రాఫిట్ 10 వేల కోట్లు!!
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 9,420 కోట్లు. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రిలయన్స్ ఆదాయం 56 శాతం ఎగిసి రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఇటు దేశానికి అటు వాటాదారులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రిలయన్స్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక త్రైమాసికంలో ఏకంగా రూ. 10,000 కోట్ల లాభాల మైలురాయిని దాటిన తొలి దేశీ ప్రైవేట్ కంపెనీగా నిల్చింది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ సవాళ్లు ఎదురైనప్పటికీ.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ మొత్తం లాభదాయకత మెరుగుపడటంలో వీటి పాత్ర కూడా పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు. క్యూ3లో రిలయన్స్ నగదు నిల్వలు స్వల్పంగా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ పెట్టుబడి ప్రణాళిక పూర్తి కావడంతో 2018 డిసెంబర్ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763. రిఫైనింగ్ మార్జిన్ డౌన్ .. రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదైంది. అయితే, రిఫైనింగ్ విభాగం ఆదాయాలు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. ముడి చమురును ఇంధనంగా మార్చే రిఫైనింగ్ ప్రక్రియకు సంబంధించిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) ప్రతి బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది. ఇది 15 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 9.5 డాలర్లుగా ఉండగా, 2017 క్యూ3లో ఇది 11.6 డాలర్లు. ఉత్పత్తి తగ్గుదల కొనసాగడం.. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు నష్టాలు రూ. 185 కోట్లకు తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 480 కోట్లు కాగా, 2017–18 మూడో త్రైమాసికంలో రూ. 291 కోట్లు. జియో లాభం 65 శాతం అప్.. టెలికం విభాగమైన రిలయన్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 65 శాతం ఎగిసి రూ. 831 కోట్లకు చేరాయి. నిర్వహణ ఆదాయం 50.9 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయం రూ. 6,879 కోట్లు కాగా, లాభం రూ. 504 కోట్లు. సగటున యూజర్‌పై వచ్చే ఆదాయం 15.5 శాతం క్షీణించి రూ. 154 నుంచి రూ. 130కి తగ్గింది. అయితే, కస్టమర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్లకు పెరగడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ’ప్రస్తుతం జియో కుటుంబ సభ్యుల సంఖ్య 28 కోట్లకు చేరింది. అందుబాటు ధరలో అత్యంత నాణ్య మైన సర్వీసులతో అందర్నీ అనుసంధానించాలన్న మా లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్ గా ఎదుగుతోంది. గృహాలు, కంపెనీల్లోనూ కనెక్టివిటీకి కొత్త తరం ఎఫ్‌టీటీఎక్స్ సర్వీసులనుపై కసరత్తు చేస్తున్నాం ’ అని అంబానీ చెప్పారు. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి 864 కోట్ల గిగాబైట్స్కి చేరింది. సగటున ప్రతి యూజరు డేటా వినియోగం 9.6 జీబీ నుంచి 10.8 జీబీకి చేరింది. రిలయన్స్ రిటైల్ లాభం రూ. 1,680 కోట్లు.. పండుగ సీజన్ అమ్మకాలు, కొత్త స్టోర్స్ ప్రారంభం మొదలైన సానుకూల అంశాల ఊతంతో రిలయన్స్ రిటైల్ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది. రిలయన్స్ రిటైల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,400 పైచిలుకు నగరాలు, పట్టణాల్లో 9,907 స్టోర్స్ ఉన్నాయి. క్యూ3లో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శించారని సంస్థ తెలిపింది. నిత్యావసరాలు విక్రయించే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని వివరించింది. ఇక ఫ్యాషన్.. లైఫ్‌స్టయిల్ విభాగంలో కొత్తగా 100 స్టోర్స్ ప్రారంభించామని, దీంతో కొత్తగా మరో 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించినట్లయిందని పేర్కొంది. రిలయన్స్ జ్యుయెల్స్ విభాగం 100 స్టోర్స్ మైలురాయి దాటింది. స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం 57 నగరాల్లో 109కి చేరింది. ప్రైవేట్‌లో టాప్.. రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయి దాటిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ అంతా ఒకే క్వార్టర్లో అందుకోవడంతో అప్పట్లో ఐవోసీ ఈస్థాయి లాభాలు ప్రకటించడం సాధ్యపడింది. మిగతా క్వార్టర్స్‌లో నష్టాలు రావడంతో 2012–13 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఐవోసీ రూ. 5,005 కోట్ల లాభాలు నమోదు చేయగలిగింది. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు 0.30 పైసలు క్షీణించి రూ. 1,133.75 వద్ద క్లోజయ్యింది. -
ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..
(సాక్షి, బిజినెస్ విభాగం) జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యావసర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి స న్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... దాని ద్వారానే ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెం దుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ–కామర్స్ అనుభవాన్ని అం దించేందుకు తనకు మూలమూలనా ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను వినియోగించుకోనుంది. చౌక చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ తాజాగా రిటైల్ రంగంలోనూ అదే తరహాలో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ప్రారంభించే రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను ఉపయోగించుకోబోతున్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు నగరాల్లో 5,100 పైగా చిన్న స్థాయి జియో పాయింట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రణాళికల ప్రకారం ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేని ప్రాంతాల వారికి, ఆన్లైన్ షాపింగ్ చేయని వారికి చేరువయ్యేందుకు వీటిలో ఈ–కామర్స్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. కొనుగోలుదారులు ఆన్లైన్లో ఆర్డర్లిచ్చేందుకు వీటిలో ఉండే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ సహాయం అందిస్తారు. పప్పులు, పంచదార, సబ్బులు వంటి నిత్యావసరాలు మొదలుకుని సౌందర్య సంరక్షణం, దుస్తులు, పాదరక్షల దాకా అన్నింటినీ వీటి ద్వారా ఆర్డరివ్వొచ్చు. రిలయన్స్ రిటైల్ ఈ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికే ఈ స్టోర్స్‌కు సిమ్‌కార్డులు, మొబైల్ హ్యాండ్సెట్స్, యాక్సెసరీస్ మొదలైనవి సరఫరా చేస్తున్న జియో పంపిణీ వ్యవస్థ... ఇకపై ఈ–కామర్స్ ఆర్డర్స్‌ను కొనుగోలుదారుల ఇంటి వద్దకే చేరుస్తుంది. ‘ఇన్స్టాలేషన్ అవసరం లేని, షెల్ఫ్ లైఫ్ ఉండే చాలా మటుకు ఉత్పత్తులను ఈ నెట్వర్క్ ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంది. కస్టమర్ ఆయా ఉత్పత్తులను జియో పాయింట్ వద్దే తీసుకోవచ్చు కూడా. కావాలనుకుంటే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తారు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే జియో పాయింట్ స్టోర్స్ నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లకు సంబంధించి ఈ తరహా ఆర్డర్లు తీసుకుంటోంది. మొత్తం కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వీటి వాటా 10 శాతం దాకా ఉంటోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా వర్తింపచేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ–కామర్స్ వెంచర్.. కంపెనీ వర్గాల కథనం ప్రకారం.. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 95% జనాభాకు చేరువవ్వాలని రిలయన్స్ రిటైల్ లకి‡్ష్యస్తోంది. ఈ–కామర్స్, జియో పాయింట్ స్టోర్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని కూడా భావిస్తోంది. దాదాపు 10,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 50,000 పైచిలుకు జియో పాయింట్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించాలని రిలయన్స్ భావిస్తోంది. కస్టమర్ సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్స్‌గానే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉత్పత్తుల పంపిణీకి కూడా వీటిని ఉపయోగించుకోనుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మూడునెలల్లో కొత్తగా 500 జియో పాయింట్స్‌ను ప్రారంభిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ దిగ్గజాలతో పోటీ! ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు దీటుగా రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ ఉండబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఉడాన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద చిన్న పట్టణాల్లో 12,000 పైచిలుకు చిన్న రిటైల్ సంస్థలు, స్థానిక ఎంట్రప్రెన్యూర్స్‌తో చేతులు కలిపింది. ఈ షాపుల ద్వారా ఆన్లైన్లో అమెజాన్‌లో ఆర్డర్లు పెట్టొచ్చు. ఉత్పత్తుల డెలివరీ తీసుకోవచ్చు. దీంతో పాటు దిగ్గజ సంస్థలకు దీటుగా వీడియో, మ్యూజిక్, మ్యాగజైన్స్, న్యూస్ వంటి రంగాల్లోనూ రిలయన్స్ భారీగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్.. కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అంచనాల ప్రకారం భారత ఈ–కామర్స్ విభాగంలో గ్రామీణ ప్రాంత మార్కెట్ వచ్చే నాలుగేళ్లలో 10–12 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ విక్రయాలు 32 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను పెరుగుతున్న ఆదాయాలు, వినియోగం, వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, సానుకూల వ్యవసాయ పరిస్థితులు, ఇంటర్నెట్ వినియోగం మెరుగుపడుతుండటం, చిన్న కుటుంబాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. -
జియోతో సావన్ జట్టు
న్యూఢిల్లీ: దాదాపు 1 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాం నెలకొల్పే దిశగా జియో మ్యూజిక్, డిజిటల్ మ్యూజిక్ సేవల సంస్థ సావన్ చేతులు కలిపాయి. దేశీయంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో ఈ భాగస్వామ్యం జియో–సావన్ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు తోడ్పడగలదని రిలయన్స్ జియో (ఆర్‌జియో) డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్‌కి సంబంధించి జియోమ్యూజిక్ విలువ 670 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందం ప్రకారం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంపై రిలయన్స్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
జియోతో సై అంటోన్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘ఎయిర్టెల్’ తన ప్రత్యర్థి ‘రిలయన్స్ జియో’కి పోటీనివ్వడానికి సన్నద్ధమౌతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018, మార్చి నాటికి) చివరి నాటికి వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవొల్యూషన్ (వీవోఎల్టీఈ) సర్వీసును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వీవోఎల్టీఈ సాయంతో 4జీ టెక్నాలజీతో ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ‘మేం 5–6 నగరాల్లో వీవోఎల్టీఈ ట్రయల్స్ నిర్వహించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా వీవోఎల్టీఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తాం’ అని భారతీ ఎయిర్టెల్ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా దేశంలో కేవలం రిలయన్స్ జియో మాత్రమే వీవోఎల్టీఈ టెక్నాలజీ సాయంతో 4జీ నెట్‌వర్క్‌లో వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. మిగిలిన టెల్కోలన్నీ వాటి 2జీ, 3జీ నెట్వర్క్స్ సాయంతోనే 4జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్‌లో 3జీ నెట్వర్క్ చాలా వేగంగా అంతరిస్తుందని విట్టల్ అభిప్రాయపడ్డారు. జియో 4జీ ఫీచర్ ఫోన్ ఆవిష్కరణపై స్పందిస్తూ.. తాము ఆ దారిలో ప్రయాణించబోమని పేర్కొన్నారు. జియో ఫీచర్ ఫోన్ వల్ల 4జీ సర్వీసులకు కొత్త విభాగం ఏర్పాటవుతుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరంగా చూస్తే ఈ ఫీచర్ ఫోన్ ధర ఎక్కువగా ఉందన్నారు. ‘మాకు యూజర్ నుంచి వచ్చే సగటు రాబడి తగ్గింది. ఆదాయం క్షీణించింది. యూజర్ బేస్ పెంపు, ప్రత్యర్థి కంపెనీ లను ఎదుర్కోవడానికి పోటీ ధరల విధానాన్ని అవలంభిస్తున్నాం. దీన్నే కొనసాగిస్తాం’ అన్నారు. -
ఎయిర్టెల్ లాభం 75% డౌన్
♦ క్యూ1లో రూ.367 కోట్లు... ♦ గత 18 త్రైమాసికాల్లో అతితక్కువ లాభం ఇది... ♦ ఆదాయం రూ.21,958 కోట్లు; 14 శాతం క్షీణత ♦ రిలయన్స్ జియో చౌక ఆఫర్ల ప్రభావం... న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్‌కు రిలయన్స్ జియో ఉచిత, చౌక టారిఫ్‌ల సెగ తీవ్రంగా తగులుతోంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(2017–18) ఏకంగా 75 శాతం దిగజారి రూ.367 కోట్లకు పడిపోయింది. గడిచిన 18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ లాభం కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.1,462 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.21,958 కోట్లకు తగ్గింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.25,546 కోట్లతో పోలిస్తే 14 శాతం క్షీణించింది. కాగా, క్యూ1లో ఎయిర్టెల్ రూ.300 కోట్ల నికర లాభాన్ని, రూ.21,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా స్వల్ప తగ్గుదలే... గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో అధికారికంగా టెలికం సేవలను ఆరంభించింది. అప్పటినుంచీ ఈ ఏడాది మార్చి వరకూ ఉచితంగానే సేవలందిస్తూ వచ్చింది. ఏప్రిల్ నుంచి మాత్రమే బిల్లింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, జియో దెబ్బకు ఎయిర్టెల్ సహా ఇతర టెల్కోలు కూడా చౌక టారిఫ్‌లను ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో సీక్వెన్షియల్ ప్రాతిపదికన (గతేడాది చివరి క్వార్టర్ డిసెంబర్–మార్చి) చూస్తే... లాభాల్లో క్షీణత చాలా స్వల్పంగానే నమోదు కావడం గమనార్హం. మార్చి క్వార్టర్లో లాభం రూ.373 కోట్లతో పోలిస్తే.. స్వల్పంగా 1.7 శాతం మాత్రమే తగ్గింది. ‘కొత్త టెలికం ఆపరేటర్ (రిలయన్స్ జియో) ఎంట్రీ తర్వాత భారతీయ టెలికం మార్కెట్లో నెలకొన్న పోటాపోటీ టారిఫ్‌ల కోత, ఉచిత ఆఫర్లతో టెలికం కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదేవిధంగా వార్షికంగా కంపెనీల ఆదాయంలో 15 శాతం మేర తగ్గుదల కారణంగా లాభదాయకత, నగదు ప్రవాహాలతో పాటు రుణాల విషయంలో కూడా మరింత ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది’ అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. కొత్త ఆపరేటర్(జియో) చౌక టారిఫ్‌ల కారణంగా దేశీ మొబైల్ మార్కెట్ ప్రస్తుత క్వార్టర్(జూలై–సెప్టెంబర్)లో కూడా తీవ్ర కుదుపులతోనే కొనసాగనుందని చెప్పారు. కాగా, తాజాగా రిలయన్స్ జియో.. ఫీచర్ ఫోన్ కస్టమర్లను తనవైపు తిప్పుకోవడానికి ఉచితంగా జియో ఫోన్‌ను(మూడేళ్ల తర్వాత తిరిగిఇచ్చేవిధంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో) ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీ టెలికం మార్కెట్లో పోటీ మరింత తీవ్రతరం కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ స్పెక్ట్రం సంబంధిత వడ్డీ వ్యయాలు పెరిగిపోవడంతో క్యూ1లో నికర వడ్డీ వ్యయం రూ.1,631 కోట్ల నుంచి రూ.1,789 కోట్లకు ఎగసింది. ♦ ఇక భారత్ వ్యాపారం విషయానికొస్తే.. మొత్తం ఆదాయం 10 శాతం క్షీణించి రూ.17,244 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా మొబైల్ సేవల విభాగంలో ప్రతికూల పనితీరు దీనికి దారితీసింది. ♦ మొత్తం కస్టమర్ల సంఖ్య 9.7 శాతం పెరుగుదలతో జూన్ చివరినాటికి 28 కోట్లకు చేరింది. ♦ ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) 21 శాతం తగ్గుదలతో రూ.154కు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఏఆర్పీయూ రూ.196గా నమోదైంది. ♦ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సగటు నెలవారీ డేటా వినియోగం మూడురెట్లు ఎగబాకి 2,611 మెగాబైట్లకు(దాదాపు 2.5 జీబీ) చేరింది. క్రితం ఏడాది జూన్ క్వార్టర్లో ఇది 904 మెగాబైట్లు మాత్రమే. అయితే, డేటా సేవల నుంచి ఏఆర్పీయూ 22.7 శాతం పడిపోవడం గమనార్హం. ♦ కన్సాలిడేటెడ్ నిర్వహణ లాభం సీక్వెన్షియల్‌గా 2.1 శాతం క్షీణించి రూ.7,823 కోట్లుగా నమోదైంది. ♦ ఆఫ్రికా వ్యాపారం మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా(మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) క్యూ1లో 3.8 శాతం తగ్గి... రూ.4,853 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం మాత్రం 4.2 శాతం వృద్ధితో రూ.1,362 కోట్లకు చేరింది. ♦ కంపెనీ మొత్తం రుణ భారం మార్చి క్వార్టర్‌తో పోలిస్తే (రూ.91,400 కోట్లు) జూన్ క్వార్టర్లో(సీక్వెన్షియల్‌గా) 3.9 శాతం తగ్గింది. రూ.87,840 కోట్లుగా నమోదైంది. ♦ ఇక కంపెనీ పెట్టుబడులు క్యూ1లో 73 శాతం వృద్ధితో రూ.6,586 కోట్లకు చేరాయి. ♦ బీఎస్ఈలో మంగళవారం ఎయిర్టెల్ షేర్ ధర 1.76 శాతం లాభంతో రూ.428 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. -
ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్.. ‘జియో’
రూ.1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాం 2017 నాటికి 90% పైగా కవరేజ్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ముంబై: వినియోగదారులకు దాదాపు 80 రెట్ల అధిక వేగంతో ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అభివర్ణించారు. ప్రపంచంలోని ఏ ఇతర డిజిటల్ స్టార్టప్‌లలో కూడా ఇంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ లేవని తెలిపారు. 2017 నాటికి దేశంలో 90%పైగా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజ్‌ను విస్తరించడమే జియో లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 2016 కార్యక్రమంలో మాట్లాడారు. జియో సేవలు తొలి రోజు నుంచే 70% కవరేజ్‌తో ప్రారంభమౌతాయని తెలిపారు. సర్వీసులు అందుబాటు ధరల్లో ఉంటాయని పేర్కొన్నారు. సేవల నాణ్యత విషయంతో రాజీపడేది లేదన్నారు. ప్రస్తుత ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే 40-80 రెట్లు అధిక వేగంతో సేవలను అందిస్తామని చెప్పారు. అయితే ఆయన జియో పూర్తి వాణిజ్య స్థాయి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభమౌతాయో ప్రకటించలేదు. టాప్-10లోకి వెళ్తాం: జియో వల్ల మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 150వ స్థానంలో ఉన్న మనం రానున్న కాలంలో టాప్-10లోకి వెళ్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచం కొత్త యుగం(డిజిటల్)లోకి అడుగుపెడుతుంటే భారత్‌ను వెనుకంజలో ఉంచబోమని చెప్పారు. దేశ ప్రజల జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం కోసమే టెలికంలోకి మళ్లీ అడుగు పెడుతున్నామని తెలిపారు. 100 బిలియన్ డాలర్లకు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ! దేశీ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తోందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2004లో 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2015 నాటికి 18 బిలియన్ డాలర్లకి పెరిగిందని పేర్కొన్నారు. వచ్చే శతాబ్ద కాలంలో ఇది 100 బిలియన్ డాలర్లకి చే రుకోవచ్చని అంచనా వేశారు. ‘ప్రస్తుత శతాబ్దాన్ని డిజిటైజేషన్ నిర్వచిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీపడగలిగే డిజిటల్ అస్త్రాన్ని కలిగి ఉండకపోతే.. మనం మనుగడ సాగించలేం. ఒంటరిగా, వెనుక ంజలో ఉంటాం’ అని ముకేశ్ చెప్పారు. -
కాల్ చార్జీలు మరింత భారం..!
ముంబై: వేలంలో స్పెక్ట్రంను దక్కించుకునేందుకు టెలికం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో కాల్ చార్జీలు మరింత పెరిగే అవకాశముందని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ తెలిపింది. స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో ఆ భారాన్ని కాల్ చార్జీల పెంపు రూపంలో టెల్కోలు వినియోగదారులపై మోపుతాయని పేర్కొంది. రిలయన్స్ జియో వంటి కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటం వల్ల స్పెక్ట్రంను దక్కించుకునేందుకు కంపెనీల మధ్య పోటీ మరింత పెరుగుతున్నదని తెలిపింది. దీనికి తోడు కొన్ని సర్కిళ్లలో తమ లెసైన్సుల గడువు ముగిసిపోనుండటంతో పలు కంపెనీలు కచ్చితంగా స్పెక్ట్రం తీసుకోవాల్సిన పరిస్థితి వల్ల కూడా పోటీ భారీగా ఉందని వివరించింది. స్పెక్ట్రంను దక్కించుకున్న కంపెనీలు ముందస్తుగా 25-33 శాతం బిడ్ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వానికి రూ. 25,000 కోట్లు రాగలవని కేర్ అంచనా వేసింది. మరోవైపు థర్డ్ పార్టీ యాప్స్ సైతం వాయిస్ సర్వీసులు అందిస్తున్న కారణంగా టెల్కోల ఆదాయానికి కొంత మేర గండి కొట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి పరిణామాల కారణంగా టెల్కోలు టారిఫ్‌లను పెంచాల్సి వస్తుందని కేర్ తెలిపింది. రిలయన్స్ జియో ఏకంగా రూ. 4,500 కోట్ల అడ్వాన్సు చెల్లించడాన్ని బట్టి చూస్తే అది పెద్ద ఎత్తున స్పెక్ట్రంను దక్కించుకోవడంపై దృష్టి పెట్టినట్లు భావించవచ్చని పేర్కొంది. రూ. 1.09 లక్షల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు.. స్పెక్ట్రం వేలం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. 14వ రోజైన గురువారం నాడు బిడ్డింగ్ సమయం ముగిసే సమయానికి 86 రౌండ్లు పూర్తి కాగా రూ. 1.09 లక్షల కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రధానంగా 800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి ఎక్కువగా డిమాండ్ నెలకొంది. సుమారు 89 శాతం స్పెక్ట్రంను బిడ్డర్లకు సూత్రప్రాయంగా కేటాయించినట్లు టెలికం విభాగం తెలిపింది. మరికాస్త స్పెక్ట్రం మిగిలి ఉన్నందున శుక్రవారం కూడా వేలం కొనసాగుతుందని వివరించింది. -
స్పెక్ట్రం బరిలో 8 కంపెనీలు
- రేసులో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో - మార్చి 4న వేలం న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగబోయే టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు 8 టెలికం కంపెనీలు బరిలో నిల్చాయి. బిడ్డింగ్‌ల దాఖలుకు ఆఖరు రోజైన సోమవారం నాడు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్, రిలయన్స్ జియో, యూనినార్ సంస్థలు దరఖాస్తులు అందజేశాయి. ఎయిర్‌సెల్, టాటా టెలీసర్వీసెస్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటున్నాయి. అయితే, సీడీఎంఏ స్పెక్ట్రంనకు సంబంధించి సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ మాత్రం వైదొలిగింది. రిజర్వ్ ధర అధికంగా ఉండటంతో పాటు టెలికం విభాగంతో న్యాయవివాదం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో పాటు వీడియోకాన్ కూడా వేలంలో పాల్గొనడం లేదు. ఆఖరు రోజు నాటికి ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు టెలికం విభాగం అధికారి ఒకరు చెప్పారు. రిలయన్స్ జియో, యూనినార్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్ కూడా పోటీపడుతుండటంతో స్పెక్ట్రంనకు అధిక ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 4న స్పెక్ట్రం వేలం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేలం వేయబోతున్న స్పెక్ట్రంలో సింహభాగం.. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికం వద్ద ఉంది. ఈ కంపెనీల లెసైన్సుల గడువు 2015-16తో ముగిసిపోనుంది. దీంతో ఇవి మొబైల్, ఇతర టెలికం సర్వీసులు అందించడం కొనసాగించాలంటే స్పెక్ట్రం కోసం బిడ్ చేయకతప్పని పరిస్థితి నెలకొంది. 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 80,000 కోట్లు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రిజర్వ్ ధర బట్టి చూసినా 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (3జీ సేవలకు ఉపయోగపడేది) కనిష్టంగా రూ. 17,555 కోట్లు, 800.. 900 .. 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (2జీ సేవలకు ఉపయోగపడేవి) రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. ఈ మూడు బ్యాండ్లలో 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేస్తోంది. 2014 ఫిబ్రవరిలో వేలం నిర్వహించినప్పుడు కేంద్రం రూ. 62,162 కోట్లు సమీకరించింది. రూ. 90 వేల కోట్ల అంచనా: క్రిసిల్ స్పెక్ట్రం వేలంతో ప్రభుత్వానికి రూ. 90,000 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. కీలకమైన 900 మెగాహెట్జ్ స్పెక్ట్రంనకు భారీ డిమాండ్ ఉండగలదని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
టెలికంలో కొలువుల జోరు!
వచ్చే 12 నెలల్లో 7 వేలకు పైగాకొత్త ఉద్యోగాలు... రిలయన్స్ జియోప్రారంభ సన్నాహాలు ఇతర టెల్కోల విస్తరణ ఎఫెక్ట్ సీఓఏఐ తాజా అంచనా... న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో ఈ ఏడాది నియామకాల జోరందుకోనున్నాయి. రానున్న 12 నెలల్లో 7 వేలకు పైచిలుకు కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో రానున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అంటోంది. ఆర్థిక మందగమనం, టెలికం పరిశ్రమలో అనిశ్చితి కారణంగా గత కొంతకాలంగా కంపెనీలు వ్యయ నియంత్రణ ఇతరత్రా పొదుపు చర్యలపై దృష్టిసారిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాల విషయంలో స్తబ్దత నెలకొంది. అయితే, ఇప్పుడు కొంత సానుకూల పరిస్థితులు నెలకొంటుండటంతో టెల్కోలు కొత్త కొలువులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయని సీఓఏఐ పేర్కొంది. వచ్చే ఏడాది వ్యవధిలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 10 శాతం పెరగవచ్చని లెక్కలేస్తోంది. అయితే, సీఓఏఐ అంచనాలు మరీ ఇంత తక్కువస్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇప్పటికే 3,500 మంది ఉద్యోగులను నియమించుకోవడమే. ఈ ఏడాది 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న రిలయన్స్ జియో ఇందుకోసం సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. గత ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... వచ్చే ఏడాది కాలంలో తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియోలో 10 వేలకు పైగా కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ఇదే సాకారమైతే... సీఓఏఐ అంచనాలు ఒక్క రిలయన్స్ జియోతోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనికిమించి కొత్త కొలువులు లభిస్తాయని భావిస్తున్నారు. గడ్డుకాలం తొలగినట్టే... భారీ రుణభారం, నియంత్రణ పరమైన ఒత్తిళ్లతో 2013-14లో దేశంలోని 9 టెలికం ఆపరేటర్లు కూడా కొత్త ఉద్యోగాల విషయంలో ఆచితూచి అడుగేశాయి. 2013 మార్చి నాటికి ఈ మొత్తం టెల్కోల్లో సిబ్బంది సంఖ్య దాదాపు 70 వేల మందికాగా.. 2014 మార్చి నాటికి ఇందులో సుమారు 3,500 కోత పడింది. అంటే 5 శాతం సిబ్బంది తగ్గినట్లు లెక్క. అయితే, టెల్కోలు, టెలికం పరికరాల సరఫరా సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు, హ్యాండ్సెట్ తయారీ కంపెనీలు, రిటైలర్లు ఇలా మొత్తం టెలికం పరిశ్రమలో గతేడాది 20 వేలకు పైగానే ఉద్యోగాల కోత పడినట్లు సీఓఏఐ చెబుతోంది. టెలికం పరిశ్రమల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న 20 లక్షల మందిలో ఇది 2 శాతం. అయితే, ఇక ఈ రంగానికి గడ్డుకాలం ముగిసినట్లేనని నిపుణులు అంటున్నారు. పోత్సాహక ఆఫర్లకు కోత విధించడం, ఇతరత్రా చర్యల ద్వారా తమ ఆదాయాలను పెంచుకోవడంతోపాటు టారిఫ్‌ల పెంపునకూ సిద్ధమవుతుండటంతో మార్జిన్లు పెరగనున్నాయని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా 2జీ వేలం కూడా ముగియడంతో విస్తరణబాట పట్టనున్నాయి. డేటా సేవల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. దీంతో కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు పడుతున్నాయని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ మాథ్యూస్ అన్నారు. ఇతర కంపెనీల విషయానికొస్తే... వొడాఫోన్ కూడా దేశంలో తమ విస్తరణ ప్రణాళికలకు మరింత పదునుపెడుతోంది. కొత్తగా 3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1,800 కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నామని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇక దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్, యూనినార్ సైతం తాజాగా నియామకాల బాటపట్టనున్నాయి. టెలికం మౌలిక సదుపాయాల(టవర్లు, వెండార్లు) ప్రొవైడర్లు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను 5-6 శాతం మేర పెంచుకోనున్నాయని మాథ్యూస్ పేర్కొన్నారు. నిపుణులు ఏమంటున్నారు... హెచ్ఆర్ విశ్లేషకులు, నిపుణులు మాత్రం టెలికం పరిశ్రమపై చాలా ఆశావహంగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం అధిక కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ గ్లోబల్ హంట్‌కు చెందిన ఎండీ సునీల్ గోయెల్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఈ రంగంలో కొత్త కొలువులేవీ పెద్దగా జతకాలేదు. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్త కొలువులు అధికంగా రానున్నాయని.. కంపెనీలకు వ్యయభారం తక్కువగా ఉండటమే దీనికి కారణమి గెయెల్ చెప్పారు. తమ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 14,000 కొత్త ఉద్యోగాలు టెలికం రంగంలో రావచ్చని ఆయన పేర్కొన్నారు. -
అమెరికన్ టవర్స్‌తో రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: మొబైల్ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్ టవర్ కార్పొరేషన్ తో(ఏటీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటీసీకి దేశవ్యాప్తంగా ఉన్న 11,000 టవర్లను మొబైల్ సేవల కోసం వినియోగించుకోనుంది. తాజా ఒప్పందంతో రిలయన్స్ జియో చేతిలో మొత్తం 1,80,000 టవర్లు ఉన్నట్లు అవుతుంది. వీటి కోసం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వ్యోమ్ నెట్‌వర్క్‌లతో ఇప్పటికే జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ద్వారా 82,000 టవర్లు, ఆర్‌కామ్ డీల్‌తో 45,000 టవర్లు, వ్యోమ్తో ఒప్పందం ద్వారా 42,000 టవర్లు జియో వినియోగించుకోనుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 4జీ సేవలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.