న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 9,420 కోట్లు. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రిలయన్స్ ఆదాయం 56 శాతం ఎగిసి రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఇటు దేశానికి అటు వాటాదారులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రిలయన్స్ నిరంతరం కృషి చేస్తోంది.
ఈ క్రమంలోనే ఒక త్రైమాసికంలో ఏకంగా రూ. 10,000 కోట్ల లాభాల మైలురాయిని దాటిన తొలి దేశీ ప్రైవేట్ కంపెనీగా నిల్చింది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ సవాళ్లు ఎదురైనప్పటికీ.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ మొత్తం లాభదాయకత మెరుగుపడటంలో వీటి పాత్ర కూడా పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు. క్యూ3లో రిలయన్స్ నగదు నిల్వలు స్వల్పంగా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ పెట్టుబడి ప్రణాళిక పూర్తి కావడంతో 2018 డిసెంబర్ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763.
రిఫైనింగ్ మార్జిన్ డౌన్ ..
రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదైంది. అయితే, రిఫైనింగ్ విభాగం ఆదాయాలు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. ముడి చమురును ఇంధనంగా మార్చే రిఫైనింగ్ ప్రక్రియకు సంబంధించిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్‌ఎం) ప్రతి బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది. ఇది 15 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 9.5 డాలర్లుగా ఉండగా, 2017 క్యూ3లో ఇది 11.6 డాలర్లు. ఉత్పత్తి తగ్గుదల కొనసాగడం.. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు నష్టాలు రూ. 185 కోట్లకు తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 480 కోట్లు కాగా, 2017–18 మూడో త్రైమాసికంలో రూ. 291 కోట్లు.
జియో లాభం 65 శాతం అప్..
టెలికం విభాగమైన రిలయన్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 65 శాతం ఎగిసి రూ. 831 కోట్లకు చేరాయి. నిర్వహణ ఆదాయం 50.9 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయం రూ. 6,879 కోట్లు కాగా, లాభం రూ. 504 కోట్లు. సగటున యూజర్‌పై వచ్చే ఆదాయం 15.5 శాతం క్షీణించి రూ. 154 నుంచి రూ. 130కి తగ్గింది. అయితే, కస్టమర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్లకు పెరగడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ’ప్రస్తుతం జియో కుటుంబ సభ్యుల సంఖ్య 28 కోట్లకు చేరింది. అందుబాటు ధరలో అత్యంత నాణ్య మైన సర్వీసులతో అందర్నీ అనుసంధానించాలన్న మా లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్ గా ఎదుగుతోంది. గృహాలు, కంపెనీల్లోనూ కనెక్టివిటీకి కొత్త తరం ఎఫ్‌టీటీఎక్స్ సర్వీసులనుపై కసరత్తు చేస్తున్నాం ’ అని అంబానీ చెప్పారు. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి 864 కోట్ల గిగాబైట్స్‌కి చేరింది. సగటున ప్రతి యూజరు డేటా వినియోగం 9.6 జీబీ నుంచి 10.8 జీబీకి చేరింది.
రిలయన్స్ రిటైల్ లాభం రూ. 1,680 కోట్లు..
పండుగ సీజన్ అమ్మకాలు, కొత్త స్టోర్స్ ప్రారంభం మొదలైన సానుకూల అంశాల ఊతంతో రిలయన్స్ రిటైల్ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది. రిలయన్స్ రిటైల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,400 పైచిలుకు నగరాలు, పట్టణాల్లో 9,907 స్టోర్స్ ఉన్నాయి. క్యూ3లో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శించారని సంస్థ తెలిపింది. నిత్యావసరాలు విక్రయించే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని వివరించింది. ఇక ఫ్యాషన్.. లైఫ్‌స్టయిల్ విభాగంలో కొత్తగా 100 స్టోర్స్ ప్రారంభించామని, దీంతో కొత్తగా మరో 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించినట్లయిందని పేర్కొంది. రిలయన్స్ జ్యుయెల్స్ విభాగం 100 స్టోర్స్ మైలురాయి దాటింది. స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం 57 నగరాల్లో 109కి చేరింది.
ప్రైవేట్‌లో టాప్..
రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయి దాటిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్‌లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ అంతా ఒకే క్వార్టర్‌లో అందుకోవడంతో అప్పట్లో ఐవోసీ ఈస్థాయి లాభాలు ప్రకటించడం సాధ్యపడింది. మిగతా క్వార్టర్స్‌లో నష్టాలు రావడంతో 2012–13 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఐవోసీ రూ. 5,005 కోట్ల లాభాలు నమోదు చేయగలిగింది. గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్ షేరు 0.30 పైసలు క్షీణించి రూ. 1,133.75 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment